Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 25
?>

తిరుమల వైభవం సీరియల్ - 25

Tirumala vaibhavam Serial- 25

దేసు వెంకట సుబ్బారావు

ఆలయ పరిస్థితి

వెంగడం అనే ప్రదేశం తొండమండలానికి చెందిన కొట్టంలోని ఒక ప్రాంతంగా తెలుపుతుంటారు. బహుశా ఈ దేశంలో తొండైయార్ అనే ఒక తెగ ప్రజలు నివసిస్తున్నందున లేక తొండైయార్ అనే రాజు పాలనలో ఉన్నందున ఈ ప్రాంతానికి తొండమండలం అనే పేరు వచ్చిందంటారు. తొండన్ అంటే శిష్యుడు అని అర్ధం. ఆ కాలానికే కంచి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నందున ఈ చుట్టుపక్కలవారు కంచి వరదుడిని దైవంగానూ, గురువుగానూ భావించేవారు. కనుక వారి శిష్యులు ఎక్కువగా ఈ ప్రాంతాన ఉన్నందున ఈ ప్రాంతం తొండమండలంగా పిలవబడింది. అంటే శిష్యుల ప్రాంతం.

 

తొండమండలంగా పిలవబడిన ఈ ప్రాంతం ఎంతో ప్రముఖమైంది. ఇటువంటి 24 మండలాలను కొట్టాలుగా పిలిచేవారు. అలా పిలవబడిన ఈ మండలాలలో ఒక్కొక్క కోట ఉండేది. రక్షణ స్థావరాలైన ఈ కోటల్లో నివసించే సైనికాధికారియే ఈ ప్రాంతానికి అధికారి. ఇటువంటి అధికారులందరికీ కేంద్రబిందువైన అత్యున్నత అధికారి కేంద్రం కంచిలో ఉన్నందున కంచిని అధికార కేంద్రంగా పిలిచేవారు. అటువంటి కొట్టంగా పిలవబడిన మండలాలలో ఒకటైన కొట్టంలో తిరువేంగడ పర్వతం ఉన్నందున దీన్ని తిరువేంగడ కొట్టం అని పిలిచేవారు. ఈ తిరువేంగడ కొట్టం చిత్తూరు, చంద్రగిరి, తిరుచానూరు, శ్రీకాళహస్తి అనే నాలుగు ప్రాంతాలు కలిసి ఏర్పడినట్లు తెలుస్తుంది. అలా ఏర్పడినదే తొండమండలం. ఇది అతి ప్రాచీనమైంది.

 

వేంగడమందు శ్రీవేంకటేశ్వరస్వామికి దేవాలయాన్ని నిర్మించి పూజా కైంకర్యాలు నిర్వహించేందుకు తిరువేంగడ కొట్టం ఇంకా దాని చుట్టుపక్కల ఉండే ప్రదేశంమీద ఆధిపత్యం కలిగిన తొండమాన్ రాజు తగిన ఏర్పాట్లు చేశాడు. తిరుపతిలో ఉత్సవాలు జరుగుతున్నాయని మామూలనార్ అనే కవి తెలపడంవల్ల కూడా ఈ వాదనకు బలం చేకూరింది. బహుశా ఈ తొండమండలమండలి ప్రాంతాలన్నీ ఏకఛత్రాదిపత్యం కిందికి రావడానికి పూర్వమే అంటే కంచిలో కేంద్రీకృత అధికారస్థానం ఏర్పడక పూర్వమే జరిగి ఉంటుంది. అందువల్ల తొండమండలంలోని వివిధ ప్రాంతాలమీద ఆధిపత్యం కలిగి 24మంది నాయకులు ఒకే కులానికి చెందినవారై ఉంటారు. రాజకీయంగా క్రమేపీ ఈ ప్రాంతం కంచి పాలకుని ఆధిపత్యం కిందికి వచ్చి ఉంటుంది. ఆంధ్ర వంశాల వారి ఆధిపత్యం నడుస్తున్న కాలంలో తొండమండలం ఏకీకరణం జరిగిన తర్వాత కూడా ఆంధ్ర రాజవంశాలు కనపడతాయి. ఈ ఏకీకరణతో శాసనాలు కానరావు. ఇందుకు కారణం ఇతమిద్ధంగా తెలియడంలేదు. పల్లవుల కాలానికి పూర్వం కూడా ఈ ఆలయాన్ని చేరడానికి కష్టసాధ్యమై ఉండేది. అందువల్లే బహుశా తగినంత ప్రజాదరణకు నోచుకోకపోయి ఉంటుంది. లేక ఆనాటి రాజులు ఇక్కడ శాసనాలను ప్రకటించాల్సినంతటి ప్రాముఖ్యతను సంతరించుకోలేకపోయి ఉంటుంది. అంతేకాదు, ఆ కాలం నాటికి శిలలమీద శాసనాలు ప్రకటించే విధానం తక్కువగా ఉండి ఉండవచ్చు. పల్లవరాజవంశం కాలంనాటికి ఆలయానికి వెళ్ళి పూజలు చేసే విధానం ప్రాచుర్యానికి వచ్చి ఉంటుంది.

