Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial-4
?>

తిరుమల వైభవం సీరియల్ - 4

Tirumala vaibhavam Serial-4

దేసు వెంకట సుబ్బారావు

 

చరిత్ర పుటలను ఒకసారి పర్యావలోకనం చేసుకుంటే తిరుమల ఆలయానికి అనేక శతాబ్దాల తరగని విషయ సంపద ఉంది. తిరుపతికి అతి సమీపంలో ఉన్న శీతారాం పేట, ఎల్లంపల్లి, మేకలవాండ్లపల్లి, పీలేరు, ఇంకా గట్టు ప్రాంతాల్లో మధ్యరాతి యుగం కాలంనాటి పనిముట్లు లభించాయి. అంటే మధ్యరాతియుగం నాటికే ఇక్కడ మానవ సంచారం ఉండేడని తెలుస్తుంది. ఇంకా ఈ ప్రాంతం మౌర్యుల కాలం తర్వాత శాతవాహన కాలానికి కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. నంద వంశాన్ని జయించిన మౌర్యులు భారదేశపు దక్షిణాపథాన్ని కూడా ఆక్రమించుకుని పరిపాలించారు.

 

మౌర్యులను ఓడించిన శాతవాహనులు ప్రస్తుతం ఉన్న చిత్తూరును తమ పాలనలోకి తీసుకున్నారు. ఆ తర్వాత కాలంలో శాతవాహనుల నుండి ఈ ప్రాంతం పల్లవుల పాలనలోకి వచ్చింది. పల్లవుల కాలంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం మరింత ప్రాభవానికి నోచుకుంది. దానికి తార్కాణం ఆనాటి అనేక శాసనాలు, స్వామివారికి అర్పించిన అనేక కానుకలు వాటికి చెందిన చారిత్రక ఆధారాలు, అనేకం ఉన్నాయి. పల్లవులు పాలించిన ఈ ప్రాంతాన్ని తొండమండలంగా పిలిచేవారు.

 

ఈ కాలానికి చెందిన పల్లవరాజు దంతివిక్రముడు, అతని కాలంలో తిరుమల స్వామివారి సేవకు గానూ అనేక కానుకలను తిరుచానూరు సభయ్యార్లకు అప్పగించారు. (అప్పట్లో తిరుమల ఆలయం తిరుచానూరు సభయ్యార్ల అధికారంలో ఉండేది) 9వ శతాబ్దపు తొలినాళ్ళలో చోళరాజైన అపరాజితుని చేతిలో పల్లవులు పరాజయం పాలవడం వల్ల తొండమండలం చోళుల పాలనలోకి వచ్చింది.

 

క్రీస్తుశకం 614లో పల్లవ మహారాణి సోమవాయి పేరిందేవి తిరుమల శ్రీవారి ఆలయంలో భోగశ్రీనివాసుని పేరుతో శ్రీవారి రజిత విగ్రహాన్ని బహూకరించింది. ఒకటిన్నర అడుగుల ఎత్తుగల ఈ భోగ శ్రీనివాసుని మూలమూర్తివలెనే తయారుచేయించి ఆలయానికి బహూకరించి ఆ మూర్తికి అనేక ఆభరణాలను చేయించింది. ఈ భోగ శ్రీనివాస మూర్తికే నిత్యం ఆకాశగంగ నుండి తెచ్చిన జలంతో అభిషేకం జరుగుతుంది. ప్రతి బుధవారం బంగారు వాకిలి ముందు ఉన్న మహామణిమండపంలో జరిగే సహస్ర కలశాభిషేకం కూడా ఈ మూర్తికే జరుగుతుంది. సహస్ర కలశాభిషేకం జరిపేముందు ఈ భోగమూర్తికి, ఇంకా మూలమూర్తికి బంగారు తీగతో కానీ, పట్టు తీగతో కానీ అనుసంధానం చేసి భోగశ్రీనివాసునికి సహస్ర కలశాభిషేకం చేస్తారు. అందువల్ల భోగమూర్తికి జరిగే సహస్ర కలశాభిషేకం సర్వవిధాలా మూలమూర్తికి జరిగినట్లేనని అంతరార్థం.

