Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 13
?>

తిరుమల వైభవం సీరియల్ - 13

Tirumala vaibhavam Serial- 13

దేసు వెంకట సుబ్బారావు

తిరుమంగై ఆళ్వారులు

తిరువెంకటనాథుని అనేకమంది దర్శించకుండానే తమ మనోనేత్రంతో శ్రీవారిని వీక్షించి వేనోళ్ళ కీర్తించిన మహానుభావులు ఆళ్వార్లు. ఆళ్వారులందరూ కూడా అలౌకిక ఆనందంలో శ్రీమన్నారాయణుని దర్శించి, కీర్తించి గానం చేసిన వారైతే తిరుమంగై ఆళ్వారులు తాను ప్రేయసికిచ్చిన మాటకోసం శ్రీరంగనాథునికి జీవితాన్నే అంకితం చేసిన మహోన్నతుడు, భక్తాగ్రేసరుడు. వారి జీవితచరిత్రను క్లుప్తంగా వివరించే అక్షర సమాహారమే తిరుమంగై ఆళ్వారుల చరిత్ర.

 

తిరుమంగై ఆళ్వారులు ఆటవిక రాచకుటుంబానికి చెందినవాడు. తిరుక్కురయ్యలూరు అనే ప్రాంతంలో జన్మించారు. ఈ ప్రాంతం తిరువాలి తిరునగరికి దగ్గర్లో ఉంది. ఈ తిరుమంగై ఆళ్వారులు వైకుంఠనాథుని శార్ఘమనే విల్లు అవతారంగా భావించారు. వీరు కలినామ సంవత్సరంలోవృశ్చిక లగ్నం, కృత్తిక నక్షత్రంలో జన్మించారు. జననీజనకులు వీరికి మొదట నీలవర్ణుడనే పేరు పెట్టి మేఘశ్యాముడి ప్రసారంగా భావించి అల్లారుముద్దుగా పెంచసాగారు.

వీరు నివసించి పరిపాలించే ప్రాంతం తిరుమంగై అనే ఊరు. ఈ ప్రాంతంలోని పాలకుడిగా వీరిని తిరుమంగైనార్ అని పిలిచేవారు. భగవద్భక్తి పరాయణుడైనందున వీరికి తర్వాతికాలంలో తిరుమంగై ఆళ్వారులు అనే పేరు స్థిరపడింది. చోళదేశంలోని చిన్న అటవీప్రాంతాన్ని తన ఏలుబడిలో ఉంచుకుని జనరంజకంగా పరిపాలించేవారు నీరవర్ణుని తండ్రి. తర్వాత వారసునిగా నీలవర్ణుడే ఆ ప్రాంతానికి రాజై ఆ ప్రాంతాన్ని అత్యంత బలోపేతం చేశాడు.

 

ఇలా తిరుమంగై ప్రాంతాన్ని పరిపాలించే ఈ తిరుమంగై మంచి రూపసి, ధైర్యవంతుడు, జనరంజకుడు. ఒకరోజు తన ప్రాంతంలో అశ్వారూఢుడై సమీపంలోని నదీప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఆ నది నుండి నీటి కుండను తీసుకొస్తున్న ఒక వైష్ణవ బాలిక తారసపడింది. ఆ బాలిక సౌందర్యానికి ముగ్ధుడైన తిరుమంగై ఆమె తల్లిదండ్రుల వివరాలను తెలుసుకుని ఆ బాలికను వివాహమాడ నిశ్చయించుకున్నాడు.

 

