Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 16
?>

తిరుమల వైభవం సీరియల్ - 16

Tirumala vaibhavam Serial- 16

దేసు వెంకట సుబ్బారావు

ప్రకృతి సంపద సౌందర్యాల మధ్య జనఘోషతో నిండిన వనారణ్యాల నడుమ శిలాతోరణాల స్వాగతంతో ప్రణమిల్లే పర్వత శ్రేణుల పరిష్వంగనతో అలరించే తిరుమల దివ్య క్షేత్రం ఎన్నిసార్లు దర్శించినా తనివితీరని పుణ్య పావన క్షేత్రం. సహజజీవజాలాలతో అలరారే ఈ తిరుమల శ్రీనివాసుని ఆవాసానికి ఆలవాలమై, అశేష జనావళికి ముక్తిని ప్రసాదించే దివ్య ప్రాంగణం. తూర్పు కనుమల మధ్య ప్రకృతి అందాల మధ్య నెలకొన్న ఈ తిరుమల దివ్యక్షేత్రం పవిత్ర పుణ్యతీర్ధాలకు కూడా ప్రసిద్ధమైంది. తిరుమల క్షేత్రంలో ప్రవహించే దివ్య తీర్థాలు నాలుగు రకాలుగా పేర్కొన్నారు. అవి ముక్తిప్రద తీర్థాలు, ధర్మప్రద తీర్థాలు, జ్ఞానప్రదతీర్థాలు, భక్తిప్రద తీర్థాలు. ఇవి అన్నీ కలిసి 108 పుణ్య తీర్థాలుగా ప్రసిద్ధి చెందాయి.

 

శేషాచల శిఖరాల్లో వెలసిన తిరుమల అసమాన దివ్య క్షేత్రం. హైందవ సంస్క్రృతికి ఆలవాలం. కోట్లాది వైష్ణవ భక్తులకు ముక్తి, శక్తి, స్ఫూర్తి. ఈ దివ్య క్షేత్రం ప్రకృతి అందాలతో పాటు, దివ్య తీర్ధాలకు, తపోధనులకు, ముముక్షువులకు ముంగిట నిలచిన వైకుంఠ ధామం. ముక్తిని ప్రసాదించే జ్ఞానక్షేత్రం, పుణ్యక్షేత్రం. అందుకే ఈ తిరుమలకు తీర్థాద్రి అనే ఇంకో పేరు కూడా ఉంది. తీర్థం అంటే పుణ్యం, పావన జలం అని అర్ధం. తీర్థయాత్రలవల్ల ప్రజలకు ప్రకృతితో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. జ్ఞాన సిద్ధి కలుగుతుంది. అంతిమంగా మానవ జీవిత పరమార్ధానికి దేవదేవుడు మనకిచ్చిన అందాల లోగిలి. అందుకే మన పూర్వీకులు తీర్థయాత్రల వైశిష్ట్యాన్ని ఎన్నోవిధాల తెలియజేశారు. ప్రతి తీర్థంలోనూ పంచ భూతాత్మకమైన ప్రకృతితో అనుసంధానం ఉంటుంది. తీర్థస్నానం సర్వ పాపహరణం. పుణ్యక్షేత్రమైనా మానవజాతి పరమార్ధానికి ముక్తిమార్గం.

 

మన పురాణాలు, శ్రీ వేంకటాచల మహాత్మ్యం, శ్రీ వేంకటేశ్వర వైభవం, శ్రీనివాస సారస్వతం అందించే సమాచారం ప్రకారం తిరుమల అరణ్యాల్లో 360 పుణ్య తీర్ధాలున్నాయంటారు. వాటిలోనూ 108 తీర్థాలు అత్యంత పవిత్రమైనవిగా ప్రతీతి. వరాహ, వామన, పద్మ, మార్కండేయ, స్కంద, ఆదిత్య, బ్రహ్మాండ, భవిష్యోత్తర, గరుడ పురాణాలు తిరుమల తీర్థ ప్రశస్తిని తెలియజేశాయి. అన్నమాచార్యులు కూడా తన కీర్తనల్లో పలు తీర్థాలగురించి గానం చేశాడు. ఆధునిక శాస్త్రవేత్తలు భౌగోళిక పరిణామ క్రమాన్ని ఇంకో పద్ధతిలో మనకు అందిస్తున్నారు. సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతమంతా సముద్రంలో కప్పబడి ఉండేదట. ఆ తర్వాత ఎన్నో మార్పులుచేర్పులు జరిగి కార్ట్ జయింట్ అనే స్ఫటిక శిల ఏర్పడింది. ఉదాహరణకు అలిపిరి గాలిగోపురానికి ఇరుపక్కలా బంగారు రిబ్బన్ లాంటి శిలా విన్యాసం కనిపిస్తుంది. అదే క్వార్ట్ జయింట్ నిర్మాణం. అది ఒకప్పుడు ఈ ప్రాంతమంతా పరచుకున్న సాగరం. దక్షిణాదికి తరలి వెళ్ళినప్పుడు వేసిన మట్టిమేట. ఈ క్రమంలోనే తిరుమలలోని శిలాతోరణం ఏర్పడింది. మరెన్నో నిగూఢమైన గుహలు, కొండకోనలు, లోయలు వెలుగు చూశాయి. నీటి ప్రవాహాలు బయల్దేరాయి. మన ఋషులు, మునులు, యోగులు, సిద్ధులు పరిశోధనలు చేసి ఆయా ప్రాంత భౌగోళిక, నైసర్గిక, ఆధ్యాత్మిక స్థితిగతులను, శక్తులను అనుసరించి నామకరణం చేసినవే ఈ దివ్య తీర్థాలు.

