Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 23
?>

తిరుమల వైభవం సీరియల్ - 23

Tirumala vaibhavam Serial- 23

దేసు వెంకట సుబ్బారావు

శ్రీరామానుజాచార్యులవారి కాలంలోనే అపర శైవ భక్తుడైన కుళోత్తుంగ చోళుడు క్రిమికంటకునిగా పేరుతెచ్చుకున్నాడు. ఈయన వైష్ణవ క్షేత్రాలన్నిటినీ శైవ క్షేత్రాలుగా మార్చే ప్రయత్నం చేస్తూ రామానుజాచార్యులను అంతమొందించాలని దేశం నలుమూలలా గాలిస్తుంటాడు. అదే సమయంలో మైసూరు ప్రాంతంలో హొయసల కుళోత్తుంగ చోళుని బారిన రామానుజాచార్యులు పడకుండా నిలువరించదానికి ప్రయత్నిస్తున్నారని పెరియనంబిని, రామానుజాచార్యులవారి శిష్యులైన కూరత్తాళ్వారులను బంధించి రామానుజాచార్యుల జాడకోసం హింసిస్తాడు. అతని హింసలకు తాళలేక పెరియనంబి ఇంకా కూరత్తాళ్వార్లు తమ నేత్రాలను కోల్పోయారు. దాంతో ఆ బాధకు తాళలేక పెరియనంబి అక్కడే మరణిస్తాడు. తర్వాత చిదంబరంలోని పన్నగశయనుడైన గోవిందరాజస్వామివారిని తొలగించి అక్కడ నటరాజస్వామిని ప్రతిష్టించాడు. కుళోత్తుంగుడు. దాంతో కోపించిన శ్రీవైష్ణవులు రహస్యంగా గోవిందరాజస్వామి విగ్రహాన్ని చిదంబరం నుండి వైష్ణవ క్షేత్రమైన తిరుపతికి తీసుకొచ్చి అక్కడ పార్థసారథి ఆలయం పక్కన ప్రతిష్ఠించారు. అదే నేడు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని గోవిందరాజస్వామి విగ్రహం. కానీ చిదంబరం నుండి గోవిందరాజస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు విగ్రహం చిద్రమైంది. అందువల్ల అది ప్రతిష్ఠకు పనికిరాదని భావించడంవల్ల దాన్ని (నృసింహతీర్థం) మంచినీళ్ళ కుంట వద్ద వదిలివేశారట. ఇక్కడ వదిలివేసిన గోవిందరాజస్వామి వారి విగ్రహం చూడవచ్చు. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో పార్థసారథి ఆలయం పక్కన ప్రతిష్టించారు.

 

అదే సమయానికి కన్నడీగులైన హోయసలలు తమకు తాము స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. మైసూరు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించసాగారు. వీరు వైష్ణవాచార సంప్రదాయాలను గౌరవించేవారవడం వల్ల శ్రీరామానుజాచార్యులు కొంతకాలం కర్ణాటక ప్రాంతంలో ఆశ్రమం పొందారు. ఈవిధంగా శ్రీరంగంలోని శ్రీవైష్ణవ పీఠాన్ని శ్రీరామానుజులవారి తర్వాత చాలామంది ఆచార్యులు వైష్ణవ భక్తి ప్రచారాన్ని కొనసాగించారు. కానీ వారెవరూ తిరుమల శ్రీవారి ఆలయ అభివృద్ధికి కృషి చేసినవారు లేరు. కానీ తర్వాత కాలంలో ఈ వైష్ణవ పీఠాన్ని అధిరోహించిన ఆచార్య పురుషులు 1264 నుండి 1369 మధ్యకాలంలో శ్రీపిళైలోకాచార్యులు.

 

పిళైలోకాచార్యులు ( 1264 - 1369)

