Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 24
?>

తిరుమల వైభవం సీరియల్ - 24

Tirumala vaibhavam Serial- 24

దేసు వెంకట సుబ్బారావు

 

తిరుమల దివ్య క్షేత్రం తరతరాలుగా అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. ప్రకృతి సొబగుల మధ్య ధరాతలంపై వెలసిన ఆధ్యాత్మిక దివ్య ధామం ఈ తిరుమల. వైష్ణవ దివ్య క్షేత్రమైన తిరుమల ప్రపంచపటంలో 13 – 41 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 79 – 21 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య వెలసింది. ఈ దివ్య పర్వత శ్రేణి తూర్పు కనుమలు, శేషాచల శిఖరాలతో అలరారుతూ ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉంది. ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన పర్వత శ్రేణి భైరంకొండ క్వార్ట్ జైట్, నగరి హిల్స్, సాలగ్రామ శిల లాంటి విశిష్టతలను పొందింది.

ఈ పర్వతాలను ఆవరించిన అరణ్యాలు వేసవిలో ఆకు రాల్చే బెట్టు అరణ్యాలుగా పేరొందాయి. తిరుమల విస్తీర్ణం 10.3 చదరపు మైళ్ళు. తిరుమలపై వెలసిన వేంకటాద్రిని చేరుకోవడానికి అనేక నడక దారులున్నాయి. వాటిలో అలిపిరి, శ్రీవారి మెట్టు,ళ్ మామండూరు, కడప జిల్లాలోని ఎర్రగుంట్లకోట మొదలైనవి. ఇంకా తిరుమలను చేరుకోడానికి రెండు ఘాట్ రోడ్లు కూడా ఉన్నాయి. 1944లో నిర్మించినది మొదటి ఘాట్ రోడ్డు కాగా, 1974లో నిర్మించినది రెండో ఘాట్ రోడ్డు. ఈ ప్రముఖ ఘాట్ రోడ్లు సముద్రమట్టానికి 2800 అడుగుల ఎత్తున ఉన్నందున తిరుమల దివ్యక్షేత్రం ఎప్పుడూ చల్లగా, చలికాలంలో మరింత చల్లగా ఉంటుంది.

 

ప్రముఖ వైష్ణవ క్షేత్రం అయినందున ఇక్కడి ప్రజలు ఎక్కువగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఆంగ్లం ఇంకా మరాఠీ, మలయాళ భాషలు కూడా మాట్లాడతారు. హైందవ క్షేత్రం అయినందున ఎక్కువగా తిరునామం, పంచెకట్టు, సంప్రదాయ వస్త్రధారణ చేస్తారు. తిరుమల శ్రీవారి నారాయణాద్రిలోని ఒక చింతచెట్టు చెంత అర్చామూర్తిగా వెలసినందున ఇక్కడ చింతచెట్టు పవిత్రమైనదిగా, ప్రముఖమైనదిగా భావిస్తారు. ఎర్రచందనం చెట్లు ఎక్కువగా పెరగడంవల్ల అనేక గృహోపకరణాల తయారీకి ఎర్రచందనం ఉపయోగిస్తారు. అతి పురాతన కాలానికి చెందిన బంగారు బల్లి లభించడంద్వారా ఈ ప్రాంతాన్ని అతి ప్రాచీన ప్రాంతంగా గుర్తించారు. శ్రీరామానుజాచార్యులు తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి సేవలను వైఖానస ఆగమ సంప్రదాయానుసారం జరపాలని నిర్ణయించినందువల్ల ఇక్కడ ఆలయ సంప్రదాయాలు వైఖానసాగమ సంప్రదాయాలను అనుసరించి ఉంటాయి. శ్రీవేంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణం అయినందున శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరిదైన చక్రస్నానం శ్రవణా నక్షత్రంలో జరుగుతుంది. ఇంకా శ్రీవారు మహా విష్ణు అవతారంగా భావించి సేవించడంవల్ల శ్రీవారి వాహన సేవలలో గరుడ వాహన సేవ ప్రముఖమైంది. తిరుమల పర్వతశ్రేణిని ఏడుకొండలుగా విభజించారు. వాటిని అంజనాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, శేషాద్రి, నీలాద్రి, వేంకటాద్రి ఇంకా నారాయణాద్రిగా పేర్కొన్నారు.

