Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 10
?>

తిరుమల వైభవం సీరియల్ - 10

Tirumala vaibhavam Serial- 10

దేసు వెంకట సుబ్బారావు

 

కులశేఖరాళ్వారులు

తిరుమల ఆలయ చరిత్రలో ప్రముఖమైన వ్యక్తి, ఆళ్వారుల్లో ఐదవవారు, పరమ వైష్ణవ భక్తాగ్రేసరుడు కులశేఖరాళ్వారులు. చంద్రవంశపు రాజైన దృఢవ్రతుడు వీరి తండ్రి. కేరళలోని కొల్లి పట్టణం వీరి జన్మస్థలం. కులశేఖరాళ్వారును, శ్రీవైష్ణవులు మహావిష్ణువు యొక్క కౌస్తుభమణి అవతారంగా భావిస్తారు. వీరు కుంభరాశిలో పునర్వసు నక్షత్రంలో జన్మించారు. లేకలేక కలిగిన ఏకైక సంతానమైన తమ పుత్రునకు దృఢవ్రతుడు కులశేఖరుడని నామకరణం చేశాడు. భగవదంశతో పుట్టినందువల్ల వీరికి భగవంతుని గాధలన్నా, భక్తులన్నా చాలా ఇష్టం. తరచూ రామాయణ కథాగానం వినేవారు. శ్రీరామచంద్రుని గుణగణాలను పదేపదే విని తరించేవాడు. ఒకరోజు వీరు తిరుమల చరిత్రను తెలుసుకుని, అక్కడి స్వామి పుష్కరిణి సర్వ తీర్ధాలకు నెలవని, పవిత్ర గంగానదికన్నా ఇంకా పవిత్రమైందని, మోక్షాన్ని కాంక్షించే ముముక్షువులు అందరూ ఆ తీరాన్నే చేరి తపస్సు చేస్తారని మనిషిగా ఎక్కడో పుట్టడం కన్నా తిరువేంకట నాథుని దివ్య క్షేత్రమైన తిరుమలలో తాను ఏవిధంగా నైనా గడిపితే చాలని, ఇంకా ఒక చెట్టుగానో, పుట్టగానో, పక్షిగానో, చేపగానో లేక ఏదో ఒక ప్రాణిగానో జీవిస్తే చాలు తన జన్మ ధన్యమౌతుందని భావించాడు.

నిరంతరం శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం చూడటానికి తాను శ్రీవారి ముంగిట గడుపుతూ స్వామివారిణి తనివితీరా చూసే భాగ్యంక్ కలుగుతుందని పరితపించాడు. అందుకే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి గర్భాలయానికి ఉన్న గడపని కులశేఖర పడి (గడప) అనే పేరు వచ్చింది.

 

కులశేఖరుడు రాజనీతిలోనూ, శౌర్య పరాక్రమాలలోనూ, పరిపాలనలోనూ, ప్రజారక్షణలోనూ, సార్వభౌమత్వంలోనూ ఎంతో పేరు తెచ్చుకున్న కులశేఖరుడు రానురాను వైష్ణవ భక్తిని ఆకళింపు చేకుకుని శ్రీమన్నారాయణునిచే మనసా వాచా కర్మణా కొలవసాగాడు. శ్రీమన్నారాయణుదే సర్వజగద్రక్షకుడని నమ్మి నిరంతరం భగవంతుని చింతనతోనే కాలం గడపసాగాడు. వీరికి భగవద్భక్తులు తారసపడినా భగవంతుని ప్రవచనాలు వినిపించినా అలౌకిక ఆనందాన్ని పొందేవాడు.భగవంతుని గుణగణాలను తన రచనలతో ఆరాధించాడు. రాజభోగాలు, భోగభాగ్యాలు ఇవేమీ పరమానందాన్ని కలగాచేయవని, కేవలం భగవంతుని ఆరాధనయే ఆత్మానందాన్ని, పరమానందాన్ని ఇస్తుందని భావించాడు. అందుకే వీరు సర్వదా పూజనీయులయ్యారు.

 

