Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 12
?>

తిరుమల వైభవం సీరియల్ - 12

Tirumala vaibhavam Serial- 12

దేసు వెంకట సుబ్బారావు

 

తిరుప్పన్ ఆళ్వారులు

''ఓ వేంకటపతి! పరమపాతకుడను, భవబంధుడను అయిన నేను, నిను తలచుటకు అర్హుడనా శ్రీహరీ?! నేను అపవిత్రుడను. అమంగళుడను. పుణ్యకర్మను అవగతం చేసుకోలేనివాడను. నీ పూజకు అర్హుడినా? ఓ సర్వేశ్వరా! నీ సేవకు పండితుడినై వుండాలా? ఆత్మారాధన చేయ సంకల్పించాను. దూరాన ఉన్న ఓ పరంధామా, నీ సేవకు అర్హుడను కానా? నా గానామృతంతో నిన్ను అభిషేకించవచ్చాను. నన్ను అనుగ్రహించు స్వామీ! శ్రీరంగనాథా! రిక్తహస్తాలతో అర్చించవచ్చాను. నా ఆర్తిని తీర్చ కదలిరావా!!''

 

శ్రీహరిని కొలువ ఏ కులజుడైన ఏమి? వైజయంతిమాలలో ఒక పుష్పాన్ని అయినా చాలు, ఒదిగి తరించడానికి. పంచమకులజుడు అయినా పరమ పండిత వంశజుడు అయినా అందరూ ఒక్కటే. తమిళనాడులోని ఉరయ్యూర్ ప్రస్తుతం చేనేత పరిశ్రమకు పేరు పొందింది. ఈ ప్రాంతం ఒకప్పుడు తమిళనాట పేరొందిన గ్రామం. అదే తిరుప్పణి ఆళ్వారుల జన్మస్థలం. వీరు రోహిణీ నక్షత్రాన వృశ్చిక లగ్నంలో కార్తీక మాసంలో శూద్ర దంపతులకు జన్మించారు. వీరు శ్రీమహావిష్ణువుని శ్రీవత్సాంకితులని పేరు. చిన్నతనం నుండి సుమధుర గానంతో శ్రీహరిని అనునిత్యం గానం చేస్తూ ఉండటం వీరి జీవన విధానం.

 

తిరుప్పన్ అంటే పవిత్ర హస్తం అని అర్ధం. అందుకే వీరు నిరంతరం తన చేతిలో చిరు వీణను మీటుతూ శ్రీరంగను కీర్తిస్తూ తన్మయత్వంతో నాట్యం చేస్తుండేవారు. అదే తన నిరంతర చింతన, జీవన రాగం. హరి గానమే నిత్యం తన జీవనం. వీరు స్వయంగా రచించి ఆ పాటలనే పాడుకునేవాడు. భాగవతంలో చెప్పినట్లు హరిపూజ లేని హస్తం హస్తమే కాదు అనే భావంతో నిరంతరం తను చిరు వీణను మీటుతూ హరికీర్తనం చేసేవారు. వీరికే మునివాహనుడు అనే పేరు ఉంది. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

 

చిన్నతనం నుండే హరిధ్యానంలో ఉన్న తిరుప్పణి అనేక దివ్యక్షేత్రాలు తిరిగి, తన యవ్వన కాలంలో కావేరీ తీరంలోని శ్రీరంగనాథుని ఆలయాన్ని చూస్తూ అలౌకిక ఆనందంలో మునిగి తన్మయత్వంలో నిరంతరం భక్తి పారవశ్యంతో హరికీర్తనం చేస్తూ కాలం గడిపేవాడు. నిరంతరం హరికీర్తనమే అతని తిండితిప్పలు. నిత్యం శ్రీరంగనాథుని శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా భావించి చేసే అతని కీర్తనలను కావేరీ తీరంలోని వ్యవసాయ కూలీలకు నిత్యపారాయణం. వీరితోపాటు గొంతు కలిపేవారు. మరికొన్నిసార్లు వీరు చేసే అలౌకిక ఆనంద నాట్యాన్ని పిచ్చి చేష్టలుగా భావించేవారు. ఎవరు ఏమనుకున్నా తిరుప్పణి మాత్రం తన నిత్య సంకీర్తన మానేవాడు కాదు. నిరంతరం అతనికి అది అసంకల్పిత చర్య.

