Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 28
?>

తిరుమల వైభవం సీరియల్ - 28

Tirumala vaibhavam Serial- 28

దేసు వెంకట సుబ్బారావు

చాళుక్య, యాదవ రాజుల వివాహ సంబంధాల్లో హోదా పట్టింపులు పట్టించుకోక వీరి కన్యలను వారు, వారి కన్యలను వీరు ఇచ్చి పుచ్చుకోవడంతో వారిలో బంధుత్వం నెలకొని పటిష్టంగా రాజ్యం నెలకొల్పుకోడానికి దోహదపడింది. తిరుక్కాళత్తి దేవ యాదవరాయలు ''చాళుక్య నారాయణ'' అన్న బిరుదే యాదవ రాజులలోనూ చాళుక్యలలోనూ ఉన్న బాంధవ్యాన్ని స్పష్టపరుస్తోంది. ''వేంగిమహానాయక'' అన్న బిరుదుతో తిరుక్కాళత్తి యాదవ రాయలు వేంగి దేశంపై అత్యంత పలుకుబడి కలిగిఉన్నాడు. తొండమండలాధీశ్వర అనే బిరుదుతో ఆనాడు తిరువన్నమలై నుంచి శ్రీకాళహస్తి వరకు విస్తరించిన తొండమండలాన్ని తిరుక్కాళత్తి దేవ యాదవ రాయలు పాలించాడు. తెలుగు చోళులు వీరికి సమకాలికులుగా ఉన్నారు. తిరుక్కాళత్తి దేవయాదవ రాయలు తిరుపతి సమీపంలోని ''అవిలాల'' గ్రామాన్ని శ్రీవారికి సర్వమాన్యంగా సమర్పించారు. భుజబల సిద్దారస'' అని పిలవబడే రాజా మల్లదేవ యాదవ రాయలు, ఆతని రాని బెజ్జాదేవి అని పిలవబడు కోమల మహాదేవి - వీరిద్దరూ శ్రీస్వామివారికి అనేక మాన్యాలను సమర్పించారు. దీన్ని మధురాంతక పోట్టాపి చోళ ఎర్ర సిద్దారస. వీరి సమక్షంలో నాగపుడోలిలో అమలుపరిచారు. ఈ విషయాలు వేంకటగిరి, నెల్లూరు శాసనాలలో బయటపడ్డాయి. తెలుగు చోళులు ఆనాడు పాకనాడు నెల్లూరు, కడప జిల్లాల ప్రాంతాలకు అధిపతులుగా ఉన్నారు.

 

అలున్ తిరుక్కాళత్తి దేవ మహారాజుకు అనగా తెలుగు చోళ తిక్కకు మామ తిరుక్కాళత్తి దేవయాడవ రాయలు. ఈ అలున్ తిరుక్కాళత్తి దేవమహారాజు వీర నరసింగ దేవ యాదవ రాయల కుమార్తె లక్ష్మీదేవిని వివాహమాడారు. అలాగే యాదవ రాజులు పోట్టాపి చోళ మహారాజు కూతురిని వివాహమాడారు. తిరుక్కాళత్తి దేవయాదవ రాయలకు ఇద్దరు భార్యలు.

1. పుడోలి మహాదేవియార్

ఈమె ఆవులను శ్రీకాళహస్తీశ్వరునికి దానం చేసింది. అప్పుడు మూడో రాజరాజ చోళుని వయసు 13 ఏళ్ళు.

2. చాళుక్య కుల మాదేవియార్

ఈమె సింగురసర్ కుమార్తె. ఈమె గొర్రెలను శ్రీకాళహస్తీశ్వరునికి దానంగా ఇచ్చింది. అప్పుడు మూడో రాజరాజ చోళుని వయసు 10 సంవత్సరాలు.