రామానుజాచార్యులవారి తర్వాత సమసమాజ సేవ చేసిన వ్యక్తుల్లో పిళైలోకాచార్యులు ఒకరు. అన్ని వర్ణాలు, జాతులు, ఒక్కటేనని అందరూ ఆ హరిణి సేవించవచ్చని ప్రచారం చేశారు. మత ఛాందసవాదుల నుండి ఎదురు దాడిని కూడా ఎదుర్కొన్న ధీరుడు, వైష్ణవ మతాచార్యులు వీరు. మత ఛాందసవాదులను, జాత్యహంకారులను ఎదిరించి భగవంతుని సేవకులే జనులంతా అని ప్రచారం చేసి ప్రజలందరి మన్ననలు అందుకున్న మహానుభావుడు. వీరి ప్రచారాలద్వారా శ్రీరంగనాథునికి అపచారం జరుగుతుందని ఛాందసవాదులు, హైందవ మతాభిమానులు అంత ఆ శ్రీరంగనాథునికి మొర పెట్టుకున్నారు. వీరి బోధనలద్వారా గురుశిష్య పరంపరకు అన్యాయం జరుగుతుందని, గురుధిక్కారం జరగరాదనీ సనాతన సంప్రదాయాలను కాపాడాలని ప్రజలందరి మధ్య అంతరాలు ఉండాలని ప్రచారం చేసే జాత్యహంకారాలను వ్యతిరేకిస్తూ వీరి రచనలు, బోధలు ఎవరూ వినకూడదని కూడా శాసిస్తారు. అయినా పట్టువీడని వీరు సర్వజనులకు శ్రీహరి మహత్యాన్ని తెలియచేయసాగాడు. అందరూ ఆ హరి శరణు కోరవచ్చని ప్రచారం చేశాడు. దీనివల్ల అనేకమంది వీరికి శిష్యులుగా చేరారు. అన్ని జాతులవారిని తన శిష్య పరంపరలో చేర్చుకున్నారు. వీరిలో ముఖ్యంగా హరిజనుడైన కోలై పిళ్ళై ఒకరు. ఈ కోలై పిళ్ళైకు కూడా అనేకమంది బ్రాహ్మణ యువకులు శిష్యులుగా చేరారు. కోలై పిళ్ళై, లోకాచార్యులవారి రచనల్లో సప్తకథై ప్రముఖమైంది. దీనికి తర్వాత కాలంలో మనవాళ మహాముని వ్యాఖ్యానం చేశారు.

 

ఈ కోలై పిళ్ళై లోకాచార్యులు వైష్ణవ సంప్రదాయాలను 18 అభంగాలుగా రచించారు. వైష్ణవ సంప్రదాయాలను రచన రూపంలో అందించిన తొలి ఆచార్యులు వీరు. అదే సమయంలో శ్రీరంగం పైకి ముస్లింల దండయాత్ర జరిగింది. మాలిక్ కాపూర్ దండయాత్ర మూలంగా శ్రీరంగనాథుని ఆలయంలోని ఉత్సవమూర్తులను తీసుకుని అనేకమంది బ్రాహ్మణులను, అర్చకులను వెంటబెట్టుకుని చీకటిలో రాత్రివేళ తిరుపతికి బయల్దేరి వెళ్ళాడు. వయసు మీద పడుతున్నా లెక్కచేయని ఆచార్యులకు అనేకమంది తోడుగా వచ్చి శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని ముస్లింల కళ్ళు కప్పి తిరుమలకు చేర్చారు. అక్కడ స్వామివారికి శ్రీరంగనాయకుల మండపం పేరుతో ఒక మండపం కట్టించి కొంతకాలం అర్చనాది కార్యక్రమాలు జరిపించారు. అదే తిరుమల ఆలయంలోని ప్రస్తుత రంగనాయకుల మండపం. మహాద్వారం దాటిన వెంటనే ఎడమవైపున ఉన్న మండపం. దీన్నే ఇప్పుడు వాహన మండపంగా పిలుస్తున్నారు. తర్వాత విషయం తెలుసుకున్న మాలిక్ కాపూర్ సేనలు పిళ్ళై లోకాచార్యులతో పాటు అనేకమంది వైష్ణవ బ్రాహ్మణులను ఊచకోత కోశారు. ఇలా అనేక కష్టనష్టాలను ఎదుర్కొని శ్రీమన్నారాయణునికి సేవలు అందించి, తమ మానప్రాణాలను అర్పించి వైకుంఠ ప్రాప్తిని పొందిన అనేకమంది మనకు చరిత్రలో గోచరిస్తారు.


