Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 20
?>

తిరుమల వైభవం సీరియల్ - 20

Tirumala vaibhavam Serial- 20

దేసు వెంకట సుబ్బారావు

అవిశ్రాంతంగా శ్రమించినమీదట పుండరీకాక్షుల శిష్యులైన శ్రీరామమిశ్రులు (మనక్కాల నంబి) యమునాచార్యులను తిరిగి శ్రీరంగానికి తీసుకువచ్చి విశిష్టాద్వైత వేదాంతులకు నాయకునిగా చేశాడు. వీరి ప్రతిభాపాటవాల గురించి తెలిసిన ఇతర వైష్ణవులైన తిరుక్కొట్టియూర్, తిరుక్కచ్చినంబి, తిరుమలై ఆండాన్, పెరియ తిరుమల నంబి మొదలైనవారు యమునాచార్యులకు శిష్యులయ్యారు. ఆ తర్వాత ఒకసారి యమునాచార్యులు కంచి వెళ్ళాడు. అక్కడి శ్రీరామానుజాచార్యులను తిరుక్కచ్చినంబి యమునాచార్యులకు పరిచయం చేశాడు. రామానుజులవారు శ్రీమహావిష్ణువును సరిగా అర్ధం చేసుకున్నవానిగా, ఆయన ప్రతిభా విసేషాలవల్ల భావించాడు యమునాచార్యులు.

 

రామానుజాచార్యులవారితో ఎక్కువ సమయం గడపలేని యమునాచార్యులు శ్రీరంగం తిరిగి చేరుకున్నాడు. శ్రీరంగం చేరుకున్న యమునాచార్యులకు రానురాను ఆరోగ్యం సన్నగిల్లింది. దానితో యమునాచార్యులు, పెరియనంబిని పిలిచి కంచి వెళ్ళి శ్రీరామానుజాచార్యులను శ్రీరంగం తీసుకురమ్మని పంపాడు. కంచి వెళ్ళి రామానుజాచార్యులను వెంటబెట్టుకుని వచ్చేసరికి యమునాచార్యులు శ్రీరంగనాథుని చేరుకున్నాడు. కానీ రామానుజాచార్యులవారు చేయవలసిన మూడు పనులను చేసిపెట్టవలసినదిగా తన శిష్యులద్వారా తెలియజేశాడు యమునాచార్యులు. విషయం తెలిసిన రామానుజాచార్యులు, యమునాచార్యులు కోరిన విధంగా పెరియనంబిని వైష్ణవ పీఠాధ్యక్షునిగా చేయడం, నమ్మాళ్వారులు రచించిన తిరువాయ్ మొళికి వ్యాఖ్యానం చేయడం ఇంకా ఉపనిషత్తులకు, వేదాంత సూత్రాలకు, భగవద్గీతకు భాష్యం చెప్పడం. ఈ మూడు పనులను నిర్విఘ్నంగా పూర్తిచేసిన రామానుజులు తిరిగి కంచి చేరుకున్నాడు.

 

పెరియనంబికి మహాపూర్ణులని కూడా పేరు. వేదాలు, ప్రబంధాలకు అక్షరరూపం ఇచ్చినందున వీరికి ఆ పేరు వచ్చిందని అంటారు. వీరు 997 లో జన్మించి 105 సంవత్సరాలు జీవించి పరాంకుశ దాసరులుగా పేరుగాంచారు. వైష్ణవ సంప్రదాయాలను పరిరక్షించి, ప్రచారం చేసిన మహామహులు. వీరు యమునాచార్యులవారి శిష్యులు. వైష్ణవ పీఠానికి అధ్యక్షులైన పిదప రామానుజాచార్యులను కలవాలని అనుకున్నారు. అలాగే వీరిని కలవాలని కూడా రామానుజాచార్యులు అనుకున్నారు. అనుకోకుండా వీరిద్దరూ మధురాంతకం అనే ఊరిలో కలుసుకున్నారు. అక్కడ వీరు వేదాంత విషయాలపైన, వైష్ణవ సంప్రదాయాలపైన, వైష్ణవ భక్తి ప్రచారం ఎలా చేయాలనే విషయాలపైన చర్చించుకున్నారు. అలాగే పెరియనంబి వద్ద శ్రీరామానుజాచార్యులు ప్రబంధాల గురించి, వాటి వైశిష్ట్యం గురించి తెలుసుకున్నాడు. ఒకసారి శ్రీరంగనాథుని రథం తిరువీధుల్లో ఉన్న పెరియనంబి ఇంటివద్దకు వచ్చి తర్వాత ముందుకు కదలక మొరాయించిందట. అంతట పెరియనంబి రథంలోని స్వామివారికి హారతి ఇవ్వడంతో రథం ముందుకు సాగిపోయిందట. స్వామి భక్తుల పట్ల చూపించే అవ్యాజమైన ప్రేమకు ఇదే నిదర్శనం.

