Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial-1
?>

తిరుమల వైభవం సీరియల్ - 1

Tirumala vaibhavam Serial-1

- దేసు వెంకట సుబ్బారావు

ఎదుట నెవ్వరు లేరు అంతా విష్ణుమయమే

వదలక హరిదాస వర్గమైన వారికి

ముంచిన నారాయణమర్తులే యీ జగమెల్ల

అంచిత నామములే యీ యక్షరాలెల్ల

పంచుకున్న శ్రీహరి ప్రసాదమే రుచులెల్ల

తెన్చివేసి మేలు దా దెలిశీటివారికి

చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే

భారపు యీ భూమితని పాదరేణువే

సారపు గర్మములు కేశవుని కైంకర్యములె

ధీరులై వివేకించి తెలిసేటివారికి

చిత్తములో భావమెల్ల శ్రీ వేంకటేశుడే

హత్తిన ప్రకృతి ఎల్లా నాతని మాయే

మత్తిలి యీతని కంటే మరి లేదితములు

తిత్తి దేహపు బ్రదుకు తెలిసేటి వారికి

 

సర్వదేవతా స్వరూపుడు, విశ్వాత్మకుడు, విశ్వంభరుడు అయిన శ్రీ వేంకటాచలపతిని ఆత్మసాక్షాత్కారం చేసుకుని హరిలీలా విలాసాన్ని, పరమాత్మ సౌందర్యాన్ని, ఆధ్యాత్మిక సంపదను, సంగీత సాహిత్య రూపంలో అందించిన పదకవితా పితామహుడు, హరిసంకీర్తనాకర్త, శ్రీ విష్ణు సాక్షాత్కారం చేసుకుని స్వామి సాయుజ్యం చేసిన ధన్యజీవి అన్నమయ్య.

 

కట్టెదురా వైకుంఠము కాణాచయిన కొండ, తెట్టలాయె మహిమలె తిరుమల కొండ

వేదములే శిలలై వెలిసినది కొండ యేదెస పుణ్యరాశులే యేరులైన దీకొండ

గాదిలి బ్రహ్మాది లోకముల కానల కొండ శ్రీ దేవుడుండేటి శేషాద్రి కొండ

 

అని తిరుమల గిరులను అపర వైకుంఠంగా అభివర్ణించాడు. ఆనంద తాండవం చేశాడు. ఆనంద నిలయుడిని అణువణువునా ఆరాధించి, శ్లాఘించి తరించాడు. అంతటి భూలోక వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆవాసయోగ్యంగా మారడానికి పౌరాణిక ఇతిహాసాలు, చారిత్రక ఆధారాలు కోకొల్లలు. భారాదేశపు దక్షినాపథంలో 13-41 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 70-21 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య తూర్పు కనుమల ప్రకృతి శోభల మధ్య అనంతకోటి భక్త జనుల కోర్కెలు తీర్చే ఆనందనిలయుని స్వర్ణ దామమే తిరుమల.

 

ఆదిశేషుని అవతారంగా వెలసిన తిరుమల పర్వత శ్రేణి శిరోభాగం వెంకటాద్రిగానూ, నడుమ భాగం అహోబిల క్షేత్రం, అధోభాగం శ్రీశైల క్షేత్రం వరకూ విస్తరించి ఉంది. ఈ మూడు దివ్య క్షేత్రాల్లోనూ వెంకటాద్రిపై శ్రీనివాసుడు, అహోబిలంలో నారసిమ్హుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు భక్తజనుల సేవలు గైకొని వారి కోర్కెలు తీరుస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత పొందిన తిరుమల సముద్రమట్టానికి సుమారు 2820 అడుగుల ఎత్తులో దాదాపు 100 చదరపు మైళ్ళ విస్తారంలో వ్యాపించి ఉంది.

 

ఈ తిరుమల కొండలు ఏడుకొండలుగాను, సప్తగిరులుగాను ప్రసిద్ధి చెందాయి. వీటినే ఆదిశేషుని 7 పడగలుగా కూడా కొందరు భావిస్తారు. వీటిలోని మొదటి నాలుగు కొండలు కొంచెం చదునైన ప్రదేశంగా ఉంటాయి. తర్వాత వచ్చే 5,6 కొండలు దట్టమైన లోయల్లో విస్తరించి ఉంటాయి. ఇవి అవ్వాచారి కోన ప్రాంతంలో ఉంటాయంటారు. ఈ కోన ప్రాంతం దాటితే వచ్చేది 7వ పర్వతం వెంకటాద్రి.