తిరుమంగై మనసు దోచిన మగువ పేరు కుముదవల్లి. ఈమె కలువల కొలను వద్ద పసిబాలికగా ఒక వైష్ణవ బ్రాహ్మణునకు దొరికినందున ఆమెను సంతానం లేని ఆ బ్రాహ్మణ దంపతులు అల్లారుముద్దుగా పెంచారు. ఆమె పేరుకు తగ్గట్లే రూపలావణ్యవతియై దేవకన్యణు పోలి ఉంది. దైవానుగ్రహంతో దొరికినందున ఆ బాలికను గారాబంగా పెంచడమే కాకుండా ఆమె తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆమోదం చెప్పసాగారు ఆ బ్రాహ్మణ దంపతులు. అందువల్ల ఆమె నిర్ణయానుసారమే ఆమె వివాహం జరుగుతుందని తెలుసుకున్న తిరుమంగై ఆమె తల్లిదండ్రులకు తాను కుముదవల్లిని వివాహమాడ నిశ్చయించుకున్నానని తదుపరి తమ నిర్ణయం చెప్పమని కబురు పంపాడు. ఆ కాలంలో వర్ణాంతర వివాహం నిషిద్ధం కనుక ఆ వార్త విన్న బ్రాహ్మణ దంపతులకు రాజాజ్ఞను ఎలా అతిక్రమించాలో తెలీక సందిగ్ధంలో పడ్డారు. అది విన్న కుముదవల్లి రాజును నొప్పించకుండా, తన తల్లిదండ్రులను బాధపెట్టకుండా ఎలా రాజుకు సమాధానం చెప్పాలా - అని దీర్ఘాలోచనలో పడింది. రాజు చెప్పినట్లు అంగీకరిస్తే తల్లిదండ్రులు బాధపడతారు. అలాగని రాజాజ్ఞను ధిక్కరిస్తే తానే గాక తన తల్లిదండ్రులు కూడా ఇక్కట్ల పాలు అవుతారని ఆలోచించింది. చివరికి రాజుకు తన అంగీకారం తెలుపుతూ ''తాను వైష్ణవ కన్య కనుక రాజు కూడా వైష్ణవుడైన క్షత్రియుడు అయితే తాను వివాహానికి అంగీకరిస్తానని, అందుకు గానూ రాజు తాను వైష్ణవ ద్వేషి కాదు అని నిరూపించుకోడానికి ఒక సంవత్సరంపాటు భక్తితో, ప్రేమతో వైష్ణవ భక్తులు వేయిమందికి ప్రతిరోజూ సంతర్పణ చేయాలని, అలా చేస్తే, ఏడాది తర్వాత తాను తిరుమంగై మహారాజును వివాహం చేసుకోడానికి సిద్ధమేనని తెలిపింది. ఇంకా ఈ వైష్ణవ బాలిక కోరుతోన్న ఈ చిన్న కోరికను తీర్చినట్లయితే తాను సంతోషంగా ఈ వివాహానికి అంగీకరిస్తానని జోడించింది. ఏనాడో తన జీవితాన్ని శ్రీరంగనాథుని సేవకు అంకితం చేసిన ఆమె మనసులో తిరుమంగైని కూడా వైష్ణవ భక్తునిగా చేసి జాతికి ఒక వైష్ణవ ఆణిముత్యాన్ని అందించాలనేదే ఆమె తపన.

 

కుముదవల్లి విధించిన నిబంధనలను తిరుమంగై సంతోషంగా అంగీకరించి, తన వైష్ణవ భక్తిని నిరూపించుకోదలచుకున్నాడు. ధనం, దర్పం గల యువరాజు తలచుకుంటే జరగనిది ఏముంది? ఆ అటవీ ప్రాంతంలో పందిళ్ళు వెలిశాయి. ఆ ప్రదేశమంతా శ్రీవైష్ణవ ముద్రలైన తిరునామాలు, శంఖ చక్ర చిహ్నాలతో పులకించి పునీతమైపోయింది. వైష్ణవ భక్తులకు ఇక నిత్య సంతర్పణే. నిత్య పండుగే. సమాదరణ, సంతర్పణ, భక్తులతో ఆ అరణ్యమంతా నిత్య కోలాహలంగా మారిపోయింది. ఏతావాతా ప్రజలందరూ అక్కడికి వచ్చి కడుపారా భోజనం చేసి ఇటువంటి సత్కార్యం చేస్తున్న తిరుమంగైని వేనోళ్ళ పొగడసాగారు. అయితే కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి కదా. కొంతకాలం జరిగిన ఈ సంతర్పణ కార్యం ఆర్ధిక సంకటంలో పడింది. ఎంతకాలమని జరుపుతారు ఇలా సంతర్పణ? పైగా తాను ఏ నగరానికో రాజు కాదు, ఒక చిన్న ఆటవిక రాజు. తన ఆర్ధిక స్థితి కొద్దికొద్దిగా తగ్గసాగింది. ఆలోచనలో పడ్డాడు తిరుమంగై. వైష్ణవ భక్తులకు నిత్యం చేసే సంతర్పణ ఇకపై కొనసాగించడం కష్టంగా భావించి ఏం చేయాలో ఆలోచించి మిత్రులతో సమాలోచన జరిపాడు.