 

వేంగడ పర్వతాన్ని గురించి, శ్రీవేంకటేశ్వరస్వామిని గురించి సంగం వాగ్మయంలోనూ, శిలప్పదికారంలోనూ, ఇంకనూ ఆళ్వారులలోనూ వివరించడం జరిగింది. ఈ గ్రంథాలు దేవాలయ పరిపాలనా విధానం గురించి తెలపడంలేదు. ఈకాలంనాటికి వేదపురుషుడు - శ్రీమహావిష్ణువు పూజనీయుడనే భావం జనబాహుళ్యంలో ఉండటంచేత పూజలు అందుకుంటూ ఉన్నాడు. వైష్ణవులు పవిత్రంగా భావించే దివ్య ప్రదేశాల్లో (భారతదేశంలో అటువంటి దివ్య ప్రదేశాలు 106 ఉన్నాయి. మిగిలిన రెండు శ్రీవైకుంఠం, క్షీరసాగరం మొత్తం 108) వీటన్నిటిలోనూ సరైన పూజాకార్యక్రమాలు ఈ కాలం నుండే జరుగుతూ ఉండేవి.

 

ఏడవ శతాబ్దం తొలినాళ్లనుండి పల్లవుల పాలనాకాలం ప్రారంభమైంది. స్థానిక రాజకుటుంబాలకు చెందిన రాకుమారులు, ప్రముఖ నాయకులు, పల్లవరాజుల ఆధిపత్యంలో ఉన్న పాళెయకారులు మొదలైన వారు శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాభివృద్ధికి తోడ్పడ్డారు. వీరు తిరుమల శ్రీవారి ఆలయంలో వైష్ణవ సంప్రదాయానుసారం జరిపే ఉత్సవాలు, ఊరేగింపులు, యజ్ఞయాగాదులు, తదితర కార్యకలాప నిర్వాహణార్ధం వేంకటేశ్వరస్వామి ప్రతిరూపాలను తయారుచేయించి ప్రతిష్ఠింపచేశారు. దేవాలయాల్లో నిత్య దీపాలను వెలిగించదానికి, ఆహార నైవేద్యాలు సమర్పించేందుకు, ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కొంత బంగారాన్ని ఇచ్చి పంట భూమిని కొని, వాటి ఫల సాయాన్ని ఆలయానికి చెందేలా శాసనాలు చేశారు. వీరి కాలంలోనే తిరుమల శ్రీవారిని పోలిన మూడు ఉత్సవ మూర్తులు ఆలయానికి చేరాయి.

 

మహేంద్ర పన్నార్ అయిన పల్లవరాజు కాలంలోని సామంతులు శక్తి విటంకుడైణ పల్లవ ప్రగ్గడియార్ భార్య సామవై పెరిందేవి తిరుమల శ్రీనివాసుని రూపంతో ఒక రజిత విగ్రహాన్ని చేయించి మనవాళ పెరుమాళ్ (భోగ శ్రీనివాసుడు)అనే పేరుతో నామకరణం చేసి అనేక కానుకలను, ఆభరణాలను, భూములను ఆలయానికి బహూకరించారు. ఈమె ప్రవేశపెట్టినదే తిరుమల ఆలయంలో జరిగే పెరటాసి నెలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవం.

