Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 21
?>

తిరుమల వైభవం సీరియల్ - 21

Tirumala vaibhavam Serial- 21

దేసు వెంకట సుబ్బారావు

తిరుకచ్చినంబి వద్ద మంగళాశీస్సులు అందుకున్న రామానుజులు కంచిపూర్ణులను తరచూ కలుస్తూ వైష్ణవ భక్తి ప్రాముఖ్యాన్ని తెలుసుకోసాగాడు. తర్వాత కొంతకాలానికి రామానుజులు తన ఉన్నత విద్యకోసం కంచిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. కంచిలో అద్వైతసిద్ధాంతపండితులైన శ్రీయాదవ ప్రకాశులవారు నిర్వహిస్తున్న గురుకులంలో చేరాడు. అక్కడ వీరితోపాటు వీరి బంధువైన గోవింద భట్టు కూడా తనతోపాటు ఈ గురుకులంలో చేరాడు. అక్కడ రామానుజులు ఆశ్రమంలోని విద్యార్దులందరిలోకీ మేటిగా ఉండేవారు. వీరికి ఎందుకో అద్వైత సిద్ధాంతం అంతగా నచ్చేది కాదు. లోపభూయిష్టంగా ఉండేదని భావించేవారు.

 

ఒకరోజు రామానుజులు తన గురువుగారైన యాదవప్రకాశులకు పరిచర్య చేస్తుండగా ఒక శిష్యుడు వచ్చి తనకు తస్య యథా కాస్యపం పుండరీకం ఏవం అక్షిణి అన్న వాక్యానికి వివరణ అర్ధం కాలేదని సరైన వివరణ ఇవ్వవలసిందిగా కోరాడు. ఇది ఆదిశంకరాచార్యులవారు వర్ణించిన మహావిష్ణువు నేత్రద్వయం గురించి. దానికి యాదవ ప్రకాశులు ఇచ్చిన వివరణకు అక్కడే ఉన్న రామానుజులు నిర్ఘాంతపోయి, స్థాణువయ్యాడు. అంత వికారమైన వివరణను విన్న రామానుజులకు కంటినీటి పర్వమైపోయింది. అది గ్రహించిన యాదవ ప్రకాశులు సరైన వివరణ ఇవ్వమని రామానుజాచార్యులవారిని అడిగాడు. అప్పుడాయన మహోన్నతుడైన శ్రీమహావిష్ణువు నేత్రద్వయం సూర్యభగవానుని దృష్టిసోకి వికసించిన కలువపూవులా మాదిరి ఉన్నాయనడం ఆ వాక్య విశేషం. అంతేగానీ కోతి పిరుదులమాదిరిగా శ్రీహరి నేత్రాలు ఉండటం సరికాదని అటువంటి నీచమైన వివరణ ఇచ్చినందుకు తనకు కన్నీరు ఆగలేదని చెప్పాడు. విష్ణు సంశ్లేష భావాన్ని అర్ధం చేసుకున్న తనను ఇటువంటి వ్యాఖ్యానం చాలా బాధించిందని చెప్పాడు. తర్వాత గురుశిష్యుల మధ్య వచ్చిన విబేధాలకు మనస్తాపం చెందిన రామానుజాచార్యులు కంచి తిరిగివచ్చి వరదరాజస్వామి సేవలో నిమగ్నమయ్యాడు.

 

