Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial-2
?>

తిరుమల వైభవం సీరియల్ - 2

Tirumala vaibhavam Serial-2

దేసు వెంకట సుబ్బారావు

ప్రకృతి రమణీయ విలాసాలతో పరిఢవిల్లే తిరుమల శ్రీనివాసుని గురించి అష్టాదశ పురాణాలలోనూ ప్రస్తావన ఉంది. ముఖ్యంగా 12 పురాణాలలో తిరుమల గిరుల ప్రభావాన్ని తెలియజేశారంటే మన హైందవ సంస్కృతి ఎంత ప్రాచీన మైందో, అమూల్యమైందో, అవ్యాజమైందో, ఆనందమయమైందో తెలుస్తుంది. ఈ 12 పూరాణాలలోనూ ముఖ్యంగా వరాహ పురాణం, విష్ణు పురాణం, పద్మ పురాణం, గరుడ పురాణం, వామన పురాణం, భవిష్యోత్తర పూరాణాలలో శ్రీవేంకటేశ్వర వైభవం గురించి తెలియచేశాయి. వ్యాస విరచితమైన ఈ అష్టాదశ పురాణాలలో శ్రీనివాసుని గురించి తెలియచేశాయంటే శ్రీనివాసుని గొప్పతనం, తిరుమల గిరుల ప్రాముఖ్యం తెలుస్తుంది. ఒక్కసారి చరిత్ర తిరగేసి యుగాల పర్యంతం తిరుమల గిరుల ప్రాముఖ్యం ఎలా తెలియజేశారో ఆలోకనం చేసుకుందాం.

 

కృతయుగంలో వృషభాసురుడనే రాక్షసుడు ఈ తిరుమల పర్వతంపై నివాసం ఉండేవాడు. అతడు తుంబురుకోనలోని తీర్థంలో అనేక సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశాడు. తుదకు మహావిష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఆ రాక్షసుడు మహావిష్ణువుతో యుద్ధమే తన కోరికగా తెల్పి యుద్ధానికి సిద్ధపడ్డాడు. అతని కోరిక మన్నించి మహావిష్ణువు యుద్ధం చేసి తన సుదర్శనంతో వృషభుని సంహరించాడు. వృషభుని అంతిమ కోరిక ప్రకారం అతనితో యుద్ధం చేసిన పర్వతానికి వృషభాద్రి పేరు స్థిరపడేలా వరమిచ్చాడు శ్రీహరి. అప్పటినుండి ఈ పర్వతానికి వృషభాద్రి అనే పేరు వచ్చిందని బ్రహ్మాండ పురాణంలో తెలియజేయబడింది.

త్రేతాయుగంలో పంపా సరోవర తీరాన ఆంజనేయుని తల్లి అయిన అంజనాదేవి సంతానార్దియై వాయుదేవుని గూర్చి తపస్సు చేసింది. అంతటా వాయుదేవుడు ఆమె తపస్సుకు మెచ్చి తన అంశతో ఆంజనేయుని పుత్రునిగా అనుగ్రహిస్తాడు. అంజనాదేవి తపస్సు చేసినందున ఈ పర్వతానికి అంజనాద్రి అని పేరు వచ్చింది.

 

ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఏకాంతంగా కూడియున్న సమయంలో వాయుదేవుడు విష్ణువును దర్శించదానికి వెళ్ళాడు. ఆ సమయంలో స్వామివారి అంతఃపురంలోకి ఎవ్వరూ ప్రవేశించకుండా ఆదిశేషుడు పర్యవేక్షిస్తూ ఉన్నాడు. మహావిష్ణువు దర్శనానికి వచ్చిన వాయువునకు విషయం తెలియజేసి అనుమతి నిరాకరించాడు. కానీ ఆదిశేషుని మాటలు నిర్లక్ష్యం చేసి వాయువు మందిర ప్రవేశానికి ప్రయత్నించాడు. ఆదిశేషుడు అడ్డుకున్నాడు. వాయువు తన శక్తిని ప్రదర్శించి ప్రవేశించాలి అనుకున్నాడు. ఆదిశేషువు కూడా అంతే బలంగా పోరాడాడు. వాయువు తన ప్రచండ ప్రభంజనం చూపగా, ఆదిశేషుడు మేరు పర్వతాన్ని తన సహస్ర పడగలతో చుట్టిపట్టి వాయువును అడ్డగించాడు. సమస్త దేవతలు వారి ప్రయత్నాన్ని నివారించలేకపోయారు. ఇద్దరూ ఎవరి శక్తి గొప్పదో నిరూపించుకోవాలనుకున్నారు. చివరికి వాయుదేవుని శక్తికి మేరుపర్వత ఒక భాగం విరిగి అతివేగంగా భూమిని చేరుకుంది. ఆ మేరుపర్వతపు భాగమే శేషాచలంగా పిలవబడుతోంది.