 

ఈ పల్లవరాణియే అత్యంత భక్తితో సమర్పించిన అనేక ఆభరణాలు, గ్రామాలు, సమస్త దానాలు స్వామివారి కైంకర్యానికేనని సవినయంగా విన్నవించుకుంది. అంతే కాకుండా శ్రీ వైష్ణవ కైంకర్యాలను కాపాడిన భక్తుల పాద ధూళిని తన శిరసున ధరిస్తానని, వైష్ణవ కైంకర్యాలను కాపాడాలని పదేపదే వేడుకుంది. ఇంకా తమిళుల పెరటాసి నెలలో ఒక బ్రహ్మోత్సవం జరిగేలా కట్టడి చేసింది. దీనికి చెందిన శాసనాన్నే మనం తిరుమల ఆనంద నిలయ విమాన వేంకటేశ్వరుని కింద గల ఆలయ కుడ్యంపై చూడవచ్చు.

 

ఈ మహారాణి స్వామివారికి ఇచ్చిన కైంకర్యాలలో 23వజ్రాలు, 16 ముత్యాలు, 2పెద్ద మాణిక్యాలు, ఇంకా 3 సానపెట్టిన మాణిక్యాలు మొత్తం 5 మాణిక్యాలతో చేసిన రజిత కిరీటం, చెవులకు రెండు బంగారు మకర కుండలాలు, ఒక పగడపు కొప్పు, స్వామివారి కంఠానికి 14వజ్రాలు, 3 మాణిక్యాలు, 11ముత్యాలు, పలు ముత్యాలతో చేసిన నాలుగు హారాలు, బంగారంతో చేసిన మొలతాడు, శాయనింపు సేవకు నాలుగు మాణిక్యాలు పొదిగిన మంచం, బాహువలయాలకు సానపెట్టిన మాణిక్యాలు, 4కంటికలు, శ్రీ పాదముల మీనా ఖండములకు రెండు పెండెయములు, దానికి తోడుగా కట్టిన బంగారు మణులు, పగడాలు, ముత్యాలు మొత్తం 52పాదచయలం రెండు, ఒక పెద్ద మాణిక్యంతో వెండి ప్రభావళి వీటన్నిటికీ 47 కళంజుల బంగారంతో చేయించి స్వామివారికి సమర్పించింది. వీటి రక్షణకు తిరుచానూరు పంచాయితీకి చెందిన సభయ్యారుల అధీనంలో ఉంచేలా శాసనం చేసింది. అంతే కాకుండా తిరుచానూరు సభయ్యారుల అధీనంలో ఉన్న కొంత భూమిని మరికొంత కొని, దానికి భూమిశిస్తు లేకుండా చేసింది. ఇంతేగాక స్వామి నైవేద్యానికి అమృతపడి చేయడానికి, ఒక నందాదీపం వెలిగించడానికి, తిరుమంజనం చేయించాలని, వురట్టాసి ఉత్సవం జరిపించటానికి, ఇంకా స్వామివారి ఊరేగింపు చేయడానికి, చిత్తా నక్షత్రం రోజున అంకురార్పణ చేస్తూ 9 దినాల ఉత్సవాన్ని చేయాలని, తిరుమల ఆలయాధికారులకు ఆదేశాల్ని జారీచేస్తూ తాను దానం చేసిన ఈ భూమికి తిరుచానూరు సభయ్యార్లు శిస్తు లేకుండా చేయాలని, ఇంకా స్వామివారికి సమర్పించిన ఈ కైంకర్యాలు ఆచంద్రార్కం నిలవాలని కోరింది.

 

దీనినిబట్టి దాదాపు క్రీస్తుశకం 6వ శతాబ్దం నుండే తిరుమల శ్రీవారి వైభవం ఎంత ప్రాముఖ్యాన్ని, ప్రాచుర్యాన్ని పొంది ఉందో చెప్పవచ్చు. ఆ కాలం నాటికే చోళులు, పాండ్యులు, పల్లవులు తమతమ విభవము కొలది స్వామిని కొలిచి కానుకలు అర్పించి తరించారో తెలుస్తుంది.

 

ఒక్క ధనుర్మాసంలో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఈ భోగశ్రీనివాసమూర్తికే శయనమండపంలో పాన్పుసేవ జరుగుతూ ఉండగా రాములవారి మేడ నడవలో తాళ్ళపాక అన్నమయ్య వంశీయులోకరు స్వామికి ఎదురుగా కూర్చుని లాలిపాటను తంబుర మీటుతూ గానం చేసే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది.

 

నిత్యాయ నివద్యాయ సత్యానంద చిదాత్మనే

సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం

 

ఇంకా ఉంది....


Tirumala vaibhavam Serial-3, tirumala hills complete information, history of tirumala, detailed story of tirumala hills, tirumala balaji epic stories, hindu epics and lord venkateswara, venkatadri, anjanadri etc 7 hills, bhooloka vaikuntham tirumaladri