ఈ విషయం తెలిసిన యమునాచార్యులు తన శిష్యుడు పెరియనంబిని పంపి తన తర్వాత వైష్ణవ పీఠాన్ని స్వీకరించి శ్రీవైష్ణవ సంప్రదాయాలను కాపాడగల సామర్థ్యం రామానుజులకే ఉందని, అనువల్ల రామానుజులను తీసుకురావాలని పెరియనమ్బిని కంచి పంపాడు. యమునాచార్యులవారి ఆదేశాన్ని కాదనలేక రామానుజాచార్యులు శ్రీరంగం చేరుకున్నాడు. కానీ వీరు వచ్చేసరికే యమునాచార్యులు కాలం చేశారు. అందువల్ల శ్రీరంగనాథుని దర్శించకుండానే రామానుజాచార్యులు తిరిగి కంచి చేరుకున్నాడు. తర్వాత కొంతకాలానికి తన వైష్ణవ భక్తి ప్రచారానికి సంసారం ఒక భారంగా భావించి సన్యాసం తీసుకున్నాడు. అది తెలిసిన పెరియనంబి శ్రీరామానుజులవారిని తిరిగి శ్రీరంగం ఆహ్వానించి వైష్ణవ పీఠానికి సారధ్యం వహించమని కోరినందున శ్రీరామానుజులు శ్రీరంగంలో నివాసం ఉండటానికి నిశ్చయించుకుని వైష్ణవ పీఠానికి సారధ్యం వహించాడు. ఈవిధంగా శ్రీరామానుజులు యమునాచార్యుల అనంతరం వైష్ణవాచార్య పురుషునిగా శ్రీరంగానికి విచ్చేశాడు. ఈలోపు పెరియాళ్వార్ల ఆరోగ్యం క్షీణించి విష్ణు పాదాలను చేరాడు. ఈవిధంగా శ్రీవైష్ణవ సంప్రదాయాలను రక్షించే నెపంతో శ్రీరామానుజులను, శ్రీరంగంలోని శ్రీవైష్ణవులను శ్రీరంగనాథునికి దూరం కాకుండా కాపాడాడు పెరియనంబి. తర్వాత శ్రీవైష్ణవ సంప్రదాయ పరిరక్షణకు శ్రీకారం చుట్టాడు భగవద్రామానుజులు. వీరిని ఆదిశేషుని అవతారంగా భావిస్తారు. శ్రీమహావిష్ణువును అనవరతం సేవించే ఆదిశేషుని అంశగా శ్రీరామానుజులు తమిళనాట శ్రీపేరుంబుదూరులో జన్మించాడు.

 

తిరువేంకటనాథుని దివ్య సౌందర్యారాధనలో తరించిన భక్తవరేణ్యుల్లో భగవద్రామానుజులు ఒకరు. వీరి గత జన్మ వృత్తాంతం గురించిన ఒక ఐతీహ్యం బహుళ ప్రచారంలో ఉంది. ఆళ్వారులలో అగ్రగణ్యులైన నమ్మాళ్వారుల శిష్యులు నమ్మాళ్వారుల విగ్రహాన్ని ఒకటి తయారుచేయడానికి ప్రయత్నించారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా నమ్మాళ్వారుల విగ్రహం బదులు వేరొక సన్నాసి విగ్రహం రూపుదిద్దుకునేది. డానికి ఎంతో ఆశ్చర్యం పొందిన నమ్మాళ్వారుల శిష్యులు ఆ సన్యాసి విగ్రహం నమ్మాళ్వారులకు చూపిస్తారు. అంతట నమ్మాళ్వారులు ఆ విగ్రహాన్ని చూసి అది సరైనదేనని, భవిష్యత్తులో రానున్న వైష్ణవ ఆచార్యులదని, రూపం వేరైనా భావం మాత్రం ఒకటేనని వివరించి అక్కడే ఉన్న మధురకవి ఆళ్వారులకు ఇచ్చాడు. దీన్నిబట్టి రామానుజాచార్యులవారి జన్మరహస్యాన్ని నమ్మాళ్వారుల కాలంనాడే వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది. అంతే కాకుండా కృతయుగంలో మహావిష్ణువుకు పానుపైన ఆదిశేషునిగా, త్రేతాయుగంలో శ్రీరాముని తమ్ముడు లక్ష్మణునిగా, ద్వాపరంబున శ్రీకృష్ణుని సోదరుడు బలభద్రునిగా కలియుగంలో రామానుజులుగా (శ్రీరామచంద్రుడు, శ్రీరంగనాథుని సోదరుడు) జన్మించారు.

ఒక్కసారి శ్రీరామానుజాచార్యులవారి కాలానికి భారతావని పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. క్రీస్తుపూర్వం 550 నాటికి ఉత్తర భారతదేశంలో కేవలం రెండు మతాలు మాత్రమే ప్రజల్లో ముమ్మరంగా ప్రచారంలో ఉండేవి. అవి ఒకటి బౌద్ధమతం రెండు జైనమతం. ఈ రెండు మతాలు కూడా హిందూమతం నుండి వేరుపడి క్షత్రియ రాజులైన గౌతమబుద్ధుడు ఇంకా మహావీరుడు స్థాపించిన బౌద్ధమతం, జైనమతంగా ఏర్పడి ప్రజలకు చేరువ కాసాగాయి. ఈ రెండు మతాలు అప్పటి హైందవ రాజులు అశోకుడు, కనిష్కుడు బౌద్ధమతం, జైనమతాలను దేశమంతా ప్రచారంలోకి తెచ్చారు. వేదాల ఔన్నత్యాన్ని పక్కకి నెత్తి, అహింసా వాదాన్ని ప్రచారంలోకి తెచ్చి జీవహింసను అరికట్టాలని ప్రచారం సాగించారు. అలా కొన్ని దశాబ్దాలు బహుళ ప్రముఖంగా ఉన్నత స్థాయిలో ఉన్న బౌద్ధమతం భారతదేశపు సరిహద్దు దేశాలైన శ్రీలంక, బర్మా, టిబెట్, చైనా, జపాన్, థాయ్ లాండ్ ఇంకా కొన్ని ఆసియా దేశాల్లో బాగా విస్తరించింది. తర్వాత భారతదేశం గుప్తుల అధీనంలోకి వచ్చింది. దీనితో తిరిగి బౌద్ధమత ప్రాభవం తగ్గి సంస్కృత భాష బాగా ప్రాచుర్యంలోకి వచ్చి హైందవ మతం ఉన్నత స్థితికి రాసాగింది.

