Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial-5
?>

తిరుమల వైభవం సీరియల్ - 5

Tirumala vaibhavam Serial-5

దేసు వెంకట సుబ్బారావు

తిరుమలను అనాది కాలం నుండి వేంగడం అని పిలిచేవారు. పురాతన తమిళ సాహిత్యంలో కూడా ఈ పదమే కనిపిస్తుంది. తిరుమల గిరులు అటు తమిళులకు, ఇటు తెలుగువారికి కూడా వారధిగా ఉండేవని క్రీస్తుపూర్వమే ప్రచారంలో ఉంది. తిరువేంగడంగా పిలువబడే తిరుమల ఉత్తర ప్రాంతానికి తమిళులు, దక్షిణ ప్రాంతానికి తెలుగువారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండేవారు. దట్టమైన అరణ్యంగా ఉండే ఈ తిరుమల ప్రాంతమంతా వన్యమృగాలతోనూ, ఏనుగుల సంచారంగా ఉంది సామాన్య జనజీవనానికి దూరంగా ఉండేదట. తమిళుల అతి ప్రాచీన కవి నక్కియార్ తిరుమల గురించి కొంత ప్రస్తావించాడు. ఆ కాలంలో ఈ ప్రాంతం కళావర్ల ఏలుబడిలో ఉండేదట. వీరు వేంగడం ప్రాంతాన్ని, ఇకా పావిత్తిరి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించారట. ఈ అటవీ ప్రాంతంలో నివసించే ఆటవికులు ఏనుగులను తరిమికొట్టదానికి రంగురంగుల రత్నాలను రాళ్ళుగా విసిరేవారని, వాటి కాంతికి ఏనుగులు దూరంగా పారిపోయేవాణి కథలు ప్రచారంలో ఉన్నాయి. అందుకేనేమో రాయలకాలంలో ఇక్కడ రత్నాలు రాశులు పోసి అమ్మేవారట. అనేక తమిళ ప్రాచీన గ్రంధాల్లో తిరువేంగడం అయిన తిరుమల పైన ఎప్పుడూ ఏవో జాతరలు, పండుగలు, సంబరాలు, ఉత్సవాలు జరిగేవని చరిత్రకారులు చెప్పారు. అన్ని జాతరలు, ఉత్సవాలు అక్కడ వెలసిన తిరువేంకటనాథుడైన శ్రీనివాసుని వైభవాలేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 

అన్నమయ్య చెప్పినట్లు అనంత సూర్యతేజుడైన శ్రీనివాసుని తేజస్సును ఎంతని వివరించగలం? ధనుజాంతకుడైన శ్రీహరి ప్రతాపాన్ని ఎంతని కొలవగలం? మన్మథుని తండ్రి అయిన వాని రూపాన్ని ఏమని వర్ణించగలం? సకల పాప నివారిణి అయిన గంగామాతకే జనకుడైన శ్రీహరిని కొలిస్తే వచ్చే పుణ్యమెంత.. సర్వ ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మికి పతి అయిన వాని రాజసాన్ని ఏమని వర్ణించగలం? వేయి రూపాల వాడైన శ్రీపతి లేని ప్రదేశాన్ని ఊహించగలమా?

 