 

శతాబ్దాల కాలం నుండి తిరుమల శ్రీవారి ఆలయం అనేకమంది ప్రముఖులు, రాజులు, మంత్రులు, సామంతులచేత నిర్వహించబడటం వల్ల ఆలయాభివృద్ధి జరిగి ప్రపంచంలోని హైందవ ఆలయాలలో అత్యంత సంపన్న ఆలయాలలో ప్రముఖమైనదిగా అభివృద్ధి చెంది, ప్రధమ స్థానంలో ఉంది. అనేకమంది స్వామివారిపై గల అపారమైన భక్తిప్రపత్తులకు గుర్తుగా వారు స్వామివారి సేవలకు చేసిన కైంకర్యాలను ముందుతరాలకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో వారి కైంకర్యవివరాలను ఆలయ గోడలపై పొందుపరిచి ముందు తరాలకు అందించారు. అవి 1252 శాసనాలు ఉన్నాయి. వీటివల్ల ఆలయ ప్రాచీనత తెలుస్తుంది. తిరుమల దివ్య క్షేత్రంలో 108 దివ్య తీర్థాలు ఉన్నాయి. వాటిని భక్తిప్రద, జ్ఞానప్రద, ముక్తిప్రద తీర్థాలుగా పేర్కొన్నారు. వీటిలో కొన్ని కాలక్రమంలో మరుగున పడిపోగా మరికొన్ని కనుమరుగై, ఇంకొన్ని చొరరాని ప్రదేశాల్లో ఉన్నాయి. కొన్ని మాత్రమే ప్రస్తుతం యాత్రికుల దర్శనానికి అనువుగా ఉన్నాయి. వాటిలో జాబాలితీర్థం, ఆకాశగంగ, తుంబురతీర్థం, పాపనాశనం, కుమారధారా, పసుపుధారా, రామకృష్ణ తీర్థం శేషతీర్థం, చక్రతీర్థం మొదలైనవి.

 

తరతరాలనుండి తిరుమల ప్రాంతం అనేక రాజవంశీయుల పాలనలో ఉంది. వారిలో మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, బాణులు, చోళులు, పాండ్యులు, యాదవ రాజులు, తెలుగు పల్లవులు, విజయనగర ప్రభువులు, గోల్కొండ నవాబులు, ఔరంగజేబు, హైదరాబాద్ నిజాం నవాబులు, టిప్పుసుల్తాన్లు, మైసూరు మహారాజులు, వెంకటగరి రాజులు, ఆంగ్లేయులు, హథీరాంజీ మఠం పాలన తర్వాత తిరుమల ఆలయం ప్రస్తుతం 1933వ సంవత్సరం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో ట్రస్టుబోర్డు ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతూ హైందవ సంప్రదాయాలకు ఆలవాలమై విరాజిల్లుతూ ఉంది. ఇంతే కాకుండా ఈ ప్రభువుల కాలంలోనే ఆళ్వారులు, ఆచార్యులు, త్యాగయ్య, అన్నమయ్య, పేద తిరుమలాచార్యులు, చిన తిరుమలాచార్యులు, తరిగొండ వెంగమాంబ, కన్నడ హరిదాసులు, అనేక పండితులు, గాయకులు, కవులు స్వామివారిని తమ అనన్య భక్తిప్రపత్తులతో కొలిచి, ఆరాధించి తరించారు.

 

తిరుమల చరిత్ర పుటలను పరికిస్తే ఈ ప్రాంతం పాత రాతియుగపు జాడల అవశేషాలు లభించడంవల్ల అతి పురాతన కాలంనుండే జనసంచారంతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉండేది. దానికి కారణం మధ్యరాతి యుగానికి చెందిన ఆయుధాలు, పనిముట్లయిణ రాతిగొడ్డలి, ఇతర ఆయుధాలు ఈ ప్రాంతంలో లభించడమే. ఈ పురాతన కాలానికి చెందిన అవశేషాలన్నీ తిరుపతి, శీతారాంపేట, ఎల్లంపల్లి, మేకలవాండ్ల పల్లి, పీలేరు, గట్టు ప్రాంతాల్లో లభించినట్లు తెలుస్తుంది. క్వార్ట్ జైట్ లోహ పనిముట్లు ఇక్కడ సమీప ప్రాంతాలైన అగ్రహారం, ఆరవాండ్ల పల్లి, చింతపర్తి, మరాఠవాండ్ల పల్లి ప్రాంతాల్లో లభించాయి.