 

తన సంపద అంతా వైష్ణవ భక్తుల కైంకర్యానికే వినియోగించాడు. ఇక దారి లేదు. సంతర్పణా వ్రతం పూర్తిచేయాలి. సుదీర్ఘ సమాలోచన అనంతరం ఒక ముగింపుకు వచ్చాడు. అది ఈ అటవీ మార్గంద్వారా శ్రీరంగనాథుని దర్శనార్థం అనేకమంది ఆర్తులు, ధనికులు, వ్యాపారులు అక్రమార్జన చేసేవారు, వారి పాపాలను ప్రక్షాళన చేసుకునేందుకు వచ్చే ఎందరో ఆర్తజన రక్షకుడైన శ్రీరంగనాథునికి అర్పించాలని తెచ్చే కానుకలను సంగ్రహించి, ఆ ధనాన్ని శ్రీరంగనాథుని భక్తులకు అన్న సంతర్పణ చేస్తే తప్పు కాదని భావించాడు. ఈ ఆలోచన సబబుగా ఉందని భావించి సుశిక్షితులైన తన అనుచరులను పిలిచి దీనులను, బీదవారిని, నిర్భాగ్యులను తప్ప శ్రీరంగనాథునికి పెద్ద మొత్తంలో కానుకలను అర్పించాలని వచ్చే వారినుండి కానుకలను సంగ్రహించి నిత్య సంతర్పణకు ఏర్పాటు చేయమని చెప్పాడు. తిరుమంగై ఆనతి మేరకు ఆతని అనుచరులు వైష్ణవ భక్తులుగా వేషం ధరించి, ఊర్ధ్వ పుండ్రాలతో భక్తులతో కలిసిపోయేవారు. అలా కొంతదూరం వారితో పయనించి తర్వాత తమతో వచ్చే బాటసారులను దోచుకునేవారు. అసలే అటవీ ప్రాంతం దారి దోపిడీ వారితో ఉండేడని ప్రసిద్ధి. దానికితోడు తిరుమంగై అనుచరులు గుంపులు గుంపులుగా ఏర్పడి భక్తులను దోచుకోవడంతో అంతకు ముందు ఆ ప్రాంతపు దారిదోపిడీదారులంతా తిరుమంగై అనుచర గణంతో చేరిపోయి తమ కార్యక్రమాలను నిరాటంకంగా చేసి పెద్ద మొత్తాలను చేర్చసాగారు. నిత్య సంతర్పణ పేదలను, సామాన్యులను, ఆర్తులను ఆదరిస్తోంటే ధనికులు, వ్యాపారులు మాత్రం తిరుమంగై చర్యలను విమర్శించసాగారు. ఇలా తిరుమంగై అనుచరులు ఈ కార్యక్రమం కొనసాగించసాగారు. ఇంతలో ఒక చిత్రమైన సంఘటన జరిగింది.

 