వేదాంత దేశికులు

వీరు కంచిపురానికి దగ్గరలోని తూపుల్ అనే గ్రామంలో జన్మించారు. అనంతసూరి వీరి తండ్రి గొప్ప వైష్ణవ యజుర్వేద పండితులు. వీరి తల్లి తోరంబ కిడాంబి ఆచార్యులవారి మనవరాలు. కిడాంబి ఆచార్యులు శ్రీరామానుజాచార్యుల వారికి భోజన సదుపాయాలు చేసే సద్బ్రాహ్మణుడు. ఈ వేదాంత దేశికులు శ్రీవేంకటేశ్వరస్వామి వారి జన్మ నక్షత్రమైన పెరటాశి నెల శ్రవణా నక్షత్రమైనందున వీరిని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఘంటావతారంగా భావిస్తారు. వీరి తల్లిదండ్రులు వీరికి వెంకటనాతులని పేరు పెట్టారు. చిన్నతనం నుండి వీరు చదువులో అత్యంత ప్రతిభ చూపెట్టడం వల్ల వీరి మేనమామ కిడాంబి అప్పుల్లార్ వీరికి వైష్ణవ సంప్రదాయాలణు, వేద వేదాంగాలను, శాస్త్ర విజ్ఞాన లౌకిక సామాజిక విషయ పరిజ్ఞానం పట్ల వీరికున్న అవగాహన గమనించి దగ్గరుండి విద్యాబుద్దులు నేర్పారు. తర్వాత వెంకటనాథుడు వాత్స్య వరదాచార్యులు వెంకటనాథుడు గొప్ప పండితుడు అవుతాడని ఆశీర్వదించాడు. అలాగే వెంకటనాథుడు తన 20వ ఏటనే సమస్త శాస్త్రాలు, వేదాంత విషయ పరిజ్ఞానాన్ని గ్రహించి కవితార్కిక సింహ అనే బిరుదును పొందాడు.

 

తర్వాత వెంకటనాథుడు హయగ్రీవోపాసన చేసి హయగ్రీవ స్తోత్రం, రఘువీర గద్యం, గోపాల వింశతి, అచ్యుత శతకం మొదలైనవి రచించాడు. రఘువీర శతకంలోని రమ్యత, గోపాల వింశతిలోని కృష్ణలీల వర్ణన ఆధ్యాత్మిక సాహితీ రస వాహినిలో ప్రముఖమైనవి.

 

విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కంచి చేరుకుని తన రచనా బోధనా వ్యాపకంలో మునిగిపోయాడు. ఇలా ఉండగా ఒకనాడు శ్రీరంగంలోని అద్వైత పండితులు అనేకమంది శ్రీవైష్ణవులతో శాస్త్రవిషయమై వాదనకు దిగారు. అప్పటికే వృద్దులైన సుదర్శన సూరి వారి వాదనలకు సరైన వ్యక్తి వేంకటనాథుడని భావించి అద్వైత పండితులతో వాదించమని ఆహ్వానించాదు. వేంకటనాథుడు వీరిని ఓడించి వేదాంత దేశికులుగా పేరుతెచ్చుకున్నాడు. తర్వాత వీరు వేదాంత దేశికులుగా శ్రీరంగంలోనే స్థిరపడ్డాడు. అక్కడ శ్రీరంగనాథుని సేవలో శ్రీవైష్ణవ సమయాచారాలకు సరైన వివరణ ఇస్తూ ఆచరించి చూపిస్తారు.

 

వీరి రచనల్లో పాదుకా సహస్రం అనే గ్రంధం ప్రముఖమైంది. ఈ పాదుకా సహస్రం ఒకే ఒక్క రాత్రిలో రచించారు. శ్రీరామచంద్రుని పాదుకలపై 1008 పద్యాలను రచించిన ఘనత వీరికే దక్కింది. తర్వాత 1327లో శ్రీరంగనాథుని ఆలయాన్ని మాలిక్ కాపూర్ దండయాత్ర వల్ల అనేక విధాలుగా దెబ్బతింది. స్వామివారికి సమర్పించిన అనేక ధన కనక వస్తు వాహనాలను దోచుకునిపోయాడు. శ్రీరంగనాథుని రక్షణలో అనేక వందలమంది శ్రీవైష్ణవులు తనువులు చాలించారు.