ప్రస్తుతం తిరుమలలో ఆవిర్భవించిన కొన్ని ప్రముఖ దివ్య తీర్థాల గురించి తెలుసుకుందాం. 1843లో ఆంగ్లేయులు తిరుమలను ఆలయ ధర్మకర్తలైన మహంతులకు అప్పగించే సమయంలో కొన్ని తీర్థాలను కూడా ప్రస్తావించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా చక్రతీర్థం, జాబాలి తీర్థం, ఆకాశగంగ తీర్థం, పాపవినాశన తీర్థం, రామకృష్ణ తీర్థం, సనకసనంద తీర్థం, పసుపుధారా తీర్థం, కుమారధారా తీర్థం, తుంబురు తీర్థం, శేష తీర్థం, గోగర్భ తీర్థం, వైకుంఠ తీర్థం. ఇంతే కాకుండా స్వామి పుష్కరిణి, స్వామి చెంత ప్రవహించే విరజాతీర్థం, ఆలయ ప్రాంగణంలోని బంగారుబావి, భూతీర్థం (పూలబావి), కటాహ తీర్థం (తొట్టి తీర్థం) - అనే మరికొన్ని తీర్ధాలున్నాయి. తీర్థాలకే తలమానికమైన స్వామి పుష్కరిణిలోనే మరో తొమ్మిది తీర్థాలున్నాయి. అవి వరాహ, ధనద,గాలవ, అగ్ని, వాయు, యమ, వశిష్ట, వరుణ, సరస్వతీ తీర్థాలు.

 

పేరుకు 108 పుణ్య తీర్ధాలున్నా, కాలాంతరంలో కొన్ని మూసుకుపోయాయి. మరికొన్ని కనుమరుగయ్యాయి. మనికొన్ని రూపుమాసిపోయాయి. శ్రీవారి ఆలయ పరిసరాలలోనే 54 తీర్థాల దాకా ఉండేవని ప్రతీతి. పూర్వం అనేకమంది మునులు, సాధువులు, ఋషులు వీటిచెంత కుటీరాలు, ఆవాసాలు నిర్మించుకుని జపతపాలు ఆచరించి స్వామిని సేవించేవారట.

 

తిరుమలలోని జల ప్రవాహాలు అలా అలా ప్రవహించి సెలయేళ్ళుగా, జలపాతాలుగా ఏర్పడ్డాయి. అలా ఏర్పడి పరమశివుని శిరసున నటనమాడే గంగాభవాని సాక్షాత్కరిస్తుంది తిరుపతిలోని సుప్రసిద్ధ శైవాలయమైన కపిలతీర్థం. అలానే మరో పుణ్యతీర్థం తిరుచానూరులోని అమ్మవారి ఆలయ పుష్కరిణి పద్మ సరోవరం. దీన్ని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే నిర్మించి శ్రీమహాలక్ష్మి కోసం తపస్సు ఆచరించాడని, అందువల్ల శ్రీమహాలక్ష్మి పద్మసంభవియై శ్రీమహావిష్ణువును చేరి పద్మావతిగా పేరుగాంచిందని మరో పురాణేతిహాసం తెలియజేస్తోంది. తిరుమల, తిరుపతి పుణ్యతీర్థాల్లో ప్రసిద్ధి చెందిన కొన్ని తీర్థాల గురించి తెలుసుకుందాం.

 

శంఖుతీర్థం

ఇది తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలోని శంఖుమిట్ట అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడే సీతాసమేత రామలక్ష్మణ విగ్రహాలు ఉన్నాయి. శ్రీవారి కల్యాణకట్టకు కొంచెం ఎగువగా, వైకుంఠం క్యూ కాంప్లెక్సుకు వెళ్ళే తోవలో ఎడమవైపు గట్టున ఉంది. స్వామివారి శంఖువు ఆకారంలో ఉన్నందున దీన్ని శంఖుతీర్థం అని పిలుస్తారు.ఇదెంతో విశిష్ట తీర్థం.

 

తిరుమల ఆలయప్రాంతానికి చేరువలో ఉన్న ఈ తీర్థం భక్తులందరూ దర్శించుకోవచ్చు. తిరుమలలోని జలవనరులన్నీ స్వామిసేవకు, స్వామి సేవకుల సేవకు నిరంతరం ఎదురుచూస్తూ ఉంటాయి. తిరుమల తీర్థ దర్శనాల్లో ప్రతి క్షేత్రం, ప్రతి తీర్థం, ప్రతి ప్రాంతం పరమ పవిత్రం. అణువణువునా భక్తి భావంతో పులకించే తిరుమల క్షేత్ర దర్శనం అనిర్వచనీయమైన అనుభూతి. మరికొన్ని తీర్థాలు వచ్చే సంచికలో...

 

ఇంకా ఉంది...

 

Tirumala vaibhavam Serial-16, tirumala and important places, tirumala sankhuteertham, tirumala kalyanakatta, tirumala 108 teerthas, 54 teerthas nearby tirumala main temple, 360 punya teerthas in tirumala forest