ఒకరోజు నూతన దంపతులైన ఒక యువ జంట శ్రీరంగనాథునికి అనేక అమూల్య కానుకలను అర్పించాలని తిరుమంగై తిరుగాడే అటవీ మార్గంలో ప్రయాణించసాగారు. వారిని తిరుమంగై అనుచరులు అటకాయించి తిరుమంగై వద్దకు తీసుకొచ్చారు. అక్కడ తిరుమంగై వారికి తాను చేసే సత్కార్యం గురించి తెలియజేసి శ్రీరంగనాథునికి అర్పించే కానుకలను తనకే ఇవ్వమని, తాను చేసే నిత్య సంతర్పణకు సహకరించమని చెప్పాడు. దానికి ఆ నూతన దంపతులు ''అయ్యా! మీరు చేస్తోన్న సత్కార్యం చాలా బాగుంది. కానీ శ్రీరంగనాథుని దర్శనార్థం వచ్చే భక్తులను ఇలా దోచుకుంటే తన భక్తులను కాపాడుకోలేని స్వామిపై భక్తులకు ఎలా నమ్మకం ఉంటుంది? రానురాను దొంగల బెడద ఎక్కువగా ఉందని భక్తులు కూడా రారు కదా! శ్రీరంగనాథుని ఆలయ నిర్వహణ ఎలా జరుగుతుంది? స్వామి భక్తులకు నిర్భీతిని కలగజేయాల్సింది పోయి ఇలా భయభ్రాంతుల్ని చేయడం భావ్యమా? మీ సత్కార్యం కోసం అన్యులను బాధించడం నేరం కాదా?! రానురాను ఈ అటవీ ప్రాంతం గుండా శ్రీరంగనాథుని దర్శనార్థం ఎవరూ రారు. అప్పుడు మీరు ఏం చేయగలరు? ఆలయ అభివృద్ధి మీ చేతులారా మీరే పాడు చేస్తారా? మీరే ఆలోచించండి. ఏదో మా తోచింది చెప్పాము.. ఆ తర్వాత మీ ఇష్టం..'' అని చెప్పి వెళ్ళిపోయారు.

 

ఆనాటి రాత్రి ఆ యువ దంపతులు చెప్పిన మాటలు తిరుమంగైకి పదేపదే గుర్తురాసాగాయి. కలతనిద్రలో కూడా ఆ దంపతులే గుర్తొస్తున్నారు. ఉలిక్కిపడి లేచి చూస్తే వారి రూపాలే లీలగా కనిపిస్తున్నట్లుగా ఉండి, వారి మాటలే చెవుల్లో మారుమోగుతున్నాయి. ఆ వచ్చినవారు శ్రీమహాలక్ష్మీ సమేత నారాయణుడు గానీ, రుక్మిణీ సమేత వాసుదేవుడు కానీ వచ్చి, తనకు జ్ఞానోదయం చిసిన మహా తెజోమయులైన దివ్యమూర్తులుగా భావించసాగాడు. నిద్ర పట్టక ఒకటే ఆలోచన. నిజంగా తాను ఎంత తప్పిదం చేశాడు. శ్రీరంగనాథుని దర్శించే భక్తులకు తన చేతలచే కంటకంగా మారాడు. భక్తులు నిజంగాణే తన చర్యలచేత రాకుంటే ఆలయనిర్వహణ ఎలా? ఆలయం ఇప్పటికే ప్రహరీగోడలేకున్నది. అనేక చోట్ల శిథిలమైపోయింది. భక్తులు నిజంగా శ్రీరంగనాథుని ఆలయానికి చేయూత ఇవ్వకుంటే ఆలయానికి నిజంగానే దుర్దశ పట్టినట్లే కదా. దానికి తానే కారణం కదా! తలచుకుని బాధపడసాగాడు. ఎంతో ఆలోచించిన మీదట తిరుమంగై ఒక నిర్ణయానికి వచ్చాడు. తాను శ్రీరంగం వెళ్ళి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలని నిర్ణయించుకున్నాడు. దానికి దేశం అంతటా తిరిగి ధనికుల నుండి ఈ మహత్తర సత్కార్యానికి సహాయం చేయాలని అర్థించాలని అనుకున్నాడు. తన జీవితాశయం ఇక కుముదవల్లి మీద గాక శ్రీరంగనాథుని ఆలయ సముద్ధరణకేనని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయాన్ని తన సహచరులకు చెప్పి, నిత్య సంతర్పణ ఇకపై విరమించాలని, సచ్చీలతతో తల్లిదండ్రులతో ఉండమని హితవు చెప్పి ఇకపై తనను శ్రీరంగంలో చూడవచ్చునని, తాను శ్రీరంగనాథుని సేవలో తరించాలని నిర్ణయించుకున్నానని తెలియజేసి పెద్దలందరి వద్ద ఆశీర్వచనం తీసుకుని శ్రీరంగానికి పయనమయ్యాడు తిరుమంగై.