 

వీర రాక్షస యాదవ రాయలు

తిరుక్కాళత్తి దేవ యాదవ రాయల కుమారుడు వీర రాక్షస యాదవ రాయలు. ఇతనికి సింగ పిళ్ళై అనే పేరు కూడా ఉంది. తండ్రి తదనంతరం రాజ్యానికి వచ్చాడు. తిరుక్కువూరునాడులోని తిరుక్కువూరును సర్వమాన్యంగా శ్రీ స్వామివారికి ఇచ్చారు. ఇతను శ్రీ స్వామివారికి ''తిరుమంతిరై తిరుప్పోనకం'' అనే నైవేద్యాన్ని ఏర్పాటు చేశాడు.మూడవ కులోత్తుంగునికి 15వ ఏడు జరుగుతుండగా ఈ దానం చేసినట్లు శ్రీకాళహస్తిలో దొరికిన శాసనాల ద్వారా తెలుస్తున్నది. అప్పటి కాలం క్రీస్తుశకం 1193వ సంవత్సరం.

 

వీర నరసింగ దేవ యాదవ రాయలు

ఆ తర్వాత వీర నరసింగ దేవ యాదవ రాయలు పట్టాభిషిక్తుడయ్యాడు. ఇతను మూడవ కులోత్తుంగ చోళుని కాలం నుంచి తొండ మండలాధీశుడిగా అటు చోళులకు, ఆపై పాండ్యులకు సామంతరాజుగా సుమారు 57 సంవత్సరాలు పరిపాలన కొనసాగించాడు. క్రీస్తుశకం 1205 నుండి క్రీస్తుశకం 1262 వరకు మూడో కులోత్తుంగుని 31వ సంవత్సరం మొదలుకొని జాతవర్మ సుందరపాండ్యుని 12వ సంవత్సరం వరకు తొండమండలాన్ని పరిపాలించాడు. ఈ తొండమండలం - కంచి, చిత్తూరు, వెల్లూరు, నార్త్ ఆర్కాట్, చెంగల్పట్టు జిల్లాలతో నిండి ఉంది.

 

శ్రీ వీరనరసింగ యాదవ రాయలు మూడోరాజరాజ చోళుని తరపున ఉరాట్టి యుద్ధం చేశాడు. ఈ యుద్ధం మూడోరాజరాజ చోళునిపై కొప్పెరుంజింగ, అతని తండ్రి ప్రకటించారు. అప్పుడు ఈ యాదవ రాయలు చోళరాజు తరపున యుద్ధం కొనసాగించాడు. చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం తాలూకాలో ఈ ''ఉరాట్టి'' ఉంది. చరిత్రలో అత్యంత ప్రశస్తమైంది ఈ యుద్ధం. ఈ యుద్ధంలోనే యాదవ రాయలు బావమరది నారాయణపిళ్ళైను కొప్పెరుంజింగ చంపేశాడు.

 

వీర నరసింగ యాదవరాయలుకు ''శశికుల-చాళుక్య'' అనే బిరుదు ఉంది. ''తని నిన్ర వెన్ర'' అంటే ''ఒంటరిగా పోరాడే వీరుడు'' అనే బిరుదు కూడా ఉంది. ''రాజాశ్రయ'' శరణు కోరిన రాజులకు ఆశ్రయమిచ్చేవాడు అనే బిరుదు కూడా ఉంది. శత్రురాజులను అందరినీ ఓడించి తన కీర్తి పతాకాన్ని దేశదేశాల్లో ఎగిరేట్లు చేశాడు. చత్ర చామరాలతో ఏనుగుపై ఊరేగాడు. తిరుమల కొండపై శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో మొట్టమొదట తులాభారాన్ని నిర్వహించిన రాజు ఇతనే.

 

తన ఎత్తు బంగారాన్ని తులాభారంగా శ్రీ స్వామివారికి సమర్పించాడు. ఈ బంగారాన్ని శ్రీ స్వామివారి గర్భగుడిపైనున్న ఆనందనిలయ విమానానికి బంగారు తాపడం చేసిన రాగి రేకులను తాకించాడు. ఇలా బంగారు కాంతులతో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం మేరు పర్వతంలా వికసించింది. బంగారు తాపడం ఆ విమానానికి పూర్తి కాగానే పాండ్యచక్రవర్తి అయిన మొదటి జాతవర్మ సుందర పాండ్యుడు బంగారు కలశాన్ని శ్రీవారి ఆనందనిలయ విమాన శిఖరంపై ఉంచి తన భక్తిని చాటుకున్నాడు. శ్రీవీర నరసింగ యాదవ రాయలు శ్రీస్వామివారి మాన్యంపై రైతుల నుండి రావలసిన ఆదాయాలను మండలాధీశుని హోదాలో సక్రమంగా వసూలు చేయించి శ్రీ స్వామివారి ఖజానాకు జమయ్యే ఏర్పాటు చేశాడు. శ్రీవారి ఆలయానికి కావలిసిన పప్పు, బియ్యం హోరవెచ్చాల కోసం కావలసిన ఖర్చుకుగానూ ఒక గ్రామాన్ని సర్వమాన్యంగా సమర్పించాడు.

