Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 17
?>

తిరుమల వైభవం సీరియల్ - 17

Tirumala vaibhavam Serial- 17

దేసు వెంకట సుబ్బారావు

శంఖుతీర్థం

ఇది తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలోని శంఖుమిట్ట అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడే సీతాసమేత రామలక్ష్మణ విగ్రహాలు కూడా ఉన్నాయి. శ్రీవారి కల్యాణకట్టకు కొంచెం ఎగువగా వైకుంఠం క్యూ కాంప్లెక్సుకు వెళ్ళే తోవలో ఎడమవైపు గట్టున ఉంది. స్వామివారి శంఖువు ఆకారంలో ఉన్నందున దీన్ని శంఖుతీర్థం అంటారు. ఇదొక విశిష్టమైన తీర్థం. తిరుమల ఆలయానికి అత్యంత సమీపాన గల తీర్థస్థలం ఇది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రులవారి చెంతన సేదతీరుతున్న తీర్థరాజమిది.

 

చక్రతీర్థం

శ్రీవారి ఆలయానికి పశ్చిమంగా సుమారు 2 కిలోమీటర్ల దూరాన గల సహజ శిలాతోరణం పక్కన నెలకొని ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం గొప్ప తపోవనం. అనేకమంది సాధువులు, సిద్ధులు తపస్సు చేసుకునే గుహలు ఇప్పటికీ ఉన్నాయి. ఇంకెక్కడా లేని విధంగా ఓ నిలువుపాటి బండపై చక్రత్తాళ్వారును, లక్ష్మీ నృసింహ స్వామిని చెక్కారు. కార్తీక బహుళ ద్వాదశినాడు తీర్థ ముక్కోటి. ఆనాడు తిరుమల ఆలయ అర్చకులు, అధికారులు, ఆలయ మర్యాదలతో ఇక్కడికి వచ్చి పూజాపునస్కారాలు సల్పుతారు. స్కాంద పురాణాన్ని అనుసరించి శాపగ్రస్తుడైన ఓ గంధర్వుడు రాక్షసుడై సంచరిస్తూ పద్మనాభుడనే తపశ్శాలిని కబళించబోయాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు తన భక్తుని కాపాడేందుకు సుదర్శనచక్రాన్ని ప్రయోగించి ఆ రాక్షసుని సంహరించాడు. అందువల్ల దీనికి చక్రతీర్థం అనే పేరు స్థిరపడింది. అంతేకాక 130 సంవత్సరాల క్రితం అంతరించిపోయింది అనుకున్న బంగారు బల్లికి (గోల్డెన్ గెకో) ఈ పరిసరాలే ప్రధాన స్థావరం కావడం విశేషం.

 

జాబాలి తీర్థం

జాబాలి మహర్షి తన శిష్యులటో కలిసి కొంతకాలం ఈ ప్రదేశంలో తపస్సు ఆచరించాడు. శ్రీవారి ఆలయానికి ఉత్తరాన సుమారు 3 కిలోమీటర్ల దూరంలో పచ్చని వృక్షచ్చాయల నడుమ నెలకొని ఉందీ తీర్థం. హనుమజ్జయంతినాడు ఇక్కడ ఆలయంలో నెలకొన్న హనుమంతునికి విశేష పూజలు జరుగుతాయి. హాథీరాంజీ మఠంవారి అధీనంలోని ఈ తీర్థం గొప్ప మునివాటిక. ఈ తీర్థానికి కొంచెం ఎగువ సీతాకుంజ్ అనే చెరువు, ఆపైన ధ్రువుడు తపస్సు చేసిన ధృవతీర్థం ఉన్నాయి.