సర్వాంతర్యామి అయిన శ్రీహరికి తమను తాము అర్పించారు కనుకనే హరి భక్తులు ఆళ్వారులయ్యారు. ఆళ్వారులంటే భగవంతుని సేవకే తమ జీవితాలను అంకితం చేసినవారని అర్ధం. అత్యంత సన్నిహితంగా ఉండే భగవద్భక్తులని భావం. అందుకే హరి వాహనుడైన గరుడుని కూడా గరుడాళ్వారులని, శ్రీహరి ఆలయాన్ని కూడా కోయిలాళ్వారులని స్వామివారి సుదర్శన చక్రాన్ని చక్రత్తాళ్వారులు అని పిలుస్తుంటారు. క్రీస్తుశకం 4వ శతాబ్దం నాటికే ఆళ్వారులు శ్రీహరిని కీర్తించి, గానం చేసి భక్తి సామ్రాజ్యాన్ని ఏలిన పరమ భక్తులు ఆళ్వారులు. వీరినే ద్వాదశ సూరులంటారు. నాలాయిరం అంటే దాదాపు నాలుగు వేలని అర్ధం. వీరు 12మంది ఆళ్వారులు. నాలుగువేల పాశురాలను రచించి గానం చేసినవారు. నాలుగువేల పాశురాలను రచించిన 12మందిని ఆళ్వారులు అన్నారు గనుకనే 32 వేల కీర్తనలను రచించిన అన్నమయ్యను కూడా తెలుగు ఆళ్వారు అని ఇటీవల పేర్కొన్నారు. ఈ ఆళ్వారులను భగవదంశతో జన్మించారని తమిళ ప్రబంధాలలో పేర్కొన్నారు. వీరంతా విష్ణు భక్తులు. భక్తి ప్రచారంలో అమృతప్రాయమైన తమ పాశురాలతో భగవద్భక్తిని ప్రభోదించినవారు. స్వామివారి పంచాయుధాలతో వీరిని పోలుస్తుంటారు. వీరిలో పోయ్ గై ఆళ్వారును శ్రీవారి శంఖు పాంచజన్యం గానూ, భూతత్తాళ్వారును శ్రీవారి గద కౌమోదకి గాను, పేయాళ్వారును నందక ఖడ్గంగానూ తిరుమలశై యాళ్వారును సుదర్శన చక్రంగానూ, కులశేఖరాళ్వారును కౌస్తుభమణిగానూ ఇలా స్వామివారి పంచాయుధాలను భగవదంశలుగా పేర్కొని, ఆళ్వారులుగా ఆరాధిస్తుంటారు.

 

భూతం సరశ్చ మహాదాహ్వాయ భట్టనాథ

శ్రీ భక్తిసార కులశేఖర యోగినాహాన్

భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్

శ్రీ మత్పరాంకుశ మువిం ప్రణతోస్మిన్ నిత్యం

 

పై శ్లోకంలో పదకొండు మంది ఆళ్వారుల పేర్లు ఉన్నాయి. వీరు 1.పొయ్ గయాళ్వారు (పాంచజన్యం) 2. పూతత్తాళ్వారు (కౌమోదకి) 3.పోయాళ్వారు (నందకం) 4. పెరియాళ్వార్ (విష్ణు రథం) 5.తిరుమలశయాళ్వారు (సుదర్శన చక్రం) 6. కులశేఖరాళ్వారు (కౌస్తుభం)7.తిరుప్పాణాళ్వారు (శ్రీవత్సలాంఛనం) 8.తొండరడిప్పొడి యాళ్వారు (వైజయంతిమాల) 9.తిరుమంగయాళ్వారు (శార్గం) 10. ఉడయవర్ (ఆదిశేషుడు) 11.నమ్మాళ్వార్ (విష్వక్సేనుడు) 12. ఆండాళ్ అను గోదాదేవి (భూదేవి)

ఈ ఆళ్వారులను కవితా సుందరి వలచి వచ్చి వీరి వాక్కులను వరించింది. అందుకే వీరి పాశురాలు అమృత ప్రాయాలు. పరమ భాగవతోత్తములైన ఈ ఆళ్వారులు ద్రవిడ దేశంలో అవతరించి ద్రవిడ భాషలో శ్రీ మహావిష్ణువు గుణవిశేషాలను తమ అనంత భక్తితో ఆరాధించి నాలుగు వేల పాశురాలలో కీర్తించారు. వీరు తమ పాశురాలలో తిరుమల, శ్రీరంగం, కంచి మొదలైన వైష్ణవ క్షేత్రాలలో వెలసిన దేవతామూర్తులను పలువిధాల స్తుతించారు.