 

పల్లవరాణి ''సామవై'' తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో గొప్పగా స్మరించుకోదగ్గ వ్యక్తి మరపురాని వ్యక్తి, చరిత్ర జ్ఞానంతో ముందుచూపుతో పరిరక్షించిన వ్యక్తి శ్రీ వీర నరసింగ దేవ యాదవ రాయలు. ఎంతో పరిజ్ఞానం పెంపొందిన ఈ ఆధునిక కాలంలో శిల్పం గానీ, శిలా శాసనం గానీ దొరికితే దాని విశిష్టతను గుర్తించక దాన్ని ఏ అరుగు మీదికో లేక మెట్లకో ఉపయోగించి దాని విలువను గుర్తించని అపర జ్ఞానులు ఈనాడున్నారు. అయితే, 800 సంవత్సరాలకు ముందున్న ఈ యాదవరాజు, తిరుమల దేవాలయ పునరుద్ధరణలో దొరికిన శిలా శాసనాలను నాల్గింటిని కొత్తరాళ్ళపై ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెక్కించి ఈ దేవాలయ గర్భగుడి ప్రాకార గోడలకు ఈ కొత్తరాళ్ళను చేర్చి కట్టించడం విరిగిన ఆ పాట శాసనాల రాళ్ళను కూడా ఆ ప్రాకార గోడలకే అతికించి ఉండటం, అసామాన్యమైన ముందుచూపు గల వ్యక్తిగా శ్రీవీర నరసింగదేవ యాదవ రాయలను గుర్తించవచ్చు. ఆయన చరిత్రకారుల పాలిట కల్పతరువుగా మనం సంస్మరించుకోవచ్చు.

 

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి గర్భగృహం, విమానం శిథిలమై ఉండగా, తిరుపుల్లానిదాసర్ అనే శిల్పి దీన్ని గుర్తించి యాదవ రాజుకు తెలపగా ఆయన దేవాలయ పునరుద్ధరణకు అనుమతించారు. అలా దేవాలయ పునరుద్ధరణలో నాలుగు చోళుల శాసనాలు చరిత్రకు దక్కేలా చేశాడు. అంతేగాక ఆనంద నిలయ విమానానికి మొదటిసారిగా బంగారుపూట వేయించి, ఆ దేవాలయానికే బంగారు కళ తెప్పించాడు. ఇది జరిగింది క్రీస్తుశకం 1245లో. అప్పటికి ఈ వీరనరసింగదేవ యాదవ రాయలకు 40 పరిపాలనా సంవత్సరాలు నిండాయి. వీర నరసింగదేవ యాదవ రాయలు పరిపాలనా దక్షునిగా, ప్రాంతీయ అధికారిగా, ఆలయ నిర్వహణలో అత్యంత భక్తునిగా, న్యాయవిచారణలో నిజమైన న్యాయనిర్ణేతగా అతన్ని మనం దర్శించగల్గుతున్నాం.

 

