Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 30
?>

తిరుమల వైభవం సీరియల్ - 30

Tirumala vaibhavam Serial- 30

దేసు వెంకట సుబ్బారావు

సాళువ వంశం

సంగమ వంశీయుడైన రెండో కంపన (కుమార కంపన ఉడైయార్) వద్ద సైన్యాధిపతిగా పనిచేసిన సాళువ మంగిదేవుడు సాళువ వంశానికి అధిపతి. ఇతడు సైన్యాన్ని అజమాయిషీ చేస్తూ చంద్రగిరి కోటలో ఉన్నాడు. ఇతనికి మహామండలేశ్వర, మేదినీ మీసరగం డ – అని బిరుదులున్నాయి. సాళువ మంగిదేవ మహారాజు తిరుమల శ్రీవారి దేవాలయ ఆనంద నిలయ విమానానికి బంగారుపూట వేయించారు. దాని శిఖరంపై బంగారు కలశాన్ని ప్రతిష్టించారు. ఇది క్రీస్తుశకం 1359 జూలై 6వ తేదీన జరిగింది. బంగారు కళలతో దేవాలయం ధగధగలాడుతూ భక్తులకు ఆహ్లాదం కలిగించిందని తెలుగు తమిళ శాసనాల్లో పేర్కొన్నారు. ఈ సాళువ మంగిదేవ మహారాజును సాళువ మంగు మహారాజు అని కూడా పిలుస్తారు. ఇతను కుమారు కెంపన ఉడైయార్ అంటే రెండో కెంపనకు యుద్ధంలో సహకరించి సంబువరాయను ఓడించాడు. ఆ కారణంగా ఇతన్ని సంబురాయస్థాపనాచార్య అనే బిరుదు పొందాడు. మధుర ముసల్మానులపై దండయాత్ర చేశాడు. ముసల్మానుల స్వాధీనంలోని మధురను, తిరుచునాపల్లిని విడిపించాడు. హిందూ ధర్మాన్ని ముసల్మానుల నుంచి పరిరక్షించాడు. ముసల్మానుల బెడద తగ్గిన తర్వాత సెంజి గవర్నరైనా గోపన్న (గోపనాచార్య) తిరుమల నుంచి తరలించిన శ్రీరంగనాథుని శ్రీరంగంలో ప్రతిష్టించాడు. శ్రీరంగనాథుని పునఃప్రతిష్ఠకు శ్రీసాళువ మంగిదేవ మహారాజు 60 వేల మాడల బంగారు నాణాలను శ్రీరంగనాథస్వామికి సమర్పించాడు.

రెండో హరిహర రాయలు (సంగమ వంశం)