 

వీరి కాలంలోనే పాలనా వ్యవహారాలను నిర్వహించడమే కాకుండా దేవాలయంమీద పై విచారణకర్తగా పర్యవేక్షించే అధికారం గల ''సభ''ను తిరుచానూరులో ఏర్పాటు చేశారు. దీనికి స్థానికులైన శ్రీవైష్ణవ బ్రాహ్మణులతో కూడి 108 మంది సభ్యులతో ఏర్పడింది. ఈ సభ దేవాలయం తరపున కార్యకర్తలుగా వ్యవహరిస్తూ భక్తులు స్వామివారికి సమర్పించే ధన, కనక, వస్తు రూపాల్లో ఆధార ద్రవ్య ధాన్యాలను స్వీకరిస్తూ దానం ముట్టినట్లు రసీదు అధికారులలో కోయిర్ కోన్, వల్వకోన్ వారు ఆలయానికి చెందిన వ్యవహారాలు చూసేవారు.

 

భక్తులు మహారాజులు, ఉన్నతాధికారులు స్వామివారికి బంగారం, ఆభరణాలు సమర్పించుకోవడం గాక ప్రత్యేక పూజలు, సేవా కైంకర్యాల నిమిత్తమై ఆధార ద్రవ్యంగా భూదానం, ధనదానం చేశారు. దానం ఇచ్చిన భూమిపై వచ్చే ఫలసాయంతో ఉత్సవ, పూజా కైంకర్యాలు జరిగేవి. అటువంటి కైంకర్యాల్లో దైవ సన్నిధిణ అఖండ దీపం వెలిగించే కార్యక్రమం, ప్రతి దినం స్వామికి నైవేద్యం జరిపించడం, ఆయా కాలాల్లో దాత పేరున ఉత్సవాలను నిర్వహించడం చేసేవారు. వీటికి తోడు కొంతమంది బ్రాహ్మణులకు ఇంకా ప్రతిరోజూ దైవదర్శనం కోసం వచ్చే భక్తులకు భోజన వసతి ఏర్పాటు చేయడం కూడా ఇందులో భాగమే. కాలక్రమేణా భక్తుల రాక ఈ ఆలయానికి పెరగడంతో పాటు అనేక ఉత్సవాలు జరిగేవి. దానికి తగినట్లుగా ఏర్పాట్లు జరిపేవారు. దూర ప్రాంతాల్లోని భక్తులు సైతం దేవాలయానికి ఇచ్చిన దానాలను సక్రమంగా వినియోగించబడుతుందని నమ్మి వీటి నిర్వహణ చూసే పనికి ''శ్రీకార్యం'' అనే పేరుతో పిలిచేవారు. ఈ కార్యదర్శి ఇద్దరు బ్రాహ్మణులకు భోజనవసతి కల్పించి దాన వివరాలను సక్రమంగా నమోదు చేసేందుకు నియమించినట్లుగా శాసనాలద్వారా తెలుస్తుంది. ఈవిధంగా తరతరాలుగా శ్రీవారికి చేసిన కైంకర్యాలను క్రమబద్ధంగానే నిర్వహించినట్లుగా తెలుస్తుంది.

 