 

తర్వాత తొమ్మిదవ శతాబ్దంలో శ్రీ ఆదిశంకరాచార్యులవారు జన్మించారు. వీరి రాకతో భారతదేశంలో వేళ్ళూనుకుపోయిన బౌద్ధమతం, జైనమతం ప్రజలనుండి దూరం కాసాగింది. శ్రీఆదిశంకరాచార్యులవారి అద్వైత సిద్ధాంత ప్రభావం ప్రజలకు బాగా చేరువై బహుళ ప్రచారం కాసాగింది. శ్రీఆదిశంకరాచార్యుల గురుదేవులైన గోవిందపాదుల ఆశీర్వచనంతో భారతదేశమంతా పర్యటించి అనేక మఠాలను ఏర్పాటు చేశారు. తర్వాత 16వ ఏట శృతి, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పారు. వీరు రచించిన అనేక రచనల్లో శ్రీమన్నారాయణుని మీద చేసిన భజగోవిందం, కరావలంబ స్తోత్రం ప్రముఖమైనవి.

 

ద్వైతాచార్యులు ధరించునది ఏకదండం. అంటే ఒకే ఒక కర్ర.. బ్రహ్మమొకటేననే సత్యాన్ని తెలియచేయడానికి దాన్ని ధరిస్తారు. త్రిదండమనగా మూడు కర్రలతో కలిపి కట్టబడి ఉండే దండమని అర్ధం. చిదచిదీశ్వరులు ముగ్గురూ సత్యమే అనే విశిష్టాద్వైత ధర్మ సూక్ష్మమిదే. వీరు శిఖ, యజ్ఞోపవీతములు ధరించి ఉంటారు.

 

విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచార సారధి అయిన రామానుజులు ఒకరోజు తన శిష్యులకు తిరువాయ్ మోళిలోని సిందుపూ మగిళుం తిరువెంగడత్తు అనే పాశురాన్ని చదివి దాని అర్ధం చెప్తూ జీవన పర్యంతం శ్రీవేంకటేశ్వర కైంకర్యమే చేస్తుండాలని దాని భావం. దీని వివరణ ఇస్తూనే రామానుజాచార్యుల వారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి నిత్యం పుష్ప కైంకర్యం చేసేవారే కరువయ్యారే! ఎవరైనా చేయగలరా అని తన శిష్య బృందాన్ని అడిగాడు. అప్పుడు అక్కడే ఉన్న అనంతాచార్యులు లేచి నిలబడి వినమ్రుడై గురువర్యా! తమరు అనుగ్రహిస్తే తక్షణం నేను వేంకటాద్రికి వెళ్ళి అక్కడ తిరువెంకటనాథునికి నిత్యం పుష్పకైంకర్యం చేయగలనని ఆ సేవా భాగ్యం చేసే అవకాశం తనకు ఇవ్వవలసిందిగా కోరాడు. అప్పటికే శ్రీశైల పూర్ణులు, యామునానాచార్యులవారి శిష్యులు, రామానుజాచార్యుల మేనమామ అయిన తిరుమల నంబి శ్రీనివాసుని సేవలో తిరుమలలో ఉంటారు. అంత శ్రీరామానుజాచార్యులవారి అనుమతితో అనంతాళ్వారులు తిరుమల చేరి శ్రీరామానుజ వనం అనే పేరుతో ఒక ఉద్యానవనం నిర్మించి తిరుమల రాయనికి నిత్యం పుష్ప కైంకర్యం చేయసాగాడు.