 

ఇప్పుడు తన మనసు, తనువు, ధ్యానం, ధ్యాస, ఇచ్చ, వాంఛ అన్నీ కూడా శ్రీరంగనాథుడే. స్వామి సుందర రూపాన్ని తనివితీర చూసి, కొలిచి, తాను చేసిన తప్పిదానికి ఆలయాన్ని సమూలంగా జీర్ణోద్ధరణ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాఉద్. శ్రీరంగం చేరుకున్న తిరుమంగై తిరునామాన్ని ధరించి, కాషాయం ధరించి శ్రీరంగంలోని ధనికులను, వ్యాపారులను కలిసి తాను దైవకార్య నిర్వహణకు వచ్చానని, శ్రీరంగనాథుని ఆలయాన్ని అభివృద్ధి చేయ సంకల్పించానని చెప్పి సహాయం చేయమని అర్ధించాడు. కానీ, వారంతా తిరుమంగైని అరణ్యంలో చూసినవారే కావడంవల్ల ఏమాత్రం సహకరించకపోగా మళ్ళీ వారిని దోచుకోదానికి వచ్చి భక్తుని వేషంలో వచ్చిన వానిగా భావించి దూషించారు.

 

విషణ్ణ వదనంతో తిరుమంగై కావేరీ తీరంలో ఇసుక తిన్నెమీద కూర్చుని ఇప్పుడు ఏం చేయాలి అని దీర్ఘాలోచనలో పడ్డాడు. అప్పుడు ఒక నలుగురు యువకులు తిరుమంగైని కలిసి తాము పూర్వాశ్రమంలో దోపిడీ దొంగలమని, తమకు అనేక విద్యలు తెలుసునని, తిరుమంగై చేపట్టిన దైవకార్యంలో ఎంతయినా సహాయపడగలమని, ఈవిధంగా నైనా తమ పాపాన్ని కొంతైనా పోగొట్టుకోవాలని నిశ్చయించుకున్నామని తెలియజేశారు. వారి అవ్యాజమైన భక్తికి సంతోషించిణ తిరుమంగై శ్రీరంగంలోని ధనికులకు ఎలాగైనా తమపై నమ్మకాన్ని కలగజేసి ఆలయ పునరుద్ధరణకు తోడ్పడేలా చేయాలని, దానికి తగిన ఉపాయం ఆలోచించమని చెప్పాడు. తర్వాత వారు ఒక వ్యూహాన్ని పన్ని ఆరోజు రాత్రి నగరంలోని ధనికులందరి ఇళ్ళలోని ధన, కనక, వస్తువులను అంతుచిక్కని విధంగా తస్కరించి శ్రీరంగనాథుని ఆలయంలో ఉంచారు. ఆ ధనరాశి వద్ద తిరుమంగై విష్ణుసహస్రనామ పారాయణం చేస్తూ కూర్చున్నారు. తమతమ సంపదలను కోల్పోయిన వారంతా తమ సంపదలు ఎలా పోయాయో అర్ధంగాక తికమకపడుతున్న వారందరికీ వినపడేలా తిరుమంగై శిష్యులు వారివారి సంపద అంతా తమ గురువుగారైన తిరుమంగై వద్ద శ్రీరంగనాథుని ఆలయంలో ఉన్నవాణి తగిన గుర్తులు చెప్పి, వలసినవారు తమతమ సంపదలను తీసుకుని వెళ్ళవచ్చని చాటింపు వేశారు.

 

అది విని పరుగుపరుగున వచ్చిన ఆ ధనికులకు యోగముద్రలో కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్న తిరుమంగై కనిపించాడు. అది చూసిన నగర ప్రజలు పరమ భక్తుడైన తిరుమంగైని తూలనాడినందుకు భగవంతుడు తమ సంపదను అయాచితంగా ఆ భక్తునివద్దకు చేర్చాడని భావించారు. తదుపరి తిరుమంగై అక్కడ గుమిగూడిణ ప్రజలను ఉద్దేశించి ''భక్తులారా! ఇక్కడున్న మీమీ సంపదలను మీరు తీసుకోండి. కానీ, మీనుండి మీకు తెలియకుండా వచ్చిన ఈ సంపద అంతా భగవంతుని కైంకర్యానికి వినియోగించాలని భగవంతుని ఆజ్ఞ. దాన్ని మీరు శిరసావహిస్తారో లేక ధిక్కరిస్తారో మీ ఇష్టం. మీరే ఆలోచించుకోండి'' అన్నాడు. దాంతో అక్కడ తమ సంపదను పోగొట్టుకున్నవారంతా ఇక్కడికి వచ్చిన తమ సంపద అంతా భగవంతుని ఇచ్చానుసారం ఆలయానికి చేరింది కనుక దీనినంతా ఆలయ సముద్ధరణకే వినియోగించాలని తిరుమంగైని వేడుకున్నారు. అంతేగాక ఆలయ సముద్ధరణకు ఇంకా తమ నుండి ఏమేం సహాయం కావాలన్నా చేస్తామని హామీ ఇచ్చారు అక్కడి పురజనులు.