 

వీరి కాలంలోనే క్రిమికంటకుడైన చోళరాజు కుళుత్తోంగ చోళుడు శైవాభిమాని. ఈతడు రామానుజాచార్యులను బంధించాలని ప్రయత్నించాడు. వైష్ణవ ప్రగతిని నిరోధించ దలచిన కుళుత్తోంగ చోళుడు వైష్ణవ ప్రచార సారధి అయిన రామానుజాచార్యుల కొరకై దేశమంతా గాలించసాగాడు. అప్పుడు పెరియనంబి ఇంకా కూరత్తాళ్వార్లు కుళుత్తోంగ చోళుని వద్దకు వెళ్ళి నిరోధించారు. కానీ కుళుత్తోంగ చోళుడు ఆగ్రహావేశుడై పెరియనంబి ఇంకా కూరత్తాళ్వార్ల కళ్ళు పీకించాడు. అంధులైన వీరు శ్రీరంగానికి చేరుకునే లోపునే పెరియాళ్వార్ల ఆరోగ్యం క్షీణించి విష్ణు పాదాలను చేరాడు. ఈవిధంగా శ్రీవైష్ణవ సంప్రదాయాలను రక్షించే నెపంతో శ్రీరామానుజులను, శ్రీరంగంలోని శ్రీవైష్ణవులను శ్రీరంగనాథునికి దూరం కాకుండా కాపాడాడు పెరియనంబి. తర్వాత శ్రీవైష్ణవ సంప్రదాయ పరిరక్షణకు శ్రీకారం చుట్టాడు భగవద్రామానుజాచార్యులు. వీరిని ఆదిశేషుని అవతారంగా భావిస్తారు. శ్రీమహావిష్ణువును అనవరతం సేవించే ఆదిశేషుని అంశగా శ్రీరామానుజులు తమిళనాట శ్రీపెరుంబుదూరులో జన్మించారు.

 

తిరువేంకటనాథుని దివ్య సౌందర్యారాధనలో తరించిన భక్తవరేణ్యులలో భగవద్రామానుజులు ఒకరు. వీరి గతజన్మ వృత్తాంతం గురించిన ఒక ఐతీహ్యం బహుళ ప్రచారంలో ఉంది. ఆళ్వారులలో అగ్రగణ్యులైన నమ్మాళ్వారుల శిష్యులు నమ్మాళ్వారుల విగ్రహాన్ని ఒకటి తయారుచేయడానికి ప్రయత్నించారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా నమ్మాళ్వారుల విగ్రహం బదులు వేరొక సన్నాసి విగ్రహం రూపుదిద్దుకునేది. డానికి ఎంతో ఆశ్చర్యపోయిన నమ్మాళ్వారుల శిష్యులు ఆ సన్యాసి విగ్రహం నమ్మాళ్వారులకు చూపించారు. అంతట నమ్మాళ్వారులు ఆ విగ్రహాన్ని చూసి అది సరైనదేనని, భవిష్యత్తులో రానున్న వైశానవ ఆచార్యులదని, రూపం వేరైనా భావం మాత్రం ఒకటేనని వివరించి అక్కడే ఉన్న మధురకవి ఆళ్వారులకు ఇచ్చాడు. దీన్నిబట్టి రామానుజాచార్యులవారి జన్మరహస్యాన్ని నమ్మాళ్వారుల కాలంనాడే వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది. అంతేకాకుండా కృతయుగంలో మహావిష్ణువుకు పానుపైన ఆదిశేషునిగా, త్రేతాయుగంలో శ్రీరాముని తమ్ముడు లక్ష్మణునిగా, ద్వాపరమున శ్రీకృష్ణుని సోదరుడు బలభద్రునిగా కలియుగంలో రామానుజులుగా (శ్రీరామచంద్రుడు, శ్రీరంగనాథుని సోదరుడు) జన్మించారట.