శ్రీరంగాన్ని కేంద్రంగా చేసుకున్న అనేకమంది వైష్ణవ ప్రముఖులు, ఆచార్యులు ఆలయాన్ని సందర్శించి అనేక సేవలను అందించారు. వీరికాలంలోనే విశిష్టాద్వైతం విశేష ఆదరణ పొందింది. ప్రముఖ యాత్రా స్థలంగా, వైష్ణవ క్షేత్రంగా విలసిల్లిన ఈ తిరుమలను వైష్ణవాచార్యులైన శ్రీమద్రామానుజులు మూడుసార్లు దర్శించారు. మొదటిసారి వచ్చినప్పుడు ఒక సంవత్సరం ఉండి తన మేనమామ తిరుమల నంబి వద్ద రామాయణ రహస్యాలను అధ్యయనం చేశారు. రెండవసారి వచ్చినప్పుడు తిరుమలపైనుం ణ స్వామివారు శివుడో, విష్ణువో అనే సందేహాన్ని నివృత్తి చేసి ఆలయంలో ఉన్నది శ్రీమహావిష్ణువేనని నిరూపించారు. మూడవసారి తన 103వ ఏట వచ్చినప్పుడు తిరుపతిని గరుడ వ్యూహంతో రచించి గోవిందరాజస్వామి ఆలయం నిర్మించి, తిరుపతిని గోవిందరాజ పట్టణంగా నిర్మించడానికి నాంది పలికాడు. తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయం చుట్టూ నాలుగు రాజవీధులను నెలకొల్పాడు. ఆలయాల్లో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం సమయాచారాలను అనుసరించాలని నియమ నిబంధనలు చేశాడు. తర్వాత వచ్చిన వారు రాజేంద్రచోళుడు. ఇతని కాలంలో నిర్మించబడినదే తిరుపతి కపిలేశ్వరాలయం (224జి.టి.) ఒకటవ కుళుత్తోంగునికి చెందిన శాసనాలు పదకొండు. (1070 – 1120) తిరుమల ఆలయానికి, తిరుచానూరు వద్ద గల యోగిమల్లవారానికి చెందినవి. ఒకటి మాత్రం విక్రమచోళునికి చెందినది. తర్వాత వచ్చినవారు మూడవ రాజరాజు. వీరికి చెందినవి 7 శాసనాలు. వీరి కాలంలోనే తిరుమల ఆలయాభివృద్ధి చెందింది.

 

చాళుక్యులు - చోళులు

క్రీస్తుశకం 1070వ సంవత్సరంలో తూర్పు చాళుక్యుల రాజైన రాజేంద్రుడు కుళుత్తోంగ చోళుడు అనే పేరుతో (1118-1135) కాలంలో విక్రమచోళుని అనుసరించగా, రెండవ కుళుత్తోంగుడు (1135-1150), రెండవ రాజరాజు (1146-1173) తర్వాత రెండవ రాజాధిరాజు కూడా కుళుత్తోంగుడి పాలనను అనుసరించారు. వీరి కాలంలోనే తెలుగు చోళులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించి అనేక కానుకలను శ్రీకాళహస్తి, తిరుమల శ్రీవారి ఆలయాలకు అందించి శ్రీవైష్ణవ భక్తిని చాటుకున్నట్లు అనేక శాసనాలు లభించాయి. చోళుల అధీనంలో ఉన్న తొండమండలాన్ని ఒకటవ ఆదిత్య చోళుడు పాలించాడు. వీరి పాలన 13వ శతాబ్దం వరకూ సాగింది. వీరి కాలానికి చెందినదే తిరుమల తొలి శాసనం. ఒకటవ పరాంతకుడు (907-955) అతని కుమారుడు రెండవ ఆదిత్యుడు క్రీస్తుశకం 956 నుండి 15 సంవత్సరాలు పాలించాడు.