 

అదే సమయంలో సుదర్శనసూరి తన ఇద్దరి కుమారులను, శృతి ప్రకాశిక అనే గ్రంధాన్ని వేదాంత దేశికులకు అప్పగించి కన్ను మూశాడు. వేదాంతసూరి వీరిని తీసుకుని సకుటుంబ సమేతంగా శ్రీరంగాన్ని వదిలి కర్ణాటక లోని సత్య మంగళంలో తలదాచుకున్నాడు. అక్కడ పరకాల మఠానికి చెందిన మొట్టమొదటి ఆచార్యులైన బ్రహ్మ తంత్ర స్వతంత్ర జీయర్ గారితో పరిచయం ఏర్పడింది. వారి బోధలకు ప్రభావితుడైన వేదాంత దేశికులు ఉత్తర భారత దేశ యాత్ర చేశాడు. యాత్రలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని దయా శతకాన్ని రచించాడు. వీరినే శ్రీవేంకటేశ్వర స్వామివారి ఘంటావతారంగా శ్రీవైష్ణవులు కొలుస్తారు. తర్వాత కొంతకాలానికి శ్రీరంగం చేరుకొని ఆచార్య పీఠాన్ని అధిరోహించాడు. 1369వ సంవత్సరం కుమార వరదాచార్యులవారి సన్నిధిలో బ్రహ్మతంత్ర స్వతంత్ర జీయర్ పాదాలచెంత విష్ణు సాయుజ్యం చేరుకున్నాడు.

 

తర్వాత కొంత కాలానికి శ్రీరంగంలోని శ్రీవైష్ణవ ఆచార్య పీఠం చేరుకున్న వ్యక్తి మనవాళ మహాముని. ఇతని కాలంలో తిరుమలలో ఆలయ కైంకర్య విధుల్లో తమ సేవలను అందించారు.

 

మనవాళ మహాముని (క్రీస్తుశకం 1370-1443)

క్రీస్తుశకం 1370 సంవత్సరంలో తమిళనాట కిడారం ప్రాంతంలో జన్మించిన మనవాళ మహాముని తొలి ఆళ్వారుళ పాశురాలకు వ్యాఖ్యానం చేసిన తొలివారు. వీరి తండ్రి వద్ద దివ్య ప్రబంధాలు, వేదాలు అభ్యసించారు. అపారమైన జ్ఞానసంపన్నులు. వీరి వైష్ణవ భక్తిని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఆళ్వారు తిరునగరి చేరి అక్కడ తిరువాయ్ మొయిప్పిలై వద్ద అనేక విషయాలపై అధ్యయనం చేశారు. వీరికి నమ్మాళ్వారుల యందు భగవద్రామానుజులవారిపై ఉన్న అనన్య భక్తికి మెచ్చి వీరిని రామానుజులవారికి ఆలయం ఆళ్వారు తిరునగరిలో నిర్మించి దాని నిర్వహణ కూడా చేయాలని నియమించాడు. భగవదాజ్ఞగా భావించి ఆలయ నిర్మాణం పూర్తిచేశాడు. వీరి కుమారునికి రామానుజ పిళ్ళై అని నామకరణం చేశాడు.

 

వీరి గురువు మరణానంతరం మనవాళ మహాముని శ్రీరంగానికి కుటుంబ సమేతంగా బయల్దేరాడు. తనతోబాటు తన సహాధ్యాయుడైన రామానుజ జీయరును కూడా శ్రీరంగానికి తీసికెళ్ళాడు.వీరిద్దరూ శ్రీరంగనాథుని ఆలయ నిర్వహణ సజావుగా నిర్వహించడానికి రామానుజాచార్యులవారి విధానాలనే అనుసరించి ఆలయాభివృద్ధి చేయసాగారు. తర్వాత వీరు గతంలో శ్రీరంగనాథుని ఆలయ నిర్వహణ చేసిన ఆచార్యుల రచనలను భద్రపరిచి మరల తిరగరాయించారు. ఆ తర్వాత కంచి, తిరుమల ఇంకా శ్రీపెరుంబుదూరు మొదలైన పుణ్యక్షేత్రాలను చూసి పూర్వపు ఆచార్య పురుషులను స్మరించుకున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించి అనంతానంద పరవశుడైన మనవాళ మహామునులు స్వామివారు కరుణా సముద్రులని భావించి స్వామి మహిమలను కొనియాడుతూ దయా శతకాన్ని రచించాడు. వైష్ణవ దివ్యక్షేత్రాలను దర్శించుకున్న మనవాళ మహామునులు శ్రీరంగానికి తిరిగివచ్చి మరల వైష్ణవ పీఠాన్ని అధిరోహించి శ్రీవైష్ణవ సంప్రదాయాలను కాపాడుతూ తన శిష్యులకు దివ్య క్షేత్ర మహిమలను తెలియచేస్తుంటాడు.