 

ఇక తిరుమంగై ఆనందానికి అంతులేకుండా పోయింది. తొలుత ఆలయ గర్భాలయాన్ని, దానిపై స్వర్ణ కళాశాలను ప్రతిష్టించాడు. తర్వాత ఆలయ ప్రాకారం చుట్టూ విశాలమైన స్థలాన్ని పెద్ద ప్రహరీగోడను నిర్మించాడు. ఆలయపు చుట్టూ ఉన్న నాలుగు ప్రహరీలకు నాలుగు అతి పెద్ద ద్వారాలను ఏర్పాటు చేసి వాటికి గాలి గోపురాలను నిర్మించాడు. ఇప్పుడు ఆలయం చుట్టూ లక్షలమంది భక్తులు స్వామివారి ఉత్సవాలను చూసేలా విశాలమైన రహదారి ఏర్పడింది. తర్వాత ఇలాగే ఏడు ప్రాకారాలు నిర్మించి, వాటికి నలువైపులా నాలుగు ద్వారాలు ఇంకా వాటిపై గాలిగోపురాలను నిర్మించాడు. ప్రతి రెండు ప్రాకారాలకూ మధ్య ఒక ఫర్లాంగు దూరం నియంత్రించి ఆలయం చుట్టూ ఏడు ప్రాకారాలు నిర్మించాడు. వాటికి నలువైపులా నాలుగు మహా ద్వారాలు, వాటిపై గాలిగోపురాలు, వాటిపై స్వర్ణ కలశాలు ప్రతిష్టించాడు. చివరి ప్రాకారపు ద్వారంనుండి చూస్తే తొలి ప్రాకారపు ద్వారందాకా సరళరేఖ గీసినట్టుగా సమానంగా ద్వారాలు కనపడతాయి. ప్రహరీల మధ్య అనేక చిన్నచిన్న ఆలయాలు, అనేక రాతి మందిరాలు, మండపాలు, వేయి స్థంబాల మండపం - ఇలా అనేక శిల్పకళను ప్రతిబింబించే కళారూపాలు చెక్కించాడు. అణువణువునా ఆధ్యాత్మికతను ప్రతిబింబించే కళారూపాలు రూపుదిద్దుకున్నాయి. ఆలయ ప్రాంగణం మరో వైకుంఠాన్ని తలపింపచేస్తుంది. ఇది తిరుమంగై కళానైపుణ్యానికి, దూరదృష్టికి, పరమ భక్తికి నిదర్శనం.

 

