Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial-6
?>

తిరుమల వైభవం సీరియల్ - 6

Tirumala vaibhavam Serial-6

దేసు వెంకట సుబ్బారావు

 

వైకుంఠుని నుతియించని వినుతులు వననిధి కురిసిన వానలు

ఆ కమలోదరు కోరని కోరిక లందని మాని ఫలంబులు

(వైకుంఠధాముని విడిచి పరులను గూర్చి చేయు పొగడ్తలన్నీ సముద్రంలో కురిసిన వానలాగ నిరుపయోగం. ఆ పద్మనాభుని గాక అన్యులను కోరే కోరికలన్నీ అందని మాని పండ్లలా అసాధ్యాలు)

శఠగోప యోగి నమ్మాళ్వార్లు

దేవాలయాల్లో శఠగోప ప్రాశస్త్యం ఎలా వచ్చిందో తెలుసుకున్నారు. మరి ఆ శఠగోప యోగి చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం.

 

పూర్వం దక్షిణ దేశంలో పాండ్యమండలంలో కురుకాపురి అనే నగరం ఉండేది. దాన్ని ఇప్పుడు ఆళ్వారు తిరునగరి అని పిలుస్తున్నారు. ఇది తమిళ దేశంలో ఉంది. ఈ నగరాన్ని పూర్వం అలకానగరం అని కూడా పిలిచేవారు. అపూర్వ సంపదలతో ఆ నగరం విలసిల్లేది. ఆ నగరానికి కారియను చతుర్ధ కులజుడు పాలకుడిగా ఉండేవాడు. అతని ధర్మపత్ని పేరు నాథనాయికమ్మ. అనేక సంపదలు ఉన్న ఆ నగరాధీశునకు సంతానయోగం కలగలేదు. అందువల్ల ఆ రాజదంపతులు చేయని పూజలు, మొక్కని దేవుడు లేడు. ఎంత ధనం ఉన్నా సంతాన యోగం లేని విచారం ఆ దంపతులకు ఉండేది.

 

ఆ నగరంలో అదినాథుడి పేర వాసుదేవుని ఆలయం ఉంది. గుడిలోని మూర్తి శ్రీకృష్ణుడు. మంత్రి సామంతుల సూచనల మేరకు రాజదంపతులు ఆ ఆలయానికి చేరుకుని శ్రీకృష్ణుని సంతానం కోసం వేడుకున్నారు. తర్వాత కొన్నాళ్ళకు దంపతులకు తన అంశతో పుట్ర సంతాన యోగం కలుగుతుందని మహా విష్ణువు అర్చక ముఖమున తెలియజేశాడు. ఒక శుభ ముహూర్తంలో వారికి పుట్ర సంతానం కలిగింది. కలియుగానికి 44వ దినమున సుమారు ఐదువేల సంవత్సరాలకు పూర్వం ప్రమాది వత్సర వైశాఖశుక్ల చతుర్దశినాడు, విశాఖా నక్షత్రం, కర్కాటక లగ్నం, ముకుందుని సేనాపతి అయిన విష్వక్సేనుని అంశమున ఒక కుమారుడు ఉడాయించాడు. ఆ బాలునకు ''మారుడు'' అని నామకరణం చేశారు.

 

సకల జగత్తులోని అజ్ఞాన అంధకారాన్నీ తొలగించుటకు అవతరించిన ఆ బాలునిలో బాల్య చేష్టలు ఏమాత్రం కానరాలేదు. అందుకు ఆ రాజదంపతులు చాలా విచారించారు. కారణం బాలుడు కళ్ళు తెరవలేదు. ఏడ్వలేదు. స్తన్యపానాదులు కోరలేదు. కదలలేదు. మలమూత్ర విసర్జన చేయలేదు. కానీ, శరీరం మాత్రం బాలసూర్యునిలా రోజురోజుకూ మహా తేజస్సుతో ప్రకాశిస్తూ వృద్ధిచెంద సాగింది.