 

ఈవిధంగా వైష్ణనాచార్యులైన శ్రీమనవాళ మహామునులకు అష్టదిగ్గజాలుగా పిల్చుకునే ఎనిమిదిమంది శిష్యులున్నారు. వారే వనమాలై జీయర్, భట్టర్ పిరాన్ జీయర్, తిరువేంగడ జీయర్, కోయిల్ కంతాడై అణ్ణన్, ప్రతివాది భయకర అణ్ణన్,ఎరుంబి అప్ప, ఆప్పిలై ఇంకా అప్పిలన్. వీరంతా శ్రీవైష్ణవ సంప్రదాయాలను ప్రచారం చేసినవారే. వారిలో ప్రతివాడ భయంకర అణ్ణన్ ఒకరు.

 

ఒకనాడు మనవాళ మహాముని తన శిష్యులతో తిరుమల శ్రీనివాసుని గురించి ప్రస్తావిస్తూ తొండరడిప్పొడి ఆళ్వారులు శ్రీరంగనాథునిపై సుప్రభాతం రచించిన విధంగా తిరుమల శ్రీవారిపై కూడా ఎవరైనా రచిస్తే బాగుంటుందని ప్రస్తావించారు. అది విన్న ఆచార్య శిష్యుల్లో ఒకరైన ప్రతివాది భయంకర అణ్ణన్ తాను తిరుమలను సందర్శించి శ్రీవారిని కొలవాలని ఉందని తిరుమల యాత్రకు అనుమతి ఇవ్వవలసిందిగా మనవాళ మహామునిని కోరాడు. ఆచార్యులవారి అనుమతితో అణ్ణన్ తిరుమల చేరుకున్నాడు. ఈ ప్రతివాది భయంకర అణ్ణన్ వేదాంత దేశికుల కుమారులైన నాయన వరదాచార్యులవారి ప్రధమ శిష్యుడు కూడా. వీరి వద్ద సంస్కృతం, వేదాధ్యయనం చేసిన తర్వాత మనవాళ మహామునులకు శిష్యులుగా చేరారు. వీరు తిరుమల చేరిన తర్వాత స్వామివారి దివ్య సౌందర్యానికి మైమరచిపోయి శ్రీరంగనాథుని సుప్రభాతం లోని భావ సౌందర్య సారాన్ని ఆకళింపుచేసుకుని శ్రీవారిపై సుప్రభాతం, స్తోత్రంప్రపత్తి, మంగళాశాసనం రచించాడు. వీరు రచించిన సుప్రభాతాన్నే ఇప్పటికే తిరుమల ఆలయంలోనూ, ప్రపంచంలోని ప్రతి భక్తుని నోట, ప్రతి శుభోదయాన, ప్రతి ఇంటా, ప్రతి ఆలయాన ప్రతిధ్వనిస్తూ ఉంది. క్రీస్తుశకం 1430 సంవత్సరంలో ఈ శుభసంకల్పానికి నాంది పలికింది. ఇంకొక విశేషం ఏమిటంటే శ్రీరంగనాథునిపై రచించిన ప్రపత్తి మంగళాశాసనం ఇంతవరకూ ప్రచురణకు నోచుకోకపోవడం నిజంగానే ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది.

 

ఈవిధంగా తిరుమల శ్రీవారిని ఆళ్వారులు, ఆచార్య పురుషులు అనేక విధాలుగా కొలిచి ఆరాధించారు. ఇంతేకాకుండా తిరుమల అనేకమంది రాజులు, సామంతులు, సంస్థానాధీశులు, మహారాణులు, కవులు, గాయకులు, పండితులు, దేశ విదేశ ప్రముఖులు దర్శించిన తిరుమల సౌందర్యాన్ని, శ్రీవారి మహిమలకు అనుగ్రహానికి పాత్రులైనవారు అనేకమంది ఉన్నారు. శతాబ్దాలుగా అనేకమంది ప్రముఖులు కొలిచిన తిరువేంకటనాథుని ఆరాధనలో తరించిన మరిన్ని విశేషాలను వచ్చే భాగాల్లో ప్రస్తావిస్తాను.

 

శ్రీవేంకటా చలపతీ నీ చరణాలే సద్గతి

నిను నిత్యం సేవించే మనిషి మనసు తిరుపతి

 

ఇంకా ఉంది...

 

Tirumala vaibhavam Serial-23, tirumala glorious history and ramanujacharya, manavala mahamuni in tirumala vaibhavam, prativadi bhayankar annan, vaishnavacharya manavala mahamuni ashtadiggaja, vedanta deshika in tirumala vaibhavam