Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 18
?>

తిరుమల వైభవం సీరియల్ - 18

Tirumala vaibhavam Serial- 18

దేసు వెంకట సుబ్బారావు

నామాల గవి తీర్థం

స్టాలక్ టైట్లు, స్టాలక్ మైట్లు అనే సుద్ద గుహల సముదాయం, నీళ్ళు, గాలి, కోతులవల్ల వికోషీకరణం చెందిన కొండ శిలల వల్ల ఏర్పడిన ఉత్కృష్ట ప్రాకృతిక నిర్మాణం. నడక దోవలోని యోగనృసింహ ఆలయం నుంచి గానీ అవ్వాచారి కోన దగ్గరి పాత మెట్లదారి నుండి గానీ వెళ్ళవలసి ఉంటుంది. ఒకప్పుడు స్వామివారి తిరునామాన్ని ఈ సుద్దరాళ్ళతోనే తీర్చిదిద్దేవారట. ఎంత పుణ్యం చేసుకున్నాయో కదా ఈ శిలాజం. నారాయణుని సేవకు నరులే కానక్కరలేదని తెలియచేస్తున్నాయి. విశాఖ జిల్లాలోని బొర్రా గుహలకు పోలికగా ఉన్న ఈ నామాల గవి తప్పక చూడాల్సిన ప్రదేశం.

 

ఇక్కడికి దగ్గరలోనే గంటా మండపం ఉండేది. నడక దారిన ఉన్న ఈ గంటా మండపాలు పూర్వం చాలా ఉండేవి. తిరుమలరాయని నివేదనా కార్యక్రమాలను ఈ గంటానాదం ద్వారా చంద్రగిరిలోని రాజభవనంలో ఉన్న విజయనగర పాలకులైన అచ్యుతరాయలకు ఆలయ కార్యక్రమాలు తెలిసేవి. స్వామివారికి నివేదన అయిన తర్వాతనే అచ్యుతరాయలవారు భోజన కార్యక్రమాలకు ఉపక్రమించేవారని చరిత్రకారులు చెప్తారు. వీటిని అచ్యుతరాయలవారి కాలంలో నిర్మించారని తెలుస్తుంది. ఈ అచ్యుతరాయలవారే తన పట్టాభిషేకం స్వామివారి శంఖుతీర్థంతో అభిషిక్తులయ్యారట. తిరుమల క్షేత్ర విశేషాలు కోకొల్లలు. చదివేకొద్దీ చదవాలని, వేనికొద్దీ వినాలని తెలుసుకునేకొద్దీ తెలుసుకోవాలనే తపన, ఆత్రుత, ఆరాటం, ఉత్సుకత ఎంతని చెప్పగలం?! అదొక నిగూఢ విసేషాల మహానిది. అంతటి మహోన్నత నిధులమధ్య ఉన్నది శ్రీనివాసుని సన్నిధి.

 

యుద్ధగళతీర్థం

తీర్థాల్లో రాజులాంటిది యుద్ధగళ తీర్థం. ప్రయాణం అత్యంత ప్రమాదవాసభరితం. దట్టమైన అడవిలో కొలువైన తీర్థం గురించి ఎంత చెప్పినా తక్కువే. శేషాచలం అరణ్యాల్లోనే అయినా కడప జిల్లా అడవికి చెందుతుంది ఈ ప్రాంతం. పదివేల ఏళ్ళ క్రితం నాటి ఎగువ శిలాయుగం రాతి చిత్రాలు ఇక్కడి ప్రత్యేకత. ఓ సువిశాల బండపై ఆబోతులు, పులులు, చిత్రవిచిత్ర మార్మిక చిత్రాలు ఉన్నాయి. ఆదిమ చిత్రకారులు మనకు వదిలి వెళ్ళిన స్మృతుల ఖజానా. రాత్రులు వినబడే డమరుక ధ్వని ఈ ప్రదేశానికి దైవత్వాన్ని ఆపాదిస్తోంది. బ్రిటిషువారు నిర్మించిన ఓ బంగళా ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. దాపులోనే గల అత్యంత ఎత్తయిన నీలగిరి వృక్షం చూపరులను ఆకర్షిస్తోంది. ఇప్పటికీ ఎందరో సాహసికులకు ఈ తీర్థదర్శనం మీద అమితమైన మక్కువ. ఎన్నో చిత్రవిచిత్రాల విశేషాలను సొంతం చేసుకున్న సాలగ్రామ శిలా రూపమైన నారాయణుని నివాసమైన తిరుమల క్షేత్రం అణువణువూ ఒక విశేషమే. ఎందరో మహర్షులు తపస్సు ఆచరించిన ఈ పుణ్యధామంలో ఇంకా చూడవలసిన తీర్థాలు చాలా ఉన్నాయి. వాటిలో భీమతీర్థం, శనీశ్వర తీర్థం, భైరవతీర్థం, కాయరసాయన తీర్థం, సీతమ్మ తీర్థం, నాగతీర్థం, మార్కండేయ తీర్థం - ఇలా అనేకం. వింటేనే మనసు పులకించిపోతోంది కదూ!