శ్రీకాళహస్తిలో మల్లికార్జున విగ్రహం నెలకొల్పాడు. తన పేరుమీద నరసింహస్వామి విగ్రహాలు ప్రతిష్టించి దేవాలయాలు కట్టించాడు. తిరుపతిలో నరసింహ తీర్థం, నరసింహదేవాలయం ఆయన కట్టించినవే. ఈ వీర నరసింగదేవ యాదవ రాయల రాణి ''యాదవ రాయ నాచ్చియార్'' తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైయ్యాశి నెలలో సాధారణంగా జరిగే బ్రహ్మోత్సవమే గాక, ఇంకో బ్రహ్మోత్సవాన్ని తమిళమాసమైన ''ఆణి'' నెలలో జరిగేట్టు ఏర్పాటు చేశారు. ఈ బ్రహ్మోత్సవం ఏర్పాటు చేసినప్పుడు వీర నరసింగ దేవ యాదవ రాయల వయసు 30 సంవత్సరాలు. ఇందుకోసం తిరుపతి సమీపాన దక్షిణ-పడమర దిక్కున సుమారు ఐదు కిలోమీటర్ల దూరాన ఉన్న ''పైండపల్లె'' (పైడిపల్లి) గ్రామ ఆదాయంలో సగం దానం చేశాడు. మిగిలిన సగభాగం తిరుమల శ్రీస్వామివారికి ''తిరువిడై యాట్టం'' అంటే స్వామివారికి చెందే మాన్యం'' ఇదివరకే ఏర్పాటు చేశారు. శ్రీగోవిందరాజస్వామి దేవాలయంలో నిత్యం దీపారాధన నెయ్యితో జరపడానికి 32 గోవులను, ఒక ఎద్దును (ఆబోతును) దానం చేశారు. అలాగే తిరుమల శ్రీవారి ఆలయమ్లో కూడా అఖండ దీపారాధనకు నెయ్యి కోసం 32 ఆవులను, ఒక ఆబోతును దానం చేశారు. ఈ ''యాదవ నాచ్చియార్'' నారాయణ పిళ్ళై తండ్రి ''పండి యదారైయార్'' కుమార్తె. ఈ పాండియదారైయార్ యోగిమల్లవరంలోని తిప్పలాదీశ్వర అని పిలిచే పరాశారేశ్వర స్వామి శైవ దేవాలయ కోశాధికారిగా ఉన్నాడు. ఈ పదవిని ''పొక్కన్'' లేక పొక్కరాన్'' అని పిలిచేవారు. తాను మామగారైనను, వీరనరసింగ దేవయాదవ రాయలు తనకు సొంత అల్లుడైనను, అతని సంస్థానంలో ఈ చిన్న ఉద్యోగం చేయడం విశేషం. వీర నరసింగ దేవ యాదవ రాయల పెద్ద కుమార్తె లక్ష్మీదేవిని తెలుగుచోళ తిక్కకు అంటే అలున్ తిరుక్కోళత్తి దేవయాదవ రాయలతో వివాహం చేశాడు. వీర నరసింగదేవ యాదవ రాయలు వీరగొండ గోపాలదేవునికి సామంతునిగా క్రీస్తుశకం 1252-53 లో ఉన్నట్టు మద్రాసు ఎపిగ్రాఫికల్ రిపోర్టు క్రీస్తుశకం 1905లో పేరా 42లో రాసి ఉంది. అయితే ఇది ఒక్క సంవత్సరం మాత్రమే.

 

యాదవ నాచ్చియార్ తాను శ్రీ గోవిందరాజస్వామి దేవాలయంలో ప్రవేశపెట్టిన ''ఆణి'' మాశ బ్రహ్మోత్సవంలో రథోత్సవానికి కొయ్యరథాన్ని తయారుచేయించాడు. ఈ రథం వైశాఖ బ్రహ్మోత్సవంలో తిరిగే రథం కంటే చిన్నది. శ్రీగోవిందరాజస్వామి దేవాలయ మరమ్మత్తులకు, అలంకారానికి, రథం మరమ్మత్తులకు, కొంత సొమ్మును శాశ్వత నిది కింద దేవాలయ అధికారులకు అప్పజెప్పారు. తిరుమలలో అట్టహాసంగా జరిగే తిరుక్కోడి తిరునాళ్ అని పిలిచే పెరటాశి బ్రహ్మోత్సవం మాదిరిగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ''ఆణి'' నెలలో ప్రవేశపెట్టిన బ్రహ్మోత్సవం కూడా జరగాలని అధికారులను పురమాయించాడు. ఆకాలంలో తిరుమల, తిరుపతుల్లో అనేక ఉత్సవాలు జరుగుతున్నా, ఎన్ని ఉత్సవాలు, ఏయే సందర్భాల్లో జరుగుతున్నాయనే విషయానికి గత భాగాల్లో వివరించడం జరిగింది.