 

పంచమ (కడ) జాతిలో పుట్టినందున వీరికి ఆ కాలంలో ఆలయ ప్రవేశం ఉండేది కాదు. రాచవీధుల్లో, బ్రాహ్మణవీధుల్లో, ఆలయ పరిసర పాంతాల్లో సైతం వీరి ఛాయను కూడా ఉన్నత కులస్తులు సహించేవారు కాదు. అంతటి ఛాందస సంస్కృతి విశృంఖలంగా ఉన్న కాలంలో పంచముడైన తిరుప్పణికి దైవారాధన విషయంలో ఎటువంటి స్వేచ్ఛ ఉండేదో వేరే చెప్పనవసరంలేదు. అటువంటి కాలంలో మేలిమి పసిమి ఛాయలో ఉన్న తిరుప్పణి కావేరీ తీరంలో చిరు వీణను మీటుతూ తనదైన భక్తి పారవశ్యంతో పాడే పాటలు తీరవాసులకు చిరపరిచితమే. కానీ ఆలయ ప్రవేశానికి అనర్హుడైన తిరుప్పణి శ్రీరంగనాథుని స్వర్ణరంజితమైన ఆలయ గోపురాన్ని చూస్తూ శ్రీరంగనాథుడినే చూసినట్లుగా అద్భుతమైన తన గాన మాధుర్యంతో నిద్రాహారాలు మాని నిరంతరం స్తుతి చేస్తూ ఆ గానంలోనే అలసిసొలసి కావేరీ తీరంలోనే నిద్ర పోయేవాడు. ఒక్కోసారి సొమ్మసిల్లి పడిపోయేవాడు. అంతటి అలౌకిక చింతన తిరుప్పణి ఆళ్వార్లది.

 

శ్రీరంగనాథుని ఆలయానికి లోకసారంగమునిగా పిలవబడే వరరంగముని అనే ముఖ్య పూజారి ఉండేవారు. వీరు దైవచింతనాపరులు. సంస్కృత పండితులు. సకల శాస్త్ర విశారదులు. విజ్ఞాన సంపన్నులు. ఒకరోజు వీరు తూర్పు తెలతెలవారుతుండగా శ్రీరంగనాథునికి అభిషేకం చేయడానికి స్వర్ణకలశంతో కావేరీ జలాలను తీసుకుని నదీతీరం వెంట ఆలయానికి వస్తూ ఉన్నారు. ఉదయాత్పూర్వం చిరుచీకటి.. వడివడిగా నడిచి వచ్చే దారిలో నిద్రావస్థలో ఉన్న పంచముడైన తిరుప్పణి తన దారికి అడ్డంగా పడుకుని ఉండటం గమనించిన లోకసారంగమునికి ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. అసలే పంచముడు.. అందులో ఆలయానికి వెళ్ళే దారి, మళ్ళీ దానికి తోడు తనను గమనించకుండా పడుకున్నాడు. తన రాకను చూసి తొలగలేదనే భావంతో అతనికి పట్టలేని కోపం వచ్చింది. నదీతీరంలోణి కావేరీ తుహిన వీచికలు పంచముని తాకి తర్వాత తనను తాకాయనే ఆవేశం. అసలే పంచముడు తన పక్కన ఉంటే అపవిత్రమని భావించే ఛాందస అర్చకుడు. ఉదయకిరణాలు, ఉదయవీచికలు పంచముని తాకి తర్వాతతనను తాకితే, ఆ ప్రభావం ఎలా ఉంటుందో నని ఊహించుకుని చండప్రచండుడై ఆగ్రహావేశంతో ఊగిపోయాడు లోకసారంగముని. అంతటితో ఆగక ''ఓరి పంచమా! ఇక్కడినుంచి తొలగు.. నడిచేదారిలో మొద్దులాగా పడి ఉన్నావు. నీకు ఎక్కడా స్థలమే లేదా పాడుకోడానికి? తూర్పుతెల్లవారుతున్నా నిద్రపోతున్నావు.. లే.. లేచి పక్కకి వెళ్ళు.. దారివ్వు. ఆలయానికి వెళ్ళడానికి ఆలస్యమౌతోంది'' అని కసురుకున్నాడు.