రెండో హరిహర రాయలు పుంగోడు గ్రామాన్ని సర్వమాన్యంగా శ్రీవారికిచ్చి అందులో వచ్చే ఆదాయం వంద ఫణాలను శ్రీవారి దేవాలయ ఖజానాకు చేర్చి, ప్రతి సంవత్సరం మాశి నెలలో బ్రహ్మోత్సవాలు జరిగేట్లు ఏర్పాటు చేశాడు. ఇది క్రీస్తుశకం 1388 జనవరి 8వ తేదీన జరిగింది. ఇందుకు సహకరించినవారు ముల్లై తిరువెంకట జీయరు. ఈ జీయరు అరిశినాలయన్ పూలతోటకు, మఠానికి అధిపతిగా ఉన్నారు. ఇచ్చిన 100 ఫణాలు బ్రహ్మోత్సవానికి చాలనందున మరో 100 ఫణాలను క్రీస్తుశకం జూన్ 1390లో సమకూర్చారు. ఈ రాజు షోడశదానాలు అనేకం దేవాలయాలకు చేశాడు. అందులో ముఖ్యమైన దేవాలయాలు చిదంబరం, శ్రీకాళహస్తి, వేంకటాద్రి, కంచి, శ్రీశైలం, సోమశైలం (తిరువన్నామలై), అహోబిలం, శ్రీరంగం, కుంభకోణం మొదలైనవి. రెండో కంపన్న దగ్గర అధికారులుగా ఉన్న గిరిదేవప్ప అతని సోదరుడు శాంతప్ప నాగప్ప (ఆత్రేయ గోత్రుడైన సాయన్న పుత్రులు) శ్రీస్వామివారికి నైవేద్యాలను 1404లో డిసెంబరు 18న చేసినట్లు శాసనాలద్వారా తెలుస్తోంది. రెండో దేవరాయలు విజయనగర రాజులలో మొదటి వంశీయుడైన సంగమ కులస్తుడు రెండో దేవరాయలు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి మూడు గ్రామాలు విక్రమాదిత్య మంగళ, ఎలమండయ, సిరుక్కురకాలు, కలరువిడ్డా గ్రామాలను సర్వమాన్యంగా సమర్పించడమేగాక, 1200 పాన్ బంగారు నాణాలను 2200 వరహా నాణాలను శ్రీస్వామివారి భాండాగారానికి చెల్లించి సంధి నైవేద్యం చేశారు. ఇందులో 30 గంగాళాల అన్నప్రసాదాలు, ఒక గంగాళం పాయసం అప్పాలు, రెండో నైవేద్యంగా ఉండేది. ఇలా ప్రతినిత్యం జరిగేలా క్రీస్తుశకం 1429 డిసెంబరు 5వ తేదీన ఏర్పాటుచేశారు. ఈ సంధి నైవేద్యం పేరు ''రాయల సంధి''. రెండో దేవరాయలు క్రీస్తుశకం 1429 డిసెంబరు 5వ తేదీన తిరుమల కొండకు వచ్చి స్వామిదర్శనం చేసుకున్నాడు. రెండో దేవరాయలు శ్రీస్వామివారికి (మూలవర్లకు) దేహ మర్దనానికి పునుగు తైలం, సుగంధ ద్రవ్యాలతో కలిపిన తీర్థం (అభిషేకం) ఏర్పాటు చేశారు. ఆశ్వయుజ మాసంలో (సెప్టెంబరు, అక్టోబరు) పునర్వసు నక్షత్రంలో ప్రారంభమై స్వాతి నక్షత్ర దినాన అవభ్రుధ స్నానంతో పరిసమాప్తమయ్యే బ్రహ్మోత్సవాన్ని 9 రోజులపాటు ఏర్పాటు చేశారు.