 

స్వామి పుష్కరిణి

సమస్త తీర్ధాలకు స్వామి వంటిది కనుక దీన్ని స్వామి పుష్కరిణి అంటారు. అంతేకాదు స్వామి చెంత ఉన్నందున, ఇంకా ఆలయంలోని మూర్తిస్కందుడిగా భావించినందున దీన్ని స్కంద పుష్కరిణిగా పూర్వం భావించేవారు. తిరుమలలోని సమస్త తీర్థాల్లోని జలాలు ఈ పుష్కరిణిలోకి చేరతాయని, అందువల్ల ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే సమస్త పాపాలూ పోతాయని మరో విశ్వాసం కూడా ఉంది. ఈ పుష్కరిణిలో 9బావులున్నాయి. దీన్నే పూర్వం వరాహ పుష్కరిణి అని కూడా పిలిచేవారు. ఎందుకంటే ఈ పుష్కరిణి వరాహస్వామి ఆలయం చెంతన ఉన్నందున దీనికి ఆ పేరు వచ్చింది. పూర్వం దీనికి దాపునే మరో పుష్కరిణి ఉండేది. కొన్ని కారణాలవల్ల ఆ పుష్కరిణిని మూసివేసి భక్తులకొరకు వసతిగృహాలను నిర్మించారు. అందువల్లనే ఆ ప్రాంతాన్ని పాత పుష్కరిణి కాటేజీలు అని ఇప్పటికీ పిలుస్తున్నారు. తర్వాత ప్రస్తుత పుష్కరిణియే స్వామి పుష్కరిణిగా ప్రసిద్ధమైంది.

 

విరజానది

స్వామి పాదాలచెంత అంతర్వాహినిగా ప్రవహించే నది విరజానది. సమస్త జీవకోటినీ పరమపదాన్ని చేర్చే స్వామివారి పాదాల చెంత ప్రవహించే దేవనది ఈ విరజానది. స్వామి పాదాల చెంత అంతర్వాహినిగా ప్రవహిస్తున్న పరమపావన వాహిని ఈ విరజానది. శ్రీవారి సేవలో సకల చరాచర సృష్టి తరిస్తుంది అనడానికి ఇదొక నిదర్శనం. తరతరాలుగా తిరుమలపై వెలసిన శ్రీ వేంకటాచలపతి సేవలో తరించే చరాలు, అచరాలు ఎన్నో! అందుకే ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం. కోరినవారికి కొంగుబంగారం. కలడన్నవారి ఎదుట కన్నులెదుట మూర్తి. వెలయు శ్రీ వేంకటాద్రి విభుడితడు.

 

ఆకాశగంగ

పూర్వం నుండీ తిరుమల శ్రీవారి అభిషేకానికి ఆకాశగంగ జలాలానే ఉపయోగించేవారు. శ్రీవారిచే ''తాతా'' అని పిలిపించుకున్న తిరుమలనంబి ఈ ఆకాశగంగ జలాన్నే శ్రీవారి అభిషేకానికి ఉపయోగించేవారు. అంతటి పవిత్ర గంగాజలం ఈ ఆకాశగంగాజలం. తిరుమల ఆలయానికి అతి సమీపాన అంటే దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకాశగంగ చేరడానికి అట్టే కష్టపడనక్కర్లేదు. ఈ ఆకాశగంగతో అనుబంధమైన ఒక చారిత్రక ఇతిహాసం ఉంది. రానున్న సంచికలో ఆ అందమైన కథ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈ పుణ్యతీర్థంలో స్నానం ఆచరిద్దాం. శ్రీమహావిష్ణువు పాదాలచెంత వెలసిన గంగామాత ఆ స్వామి సేవకై తిరుమలలో అత్యంత మనోహర జలపాతమై వెలసి స్వామి సేవలో తరించే మనోహర జలనిధి. తిరుమల యాత్రికులు తప్పక దర్శించవలసిన తీర్థరాజం.