పల్లవరాజు కో విజయదంతి విక్రమవర్మన్ కాలం నుండీ పరిపాలన సౌలభ్యం కోసం చేసిన నెల విభాగపు పద్ధతే చోళుల కాలం వచ్చేసరికి ఎటువంటి మార్పులు లేకుండా అమలులోకి వచ్చింది. 24 కొట్టాలుగా విభజించిణ తొండమండలంలోకి మరికొన్ని కొట్టాలు చేరాయి. అలా చేరిన పెరుంబాణప్పొడి జయన్ కొండ చోళ మండలంలోని ఒక ప్రధాన విభాగంగా చేయబడింది. తిరుచానూరు, తిరుమండియంలో స్థానిక సభా సంఘాలు ఉన్నాయి. మూడవ రాజరాజు పరిపాలనా కాలానికి చెందిన ఒక శాసనం (సంఖ్య 126-జి.టి.) ప్రకారం తిరుచానూరు సభ అధిక ప్రాధాన్యత కలిగియుండి, న్యాయ పరిపాలనాధికారం ఎక్కువ విశాలమైన ప్రాంతంపై చెల్లుబడి కలిగి ఉంది. తిరుమలలోని కుళుత్తోంగ చోళుని చారిత్రక పరిచయానికి సంబంధించిణ వివరాలున్న శాసనంలో వెఱుందరులియ కోవి రాజకేసరి పన్నార్ అనే పదం ఉంది. ఇది రాజేంద్రచోళ అనే కుళుత్తోంగ చోళునకు సరిపోతుంది. ఇతడు సింహాసనాన్ని అధిష్టించి పరిపాలన ప్రారంభించిన తొలినాళ్ళలో రెండవ రాజేంద్రునిగా పిలవబడినట్లు తెలుస్తుంది. ఇతడే తన పాలనాకాలంలోని నాల్గవ సంవత్సరంలో కుళుత్తోంగ చోళ అనే బిరుదును పొందాడు. వుగళ్ నుళ్ న్ద వునారి అగల్ నూళ్ న్ద వువియిళ్ అనే వాక్యంతో ప్రారంభించిన పూర్తి చారిత్రక పరిచయం గల శాసనం యోగిమల్లవరంలో లభించింది. దీని ప్రకారం కో రాజకేసరి వర్మన్ అనే మరో పేరున్న చక్రవర్తిగళ్ శ్రీ కుళుత్తోంగ చోళదేవ యొక్క 24వ పరిపాలనా కాలంలో ప్రకటించబడింది. మొదటి రాజేంద్ర చోళుడు సింహాసనాన్ని అధిష్టించేవరకూ తొండమండలం జయగొండ మండలంగా సుప్రసిద్ధమైంది. కానీ మొదటి రాజేంద్రచోళుడు ఇంకా మొదటి కుళుత్తోంగ చోళుని పరిపాలనాకాలం మధ్య కాలంలో ఈ తొండమండలం పేరును రాజేంద్ర చోళమండలంగా మార్చినట్లు తెలుస్తుంది. కానీ మూడవ రాజరాజ కాలంలో ఈ ప్రాంతాన్ని తిరిగి జయకొండ చోళమండలంగా ప్రకటించబడిందిగా శాసనాలవల్ల తెలుస్తుంది.

 

క్రీస్తుశకం 905 నుండి 953 వరకు మదిరైకొండ కో పరకేసరి వర్మన్ అనే పేరుగల మొదటి పరాంతకుడు తన పాలనలోని 20 వ సంవత్సరంలో ఒకటి ఇంకా 29వ సంవత్సరంలో మరో అఖండ దీపాన్ని ఆలయానికి సమర్పించాడు. తర్వాత రెండవ పరాంతకుని భార్య అయిన పరాంతకదేవి అమ్మన్ (దేవి అమ్మన్ అనే బిరుదుతో పట్టమహిషి) విలువైన రత్నాలు పొదిగిన ఒక పట్టాన్ని స్వామివారికి సమర్పించినట్లు తెలుస్తుంది. ఈ రెండవ పరాంతకుడే తన శయనమందిరాన్ని స్వరమయం చేసుకున్నాడనే విషయం చరిత్ర తెలియజేస్తుంది.

 

తర్వాత ఈ చిత్తూరు జిల్లాను మూడవ కుళుత్తోంగచోళుని పాలనలోకి వచ్చింది. ఈతని పాలనాకాలం క్రీస్తుశకం 1178-1218. అనేక ఇబ్బందులను ఎదురొడ్డి సమైక్యంగా అన్ని ప్రాంతాలను జనరంజకంగా పాలించాడు. ఇతని కాలంలో సంభువ రాయలు, కాడవ రాయలు, ఛేది రాయలు, యాదవ రాయలు మొదలైనవారు చిత్తూరు, చంగల్పట్టు, ఆర్కాటు ప్రాంతాలను పాలించారు. ఇతని తర్వాత అధికారంలోకి వచ్చిన మూడవ రాజరాజు అనేక విషమ పరిస్థితులను, ప్రతిఘటనలను ఎదుర్కొన్నాడు. ఇతని కాలంలోనే తెలుగు పల్లవులు వెలుగులోకి వచ్చారు. వీరిలో విజయ గండగోపాలుడు ప్రముఖుడు.