తిరుమలలో తిరిగి వేద ఘోష

తిరుపతికి 8కిలోమీటర్ల దూరంలో పశ్చిమాన ఉన్న శ్రీనివాసపురంలో 24మంది బ్రాహ్మణ మహాజనులు నివసిస్తుండేవారు. వీరు తిరుమలలో శ్రీవారి సన్నిధిలో నిత్యం వేదపారాయణం చేస్తుండేవారు. ఈ శ్రీనివాసపురం సాలీనా 400ఫణాల ఆదాయం ఇస్తుండేది. శ్రీనివాసపురాన్ని రెండు భాగాలుగా చేసి ఇందులో సగభాగం శ్రీవారి భాండాగారానికి, మిగిలిన సగభాగం రాజ భాండాగారానికి చెల్లిస్తుండేవారు. రాజుగారి సగభాగం వేద పారాయణం చేసే 24 మంది బ్రాహ్మణులు జీవనంగా అనుభవిస్తున్నారు. కొంతకాలం తర్వాత వీరు అనుభవించే సగభాగం చాలకపోవడంతో మిగిలిన సగాన్ని కూడా ఇవ్వమని కోరారు. అంటే శ్రీవారి భాండాగారానికి చెల్లించే సగభాగాన్ని కూడా వారు కోరారు. అయితే ఈ సగభాగం ఎండోమెంటుకు సంబంధించింది కనుక దాన్ని ఇస్తే ఎండోమెంట్ ఒప్పందాన్ని త్యజించినట్లవుతుందని, అది ధర్మవిరుద్ధమని ఇవ్వడానికి వీలుపడదని చెప్పారు. దీంతో ఈ 24మంది తిరుమలలో వేదపారాయణం మానేశారు. ఇది 15వ శతాబ్దం పూర్వార్థంలో జరిగింది. శ్రీవారి సన్నిధిలో 10వ శతాబ్దానికి ముందు ప్రతి పూజలోనూ వేదపారాయణం చోటుచేసుకునేది. కానీ కాలక్రమేణా తమిళుల ప్రాబల్యంతో దివ్య ప్రబంధ పారాయణం ఎక్కువైంది. వేదపారాయణ నిలుపుదలతో తమిళ దివ్య ప్రబంధ పారాయణం, దాని ప్రాధాన్యత పెరిగింది. వేదోక్తమైన పారాయణానికి విఘ్నమే కలిగింది. అలంటి పారాయణాన్ని రెండో దేవరాయలు 1433 నవంబరు 22న పునరుద్ధరించాడు. అళగప్పిరనార్ అని ప్రసిద్ధుడైన తిరుక్కాలికనిదాసర్ తిరుపతి వాస్తవ్యుడు. శ్రీవైష్ణవ బ్రాహ్మణుడు. శ్రీవారి భాండాగారంలో 450 నార్ ఫణం బంగారు నాణాలను చెల్లించి క్రీస్తుశకం 1380లో శ్రీమలయప్ప స్వామికి శ్రీదేవి భూదేవిలతో ఉత్సవర్లకు శ్రీవారి బ్రహ్మోత్సవం రెండో రోజు అభిషేకం (తిరుమంజనం) జరిగేటట్లు ఏర్పాటు చేశారు. ఇది అతను తిరుమలలో కట్టించిన పుష్పమండపంలో జరిపించారు. అభిషేకానంతరం నైవేద్యానికి అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు. అన్నప్రసాదా నైవేద్యాలను శ్రీస్వామివారి మూలవర్లకు శ్రీవరాహస్వామికి కూడా ఏర్పాటు చేశారు. శ్రీ వరాహస్వామి ప్రస్తావన తొలిసారిగా శాసనాల ద్వారా క్రీస్తుశకం 1380 నుంచి తెలియవచ్చింది.

శ్రీస్వామివారికి అభిషేకం (తిరుమంజనం) ప్రస్తావన శాసనాల్లో మొట్టమొదటగా క్రీస్తుశకం 1380 నుంచి అని తెలుస్తోంది. చంద్రగిరి రాజ్యంలో, తిరువెంకటకొట్టంలో, వైకుంఠవలనాడులో, కొట్టాల స్థలంలో సిద్ధవటం అనే ఊరుంది. ఈ సిద్ధవటం గ్రామమే ప్రసిద్ధి చెందిన శ్రీనివాసపురం. నిలిచిపోయిన వేదపారాయణాలను పునఃప్రారంభించడానికి అత్యంత ప్రయాసపడిన భక్తుడు తిరుక్కోన్ద్రిదాసర్ గా పిల్చుకునే అళగప్పిదాసర్. శ్రీవైష్ణవుడైన ఇతను రెండో దేవరాయలు దగ్గర మంత్రిగా ఉన్న దేవన్న యుడైయార్ ను కలిసి ఈ విషయం రాజుగారికి మనవి చేయాల్సిందిగా కోరాడు. శ్రీవారి భాండాగారానికి చెల్లించాడు. తర్వాత ఒక నిర్దిష్టమైన ప్రతిపాదన చేసి తిరుక్కూడవూరునాడు గ్రామ రైతుల నుంచి ఏటా 200 ఫణాలు వసూలుచేసి శ్రీవారి భాండాగారానికి చెల్లించే ఏర్పాటు చేసి శ్రీనివాసపుర సగభాగం 24మంది మహాజన బ్రాహ్మణులు అనుభవిస్తూ శ్రీవారి దేవాలయంలో వేదపారాయణం కొనసాగించేట్టు ఏర్పాటు చేశారు. అయితే 24 మంది బ్రాహ్మణులు అంతా వేదపారాయణం చేయడానికి బదులు నెలకు ఇద్దరు చొప్పున ఏడాదిలో అందరికీ అవకాశం వచ్చేలా పారాయణం చేసే పద్ధతిని అనుసరించారు. పునఃప్రారంభమైన ఈ వేదపారాయణం వల్ల దేవాలయంలో జరిగే ఉత్సవ కార్యక్రమంలో వేద ఘోషను తిరిగి వినగలిగారు. అంతేకాక శ్రీవారి మాహాత్మ్యం, అనంత పద్మనాభ వ్రతపురాణం ఇత్యాది పురాణ పారాయణం కూడా తిరుమల తిరుపతి దేవాలయంలో కొనసాగించారు.