 

పాండవతీర్థం

గోగర్భం డ్యాంకు దిగువన ఉన్నదే పాండవతీర్థం. కురుక్షేత్ర యుద్ధానంతరం తమకు అంటిన బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోడానికి పాండవులు ఈ తీర్థాన్ని సందర్శించి తపస్సు చేశారు. ఇక్కడి ఒక గుహలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక కర్త మలయాళ స్వామి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడు. అందుకు చిహ్నంగా మలయాళ స్వామి పాలరాతి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించారు. దాపులోనే తిరుపతి క్షేత్రపాలక గుండు ఉంది. ఈ క్షేత్రపాలక గుండు పూర్వం ఆలయంలోని ధ్వజస్థంభం దగ్గర ఉండేది. ఒకనాడు ఈ క్షేత్రపాలక గుండు వల్ల ప్రమాదం జరిగింది. అందువల్ల దీన్ని ఆలయంనుండి తరలించి ఇక్కడ ఉంచడం జరిగింది. తిరుమల ఆలయ క్షేత్రపాలకుడు రుద్రుడు ప్రతిరోజూ ఆలయం తెరిచేటప్పుడు, తిరిగి మూసిన తర్వాత ఆలయ తాళాల గుత్తిని రుద్రపాలకుడైన క్షేత్రపాలక గుండుకు తాకించిన తర్వాతనే ఆలయాన్ని తెరవడం, మళ్ళీ ఆలయం మూసినా తర్వాత ఆలయ తాళాలను తాకించడం ఆలయ సంప్రదాయం.

 

మలయప్ప తీర్థం

పాపవినాశనం డ్యాం ముందు నుంచి తూర్పుగా దుర్గమమైన అడవిలో కొండల అంచున ప్రయాణించి ఈ తీర్థాన్ని చేరుకోవాలి. ఈ ప్రాంతాన్ని మైలపుకొనగా పిలుస్తారు. మాలిక్ కాఫర్ దక్షిణదేశ దండయాత్ర సందర్భంగా ఉత్సవ మూర్తులైన మలయప్పస్వామి వారిని ఈ తీర్థం వద్దనే చాలాకాలం పదిలపరచి ఉంచారని ప్రచారంలో ఉంది.

 

శేషతీర్థం

ప్రమాదాల నెలవు ఈ శేషతీర్థం. శ్రీవారి ఆలయానికి ఈశాన్యంగా ఐదు కిలోమీటర్ల దూరంలో దుర్గమమైన లోయలో నెలకొని ఉంది. వానాకాలంలో ఈ తీర్థసందర్శన అత్యంత ప్రమాదకరం. గంగమ్మగుడి నుంచి బయల్దేరి సానరాళ్ళ మిట్ట మీదుగా సామిరెడ్డి గుంతలు దాటి నడికటి గడ్డపై నడిచి ఎడంపక్క ఓ బావిలాంటి లోయలోకి దిగాలి. ఈత రానివారు ఈ తీర్థం చేరుకోడానికి ఏడు నీటి మడుగులు దాటాలి. చివరి దాంట్లో తప్పనిసరిగా నీటిలో ఈదాలి. వారి జీప్ ట్యూబుల సహాయంతో దాటవచ్చు. లోపల ఆదిశేషుడు చుట్టాలు చుట్టుకున్నట్లు అత్యద్భుత శిల్పాకృతి. ఇంకా లోనికి వెళ్తే వైకుంఠం నందలి పాలకడలి లాంటి అద్భుత సరోవరం. తటిల్లత మెరిసినట్లు ఒక జలపాతం ఆ జలకుండాన్ని నింపుతూ ఉంటుంది.

 

రామకృష్ణ తీర్థం

ఇక్కడ శ్రీరాముడు, శ్రీకృష్ణుల శిలా విగ్రహాలున్నాయి. పాపవినాశనం డ్యాం నుంచి సనకనందన తీర్థం మీదుగా తుంబురు తీర్థం వెళ్ళే దారిలో కొద్ది దూరం పయనించాలి. సలీంద్రం బండ నుంచి ఎడమవైపు పెద్ద గుట్ట ఎక్కి ఓ లోయలోకి దిగాలి. పుష్య పౌర్ణమినాడు తీర్థ ముక్కోటి. సాధారణంగా ఫిబ్రవరిలో వస్తుంది. ఆ పర్వదినాన తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అర్చకులు, అధికారులు విచ్చేసి స్వామివార్లకు అభిషేకాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.