 

శ్రీ వీరనరసింగ దేవ యాదవ రాయలు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి అనేక సేవలు చేశాడు. అఖండ దీపారాధన చేయించాడు. అన్న నైవేద్యాలు శ్రీ స్వామివారికి త్రికాలాల్లో సమర్పించే ఏర్పాటు చేశాడు. ఇందుకోసం కోడవూరునాడులోని పాదిరివేడు గ్రామాన్ని శ్రీస్వామివారికి సర్వమాన్యంగా చెల్లించాడు. అలాగే శ్రీ గోవిందరాజస్వామివారికి కూడా అన్ననైవేద్యాలు ఏర్పాటు చేశాడు. శ్రీ వీర నరసింగదేవ యాదవ రాయలు 50 సంవత్సరాల కాలంలో అంటే క్రీస్తుశకం 1220లో తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి ప్రాంగణంలో శ్రీవైష్ణవ మత ప్రవక్త అయిన శ్రీ రామానుజాచార్యులకు ఒక దేవాలయం కట్టించి దానికి ''ఎంబెరుమన్నార్ కోవిల్'' అనే పేరు పెట్టారు. ఆ తర్వాత కాలంలో వారిని భాష్యకార్లను, భాష్యకార్ గుడి అని పిలిచేవారు.

 

తిరువెంకటనాథ యాదవ రాయలువీరనరసింగ దేవ యాదవ రాయల తదనానంతరం రాజ్యానికి వచ్చిన వారు తిరు వెంకటనాథ యాదవ రాయలు. ఇతన్ని తిరువెంగళ నాథా అని కూడా పిలిచేవారు. ఇతని సేనాధిపతి సింగయ్యధన్నాయక. ఇతని సలహా మేరకు ఇల్లత్తూరునాడులోని పొంగల్లూరు గ్రామ ఆదాయంలో సగభాగం శ్రీస్వామివారికి సర్వమాన్యంగా దానం ఇచ్చారు. ఈ దానం ''ఆణి'' నెలలో జరిగే బ్రహ్మోత్సవానికి ఖర్చులను భరించదానికి ఏర్పాటు చేసింది. తన దగ్గర మహా ప్రధానిగా ఉన్న రాచాయ ధాన్నాయక జ్ఞాపకార్ధం ''సీతా'కర'గండ'సంధి'' అనే నైవేద్య ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. సింగయ ధాన్నాయక ప్రోద్బలంతో ఈ పొంగల్లూరు గ్రామం శ్రీస్వామివారికి దానం చేయడం వలన కాలక్రమంలో దీని పేరు ''సింగన నల్లూరు''గా మారింది. సింగయ్య ధాన్నాయక తండ్రి పేరు మాధవప్ప ధాన్నాయక. ఇతన్ని మాధప్ప అని, మాధవన్నాయక అని కూడా పిలిచేవారు. ఈ మాధవ ధాన్నాయక తండ్రి పేరు పెరుమాళ్ళదేవ. ఈ పెరుమాళ్ళదేవుడు హొయసల రాజైన మూడో వీరనరసింహానికి మంత్రిగా ఉండేవాడు.

 

మాధవప్పనాయక మరొక కుమారుని పేరు వీరచిక్క కేతయ. ఈ కేతయ మూడో వీరవల్లాలకు సమకాలికుడు. మాధవప్పనాయక వీర చిక్కకేతయ, తండ్రీకొడుకులిద్దరూ గవర్నర్లుగా పనిచేశారు. వీరచిక్క కేతయ తమ్ముడైన సింగయధాన్నాయక ఇద్దరూ యాదవ రాజుల దగ్గర అంటే తిరు వేంకటనాథ యాదవ రాజుల దగ్గర అంటే తిరు వేంకట నాథ యాదవ రాయలు, రంగనాథ, యాదవ రాయలు దగ్గర సేనాధిపతిగా మంత్రిగా పనిచేశాడు. హొయసల రాజైన మూడో వీరవల్లా దగ్గర కూడా సేనాధిపతిగా, మంత్రిగా కూడా పనిచేశాడు. ఈ ధాన్నాయక వంశీయులు ''ధాన్నాయకన్ కొట్టు''కు అధిపతులు. ఈ ఊరు కోయంబత్తూరు జిల్లాలో సత్యమంగళం తాలూకాలో ఉంది. ఈ దాన్నాయకులందరికీ ''సీతాకర్ గండన్'' అనే బిరుదు ఉంది. రాచయ ధాన్నాయకన్ కొట్టుకు ముఖ్య అధిపతిగా ఉండటం వల్ల ''సీతాకర గండ'' అనే నైవేద్యం రాచాయ ధాన్నాయక పేరిట అతని జ్ఞాపకార్ధం శ్రీ స్వామివారికి జరిపించారు. ఈ దానం తిరువేంకట నాథ యాదవ రాయల 8 సంవత్సరాల పాలనాకాలంలో ఆణి నెలలో ఇచ్చినది. అయితే దానం ఆ రాజు తొమ్మిదవ పరిపాలనా కాలంలో ఆణి నెలలో అమల్లోకి వచ్చింది. తిరు వెంకట నాథ యాదవ రాయలు హొయసల రాజైన మూడవ వీర వల్లారకు సామంతునిగా ఉన్నాడు. తిరువెంకట నాథ యాదవ రాయలు తిరుపతిని ''తిరునామత్తుక్కాని''గా శ్రీవారికి దానం చేశాడు.