 

నిరంతర గానవాహినిలో తేలియాడుతున్న తిరుప్పణికి అర్చకుని మాటలు ఏమాత్రం వినిపించలేదు. నిజానికి తిరుప్పణి ఆళ్వారులు నిద్రావస్థలో లేడు. తను ఉన్నది అలౌకిక ఆనందవాహినిలో. ఆ శ్రీరంగనాథుని ధ్యానసముద్రంలో తేలియాడుతున్నాడు. కానీ అర్చకులు తన మాటను విని లెక్కచేయక నిర్లక్ష్యం చేశాడన్న కోపం మరీ పెరిగిపోయింది. తన ఆగ్రహాన్ని ఆపుకోలేక చెంతనే ఉన్న ఒక రాతిణి తీలుకుని బలంగా తిరుప్పణి మొహంమీద కొట్టాడు. ఆ దెబ్బకు తిరుప్పణి ముఖం రక్తసిక్తమైంది. దాంతో తిరుప్పణి ఒక్కసారిగా ఉలిక్కిపడి స్వామీ క్షమించండి.. మిమ్మల్ని గమనించలేదు. మీకు ఆటంకం కలిగించాను. నాకు తెలీకుండానే మీ దైవకార్యానికి అడ్డు తగిలాను. నన్ను క్షమించండి'' అని పక్కకి తొలగి దారి ఇచ్చాడు.

 

ఆలయానికి చేరుకోబోతున్న లోకసారంగముని ఆలోచనలో పడ్డాడు. అంతరంగంలో ఒకటే మథనం జరుగుతోంది. నిద్రావస్థలో ఉన్న తిరుప్పణి తనను ఏంచేశాడని రాతితో గాయంచేసి తూలనాడాడు?! తన విద్య, దైవభక్తి, దైవచింతన, సంస్కారం ఏం నేర్పింది? తాను చేసిన పని తనకే చాలా ఏహ్యభావం కలగజేసింది. తానిలా ఎందుకు చేశాడు? చేయకూడదు కదా! తిరుప్పణి ఏం నేరం చేశాడని? తనలోని సాత్విక గుణం ఏమైంది? ఈ ఆగ్రహం ఏమిటి? ఈ ఆవేశం ఏమిటి? నిరంతరం భగవత్ సేవలో ఉన్న తాను ఇటువంటి హేయమైన పని ఎలా చేశాడు? అంతరంగంలో ఒకటే ఆవేదన, ఆలోచన, అంతర్మధనం.. చాలా అసౌకర్యంగా ఉంది. అశాంతిగా ఉంది. తన ఆవేశానికి పశ్చాత్తాపం చెందాడు. గీతాచార్యుఁడు చెప్పిన

 

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తినా

శృణుచైవ స్వపాకేచ పండితాహ సమదర్శినః

 