 

అలా కొంతకాలం అయిన తర్వాత రామానుజాచార్యులు తిరుమల దర్శించాలని ఆకాక్షించి పాదయాత్రతో శిష్యబృందంతో తిరుపతి చేరి అక్కడ కపిల మహర్షి ప్రతిష్ఠించిన కపిలేశ్వరుని ఆలయం చేరారు. ఆ ప్రాంగణంలోకి తిరుమల శిఖరాలనుండి జాలువారే జలతరంగిణిలో స్నానం ఆచరించి పిదప ఇది ఆళ్వారులు దర్శించిన తీర్థం అని ఇకపై ఇది ఆళ్వార్ తీర్థంగా ప్రసిద్ధి పొందుతుందని చెప్తూ కపిలేశ్వరుని దర్శనం చేసుకుని తిరుమలపైకి వెళ్ళడానికి అలిపిరి చేరుకున్నారు. కొండ పాదాల చెంతకు చేరగానే ఆయనకు ఈ పర్వతం పరమ పవిత్రమైన శేషాచలమని, శాలగ్రామ భరితమై దీన్ని పాదస్పర్శతో అపవిత్రం చేయజాలనని, తిరుమలకు వెళ్ళనని ఆగిపోయాడు. అప్పుడు రామానుజాచార్యులవారి శిష్యులు స్వామి తమరే అలా అంటే సామాన్యులు స్వామివారి సేవకు ఎలా తరలివెళ్తారు? కనుక మీరే మరో మార్గాన్ని సూచించండి అని వేడుకున్నారు. అంతట రామానుజాచార్యులు తిరుమల కొండపైకి తాను మోకాళ్ళపైకి చేరుకుంటానని మిగిలినవారు యథావిధిగా రావచ్చని తాను మోకాళ్ళతో తిరుమల దివ్యక్షేత్రాన్ని చేరుకున్నారు. అక్కడ వరాహస్వామిని దర్శించి స్వామి పుష్కరిణిలో స్నానం ఆచరించి ఆలయపు తిరుమాడ వీధులు ప్రదక్షిణ చేసి తీర్థం నిత్య సౌందర్యమూర్తి అయిన స్వామివారిని దర్శించి తర్వాత అనంతాళ్వారులచే నిర్మితమైన రామానుజ వనాన్ని దర్శించి అక్కడి పుష్పశోభకు పులకించిపోయాడు. అక్కడ మూడు రోజులు ఉంది అనేక ధార్మిక విషయాలపైన, ఉపనిషత్తుల పైన చర్చించుకున్నారు. ఆ తర్వాత తిరుపతి చేరుకొని అక్కడ ఒక ఏడాదిపాటు ఉంది నిత్యం తిరుమలనంబి వద్ద రామాయణ విశేషాలు, ఔన్నత్యం, రామాయణ రహస్యాలను తెలుసుకున్నాడు. దీనికిగానూ రామానుజులవారు తిరుమలలోని మోకాలిమిట్ట వద్దకు చేరుకోగా, తిరుమలనంబి వేంకటాద్రినుండి మోకాలిమిట్ట చేరి చర్చించుకునేవారు. ఆవిధంగా తిరుమల రహదారిలోని మోకాలిమిట్ట ప్రసిద్ధి పొందింది.

 