 

తిరుమలకు ప్రాచీనకాలంలో వేంగడం అని పేరు. తమిళంలో వడ వేంగడం అని కూడా అంటూ వచ్చారు. ఇది తమిళులకు వడగు. ఉత్తర దిశలో ఉన్నది కనుక వడగు (వెనకవైపు). అంటే వీపు అని అర్ధం. తిరుమలకు చెందిన ఈ కొండలనే శేషాచలం, వేదాచలం, గరుడాచలం, అంజనాచలం, వృషాచలం, నారాయణాచలం, వెంకటాచలం అంటారు. నారాయణాచలం తూర్పుకు రెండు మైళ్ళ దూరాన సముద్ర మట్టానికి దాదాపు 3600 అడుగుల ఎత్తులో స్వామివారి ఆలయం ఆనంద నిలయం ఉంది.

 

యుగయుగాల నుండి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ తిరుమల ప్రకృతి రమణీయ శోభల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ వెంకటేశ్వరుని ఆది విష్ణువుని అర్చామూర్తిగా భావించి సేవించి తరించే ఆధ్యాత్మిక ఆనంద ధామం. శ్రీ వేంకటేశ్వరుని దర్శించాలంటే సహజ ప్రకృతితో పులకించే అనేక పర్వత సానువులు, లోయలు, కొండ కనుమలు, అంబరాల చుంబనాలతో పులకరించే పర్వత శిఖరాలు, శాల వృక్షాలు, శిలా శాసనాలు అనేకం మార్గమధ్యంలో తారసపడతాయి.

 

సాగిలపడిన భక్తుల జ్ఞాపకాలు, భక్తుల దాహార్తిని తీర్చే చలివేంద్రాలు, గుహలు, గృహాంతరాలు, లతానికుంజ సోయగాలు, పచ్చికబయళ్ళు, కుంజరాల ఘీంకారాలు, మృగరాజుల విహారాలు, సారంగాలు, మయూరాలు, మృగాలు, లేళ్ళ సవ్వళ్ళు, మేఘమాలికల పలకరింపులు, సాధువుల ధ్యానాలు, సానువుల సాగిలాలు మనల్ని స్వాగతిస్తాయి.

 

ఇంకా అనేక తీర్థాలు, జనారన్యానికి నోచుకోని ఎన్నో ఎన్నెన్నో మనోహర జలపాతాలు, జలాశయాలు, మనోజ్ఞ మధుర మంజీరా నారీనాడ నినదాలు, గానాలు, గీతాలు, ఆలాపనలు, ఆడుకోమని, వేడుకోమని ఆర్తుల ఆవేదనా గీతాలు, గృహాంతరాలలో నిరీక్షిస్తున్న దేవతామూర్తులు, మందగమన మృగ సముదాయాలు, మనోరంజిత సుమ సోయగాలు, అణువణువునా దేవదేవుని దివ్య చక్షువులకై నిరీక్షించే వికసిత పుష్ప దరహాస వీచికలు మనకు ఆహ్వానం పలుకుతాయి. ఇన్ని ప్రకృతి రమణీయ సంపదలను తన అక్కున చేర్చుకున్న తిరుమల రాయని అర్చించే భక్తుల మనోవిన్యాసాలు, ఆధ్యాత్మిక పరవశుల్ని చేసే వెంకటరాయని వైభవం అమృతవాహిని. ఆ ఆనందామృతం ఎంత తాగినా దప్పిక తీరని ఆర్తి. అదే గోవిందుని గొప్పతనం.

 

ఆమ్లాన హృష్య దవనీతల కీర్ణ పుష్పా, శ్రీ వేంకటాద్రి శిఖరాభరణాయమౌనౌ| ఆనందితాఖిల మనోనయనౌ తవై తౌ, శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే||

 

ఇంకా ఉంది...


Tirumala vaibhavam Serial-1, details of tirumala tirupati, historical story of tirumala, detailed story of tirumala hills, tirumala balaji epic stories, hindu epics and lord venkateswara, venkatadri bhooloka vaikuntha