అనే శ్లోకం గుర్తుకువచ్చింది. విద్యావినయసంపన్నుడైన బ్రాహ్మణుడు గోవు, ఏనుగు, కుక్క, కుక్క మాంసం తినే చండాలుడు - ఇలా అందరిపట్లా కూడా సమదృష్టి కలిగిఉండాలి. కానీ, తానేం చేశాడు? ఇది సద్బ్రాహ్మణ చర్య కాదు. తాను నిజంగా పండితుడేనా? విజ్ఞానం, సంస్కారం తనకు నేర్పింది ఇంతేనా? తాను చూపిన ఆగ్రహానికి తిరుప్పణి క్షమాపణ కోరాడే కానీ తిరిగి తనను దూషించలేదే?! ఆమాత్రం సంస్కారం తనకు లేకున్నదే? అయ్యో.. ఎంత అపచారం చేశాను? మరి తిరుప్పణి ఏం చేశాడు? గీతాచార్యుడు చెప్పినట్లు -

 

తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్

అనికేతహ స్థిరమాతిహి భక్తిమాన్మే ప్రియో నరః

 

లభించినదానితో తృప్తినొంది దృఢ చిత్తంతో ఉన్నవారే నాకు ప్రియమైనవారు - అన్నట్లు క్షమాపణ చెప్పి తప్పుకున్నాడే కానీ తనను ఎదిరించి దూషించలేదే. నిజానికి తనకన్నా తిరుప్పణుడే నిజమైన భక్తుడు. నిశ్చలమైన భక్తితో తన మానాన తాను ఉన్నాడే కానీ ఎవరిజోలికీ పోలేదు కదా! నిందించిన నన్ను చూసి తప్పుకున్నాడే కానీ ఎవరినీ మనసా వాచా కర్మణా బాధించలేదు. నిర్మలమైన తిరుప్పణుడే నిజమైన భక్తుడు.. అని పదేపదే భావించి శోకించాడు లోకసారంగముని. ఇలా ఆలోచిస్తూ ఆలయం చేరుకొని స్వర్ణపాత్రను కిందికి దించాడు. కన్నీళ్ళ పర్యంతం శోకించాడు. తనను తాను ఎలా పునీతం చేసుకోవాలా అనే తపనలో ఉద్వేగంతో విలపించాడు. వెంటనే ఆలయంనుండి పరుగు తీశాడు. నాకు కనువిప్పు కలిగింది. నా అజ్ఞానాన్ని తెలుసుకున్నాను. నాకు తెలిసింది. నాకు తెలిసింది. స్వామీ నాకు తెలిసింది.. అని కేకలు పెడుతూ ఆలయం నుండి పరుగులు తీస్తున్నాడు. ఆలయ సిబ్బంది, మిగిలిన యాత్రికులు, అర్చకులు ఈ హఠాత్సంఘటనకు ఆశ్చర్యపోయారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలీక వెంబడించారు.

 

అలా వెళ్ళిన లోకసారంగముని కావేరీతీరంలో ఇసుకతిన్నెపై తన్మయత్వంతో ఉన్న తిరుప్పణిని చూశాడు. కన్నీళ్ళతో సాష్టాంగ దండప్రణామం చేసి క్షమించమని వేడుకున్నాడు. తన అజ్ఞానపు చీకట్లను వెలుగుతో నింపిన జ్ఞానమూర్తిగా కొనియాడాడు. నిరంతరం భక్తిపారవశ్యంతో మునిగితేలుతున్న తిరుప్పణుడే నిజమైన ఆళ్వారులు అని ఎలుగెత్తి అరిచాడు. తిరుప్పణి ఆళ్వారులకు పాదాభివందనం చేసి నమస్కరించి వారిని తన భుజాలమీద ఎక్కించుకుని శ్రీరంగనాథాలయం చేరుకున్నాడు. రంగనాథుని ఖగరాజు భుజస్కందములపై వహించునట్లే ఆ లోకసారంగముని తిరుప్పణి ఆళ్వారులణు తన భుజములపై ఎక్కించుకుని రంగనాథుని ఆలయానికి బయల్దేరాడు. ఈ చర్చకు ఆశ్చర్యపడిన ద్విజులు ముందు వేదపఠనం వెనుక ద్రావిడ వేదపాఠం చేస్తూ ఆలయాన్ని చేరాడు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి శ్రీరంగనాథుని చెంత మోకరిల్లాడు లోకసారంగముని. ఈవిధంగా తిరుప్పణి ఆళ్వారులణు ఆలయప్రవేశం చేసే సమయాన ఆలయ వాకిళ్ళు వాటంతట అవే తెరుచుకుంటాయి. స్వామిచెంతనున్న ఆలయ గంటలు మోగుతాయి. ఆలయంలో దీపాలు వాటంతటవే వెలుగులు ప్రసరిస్తాయి. శ్రీరంగనాథుని ముఖంలో చిరునవ్వులు గోచరిస్తాయి.