 

ఇటువంటి బాలుడు కలిగినందుకు ముఖ్యంగా అతని తల్లి పడిన బాధ వర్ణనాతీతం. లేకలేక కలిగిన పుత్రుడు బాల్యచేష్టలు ఏమీ లేక ఎటువంటి చలనమూ లేకపోవడం ఏ మాత్రుమూర్తికి మాత్రం ఆనందాన్ని ఇస్తుంది?! అలా చలనం లేని పసిబాలుని చెంత పన్నెండురోజులు అహర్నిశలు గడిపారు రాజదంపతులు. చివరికి ఆశలుడిగి బాలుని గుడికి తీసికెళ్ళి మందిర ప్రాంగణంలో మహాలక్ష్మి అమ్మవారి వద్దకు చేర్చి, బాలుని కాపాడే భారం నీదేనంటూ జగన్మాతపైనే భారం వేసి పలువిధాలుగా ప్రార్ధించారు. ఇంతలో ఊయలలోని పసిబాలుడు కిందికి దిగి, మోకాళ్ళపై పాకుతూ ఐదారునెలల బాలునిలా ఆలయంలోని పురాతన చింతచెట్టు తొర్రలోనికి ప్రవేశించి వెంటనే మునివలె పద్మాసనం వేసుకుని కనులు మూసుకుని అందరూ చూస్తుండగానే ధ్యానముద్రలోకి వెళ్ళాడు.

 

ఆ అద్భుత దృశ్యాన్ని వేలాదిమంది ప్రత్యక్షంగా చూశారు. ఆనందంతో చింతచెట్టును ఆదిశేషుని అవతారంగానూ, బాలయోగిని విష్వక్సేనుని అవతారంగానూ వేనోళ్ళ పొగిడారు. వైకుంఠ నాథుని ఆజ్ఞచేత విష్వక్సేనుడు ఆ బాలునికి పంచ సంస్కారాలు అనుగ్రహించాడు. పద్మాసనుడైన ఆ బాలుడు బాలయోగిగా మారి ఎల్లప్పుడూ రమాపతినే ధ్యానం చేస్తూ మునియై ధ్యానస్థిమిత లోచనుడై, అష్టాంగ యోగమున శ్రీహరి దివ్య మంగళ విగ్రహ సౌందర్యమును, శ్రీహరి కల్యాణ గుణ చేష్టలను అలౌకికంగా అనుభవిస్తూ పదహారు సంవత్సరాలు ఆ చింతచెట్టు వద్దనే గడిపాడు.

 

ఎల్లప్పుడూ ప్రసన్నవదనంతో కనిపించే ఈ యోగిని అందరూ శఠగోప యోగి అని, శఠారి యోగి అని పిలిచేవారు. ఇక్కడ శఠ అంటే శత్రువు. అంటే కోపానికి శత్రువు అని అర్ధం. ఈ యోగిని శఠగోప యోగి అని పేరుకు తగ్గట్లుఎప్పుడు ప్రసన్నవదనంతో ఉండేవాడు. 16 సంవత్సరాలు ఆలయ ప్రాంగణంలో చింతచెట్టు వద్ద ధ్యానముద్రలో గడిపిన కాలంలో దేశంలోని అనేకమంది పండితులు, విద్వాంసులు, యోగులు విచ్చేసి నిరంతరం ధ్యానముద్రలోనూ, దివ్యతేజస్సుతో ఉన్న మునిని చూసి వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, రామాయణ, మహాభారత, భాగవతాలు, అనేక శాస్త్రాలు, వేద వేదాంగాలు చదివేవారు. అలా నిరంతర పారాయణం వాళ్ళను, ధ్యానముద్రలో ఉన్న శఠగోపయోగి ఏకసంధాగ్రాహి కావడంవల్లనూ, ఆ శాస్త్ర విజ్ఞానాన్ని అంతా ఆకళింపు చేసుకుంటారు శఠగోపయోగి. అప్పుడప్పుడు కొన్ని అమూల్య సందేశాలు కూడా ఇచ్చేవారు. భక్తులు, ఈ శఠగోప యోగి నిరంతర విష్ణు చింతనవల్ల శ్రీదేవి, భూదేవి సమేత గరుడ వాహనుడైన శ్రీమన్నారాయణుని తలచినదే తడవుగా చూసే అదృష్టాన్ని పొందాడు. అలా శ్రీమన్నారాయణుని చూసిన వెంటనే పరమానందభరితుడై పెద్దగా శ్రీమన్నారాయణుని గానం చేసేవారు. వీరికి కలిగిన దివ్యానుభూతిని ధారగా గానంచేయగా, శ్రీసూక్తి, శ్రీ వచన భూషణం అనే నాలుగు ప్రబంధాలు వెలిశాయి. నాలుగు వేదాల సారంతో నిండిన నూరు పాశురాలు, 87 పాశురాలతో కూడిన పెరియ తిరువందాడి, 1102 పాశురాలతో కూడిన తిరువాయిమొళి.