అళగప్పిరనార్ తిరుక్కాశికంద్రిదాసర్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి పునగకొప్పు త్తెలనానికి కావలసిన సామగ్రిని, చందనం, హారతి కర్పూరం ఆరునెలలకు సరిపడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ అభిషేకం జరిగేట్టు ఏర్పాటు చేశారు. అటు మూలవర్లకు, ఉత్సవర్లకు ఈ అభిషేకం ప్రతిరోజూ జరగడం విశేషమే. ఉడైయార్ దేవన్న ఉడైయార్ నాగన్న ఓడియా కుమారుడు. ఈ నాగన్న ఓడియా మొదటి బుక్కరాయలు దగ్గర వైస్రాయిగా పనిచేశాడు. దేవన్న ఉడైయార్ విజయనగర రాజైన రెండో హరిహరరాయలు దగ్గర నుంచి రెండో దేవరాయల వరకు 50 సంవత్సరాల పైబడి మంత్రిగా పనిచేసాడు. క్రీస్తుశకం 1379 నుంచి క్రీస్తుశకం 1454 వరకు పనిచేశాడు. శఠగోప నంబి గోవిందన్ అనే తిరుపతి వాస్తవ్యుడు తన ఇంటిని శ్రీస్వామివారి సంస్థానానికి అమ్మేశాడు. రాజుగారి భాండాగారం నుంచి ఆ ఇల్లు దేవన్న ఉడైయార్ ''కానుక''గా ఇచ్చారు. ఆ కానుకను శఠగోప నంబి గోవిందన్ దేవన్న ఉడైయార్ మంత్రికి చెల్లించాడు.

మల్లన మంత్రి (మాధవదాసర్)

రెండో దేవరాయల మరొక మంత్రి పేరు మల్లన. ఇతని మరొకపేరు మాధవదాసర్. మల్లాన్ డైయార్ అని కూడా పిలిచేవారు. ఈ మంత్రి మొదటి శాసనం క్రీస్తుశకం 1409మార్చి 13 నాటిది. ఇది మొదటి దేవరాయలవారి కాలంనాటిది. ఈ మల్లన మైసూరు గవర్నరుగా ఉంది చంద్రగిరి రాజ్యానికి గవర్నరుగా నియమితులయ్యారు. చంద్రగిరి రాజ్య గవర్నరుగా చేరినంతనే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి నైవేద్యం, నిత్యదీపం ఏర్పాటు చేశారు. ఇది పై శాసనంలో ఉంది. ఈ మల్లన మంత్రి అవిలాల చెరువు నీటి కాలువలను మరమ్మత్తు చేయించారు. ఇందువల్ల 5000 ఎకరాల భూములకు నీటి వసతి కలిగింది. ఈ భూముల నుంచి వచ్చే ఆదాయంతో నెయ్యికోసం 82 ఆవులను కొని స్వామికి దానం చేశారు. ప్రతిరోజూ ఒక తిరుప్పోకనం (నేతిపొంగలి) స్వామివారికి నైవేద్యం ఏర్పాటు చేశారు. గర్భగుడిలో రెండు దీపాలు వెలిగించే ఏర్పాటు చేశారు. ఇది 1409 మార్చి 13న జరిగింది. సంస్కృత శ్లోకంలో నైవేద్యం గురించి రెండు దీపాలు వెలిగించడం గురించి వర్ణించారు. ఈయన నలుగురు రాజుల దగ్గర పనిచేశారు. క్రీస్తుశకం 1388 నుంచి క్రీస్తుశకం 1446 వరకు - 1. మొదటి బుక్కరాయలు 2. మొదటి దేవరాయలు 3.రెండో హరిహరరాయలు 4. రెండో దేవరాయలు. ఈ రెండో దేవరాయలును ''అమాత్యశేఖర'' అనే సంస్కృత శాసనంలో పేర్కొన్నారు. మహాప్రధాన మంత్రి అని కూడా పిలిచారు. ఇతన్ని చంద్రగిరి రాజ్యం నుంచి చాంద్రగుట్ట కొనకు గవర్నరుగా క్రీస్తుశకం 1446 లో ఇరుగప్ప ఓడియో స్థానానికి మార్చారు. చంద్రగిరి రాజ్యాన్ని క్రీస్తుశకం 1409 నుంచి క్రీస్తుశకం 1445 వరకు పాలించారు.