ఒకసారి శ్రీరామానుజాచార్యులవారి కాలానికి భారతావని పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. క్రీస్తుపూర్వం 550 నాటికి ఉత్తర భారతదేశంలో కేవలం రెండు మతాలు మాత్రమే ప్రజల్లో ముమ్మరంగా ప్రచారంలో ఉండేవి. అవి ఒకటి బౌద్ధమతం రెండు జైనమతం. ఈ రెండు మతాలు కూడా హిందూమతం నుండి వేరుపడి క్షత్రియ రాజులైన గౌతమబుద్ధుడు ఇంకా మహావీరుడు స్థాపించిన బౌద్ధమతం, జైనమతంగా ఏర్పడి ప్రజలకు చేరువ కాసాగాయి. ఈ రెండు మతాలు అప్పటి హైందవ రాజులు అశోకుడు, కనిష్కుడు బౌద్ధమతం, జైనమతాలను దేశమంతా ప్రచారంలోకి తెచ్చారు. వేదాల ఔన్నత్యాన్ని పక్కకి నెత్తి, అహింసా వాదాన్ని ప్రచారంలోకి తెచ్చి జీవహింసను అరికట్టాలని ప్రచారం సాగించారు. అలా కొన్ని దశాబ్దాలు బహుళ ప్రముఖంగా ఉన్నత స్థాయిలో ఉన్న బౌద్ధమతం భారతదేశపు సరిహద్దు దేశాలైన శ్రీలంక, బర్మా, టిబెట్, చైనా, జపాన్, థాయ్ లాండ్ ఇంకా కొన్ని ఆసియా దేశాల్లో బాగా విస్తరించింది. తర్వాత భారతదేశం గుప్తుల అధీనంలోకి వచ్చింది. దీనితో తిరిగి బౌద్ధమత ప్రాభవం తగ్గి సంస్కృత భాష బాగా ప్రాచుర్యంలోకి వచ్చి హైందవ మతం ఉన్నత స్థితికి రాసాగింది.

 

తర్వాత తొమ్మిదవ శతాబ్దంలో శ్రీ ఆదిశంకరాచార్యులవారు జన్మించారు. వీరి రాకతో భారతదేశంలో వేళ్ళూనుకుపోయిన బౌద్ధమతం, జైనమతం ప్రజలనుండి దూరం కాసాగింది. శ్రీఆదిశంకరాచార్యుల గురుదేవులైన గోవిందపాదుల ఆశీర్వచనంతో భారతదేశమంతా పర్యటించి అనేక మఠాలను ఏర్పాటు చేశారు. తర్వాత 16వ ఏట శృతి, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పారు. వీరు రచించిన అనేక రచనల్లో శ్రీమన్నారాయణుని మీద చేసిన భజగోవిందం, కరావలంబ స్తోత్రం ప్రముఖమైనవి. ఇంకా రామానుజాచార్యులవారి కాలానికి వస్తే దక్షిణ భారతదేశంలో తమిళనాట భూతపురి అనే ప్రాంతం ఉండేది. అక్కడ వైష్ణవ భక్తుడైన కేశవదీక్షితులు అనే బ్రాహ్మణుడు నివసించేవారు. వీరినే కేశవ సోమయాజులని కూడా పిలిచేవారు. అదే ప్రాంతానికి చెందిన తిరుమలనంబి అనే శ్రీవైష్ణవుడు నివసించేవాడు. ఈ తిరుమల నంబినే శ్రీశైల పూర్ణుడు అని కూడా పిలిచేవారు. వీరికి ఇద్దరు చెల్లెళ్ళు. శ్రీశైల పూర్ణుడు యమునాచార్యులవారి శిష్యులు. వీరినే పెరియ తిరుమల నంబి అని కూడా పిలిచేవారు. వీరి నివాసం తిరుమల క్షేత్రమైనా యమునాచార్యులవారి ముఖ్య అనుచరులలో ఒకరిగా పేరుంది. తిరుమలనంబి సోదరి అయిన కాంతిమతిని కేశవ సోమయాజులకు ఇచ్చి వివాహం చేశారు. భగవదనుగ్రహం లేనందువల్ల కేశవ సోమయాజులకు, కాంతిమతికి సంతానయోగం చాలాకాలంవరకూ కలగలేదు. యమునాచార్యులవారి మరొక శిష్యులు తిరుకచ్చినంబి. వీరి నివాసం కంచి. శ్రీవైష్ణవాచార్యులుగా పేరుగాంచిన తిరుకచ్చినంబి ఉండేవారు. వీరినే కంచిపూర్ణులు అని కూడా పిలిచేవారు. వీరు తరచూ కంచి నుండి పూనమల్లి లోని వైష్ణవాలయానికి వెళ్ళేవారు. దారిలో ఉన్న శ్రీపేరుంబుదూరు చిరపరిచితంగా ఉండేది. తిరుకచ్చినంబి తరచూ చేన్నకేసవాలలో వైష్ణవాచార్యులతోనూ, పండితులతోనూ గోష్టి నిర్వహించేవారు. సత్సాంగత్యం ద్వారా వైష్ణవ భక్తులతో సమావేశం ఏర్పరచి వైష్ణవ భక్తి ప్రచారం ఎలా జరుగుతుందో వివరాలు తెలుసుకునేవారు. ఇలా శ్రీకంచిపూర్ణులు శ్రీపెరంబుదూర్లోని వైష్ణవులతో బాగా పరిచయం ఏర్పరచుకున్నారు. వీరు వైష్ణవబ్రాహ్మణులు కాకున్నా వీరికున్న వైష్ణవ భక్తివల్ల అనేకమంది శ్రీవైష్ణవులు వీరికి శిష్యులుగా మారారు. అలా ఉన్న సమయంలోనే పెరుంబూరులో ఉన్న కేశవసోమయాజులు సంతానార్థియై తిరుకచ్చినంబిని కలిసి తన బాధను తెలియజేశాడు. అప్పుడు తిరుకచ్చినంబి కేశవసోమయాజులు తిరువాలికేని అని ఊరిలో యాగం చేస్తే సంతానయోగం ఉంటుందని సలహా ఇచ్చాడు. తిరుకచ్చినంబి సలహా మేరకు కేశవసోమయాజులు సతీసమేతుడై తిరువాలికేని ప్రాంతంలో సంతానార్థియై యాగం చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి చిత్రై మాసాన గురువారం క్రీస్తుశకం 1017, శుక్లపంచమి, ఆర్ద్రా నక్షత్రాన ఒక మగ శిశువు జన్మించాడు.