 

ప్రాచీన కాలంనుండీ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశాలను పరిశీలిస్తే అనేక ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.

 

మౌర్యులు ఇంకా శాతవాహనులు

ఈ ప్రాంతాన్ని అతి ప్రాచీన కాలానికి చెందిన మౌర్యులు, శాతవాహనులు పరిపాలించారు. వీరి కాలానికి చెందిన ప్రత్యక్ష సాక్ష్యాధారాలు మనకు లభించనప్పటికీ అప్పటి కాలానికి చెందిన పేర్లు ఇప్పటికీ వాడుకలో ఉండటం, కొన్ని గ్రామాలకు అప్పటి పేర్లు ఇంకా వాడుకలో ఉండటమే కారణం. మౌర్యులు నందవంశాన్ని కూల్చిన తర్వాత భారతదేశంలోని దక్షిణ ప్రాంతాన్ని కూడా తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు. తర్వాత మౌర్యుల ప్రాభవాన్ని నిలువరించిణ శాతవాహనులు ఈ ప్రాంతాన్ని దాదాపు 400 సంవత్సరాలకు పైగా పాలించారు. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పల్లవులు పాలించారు. వీరిలో స్కందవర్మ, తన సామ్రాజ్యాన్ని కృష్ణా తీరంనుండి అరేబియా సముద్రం వరకు విస్తరించాడు. అప్పటికాలంలో కృష్ణాతీరంలో చిత్తూరు జిల్లా కూడా చేరి ఉన్నందున పల్లవుల పాలన ఈ ప్రాంతం వరకూ విస్తరించింది. నాల్గవ శతాబ్దం మధ్య ప్రాంతంలో సముద్రగుప్తుడు పల్లవ రాజైన కంచిని పాలించిన విష్ణుగోపుని ఓడించాడు. కానీ తర్వాత కాలంలో అధికారానికి వచ్చిన త్రిలోచన పల్లవుడు మళ్ళీ కరికాలచోళుని కాలంలో అధికారాన్ని కోల్పోయారు. ఆవిధంగా గుప్తుల కాలంలో ఈ దక్షిణాపథం 560 ఏ.డి. నుండి 580 ఏ.డి. వరకు అభివృద్ధి చెందింది. చోళులు పల్లవులు సమకాలీనులైనందున అనేక శాసనాలు ఇటు చోళులు, పల్లవులు వేయించారు. పల్లవుల కాలంలోనే అనేక శాసనాలు లభించాయి. రెండవ నరసింహ వర్మ (700-728ఏ.డి.), రెండవ పరమేశ్వర వర్మ (728-731ఏ.డి.), రెండవ నందివర్మ (731-796ఏ.డి.), దంతివర్మ (796-847ఏ.డి.), మూడవ నందివర్మ (846-869ఏ.డి.), నృపుతుంగ వర్మ (859-899ఏ.డి.), అపరాజిత (885-903ఏ.డి.) లకు చెందిన అనేక శాసనాలు ఈ ప్రాంతంలో లభించాయి.

 