శ్రీవారి ఆలయంలో రాయలువారి మేడను ఆనుకుని ఉన్న మంటపాన్ని స్నపనమంటపం అంటారు. దీన్నే తిరుమామణి మంటపం అని కూడా అంటారు. ఈ మంటపాన్ని కట్టించింది మల్లన మంత్రే. ఈయన స్వామివారి గర్భగుడిపైన ఉన్న ఆనందనిలయ విమానానికి బంగారు పూత పూయించారు. ఇది 1417 ఆగస్టు 25న జరిగింది. తిరుమల దేవాలయ చరిత్రలో శాసనాలద్వారా శ్రీవారి గర్భగుడిపై ఉన్న విమానాన్ని ''ఆనంద-నిలయ-విమానం'' అని మొట్టమొదట పేర్కొన్నడి రెండో దేవరాయల కాలంనుంచే! తిరుమల శ్రీవారి దేవాలయం ఇప్పుడున్న స్వరూపంలో ఆనాడు లేదు. దేవాలయమంతా ఒకేమారు కట్టలేదు. అంచలంచెలుగా ఈ దేవాలయం వృద్ధి చెందింది. మొదట ఈ ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి జరిపించినట్టు పురాణంలో పేర్కొని ఉంది. తొండమాన్ చక్రవర్తి తర్వాత ఈ దేవాలయాన్ని పోషించిన వారిలో శాసనాలద్వారా తెలుస్తున్నవారు పల్లవులు, చోళులు, పాండ్యులు, యాదవ రాజులు, విజయనగర రాజులు, మట్ల వంశీయులు, మహమ్మదీయ నవాబులు, బ్రిటీషువారు, మహంతులు - ఇలా అనేక వంశస్తుళ పోషణతో దేవాలయం వృద్ధి చెందింది.

శ్రీవారి గర్భాలయంలో ప్రాకారం

శ్రీవారి దేవాలయం 10 వ శతాబ్దంలో చిన్న పరిమాణంలో గర్భగుడి వరకు పరిమితమై ఉండేది. శ్రీవీరనరసింగదేవరాయలు దేవాలయాన్ని కొంతవరకు విస్తరింపచేశారు. మొదట కట్టిన గర్భగృహ గోడలను యధాతధంగా కట్టించి దానిచుట్టూ ప్రాకారాన్ని కట్టించాడు. అందుకే శ్రీవారి గర్భగృహాన్ని ''కోవిల్ ఆళ్వారు'' అని పిలిచారు. అంటే ''దేవాలయానికే దేవాలయం'' అని అర్ధం. ఇది క్రీస్తుశకం 1245లో జరిగింది. ప్రస్తుతం ఇది కంటికి కనపడదు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణ ప్రాకారాన్ని కూడా కట్టించి ఆ ప్రాకార పైకప్పును మూయిస్తూ ఆనందనిలయాన్ని పునర్ నిర్మించారు.దేవాలయ పునర్నిర్మాణంలో పాడుపడిన రాళ్ళపై ఉన్న శాసనాలను కొత్తరాళ్ళపై చెక్కించి వాటిని తిరిగి దేవాలయ గర్భగృహ గోడలకు తాపడం చేయించడం రాజు విజ్ఞతకు నిదర్శనం. దీనివల్ల చారిత్రక అంశాలకు సంబంధించి రాజుకున్న ముందుచూపు, చరిత్రను భద్రపరచాలనే ప్రజల వివేకం బోధపడతాయి. శాసనాల ద్వారా భవిష్యత్ తరాల్లో కూడా వీటి ఏర్పాటుపై ఆసక్తి కలిగించినట్లయింది.