 

ఇందులో ద్రవిడ దివ్య వేదంగా తిరువాయిమొళి ప్రసిద్ధి చెందింది. ఇలాతమ మధ్యనే ఉండి భగవద్ సన్నిధానాన్ని ఎల్లప్పుడూ చూసే అదృష్టాన్ని పొందినందుకు అక్కడివారంతా శఠగోప యోగిని నమ్మాళ్వార్ అని పిలిచేవారు. ''నమ్'' ఆళ్వారు అంటే మా ఆళ్వారు అని అర్ధం. ఈ నమ్మాళ్వార్ గానం చేసిన వాటిలో శ్రీసూక్తిలోని ఆంతర్యాన్ని ఆళ్వారుల్లో మునిత్రయమైన శ్రీనాథముని, యమునాచార్యురు, శ్రీరామానుజాచార్యులు ఎక్కువగా ప్రచారంలోకి తెచ్చారు.

ఈ నమ్మాళ్వారుల అనన్యభక్తికి సంతసించిన యాదినాథ దేవుడైన శ్రీకృష్ణుడు తాను ధరించిన వకుళమాలికను, పొగడపూలదండను, అర్చకద్వారమున ఈ ఆళ్వారుకి అందేలా అనుగ్రహించాడు. దాన్ని ధరించిన ఆ మహాయోగి అలౌకిక మహిమాన్వితుడిగా దివ్యతేజస్సుతో ప్రకాశిస్తాడు. వకుళ మాలదారి అవడంవల్ల ఇతన్ని వకుళభూషణుడు అని, కారి కుమారుడైనందున కారిమారులని, పర మతస్తులకు అంకుశ ప్రాయుడైనందున పరాంకుశులని, భక్తి పరిపూర్ణుడైనందున నమ్మాళ్వారులని ఆయనకు పేర్లు వచ్చాయి. వకుళమాల శాంతికి చిహ్నం. సదాచారానికి, సత్సంకల్పానికి ఉదాహరణ. పరోపకార పారాయణత్వానికి ఈ పుష్పం ఆదర్శం. అందుకే నమ్మాళ్వారులు వకుళ మాలాధారులయ్యారు. ఈ నమ్మాళ్వారుల కాలం నాటివాడే మధురకవి యాళ్వారులు.

 

నమ్మాళ్వారుల శ్రీసూక్తిలోని మాధుర్యాన్ని భక్తులందరికీ పంచి ప్రచారాన్ని చేసి వీరికే శిష్యునిగా చేరి ధన్యుడయ్యాడు. వీరు సుమధుర గాయకులూ. వీరు తమ అమృతప్రాయమైన గానంతో ప్రజలందరినీ భక్తిమార్గంవైపు మళ్లించి భక్తి ప్రబోధకులయ్యారు.

 

ఇంకా ఉంది....

 

Tirumala vaibhavam Serial-6, tirumala hills complete information, history of tirumala, detailed story of tirumala hills, tirumala balaji epic stories, hindu epics and lord venkateswara, venkatadri, anjanadri etc 7 hills, bhooloka vaikuntham tirumaladri