 

పాండ్యులు

చోళుల పతనానంతరం ఈ ప్రాంతాన్ని కొంతకాలం వరకు శక్తివంతులైన ఏ రాజూ పరిపాలించలేదు. సుప్రసిద్ధుడైన కడపటి చోళచక్రవర్తి మూడవ కుళుత్తోంగుని పాలనా కాలంలోనే కంచి నుండి తెలుగు చోళులు విజ్రుంభించి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. తర్వాత రాజ్యానికి వచ్చిన మూడవ రాజేంద్రుడు కూడా తెలుగు చోళులను అదుపు చేయలేకపోయాడు. ఈయన కాలంలో చోళపాలెయకారులు సంపూర్ణ స్వతంత్రులు కాలేకపోయినప్పటికీ వీరిలో చాలామంది తమతమ ప్రాంతాలకు స్వతంత్ర రాజులుగా ప్రకటించుకున్నారు. తర్వాత క్రీస్తుశకం 13వ శతాబ్దంలో మొదటి మారవర్మన్ సుందర పాండ్యుడు చోళ రాజ్యాన్ని కైవసం చేసుకుని దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఈతని కాలానికి చెందిన కాడవ రాయలు, యాదవరాయలు, తెలుగు చోళులు, తెలుగు పల్లవులు తిరుమల శ్రీవారి ఆలయానికి అనేక కైంకర్యాలు, దానాలు చేసి అభివృద్ధి చెందినట్లు అనేక శాసనాలవల్ల తెలుస్తుంది.

 

దక్షిణ భారతంలోని ఉత్తర భాగాన్ని కాకతీయులు, యాదవరాయలు పరిపాలిస్తూ ఉంటే దక్షిణ ప్రాంతాన్ని పాండ్యులు, హొయసలలు పాలించసాగారు. ఈ ప్రాంతంలోని కొద్దిపాటి ప్రదేశాన్ని పాలించినవారు తెలుగు పల్లవులు. జఠవర్మ సుందరపాండ్యుడు క్రీస్తుశకం 1251 కాలానికి చెందినవాడు. ప్రముఖ వైష్ణవ భక్తుడు, యోధుడు. ఇతడు అనేక ఆలయాలను పునరుద్ధరించి అనేక కైంకర్యాలు చేశాడు. అనేక ప్రాంతాలను జయించి తన జయకేతనాన్ని ఎగరవేశాడు. దక్షిణ భారతాన్ని చాలావరకు కైవసం చేసుకుని అభివృద్ధి చేశాడు. తిరుమల శ్రీవారి ఆలయ గోపురానికి బంగారు కలశాన్ని ప్రతిష్ఠించిన వాడు సుందరపాడ్యుడు. కాకతీయ గణపతి రాజును ఎదిరించినట్లు కాళహస్తి ప్రాంతంలో లభించిన శాసనాలవల్ల తెలుస్తుంది. సుందరపాండ్యుని కాలానికి చెందిన ఐదు శాసనాలు ఇక్కడ లభించాయి. సుందరపాండ్యుని తర్వాత అధికారంలోకి వచ్చిన మారవర్మ ఒకటవ కులశేఖరుడు (1268-1308) హొయసల రాజైన రామనాథ్, చోళరాజైన మూడవ రాజేంద్ర చోళునిపై దండయాత్ర చేసి పాండ్యరాజ సామ్రాజ్యాన్ని విస్తరించి సుస్థిర పాలన చేశాడు. మారవర్మ చేతిలో పరాజయం పొందిన రామనాథ్ తన సోదరుడైన నరసింహునిపై దండయాత్ర చేసి అతని భూభాగాన్ని ఆక్రమించాడు. 13వ శతాబ్దం మధ్య కాలానికి చెందిన మారవర్మ తన విజయాలకు గుర్తుగా తిరుమల ఆలయానికి అనేక కైంకర్యాలు చేసినట్లు అనేక శాసనాలు లభిస్తున్నాయి.

 

ఇంకా ఉంది...

 

Tirumala vaibhavam Serial-25, tirumala glorious history and kulottunga cholas, pallavas destiny in tirumala vaibhavam, pandyas destiny in tirumala vaibhavam, cholas and chalukyas in tirumala history