చరిత్రను భద్రపరచడంలో రాజకీయ ద్వేషాలకు అతీతంగా వ్యవహరించడం.. పైపెచ్చు యాదవులకు, చోళులకు స్నేహ బంధమేగాక, వివాహబంధం కూడా పెంపొందాయి. ముందు తరాలలో కూడా అలాంటి బంధం కొనసాగింది. శ్రీవీరనరసింగదేవయాదవ రాయలు పునర్నిర్మించిన ఆనంద నిలయ విమానం, దేవాలయం, గర్భగృహం, అంతరాళమని పిలిచే మంటపం, దాన్ని అనుసరించే ప్రాకారం, అప్పట్లో ఇంతవరకే పరిమితమై ఉండేది. అందువల్ల ఈ గుడి చాలా చిన్నదిగా ఉండేది. ఈనాటి శయన మండపం ఆనాడు భక్తులు నిలిచి ఉండే ముఖమంటపంగా ఉండేది. 115 సంవత్సరాల తర్వాత బుక్కరాయల పాలెగాళ్ళలో ఒకరుగా చంద్రగిరి కోటలో ఉన్న సాళువ మంగి దేవమహారాయలు క్రీస్తుశకం 1359 లో విమానానికి మరమ్మత్తు చేసి బంగారు పూత పూయించి, బంగారు కలశాన్ని ప్రతిష్టించారు. ఈయన సాళువ నరసింగరాయునికి ముత్తాత. మల్లనమంత్రి 58 సంవత్సరాల తర్వాత తిరుమామణి మంటపాన్ని కట్టించి దేవాలయ విస్తీర్ణతను పెంచారు. లోపల ప్రదక్షిణా ప్రాకారాన్ని మూయించి, గర్భగృహం లోపలికి తిరుమామణి మంటపం నుంచే ప్రవేశం ఏర్పాటు చేశారు. శయనమంటపానికి, తిరుమామణి మంటపానికి మధ్య ఉన్న రాళ్ళను పెకిలించక (బహుశా ఆనంద నిలయ పునర్నిర్మాణం చేసేటప్పుడు కట్టిన ప్రాకార గోడలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశం, ఆనందనిలయానికీ ముప్పు వాటిల్లవచ్చనే భావంతో లోపల ప్రాకారం అంటే రాములవారి మేడవద్ద ఉన్న రాళ్ళను పెకిలించలేదు) అలానే ఉంచేసి కట్టడంవల్ల రాములవారి సన్నిధి మేడ ఇరకాటమైంది. అయితేనేం.. శ్రీవారి గర్భగుడి విమానంతో పాటు ఈనాటికీ చెక్కుచెదరకుండా ఉండటం మన భాగ్యం. ఆనాటి నిర్మాణ కర్తల వైశిష్ట్యం. ఆనందనిలయ విమానానికి ఇప్పటిదాకా మూడుసార్లు బంగారుపూత వేయించారు. రెండో దేవరాయల కాలంలో సంగమ వంశం రానురాను క్షీణించడం ప్రారంభమైంది. సాళువ వంశీయుల ప్రాబల్యం పెరిగింది. సాళువ ఎర్రకంపయ దేవమహారాజుకు ఇద్దరు కుమారులు.

సాళువపెరిమల్లయ దేవమహారాజు

ఇతను చంద్రగిరి రాజ్యానికి మల్లన మంత్రి తర్వాత క్రీస్తుశకం 10-10-1446లో రాజయ్యాడు. ఇతనికి ''మహామండలేశ్వర'' అనే బిరుదు ఉంది. శ్రీస్వామివారికి ఏలంబాకం గ్రామాన్ని (చంద్రగిరి రాజ్యంలోనిది) సర్వమాన్యంగా దానం చేశాడు.