 

ఇక వామన పురాణంలో ఒక ప్రస్తావన ఉంది. పూర్వం శ్రీకాళహస్తియందు పురందర సోమయాజి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను సర్వశాస్త్రాలు, వేదవేదాంగాలు చదివిన సకలవిద్యాపారంగతుడు. అతనికి మాధవుడనే కొడుకు ఉడాయించాడు. మాధవునికి తండ్రి అయిన పురందర సోమయాజి సమస్త వేదాలు బోధించి విజ్ఞానవంతుని చేశాడు. విద్యవల్ల వినయం ప్రాప్తిస్తుందని పెద్దలంటారు. కానీ అతనికి విద్యాగర్వంవల్ల అహంకారం ప్రాప్తించింది. అనేక దురలవాట్లకు బానిస అయి ఒక చండాల స్త్రీని కామించి ఆమెతో పన్నెండు సంవత్సరాలు విహరించాడు. బ్రాహ్మణ ధర్మాలు విడిచిపెట్టాడు.

 

కొంతకాలానికి ఆ స్త్రీ మరణించింది. మాధవుడు విరక్తి చెందాడు. ఆ సమయంలో కొంతమంది క్షత్రియులు తిరుమల యాత్రకు బయల్దేరారు. వారితో మాధవుడు కూడా తిరుమల యాత్రకు బయల్దేరాడు. పరమ పవిత్రమైన తిరుమల కొండ ఎక్కి శ్రీవారిని దర్శించకపోవడంవల్ల అతని నుండి పాపపంకిలమైన దుర్గంధం వెలువడింది. అంతలో ఒక అగ్ని ప్రవేశించి ఆ పాపపంకిలాన్ని దహించివేసింది. తర్వాత ఆ మాధవుడే మరుజన్మలో చోళరాజుకు పుట్టి తొండమండలాన్ని ఏలే రాజుగా జన్మించేలా శ్రీవారు మాధవుని అనుగ్రహించాడు. పాప పంకిలాన్ని పోగొట్టిన పర్వతం కనుక ఈ తిరుమల గిరికి వేంకటాచలం అని పేరు వచ్చినట్లు వామన పురాణంలో ఉంది.

 

వరాహపురాణంలో తిరుమల గురించిన ప్రస్తావన ఈవిధంగా ఉంది. నైమిశారణ్యంలో సమావేశమైన మునులకు అపర వేదవ్యాసుడైన సూతుడు భువిపై వెలసిన శేషాచలం శ్రీ మహావిష్ణువుకు క్రీదాద్రిగా మారిన వైనం గురించి ఈ విధంగా వివరిస్తాడు. బ్రహ్మకు 8 వేల యుగాల కాలం ఒకరోజు. అందులో 4 వేల యుగాల కాలం ఒక పగలు, మరో 4 వేల యుగాల కాలం ఒక రాత్రి. ఇలా ఒక రెండువేల చతుర్యుగాల కాలం గడిస్తే ప్రళయం సంభవిస్తుంది. ఈ కాలంలో సూర్యుడు ప్రచండ భానుడై ప్రకాశిస్తాడు. భూమిపై తీవ్ర క్షామ పరిస్థితులు వర్షాభావం కలుగుతుంది. తపోధనులు ఊర్ధ్వ లోకాలకు వెళ్ళి తలదాచుకుంటారు.

 

ఇత్థం వృషాచలపతే రిహ సుప్రభాతం, యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః

తేషాం ప్రభాత సమయే స్మృతి రంగభాజాం, ప్రజ్ఞాం పరార్ధ సులభం పరమాం ప్రసూతే

 

ఇంకా ఉంది....

 

Tirumala vaibhavam Serial-2, tirumala tirupati complete information, history of tirumala, detailed story of tirumala hills, tirumala balaji epic stories, hindu epics and lord venkateswara, venkatadri bhooloka vaikuntha