 

పాపవినాశనం

తిరుమల తీర్థ ప్రజల దాహార్తిని తీర్చే అతి పెద్ద జలాశయం ఈ పాపవినాశనం. తిరుమలకు విచ్చేసే జనవాహిని అవసరాలను తీర్చడానికి ప్రకృతి ప్రసాదించిన ఈ జలాశయానికి రక్షణ వలయంగా ఒక డ్యాం నిర్మించారు. ఈ జలాశయం నుండే తిరుమల యాత్రికుల దాహార్తి తీరుతుంది. శ్రీవారి ఆలయానికి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ జలాశయంలో స్నానం ఆచరిస్తే జన్మజన్మల పాపాలు హరిస్తాయి. ఈ తీర్థస్నానం సకల పాపహారం కనుక ఈ జలాశయానికి తీర్థరాజానికి పాపవినాశనం అనే పేరు వచ్చింది.

 

ఇక తిరుపతి ప్రాంతానికి వస్తే సువర్ణముఖీ నది ఇక్కడివారి దాహార్తిని తీరుస్తుంది. సువర్ణముఖి నదీ తటస్తమైన కల్యాణి డ్యాం, ఇంకా స్థానికుల అవసరాల కోసం రాయలవారి కాలంలో నిర్మించిన నృసింహ తీర్థం, కపిల మహర్షిచే ప్రతిష్టితమైన కపిలతీర్థం ముఖ్యమైనవి. ప్రకృతి సొబగులతో అలరారుతూ పచ్చని వృక్షాల మధ్య అనేక వంపులు తిరుగుతూ తిరుమల నుండి జాలువారే జలపాతంతో తిరుపతిలోని కపిలతీర్థం కపిల మహర్షిచే ప్రతిష్టితమైన పరమేశ్వరునికి నిత్యం అభిషేకిస్తూ ఉంటుంది.

 

పరమపావన వాహిని అయిన గంగాభవాని వివిధ రూపాలలో శ్రీవారి పాదాలచెంత అనునిత్యం ప్రవహిస్తూ లక్షలాదిగా ప్రతిదినం విచ్చేసే యాత్రికుల, స్థానికుల దాహార్తిని తీర్చే అమృత ఝరి యై తరిస్తుంది. ముఖ్యంగా తిరుచానూరులో వెలసిన అలమేలుమంగ చెంతనున్న పద్మసరోవరంలోని పంచమీ స్నానం కోసం లక్షలాది భక్తులు వేచి ఉంటారనేది నిత్య సత్యం. సరే పద్మావతీ అమ్మవారికి జరిపే కార్తీక బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన చక్రస్నానం కార్తీక పంచమి రోజున జరుగుతుంది. ఆనాడు స్వామివారి ఆలయం నుండి విచ్చేసే స్వామివారి పాదాల చెంత అమ్మవారికి జరిపే స్నపన తిరుమంజనం, పంచమీ స్నానం వీక్షించడానికి విచ్చేసే యాత్రిక ప్రజలతో కిక్కిరిసిఉంటుంది. ఇన్ని తీర్థాలతో విరాజిల్లే తిరుమల శ్రీవారి సంస్థానం అనేక ప్రకృతి సౌందర్యాలతో విరాజిల్లుతూ నిత్య శోభలతో అలరారుతుంది.

 

కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమలలో స్వామివారి సేవలో తరిస్తూ వైష్ణవ సంప్రదాయాలను తరతరాలుగా ఆచరిస్తూ వైష్ణవ కైంకర్యం చేసిన ఆచార్య పురుషుల గురించి తెలుసుకుందాం.

 

ఇంకా ఉంది...

 

Tirumala vaibhavam Serial-18, akashaganga and tirumala famous teerthas, tirumala teertha swami pushkarini, tirumala yuddha gala teertham, tirumala namala gavi, virajanadi akashaganga and papavinashanam