సర్వసుఖాలు, సర్వభోగాలు, సిరిసంపదలు, రాజభోగాలు, భార్యాపిల్లలు, బంధుమిత్రులను విడిచి ''సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ'' అని విభీషణుడు శ్రీరామచంద్రుని దివ్యపాదాలను ఆశ్రయించినట్లు కులశేఖరుడు కూడా అన్ని భోగభాగ్యాలు, సిరిసంపదలు, సమస్త సుఖాలు విడనాడి అనంత శయనుడైన శ్రీరంగనాథుని పాదసన్నిధిలో గడపాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఒక సుముహూర్తాన్ని ఎంచుకున్నాడు. అంతేకాకుండా శ్రీవైష్ణవ క్షేత్రాలైన 108 దివ్య తిరుపతులను దర్శించాలానే తపన బాగా ఉండేది. అంతేగాక ప్రముఖ పండితుల ముఖతః నిత్యం రామాయణం వినేవారు. కులశేఖరుని దృష్టిలో శ్రీరామచంద్రుడు సర్వలక్షణ శోభితుడు. వేదాలలోనూ, ఉపనిషత్తులలోనూ వర్ణించినట్లుగా శ్రీరామచంద్రుడు సర్వదేవలక్షణ స్వరూపుడు సర్వ శోభితుడు అని భావించేవాడు. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్మను కూడా అలాగే ఆరాధించేవాడు. ఈ ఇద్దరు పురాణ పురుషులు కూడా సత్యస్వరూపులు, అత్యంత సౌందర్యవంతులు.

 

ఒకసారి రామాయణంలోని యుద్ధకాండలోని ఘట్టాన్ని వింటున్నాడు కులశేఖరుడు. అందులో 14 వేలమంది అతిపరాక్రమవంతులైన రాక్షసులు ఒకపక్క, మరోపక్క ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడు. వాల్మీకి ఎంత రమ్యంగా వర్ణించాడో చూడండి. చతుర్దశ సహస్రాణి, రాక్షసాం భూమి కర్మణాం, ఏకశ్చ రామో ధర్మాత్మక యుద్ధం భవిష్యతి. ఇక్కడ ధర్మానికి పరీక్ష. అధర్మం ఎంత బలమైనప్పటికీ ధర్మం ఎంత బలహీనంగా కనపడినప్పటికీ, భవిష్యత్తులో ధర్మానికే విజయం అని ఊహామాత్రంగా తెలియజేశాడు. ఎంతో భక్తిపారవశ్యంతో ఆలకిస్తున్న కులశేఖరునికి ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. తన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రునికి సాయంగా తన చతురంగబలాలను సమీకరించి బయల్దేరాడు. అక్కడే ఉన్న తన మంత్రి సామంతులు రాజుగారి భక్తి భావావేశానికి ఏమీ తోచక కొద్దిపాటి సైన్యాన్ని వేరొక దారిలో పంపి, తాము సాగరాన్ని చేరుకునే లోపే శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేసి విజేయుడయ్యాడనే వార్తను కులశేఖరునకు తెలియజేశాడు. అప్పుడు కానీ కులశేఖరుని ఆగ్రహావేశాలు చల్లారలేదు. అంతటి భక్తి తన్మయత్వానికి లోనయ్యాడు.

ఇలాంటి భక్తి కార్యక్రమాలకు నెలవైంది కులశేఖరుని రాజప్రాసాదం. ఎప్పుడూ విష్ణు భక్తులతోనూ, వైష్ణవ ప్రవచనాలతోనూ కులశేఖరుని ప్రాంగణం నిండిపోయేది. రాజపాలన మరుగున పడిపోయింది. మితిమీరిన భక్తివల్ల రాజ్యపాలన కుంటు పడిందని రాజోద్యోగులు భావించారు. రాజుగారిని వైష్ణవ భక్తులనుండి వేరుచేస్తేనే కానీ రాజ్యపాలన కుదరదని భావించిన వీరు వైష్ణవ భక్తులమీద రాజుగారికి౮ అపనమ్మకం ఏర్పడితేకానీ వారిని వేరుచేయలేమని నిర్ణయించుకున్నారు. అంతే.. ఒకరోజు రాజభవనంలోని శ్రీకృష్ణ విగ్రహానికి అలంకరించి నవరత్నహారాన్ని దొంగిలించి అది వైష్ణవ భక్తుల పనే అని నమ్మబలికారు. వైష్ణవ భక్తులపైన వేసిన నింద కులశేఖరుడు జీర్ణించుకోలేకపోయారు. కానీ రాజోద్యోగుల పథకం ఫలించలేదు. వైష్ణవ భక్తుల పైన నింద శ్రీ మహావిష్ణువును నిందించడమేనని భావించి దైవనింద మహాపాపమని తలచాడు. దైవ నింద చేసినందుకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకోదలచి ఒక బుట్టలో ఒక కాలసర్పాన్ని ఉంచి వైష్ణవ భక్తులపైన నింద నిజమైతే కాలసర్పం తనను కాటువేస్తుందని, లేకుంటే ఆ నింద కేవలం నిరాధారమైందని, అసత్యమైందని తెలియజేస్తూ తాను ఆ బుట్టలో చేతిని ఉంచుతాడు. అంతే శేషశాయి తన భక్తునికి అపాయం చేయడుకదా! అందుకే కులశేఖరునికి ఎటువంటి అపాయం జరగలేదు. కాలసర్పం ఎటువంటి హాని చేయలేదు. తాము చేసిన పనికి సిగ్గుపడి తమను క్షమించమని వేడుకున్నారు.