 

కొంతకాలం తర్వాత ''తిరునామత్తుక్కాని'' సర్వమాన్యంగా మార్చివేశాడు. ఉరాట్టి యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకుని నారాయణపిళ్ళై జ్ఞాపకార్ధం తిరువేంకటనాథ యాదవ రాయలు శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో ''నారాయణసంధి'' అనే నైవేద్యం ప్రవేశపెట్టారు. ఈ నారాయణపిళ్ళై జ్ఞాపకార్ధం ఆయన విగ్రహాన్ని నాగపుడోలి (నాగలాపురం)లో ప్రతిష్టించారు. ''రాజా మల్లి దేవ యాదవ'' అని పిల్చుకునే భుజబల సిద్దారస అనే యాదవ రాయలు ఈ ప్రతిష్ఠ చేయించాడు. ఇది మూడో కులోత్తుంగ చోళుని అంత్యదశలో జరిగింది. తిరువేంకటనాథ యాదవ రాయలు వీరవల్లాలకు సామంతుడు. వల్లాల దేవర వారి పన్ను పేరిట హొయసల రాజుల గౌరవార్థం వసూలుచేసి వారికి కప్పంగా కడుతుండేవారు. క్రీస్తుశకం 1310లో మౌలికాఫిర్ దక్షిణభారతదేశ దండయాత్రలో చిన్నచిన్న రాజులు స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. కానీ యాదవ రాజులు మాత్రం హొయసల రాజులకు సామంతులుగానే ఉంటూ తొండమండలాన్ని బలోపేతం చేశారు. ఈ పరిస్థితి తిరువెంకట నాథయాదవ రాయలు, ఆ తర్వాత వచ్చిన శ్రీరంగనాథ యాదవ రాయలు కొనసాగించారు.

 

తిరువేంకట నాథయాదవ రాయలు సుమారు 15 ఏళ్ళు అంటే క్రీస్తుశకం 1321–22 నుంచి 1336-37 వరకు పాలించాడు. పరిపాలనా సౌలభ్యానికి అవసరమైన డబ్బును పన్నులద్వారా వసూలు చేశాడు. ఆ పన్నుల విభజన ఇలా ఉంది.

1. బంగారంతో చెల్లించే పన్నులు - పాన్ వారి

2. ధ్యానంతో చెల్లించే పన్నులు - కడమైయాం

3. దేవుని సేవలకోసం చెల్లించే పన్నులు - అమానివగై

4. హొయసల రాజులకు చెల్లించే పన్నులు - వల్లాల దేవర వారి పన్ను

 

పన్నుల వివరాలు

1.జంతువులపై పన్నులు

2. వీధి పన్నులు

3.వృత్తి పన్ను (వ్యాపార పన్ను, గానుగ పన్ను, నేత పన్ను మొదలైనవి)

4. తోట పన్ను

5. చేపలు పట్టే బెస్తవారి పన్ను

6. పెంపుడు కుక్కలా పన్ను

 

ఇంకా ఉంది...

 

Tirumala vaibhavam Serial-28, tirumala glorious history and pallavas, tirumala vaibhavam ani, narayana pillai statue in nagalapuram, govindaraja swamy temple in tirumala vaibhavam