శ్రీవేంకటేశ్వరస్వామివారు తొండమాన్ చక్రవర్తికి తన శంఖు, చక్రాలను ఇచ్చి విజేయుడవు కమ్మని జైత్రయాత్రకు దీవించి పంపాడు. దానితో శ్రీనివాసుడు శంఖుచక్రాలు లేని అర్చామూర్తిగా కనిపించాడు. అదే సమయంలో శైవులు, శాక్తేయులు అంతా స్వామివారు దండపాణిఅయిన సుబ్రహ్మణ్య స్వామి అని అందుకే పుష్కరిణికి స్వామిపుష్కరిణి అనే పేరు వచ్చిందణి, మరికొందరు ఆలయ గోపురంపై సింహ తలాటాలు ఉన్నందున స్వామివారు శాక్తేయణి అని అందుకే శ్రీవారికి శుక్రవారాభిషేకాలు ఉన్నాయని వాదించుకున్నారు. తర్వాత రామానుజాచార్యులు తిరుమలకు విచ్చేసి స్వామివారు సాక్షాత్తూ స్వయంభూ అయిన మహావిష్ణువేనని వివరణ ఇచ్చారు. దానితో వారు సంతృప్తి చెందనందున స్వామివారు తాను ఎవరో తానే తెలియచేస్తారని అక్కడివారికి నచ్చజెప్పి స్వామి ముందు త్రిశూలాది ఆయుధాలను, శంఖు చక్రాలను ఉంచి వాటికి రాజముద్రలు వేసి, నిజ నిర్ణయం చేయమని స్వామివారిని ప్రార్ధించి, ఆలయ ద్వారాలు మూసేశారు. మర్నాడు ఉదయమే ఆలయద్వారాలు తీసిన వెంటనే స్వామివారు శంఖు, చక్రధారియై దర్శనమిచ్చారు. ఆ తర్వాత శ్రీరామానుజులు స్వామివారిని మహాలక్ష్మి నిత్యం అంటిపెట్టుకుని ఉన్నందున స్వామివారికి స్వర్ణలక్ష్మిని సమర్పించి స్వామివారిని మహాలక్ష్మి అనాపాయిగా నిత్యం హృదయవాసినిగా ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. తర్వాత అక్కడి ప్రజలు వాస్తవాన్ని గ్రహించి సర్వాంతర్యామి అయిన శ్రీమహావిష్ణువే తిరుమలకొండపై అర్చామూర్తిగా అవతరించారని నమ్మి స్వామివారిని వేంకటాద్రిపై వెలసినందున వేంకటేశ్వరస్వామిగా నమ్మి గతంలో చేసిన తమ తప్పిదానికి క్షమాపణలు చెప్పి శ్రీరామానుజులవారిని శరణుకోరారు. అంతటా రామానుజాచార్యులు తిరుమల ఆలయాన్ని, స్వామివారి సేవలను, కైంకర్యాలను, సమయాచారాలను క్రమబద్దీకరించి ఆలయ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించేలాగా సూచనలు ఇచ్చాడు. వాటినే ఇప్పటికీ శ్రీవారి ఆలయంలో కొనసాగిస్తున్నారు. తర్వాత గోవిందరాజస్వామిని చిదంబరం నుండి తరలించి తిరుపతిలో ప్రతిష్టింపచేశాడు. గరుడ వ్యూహంతో తిరుపతి పట్టణాన్ని నిర్మించి నలుచెరగుల శ్రీవైష్ణవ చిహ్నాలైన శంఖుచక్రాలను ఏర్పాటు చేశాడు. ఆ మధ్యప్రదేశం అంతా విష్ణుక్షేత్రంగా విలసిల్లాలని నియమబద్ధం చేశాడు. కానీ తర్వాత కాలక్రమాన ఆచరణలో సాధ్యంకాలేదు.

 

ఆకాలంలో తిరుమల క్షేత్రమంతా కారడవిగా, దుర్భేద్యంగా ఉన్నందున అక్కడ ఉత్సవాలు చేయడానికి అనుకూలంగా లేవని భావించాడు. జనసమ్మర్దం అంతగా లేనందున ఆలయానికి తిరుమాడ వీధులు నిర్మించటానికి ఆనాటి రాజులు కూడా సానుకూలంగా లేనందున సమీపంలోని గ్రామంలో ఉత్సవాలు చేయవచ్చని చెప్పి ఉన్నందున ఉత్సవాలు తిరుపతిలోని శుకమహర్షి తపస్సు చేసిన తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ప్రాంగణంలో ఉత్సవాలు జరిపేవారని తెలుస్తుంది. అనగా స్వామివారి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణమైన పిదప తిరుమల నుండి దిగి శ్రీశుకపురి (తిరుచానూరు) నందు ప్రతి రోజూ ప్రాతః సాయంకాలాల్లో వాహనాలపై వీధుల్లో స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగింపు చేసి సమస్త ఉపచారాలు అందిస్తూ ఉత్సవ సేవాపరులతో తొమ్మిది రోజులు ఉత్సవాలు జరిపేవారని చరిత్ర, శాసనాల ద్వారా తెలుస్తోంది. అది గ్రహించిన రామానుజాచార్యులు శ్రీవారి ఆలయానికి నలువైపులా తిరుమాడ వీధులను నిర్మించి స్వామివారి సమస్త సేవా, ఉత్సవ కైంకర్యాలు అన్నీ స్వామివారి ఆలయంలోనే జరగాలని నిర్దేశించారు. అలాగే తిరుమాడ వీధుల్లో క్రోసుడు దూరంలో అర్చకులకు, కైంకర్యపరులకు శాశ్వత నివాసం ఉండటానికి నివాస యోగ్యమైన గృహాలను నిర్మించి నిరంతరం స్వామి సేవ చేయడానికి వారందరినీ అక్కడే ఉండేటట్లు ఏర్పాట్లు చేశాడు. అందువల్ల నిత్యం శ్రీనివాసునికి నిత్యోపచారాలు సకాలంలో అందేలా ఏర్పాట్లు చేశాడు రామానుజులు.

 

ఇంకా ఉంది...

 

Tirumala vaibhavam Serial-21, tirumala glorious history and yamunacharya, tirumada veedhulu in tirumala vaibhavam, story of Thirukachi nambi and ramanuja