రెండో కుమారుడు మల్లయదేవమహారాజు

సంగమ వంశ కడపటి రాజులైన మల్లికార్జున, విరూపాక్షుల దగ్గర పనిచేశాడు. రెండో దేవరాయల దగ్గర సేనాధిపతిగా పనిచేసిన తిప్పాడ నాగయనాయక్కర్. క్రీస్తుశకం 1443లో మూడువేల కాసులు ''కానిక్కై''గా సమర్పించి, దర్శించుకున్నారు. వీరి తండ్రి పేరు ముద్దయనాయర్. చంద్రగిరి మూలబలంతో ఒకానొక సేనానిగా పనిచేశాడు.

శ్రీగిరేశ్వర

శ్రీగిరేశ్వరుడు సంగమ వంశీయులలో ఒకడు. రెండో దేవరాయలకు సోదరుడు. ఇతన్ని శ్రీగిరి భూపాలుడని, ప్రతాపదేవరాయలని పిలుస్తారు. శ్రీస్వామివారికి క్రీస్తుశకం 1430 జులై 1వ తేదీన సమర్పించాడు. ఇతనికి ఏనుగులతో వేటాడే రాజు అని పేరుంది. ఇతను ఉత్తర ఆర్కాటులోని మరకత నగర ప్రాంతాన్ని పాలించాడు. ఇతని కుమారుడు మల్లికార్జునుడు. ఉత్తరదేశం నుంచి వలస వచ్చి తిరుమల, తిరుపతిలో మఠాలు కత్తి భగవత్ కైంకర్యం చేసుకుంటూ జీవించిన హథీరాంజీ ఈతని సమకాలికుడు. ఈనాటికి కూడా హథీరాంజీ మఠం తిరుమల, తిరుపతిలో ఉన్న విషయం విదితమే.

మల్లికార్జున

మల్లికార్జున రెండో సంవత్సర పరిపాలనా కాలం నాటిది ఒకే ఒక శాసనం క్రీస్తుశకం 1450 మార్చి 4వ తేదీనాటిది లభ్యమైంది. తిరుపతిలో ఒక ఇల్లు, ఇంటిజాగా, చంద్రగిరిలో నివసించే రాజమౌళి చెన్నప్ప ఉడైయార్ కు అమ్మడం ఆ శాసనంలోని విషయం. ఈ చెన్నప్ప పుష్పమాలికలు కత్తి రాజాంతఃపురానికి పంపుతూ ఉండేవాడు. మల్లికార్జున కాలంనాటికి సంగమ వంశం పూర్తిగా క్షీణించిపొయింది. సాళువులు ప్రాబల్యంలోకి వచ్చారు. తిరుపతి చంద్రగిరుల మధ్య దూరం ఏడు కిలోమీటర్లు మాత్రమే. అయినా ఈ రెండు తిరువేంకటకొట్టంలో వేరువేరు తాలూకాలుగా ఉండేవి. తిరుపతి తిరుక్కడవూరునాడులో ఉండగా, చంద్రగిరి వైకుంఠ వలనాడులో చేరింది.

సాళువవంశం

సంగమవంశీయుల తర్వాత సాళువవంశీయులు విజయనగర రాజులయ్యారు. ముగ్గురు సాళువరాజులు విజయనగర సామ్రాజ్యం కోసం పోరాటం సాగించారు. వీరిలో సాళువ నరసింగరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని అధిష్టించాడు. మాలగంగయ దేవమహారాజు కుమారుడు సాళువ సిరుమల్లయ దేవమహారాజు.

  ఇంకా ఉంది...

 Tirumala vaibhavam Serial-30, tirumala glorious history mallana mantri madhavadasar, tirumala sangama vamsha harihara raya, tirumala temple veda ghosha, mallayadeva maharaju and mallikarjuna in tirumala vaibhavam