ఈ ఆలయ జీర్ణోద్ధరణ చేస్తున్నప్పుడు దూర ప్రాంతాల నుండి అనేకమంది శ్రామికులు, శిల్పులు, కళాకారులు, పండితులు, అనేకమంది ఈ బ్రహాద్కార్యక్రమాన్ని వీక్షించడానికి, ఇంకా ఇందులో పాలుపంచుకోవడానికి స్వచ్ఛందంగా వచ్చేవారితోనూ, విరాళాలు అందించేవారితోనూ ఆ ప్రాంతం అంతా కిటకిటలాడిపోతుండేది. అనేకమంది చోరులు, నేరస్తులు తిరుమంగై అనుసరించిన భక్తిమార్గాన్ని ఆరోజుల్లో ఎన్నుకుని ఆలయ సముద్ధరణకు తమ వంతు సేవ చేయడానికి తిరుమంగైకి సహకరించసాగారు. అయాచితంగా వచ్చే కానుకలు, సేవలతో ఆలయం నిత్యం తిరునాళ్ళను తలపించేది. ఈ విధమైన ఆలయ సముద్ధరణకు పూనుకున్న తిరుమంగై వాసం, నివాసం అంతా శ్రీరంగనాథుని సన్నిధిలోనే అయింది. నిత్యం భక్తి పారవశ్యంతో తిరుమంగై ఆలపించే కీర్తనలతో ఆలయ ప్రాంగణం పులకించిపోయేది. ఆలయమంతా ఊర్ధ్వ పుండ్రాలు దిద్దుకున్న భక్తులతో కిక్కిరిసిపోయేది. ఈవిధంగా శ్రీరంగనాథుని థామాన్ని అపర వైకుంఠంగా మలచి తన అనన్యమైన భక్తి సామ్రాజ్యాన్ని విస్తరింపచేసి, తన అమృతగానంతో పులకింపచేసిన తిరుమంగైను అక్కడ చేరిన భక్తులందరూ ముక్తకంఠంతో ఆళ్వారులుగా కీర్తించసాగారు. అప్పటినుండి తిరుమంగై, తిరుమంగై ఆళ్వారులుగా కీర్తించబడ్డాడు.

 

భారతదేశంలోనే గర్వించదగ్గ అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయంగా తీర్చిదిద్దిన తిరుమంగై ఆళ్వారు తన 25వ ఏట శ్రీరంగానికి విచ్చేసి అనుకున్నవిధంగా అన్ని విధాలుగా ఆలయ సముద్ధరణ కార్యాన్ని దాదాపు 60సంవత్సరాల కాలంలో పూర్తిచేశాడు. తన 85 వ ఏట తిరుమంగై ఆళ్వారులు తాను తలపెట్టిన ఆలయ సముద్ధరణ అనే బృహత్కార్యాన్ని పూర్తిచేసి, శ్రీరంగనాథుని ఆలయాన్ని అపర వైకుంఠంగా తీర్చిదిద్ది తన జీవితానికి సార్ధకతను సాధించుకుని, సంపూర్ణమైన ఆనందాన్ని పొంది, అశేష భక్తజనావళి భక్తి గానాన్ని ఆలపిస్తూ ఉండగా శ్రీరంగనాథుని సాయుజ్యానికి చేరుకున్నాడు.

 

తిరుమంగై ఆళ్వారులు ఆలపించిన వైష్ణవ భక్తి ప్రబంధాలు ఆరు. దాదాపు వేయికి పైగా ఉన్న అమృత గానామృత సంకలన పాశురాలు. వీటిని ఆలయ నిర్మాణ సమయంలో తనతోపాటు తోటి కార్మికులచేత కూడా పాడించేవాడు. వాటిలో పెరియ తిరుమోళి యందు 58 , తిరుక్కురన్ దండకం నందు 1, తిరునిడు దండకం నందు 4, తిరువేలు కుట్టిరుక్కై, శిరియ తిరుమోదల్ నందు 1, ఇంకా పెరియ తిరుమదల్ యందు 2 పాశురాలు, తిరుమల శ్రీ వేంకటేశ్వరునిపై మొత్తం 66 పాశురాలు గానం చేశారంటారు. తమ అమృత గానంతోనూ, భక్తి పారవశ్యంతోనూ శ్రీరంగాన్ని ఆలయ నగరంగా తీర్చిదిద్దిన తిరుమంగై ఆళ్వారులు శ్రీరంగాన్ని భారతదేశంలోకెల్లా ప్రముఖ వైష్ణవ భక్తిక్షేత్రంగా మార్చిన ధన్యజీవి. వీరు రచించిన పెరియ తిరుమొళిలోని వాడినేన్ అనే భాగంలో తిరుమంత్ర వైభవం గురించి తెలియజేసిన వైనం ఈ ఆళ్వారుల భక్తి పారవశ్యానికి ప్రతీక.

 

ఇంకా ఉంది...

 

Tirumala vaibhavam Serial-13, Tirumangai Alwar and 12 Alwars, Nammalvars and Tirumangai alwar, the story of Tirumangai Alwar, Tirumangai Alwar's amala natha piran, Tirumangai Alwar and 66 Pashuras, Tirumangai Alwar and periya tirumoli