పల్లవుల కాలంలో ఈ ప్రాంతానికి తొండమండలం పేరుతో తిరుమల తిరుపతి ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. పల్లవులు తూర్పు దక్షిణ ప్రాంతాలనుండి వలస వచ్చిన శాతవాహనులే. ఈ పల్లవ రాజ్యాన్ని స్థాపించిన సింహవర్మ నాగకన్యను వివాహం చేసుకున్నాడు. దీనివల్ల సింహవర్మకు వీరి వర్గంలో మంచి పేరు వచ్చింది. దీన్ని అనుకూలంగా చేసుకున్న సింహవర్మ తన రాజ్యాన్ని మరింత విస్తరింపచేసుకున్నాడు. ఈయన గుంటూరు, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని తొండమండలాన్ని ఆక్రమించాడు. తర్వాత తన ప్రాభవంతో కంచిని రాజధానిగా చేసుకుని కంచికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చాడు. ఈతని వంశపాలనలో ఈ ప్రాంతం తొమ్మిదవ శతాబ్దం వరకు సాగింది. తొమ్మిదవ శతాబ్దం తొలినాళ్ళలోనే చోళులు ఓడించేవరకూ వీరి రాజ్యపాలన సాగింది. వీరి కాలానికి చెందిన రెండు శాసనాలు తిరుమల శ్రీవారి ఆలయానికి చెందినవి లభించాయి. అవి కోదంతి విక్రముడైన (775-826ఏ.డి.) కి చెందినవి. ఐతే అప్పటికాలంలో తిరుమల శ్రీవారి ఆలయానికి సరైన మార్గం లేనందున ఈ కానుకలను తిరుచానూరులోని శ్రీ మనవాళ పెరుమాళ్ కు అనగా భోగ శ్రీనివాసునికి సమర్పిస్తారు.

 

బాణులు

పల్లవుల వంశానికి చెందినవారే బాణులు. విజయాదిత్య బాణుడుతన పరిపాలనలో తిరుమల స్వామివారికి ఇచ్చిన రెండు శాసనాలు లభించాయి. తొమ్మిదవ శతాబ్దం తొలినాళ్ళలో పాలించిన విజయాదిత్యుని పాలనలో తొండమండలం బహుముఖంగా అభివృద్ధి చెందింది. పల్లవులు రెండు తరాలు పాలించిన తర్వాత చోళరాజైన ఆదిత్యచోళుడు పల్లవరాజైన అపరాజితుని ఓడించాడు. దీంతో పల్లవుల పాలన అంతమైంది.

 

బాదామి చాళుక్యులు

తర్వాత వచ్చినవారు బాదామి చాళుక్యులు. కంచిని పల్లవులు పాలించిన కాలంలోనే వీరు కూడా కొంత ప్రాంతాన్ని పరిపాలించారు. తొండమండలాన్ని పాలించిన ఈ బాదామి చాళుక్యులనే కరికాల చోళులు లేక రేనాడు చోళులు అని పిలిచేవారు. మహా మండలేశ్వరుడైణ చోళరాజు మహేంద్ర విక్రముడు, అతని కుమారుడు పుణ్యకుమారుని పేరుతో కొన్ని శాసనాలు తిరుమల ఆలయానికి చెందినవిగా గుర్తించారు. ఈ రేనాడు రాజులను 757ఏ.డి.లో ఓడించి రాష్ట్రకూటులు అధికారంలోకి వచ్చారు. వీరు బాదామి చాళుక్యులను ఓడించి తొండమండలాన్ని కైవసం చేసుకున్నారు. అప్పటినుంచి ఈ తొండమండలం రాష్ట్రకూటుల పాలనలోకి వచ్చింది.

 

రాష్ట్రకూటులు

వీరి కాలంలో పాండ్యులు అధిక బలవంతులుగా ఉండేవారు. అందువల్ల పల్లవులు, రాష్ట్రకూటుల సహకారంతో పాండ్యరాజులను ఓడించి పాలనలోకి వచ్చారు. కానీ వీరికి బాణులు, నలంబాలు, వైడుంబాలు వైరులుగా మారి తరచూ యుద్ధాలకు పాల్పడేవారు. ఈవిధంగా అధికారంలో ఉన్న పల్లవ రాజైన అపరాజితుని ఓడించి చోళరాజైన ఒకటవ ఆదిత్య చోళుడు (871-907ఏ.డి.) తొండమండలాన్ని జయించి పరిపాలించాడు. ఆదిత్యచోళుని కుమారుడైన ఒకటవ పరాంతకుడు (907-955ఏ.డి.) అత్యంత బలోపేతుడై కాళహస్తి నుండి మద్రాసు వరకు, కావేరీతీరం వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు. తర్వాత ఒకటవ పరాంతకుని (909-916ఏ.డి.) ఇద్దరు బాణరాజుల సహకారంతో విడుంబలు (రెండవ విక్రమాదిత్యుడు, మూడవ విక్రమాదిత్యుడు) ఓడించారు. తర్వాత రాష్ట్రకూటుల రాజైన మూడవ కృష్ణుడు బాణుల ప్రాబల్యాన్ని అణచివేశాడు. బాణులు, వైడుంబులు రాష్ట్రకూటుల రాజైన మూడవ కృష్ణుని శరణు వేడారు. దీనిద్వారా చోళుల దాష్టీకం నుండి రక్షణ పొందాలని ఆశించారు. ఐతే మూడవ కృష్ణుడు సామంతరాజులను కూడగట్టుకొని చోళుల దాష్టీకాన్ని అరికట్టాడు. ఈవిధంగా చోళరాజైన ఒకటవ పరాంతకుని అధీనంలోనున్న తొండమండలం రాష్ట్రకూటుల రాజైన మూడవ కృష్ణుని అధీనంలోకి వచ్చింది.