 

తొలిసారిగా ఆలయ ప్రవేశం చేసిన పంచముడైన తిరుప్పన్ ఆళ్వారులకు సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. ఆ ఆనందావేశంలో అనేక భక్తి గీతాలు పాడాడు. అక్కడి భక్తులంతా ఆలయాధికారులతో స్వరం కలిపారు. వీరు రచించిన ''అమలనాథ పిరాన్'' అనే గ్రంధంలో రెండు పాశురాలు తిరుమల శ్రీవారి గురించినవే. లోకసారంగముని భుజాలమీద ఎక్కినందున వీరు మునివాహనులయ్యారు. వీరు రచించిన అమలనాథ పిరాన్ గ్రంధంలో శ్రీరంగనాథుని సర్వావయవ సౌందర్యారాధన చేశాడు. వైకుంఠంకన్నా శ్రీరంగమే మిన్న అని కొనియాడారు. 108 శ్రీవైష్ణవ దివ్య క్షేత్రాలు దర్శించేకన్నా శ్రీరంగనాథుని పాదాదికేశ పర్యంతం అమృతంవలె ఆస్వాదిస్తూ పది పాశురాలలో స్వామిని ప్రస్తుతించారు. ఈ గ్రంధం ఎంతో ప్రసిద్ధి పొందింది. ఒక చిన్న మర్రి ఆకుపై పసిబిడ్డడై పవళించి, ప్రళయకాలంలో జగత్తు అంతటినీ తన ఉదరమునందు ఉంచుకున్న శ్రీమహావిష్ణువే శ్రీరంగమందు అనంతునిమీద శయనించాడు. ఆ స్వామి రత్నఖచిత హారాన్ని, ముక్త దామాన్ని అంతయునూ సామ్యంలేని సౌందర్యం గల నీలవర్ణ దేహాన్ని, హృదయగాంభీర్యాన్ని నశింపచేసింది.

 

తల్లి అవయవములన్నియూ వదిలి శిశువు దృష్టి స్తన్య పానం చేసేందుకు ఆమె రొమ్ముపైకి పాకినట్లే ఆ భక్తవరుని చిత్తం కూడా స్వామి ఇతర విభవములను మరచి శ్రీపతి పాదారవిందముల యందే మానసును లగ్నం చేశాడు. వీరి భక్తిగీతాల్లో శ్రీరంగనాథుని, శ్రీవేంకటేశ్వరుని ఎంతగానో కొనియాడారు.

 

తిరుప్పన్ ఆళ్వారుల తన్మయత్వ భక్తిగానానికి ముగ్ధుడైన శ్రీరంగనాథుడు అందరూ చూస్తూ ఉండగా తనయందు ఐక్యము చేసుకున్నాడు. ఇది శ్రీ మహావిష్ణువుకు తన భక్తుల యందుగల అనురాగానికి ప్రత్యక్ష సాక్ష్యం.

 

ఇంకా ఉంది...

 

Tirumala vaibhavam Serial-12, Thiruppan Alwar and 12 Alwars, Nammalvars and Thiruppani alwar, the story of Thiruppani alwar, Thiruppan alwar's amala natha piran, thiruppan alwar and Pashuras, thiruppan alwar and sriranganatha