 

ఈ సంఘటన తర్వాత కులశేఖరుడు రాజ్యకాంక్ష లేని తనకు ఈ రాజ్యం భారంగా అనిపించింది. వెంటనే తన కుమారులను పిలిచి వారికి తన రాజ్యాన్ని సమంగా విభజించి జనరంజకంగా పాలించుకోమని తను శ్రీరంగనాథుని సేవలో గడుపుతానని చెప్పి, తన సహచరులైన వైష్ణవ భక్తులతో శ్రీరంగం చేరుకున్నాడు. తర్వాత కులశేఖరుడు నిరంతరం విష్ణు భక్తిలో నిమగ్నమై తనకు తాను దశరథ మహారాజుగా ఊహించుకుని శ్రీరామచంద్రుని ముకుందమాల అనే 40 సంస్కృత శ్లోకాలను రచించి తన అవ్యాజమైన భక్తిని చాటుకున్నాడు. తమిళ ప్రబంధ సాహిత్యంలో ముకుందమాల అత్యంత ప్రాముఖ్యతను చాటుకుంది. త్రిభువన సుందర మూర్తి అయిన శ్రీకృష్ణునిపై రచించిన ఈ ముకుందమాల సాహిత్యపరంగాను, భక్తిపరంగాను ఎంతో ఉన్నతమైందిగా పేర్కొన్నారు. అంతేకాకుండా శ్రీరామచంద్రుని గుణగణాలను వర్ణిస్తూ చెప్పిన పెరుమాళ్ తిరుమొళి కూడా అత్యంత ప్రశంసా పాత్రమైంది.

 

కులశేఖరుడు తాను రచించిన ముకుందమాలలోని 40 శ్లోకాల్లో చిప్పిన భక్తిసారానికి, సంశ్లేష భావానికి పరవశించిన భక్తులు ఆయన్ను ఆళ్వారుల్లో ఒకనిగా చేశారు. అప్పటినుండి కులశేఖరుడు, కులశేఖర ఆళ్వారుగా పిలవబడ్డాడు. ముకుందమాలలో కులశేఖరాళ్వారులు శ్రీకృష్ణ మంత్రం గురించి తెలియజేస్తూ అది శత్రునాశని అని, ఉపనిషత్తుల్లో కొలువబడిందని, సంసారంలోని బాధలను తొలగించేదని, అజ్ఞానాంధకారం నుండి వెలుగు చూపేదని, సకల సౌఖ్యాలను కలగజేసేదని, కాలసర్పాల నుండి కాపాడేదని, జీవితానికి అర్ధాన్ని, పరమార్ధాన్ని కలగజేసేదని, ఎల్లప్పుడూ కృష్ణ మంత్రాన్ని పఠించమని, అదే మోక్షానికి మార్గాన్ని కలగజేస్తుందని చెప్తాడు. అంతేగాక కులశేఖరాళ్వారులు ప్రహ్లాదుని అవతారమని కూడా వైష్ణవులు నమ్ముతారు.

ఈవిధంగా కులశేఖరాళ్వారులు జీవితంలోని బాల్యావస్తలోనూ, యవ్వనంలోనూ, కౌమార్యంలోనూ, వృద్ధాప్యంలోనూ అంటే జీవితకాలమంతా భగవద్సేవలోనే తరించిన ధన్యజీవి. వీరు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఒకసారి దర్శించి కొన్నాళ్ళు అక్కడ గడిపారు. వీరు దాదాపు అన్ని వైష్ణవ క్షేత్రాలను దర్శించారు. శ్రీవేంకటేశ్వరుని దర్శించిన తర్వాత అవ్యక్తానుభూతిని పొందిన కులశేఖరాళ్వారులు భక్తిసారాన్ని, శరణాగతి స్తోత్రాలను పాడుతూ 10 పాశురాలను తమిళంలో గానం చేశారు. వీరు రచించిన తిరుమలరాయని పాశురాలు అనిర్వచనీయమైన భక్తి భావాన్ని కలగజేస్తాయి.

 

అందుకే కులశేఖరుని కోరిక మేరకు తిరుమలేశుని ముంగిట పడి (గడప) రూపంలో ఈ ఆళ్వారులు నిత్యం స్వామివారిని చూస్తూ తన్మయత్వాన్ని పొందుతారు. అందుకే తిరుమల శ్రీవారి ముంగిటనున్న గడపకు ''కులశేఖర పడి'' అనే పేరు సార్ధకమైంది.

 

ఇంకా ఉంది...

 

Tirumala vaibhavam Serial-10, Kulasekhara Alwar and 12 Alwars, Nammalvars and kulasekharalwar, the story of kulasekharalwar, Kulasekhara padi, kulasekharalwar and 10 Pashuras