కుమారధార

ప్రస్తుతం ఇక్కడ తిరుమల యాత్రికుల దాహార్తిని తీర్చేందుకు ఆనకట్ట నిర్మిస్తున్నారు. సాదర కౌగిలింతకై రెండు చేతులూ చాచినట్లు ఉంటుందీ తీర్థం. దాని ఉత్కృష్ట ప్రాకృతిక నిర్మాణం ఆంగ్ల సినిమా సెట్టింగును పోలి ఉంటుంది. పాపవినాశనం డ్యాం నుండి వాయువ్యంగా పాత చలివేంద్రం, అల్లికాలవ, టెంకెగుండు దాటితే కుమారధార, మాఘ పూర్ణిమ నాడు ముక్కోటికి జనం విశేష సంఖ్యలో దర్శిస్తారు. తారకాసునుని సంహరించిన తర్వాత కుమారస్వామి కొంతకాలం ఇక్కడ తపస్సు చేశాడని కథనం. ఇక్కడ నిష్ఠగా జపతపాలు చేసి స్నానం ఆచరిస్తే సమస్త వ్యాధులు నిర్మూలమై, ఆయురారోగ్యాలతో వృద్ధి చెందుతారని భావిస్తారు. దగ్గర్లోనే ఉన్న పసుపుధారాతీర్థం, గణేశ ధారా తీర్థం గొప్ప ధార్మిక స్థలాలు.

 

తుంబురుతీర్థం

అత్యద్బుత ప్రాకృతిక నిర్మాణం. దీనికే ఘోణతీర్థం అని పేరు. తుంబురుడు తపస్సు చేసిన స్థలం కనుక దీనికి తుంబురుతీర్థం అనే ప్రశస్తి వచ్చింది. నారదునిచే తుంబురుడు శాపగ్రస్తుడైన తర్వాత ఆ తుంబురుడు ఇక్కడ తపస్సు చేసి ముక్తిని పొందిన కారణాన ఈ తీర్థానికి తుంబురు తీర్థం అనే పేరు వచ్చింది. పాపవినాశనం డ్యాం నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో సనకసనందన తీర్థం, నల్లగుండాల మీదుగా వెళ్తే వచ్చే దట్టమైన అడవిలో నిండిన లోయలో తుంబురుకోన దర్శనమిస్తుంది.

 

భూపరిణామక్రమంలో భాగంగా ఓ పెనుకొండ కొబ్బరి చిప్పలా రెండు విచ్చుకుని దారి ఇచ్చినట్లు కనిపిస్తుంది. చివర్లో ఓ జలపాతం ఆ దోవగుండా ప్రవహిస్తూ మనల్ని పరవశుల్ని చేస్తుంది. స్వామివారి మహా భక్తురాలు తరిగొండ వెంగమాంబ కొంతకాలం ఇక్కడ గుహలో తపస్సు చేసింది. ఆమె పేరుతో ఇప్పటికీ ఆ గుహ తరిగొండ గవిగా పిలవబడుతోంది.

 

పులులు, ఎలుగుబంట్లు, కణుతలు, అడవిపందులు మొదలైన వన్యజంతువుల సంచార స్థలి, పాల్గుణపూర్ణిమనాడు తీర్థ ముక్కోటి తీర్థోత్సవం నాడు లక్షలమంది పైగా ఉత్సవం అత్యంత ప్రాముఖ్యత చెందింది. విశేష సంఖ్యలో తమిళులు దర్శించుకునే అత్యంత ప్రాముఖ్యత గల పుణ్యతటి. దగ్గరలోనే సన్యాసోళ్ళగవి, బూచోళ్ళపేట, చెంచమ్మ పేట అనే ప్రాంతాలు ఎంతో రమణీయంగా తారసపడతాయి.

ఇంకా ఉంది...

Tirumala vaibhavam Serial-17, tirumala and famous teerthas, tirumala sankhuteertham, tirumala chakrateertham, tirumala jabali teerthm, tirumala kumaradhara, tirumala tumburu teertha