 

ఐతే జయించిన భూభాగంలో ఉండటం ఇష్టంలేని రాష్ట్రకూటరాజు కృష్ణుడు ఆ ప్రాంతానికి అనేకమంది అధికారులను నియమించితన అధీనంలో పాలన చేయాలని సూచించాడు.ఈవిధంగా నియమితులైన అధికారుల్లో వజ్జరదేవుడు ఒకడు. ఇతను తొండమండలంలోని పులినాడు ప్రాంతానికి అధికారిగా నియమితుడయ్యాడు. కొంతకాలానికి మూడవ కృష్ణుడు మరణించడంవల్ల వజ్జరదేవుడు స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు. ఇదే అదనుగా భావించిన చోళులు (949-957ఏ.డి.) గంధరాదిత్యుడు, (957-973ఏ.డి.)అరింజయుడు, ఆతని కుమారుడు రెండవ పరాంతకుడు, (970-985ఏ.డి.) ఉత్తమచోళుడు మిగిలిన రాష్ట్రకూటులపై విజయం సాధించి తొండమండలాన్ని తమ స్వాధీనం చేసుకున్నారు. వీరి కాలంలోని అనేక శాసనాలు ఇక్కడ లభించాయి.

 

విడుంబులు

రాష్ట్రకూటుల కాలానికే చెందినవారు విడుంబులు. వీరు కూడా ఈ ప్రాంతంలోని కొంత భాగాన్ని పాలించారు. కడప, చిత్తూరు, కోలారు జిల్లాల్లో వీరి ప్రాభవం ఉండేది. 8 నుండి 10వ శతాబ్దం వరకు వీరి ప్రాభవం ఈ ప్రాంతాల్లో ఉండేదని వీరి వీరోచిత యుద్ధాలకు చెందిన శాసనాల ద్వారా తెలుస్తుంది. వీరి వంశానికే చెందినవారు ఇరిగయ మహారాజు, నన్నిమ రాయర్, తుక్కరాయ, మధుక మహారాజ, కలిగా త్రినేత్ర భీమ మహారాజు.

 

నలంబ పల్లవులు

క్రీస్తుశకం నాల్గవ శతాబ్దం మధ్య ప్రాంతంలో పరిపాలించిన మరో చిన్నరాజులు నలంబులు. పల్లవరాజైన ఒకటవ సింహవర్మ నలంబరాజైన హరివర్మ (450-460) కు పట్టాభిషేకం చేశాడు. వీరి వంశం మొత్తం 11మంది. వీరందరూ బాణులు, వైడుంబులు, చోళులు, రాష్ట్రకూటులతో తరచూ యుద్ధాలు చేసేవారు. క్రీస్తుశకం 878 తర్వాత మహేంద్రవర్మ విజయంతో నలంబులు తమ శక్తి సామర్ధ్యాలు పెంచుకుని బలవంతులయ్యారు. ఈవిధంగా నలంబులు చాలా భూభాగాన్ని ఆక్రమించారు.

 

ఇంకా ఉంది...

 

Tirumala vaibhavam Serial-24, tirumala glorious history and badami chalukyas, nalamba pallavas in tirumala vaibhavam, vidumbas and rashtrakutas, mouryas and shatavahanas