 

అలపన్నిద్దరు సూరులందును సముద్యల్లీలగా ఉన్న బె

గ్గలికం దానము బాస ణా నిజమున కంజాతనంజాత పు

ష్కల మాధ్వీక ఝరిన్మురారి సాగియంగా బొక్కి ధన్యాత్ములౌ

నిల పన్నిద్దరు సూరలం దలతు మోక్షేచా ఛామతిందివ్యులన్

 

అని శ్రీకృష్ణదేవరాయలు తాను రచించిన ఆముక్తమాల్యదలో ఆళ్వారుల గురించి స్తుతించాడు. వీరు రచించిన పాశురాలు నాలాయిర దివ్య ప్రబంధమనే పేరుతో ప్రఖ్యాతి గాంచాయి. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి తొలి ఆళ్వారుగా పేర్కొన్న పోయ్ గై యాళ్వారు, భూతత్తాళ్వారులు, పేయాళ్వారులు క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటివారని చెబుతోంటే చరిత్రకారులు మాత్రం 12 మంది ఆళ్వారుల కాలం క్రీస్తుశకం 6 నుండి 9వ శతాబ్దం వారని చెబుతుంటారు. ఏది ఏమైనా పన్నిద్దరు ఆళ్వారులు తమ హృదయ కమలాల నుండి నిసర్గ సుందరంగా వెలువడిన మధుర మధు ప్రవాహంచే హరిణి కీర్తించి ధన్యులైన పరమ భాగవతోత్తములు. ఈ ఆళ్వారులు చూపిన మధురభక్తి విష్ణు సాయుజ్యము నకు చేరుటకు మార్గం.

 

కొండలపై వర్షం కురవడంవల్ల ఆ నీరు పాయలుగా మారి నదీనదాలుగా రూపాంతరం చెంది పల్లమువైపుకు ప్రవహించి చివరికి సాగరంతో సంగమిస్తుంది. కానీ భక్తి నది మాత్రం దక్షిణము నుండి ప్రవహిస్తూ ఉత్తరంగా పయనించి కొండ కోణాలను దాటి పరమ పదమునకు ఆలవాలమైన శ్రీమన్నారాయణుని యందు ఐక్యమౌతుంది. ఆకాశం నుండి కురిసిన వర్షం సాగరాన్ని చేరినట్లుగా, భూలోకాన ఆవిర్భవించిన భక్తి నది మాత్రం సర్వోత్కృష్టమైన హరి అనే మహా సాగరాన్ని చేరడానికి ఆరాటపడుతుంది. అందుకే గదా భగవానుడు భగవద్గీతలో ఈవిధంగా చెప్పాడు.

 

ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం

సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్ఛతి

 

ఈ పాశురాలను నాథముని అనే కవినాథుడు ద్రావిడ సంహితకు రాగతాళములు కూడా కూర్చి పాటలు పాడుకోడానికి వీలుగా మలిచాడు. అందువల్ల ఈ పాశురాలు పండిత పామరులు కూడా సులభంగా పాడుకోడానికి అవకాశం కలిగింది. ఆళ్వారులలో నమ్మాళ్వారులు శరీరం కాగా, మిగిలిన ఆళ్వారులు అందరూ వీరికి ఇతర శరీర భాగములని వైష్ణవులు కీర్తిస్తారు. ఈ నమ్మాళ్వార్లనే భక్తి అనే నదికి ఉన్నత స్థానంగా కూడా వైష్ణవాచార్యులు వర్ణిస్తారు.

వైష్ణవాలయాలకు వెళ్ళినప్పుడు అర్చకులు మనకు తీర్థం ఇచ్చి శఠగోపం మన శిరశుపై ఉంచుతారు కదా! ఈ నమ్మాళ్వారులకే శఠగోపులని కూడా పేరు. వీరి ప్రతీకయే ఈ శఠగోపం. వీరు శ్రీ మహావిష్ణువుకు పాదస్థానీయులు. అందుకే శఠగోపంపై విష్ణు పాదములు ఉంటాయి. శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రవర్తకులగు శఠగోప మహర్షి భక్తి స్రవంతికి ఉన్నత స్థానం. వీరు మూర్తీభవించిన కరుణా రసమూర్తి.

 

ఇంకా ఉంది....

 

Tirumala vaibhavam Serial-5, tirumala hills complete information, history of tirumala, detailed story of tirumala hills, tirumala balaji epic stories, hindu epics and lord venkateswara, venkatadri, anjanadri etc 7 hills, bhooloka vaikuntham tirumaladri