Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial-3
?>

తిరుమల వైభవం సీరియల్ - 3

Tirumala vaibhavam Serial-3

దేసు వెంకట సుబ్బారావు

అనూహ్యమైన వాన కురిసింది. సప్తసాగరాలు ఏకమై ప్రవహించాయి. అపార జలార్ణవం కనిపించింది. గాఢాంధకారం అలముకుంది. భూమి పాతాళానికి కుంగిపోయింది. మహా ప్రళయాకాశాన కల్పాంతం జలధిలో మునిగిఉండగా మహార్లోకంలో మహావిష్ణువు వటపత్రశాయిగా వేయి యుగాలు సంచరించాడు. తర్వాత శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహ రూపంలో పాతాళం చేరి భూమికి కాపలా అయ్యాడు. భూమిని సముద్రంలోకి విసిరిన హిరణ్యాక్షుడనే రాక్షసునితో పోరాడి సంహరించాడు.

 

భూమిని తన దంష్ట్రాలతో పైకి లేపిపట్టి, ఒక పాదం శేషునిపై ఉంచి భూమిని యథాస్థానంలో ఉంచాడు. సప్తసాగారాలను, సప్తలోకాలను యథాస్థితిలో ఉంచి బ్రహ్మను మరల సృష్టి చేయమని ఆజ్ఞాపించాడు. తర్వాత గరుత్మంతుని పిలిచి తాను కొంతకాలం భూమిపై ఉంది భక్తజనులను కాపాడ సంకల్పించానని, తనకు వైకుంఠంలో ఉన్న క్రీదాద్రిని భూమిపై నెలకొల్పమని ఆదేశించాడు. గోమతీతీరానికి దక్షిణాన 60 యోజనాల దూరాన సువర్ణముఖీ నదీతీరానికి ఉత్తరదిక్కు అనువైనదిగా భావించి క్రీదాద్రిని అక్కడ నెలకొల్పవలసిందిగా ఆదేశించాడు.

 

తదనుగుణంగా గరుడుడు సర్వదేవతా పరివేష్టితమైన క్రీదాద్రిని వైకుంఠంనుండి భూమికి తరలించాడు.ఇలా తరలివచ్చిన శేషాచలం సమస్త మునులకు ఆవాసయోగ్యంగా ఉండేవిధంగా సమస్త మానవాళికి మోక్షదాయినిగా అన్దరినీ రక్షించే అభయప్రదాయినిగా నారాయణునికే నివాసయోగ్యంగా ఆదిశేషుని ఆకారంలో ఏర్పడింది. అప్పటినుంచి ఈ తిరుమల క్షేత్రం వరాహక్షేత్రంగా పేరుగాంచింది. వరాహుడు శ్రీదేవీ భూదేవీ సహితుడై వైకుంఠం కన్నా మిన్నగా ఉన్న ఈ వెంకటాద్రినే ఆవాసంగా చేసుకుంటానని సమస్త మానవాళి కోర్కెలు మన్నించి వారికి సర్వశుభాలు ప్రసాదిస్తానని చెప్పి తనవారినందరినీ తమతమ నివాసాలకు వెళ్ళమని ఆదేశించాడు.

 

శ్రీమహావిష్ణువు క్రీదాద్రిగా వెలసిన ఈ శేషాచలం ఒక్కొక్క్క యుగంలో ఒక్కొక్క విధంగా పిలవబడుతుంది. కృతయుగంలో వృషాచలంగానూ, త్రేతాయుగంలో అంజనాద్రిగాను, ద్వాపరయుగంలో శేషాచలంగాను, కలియుగంలో వెంకటాచలంగాను నామాంతరం చెందింది. సమస్త వేదాలకు, మునులకు, తపోధనులకు, దేవతలకు ఆలవాలమైంది. కనుకనే ఈ సప్తాద్రి సమస్త కోరికలు తీర్చే చింతామణిగాను, జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానాద్రిగాను, సమస్త తీర్తాలకు నిలయమైన తీర్థాద్రిగాను, ఎర్రని కాలువలకు నిలయమై పుష్కరాద్రిగాను, మోక్షాన్ని ప్రసాదించే ధర్మాద్రిగాను, అనేక మణిమాణిక్యాలకు నిలయమైన కనకాద్రిగాను, నారాయణుని నివాసం కనుక నారాయణాద్రిగాను కీర్తిస్తుంటారని భవిష్యోత్తరపురాణంలో జనక మహారాజుకు శతానంద మహర్షి వివరించాడు.

 

మరో పురాణంలో శ్రీ వేంకటేశ్వరుడు 28 మహాయుగాలకు పూర్వమందున్న కలియుగంలో అవతరించినట్లు ఉంది. ఆ పూరాణాలను అనుసరించి ఒక మహాయుగకాల పరిమితి 43,20,000 సంవత్సరాలు. దీని ప్రకారం తిరుమలకు శ్రీవారు వేంచేసి సుమారు 28 X 43,20,000 సంవత్సరాలు గడిచాయి. 1,19,960,000 మానవ సంవత్సరాలకు ఇది సమానం. ఈ విషయం వరాహ, వామన, భవిష్యోత్తర, బ్రహ్మాండ, బ్రహ్మ, పద్మ పురాణాలలో ఉంది.

 

తరతరాలకు తరగని సంపదగా సమోన్నతమైన, సనాతనమైన హైందవ సంస్కృతికి తార్కాణంగా నిలిచే అనేక ఇతిహాస, పౌరాణిక, చారిత్రక ఆధారాలతో తిరుమల పరిఢవిల్లింది. శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుని గర్భాలయంలోని నిశ్చలమైన జ్యోతులకు చలనం కలిగించేది ఆదిశేషుని శిరోభాగమైన వెంకటాద్రినుండి వచ్చే ఉచ్చ్వాస నిశ్వాసల వల్లేనని భక్తుల నమ్మకం.

 

తిరుమలలోని సుప్రసిద్ధమైన తీర్ధరాజాల గురించి తెలుసుకునేముందు చారిత్రిక ప్రాధాన్యత పొందిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.

 

అవనీతనయా కమనీయకరం, రజనీకర చారుముఖాంబురుహం

రజనీచార రాజతమో మిహిరం, మహనీయ మహం రఘురామ మయే


ఇంకా ఉంది...

 

Tirumala vaibhavam Serial-3, tirumala hills complete information, history of tirumala, detailed story of tirumala hills, tirumala balaji epic stories, hindu epics and lord venkateswara, venkatadri, anjanadri etc 7 hills, bhooloka vaikuntham tirumaladri