 

కాంతిమతి సోదరుడు శ్రీశైల పూర్ణుడు యమునాచార్యులవారి శిష్యులు. శ్రీశైల పూర్నులు తన చెల్లి అయిన కాంతిమతికి శ్రీవైష్ణవ భక్తిగురించి, వేదవాగ్మయం గురించి, ఆళ్వారుల భక్తి తత్వాన్ని ఆమెకు వివరించేవాడు. అలా ఆమెకు కూడా వైష్ణవ భక్తి తత్వం అలవడింది. ఆ విధంగా కాంతిమతికి అప్పుడప్పుడు చెప్పే సంగతులవల్ల యమునాచార్యులవారి గురించి, ఆయన శిష్యుల గురించి చెప్తూ కంచి పూర్ణులైన తిరుకచ్చినంబి గురించి కూడా చెప్పేవారు. తద్వారా ఆమెకు తిరుకచ్చినంబి గురించి సద్భావన కలిగి వారిని కలవాలని అనుకునేది. వీరు ఒకనాడు శ్రీపెరుంబదూరు వచ్చి తన సోదరిని, ఆమె కుమారుని చూశాడు. ఆమె కుమారుని చూసిన వెంటనే నమ్మాళ్వారులు చెప్పినట్లుగా ఆ బాలుడు ఉండటం గమనించి ఆ బాలునికి రామానుజులు అని నామకరణం చేశాడు. తర్వాత ఆ బాలునికి నామకరణం, అన్నప్రాసన, ఉపనయనం చేసి విద్యాభ్యాసం చేయించాడు. శ్రీరామానుజులు కూడా తన తల్లిదండ్రులవద్ద వేదాధ్యయనం చేశాడు. తరచూ తిరుకచ్చినంబి శ్రీపెరుంబుదూరులోని వైష్ణవ ఆలయానికి రావడంవల్ల తల్లి కాంతిమతి చెప్పినందువల్ల తిరుకచ్చినంబి సలహా మేరకు యాగం చేసినందువల్ల తాను జన్మించానని భావించి, శ్రీరామానుజులు తిరుకచ్చినంబితో అనుబంధం ఏర్పరచుకోవాలని అనుకునేవాడు. కానీ ఎప్పుడూ కుదిరేది కాదు.

 

అలా కాలం గడుస్తుండగా తన పదహారవ ఏట రామానుజాచార్యులు వివాహం చేసుకున్నారు. తన వివాహం అయిన కొద్దిరోజులకే తన తండ్రి కాలం చేశారు. పితృకర్మలు చేసిన అనంతరం శ్రీరామానుజాచార్యులు తిరుకచ్చినంబిని కలిసి తన భవిష్యత్తు నిర్ణయించుకోవాలని అనుకున్నారు. చిన్నతనంనుండి తన తల్లి, ఇంకా మేనమామ మహా పండితుడైన కంచి పూర్ణులు తిరుకచ్చినంబి తనకు సరైన మార్గం చూపగలరని ఆయన రాకకోసం శ్రీపెరుంబుదూరులో ఎదురుచూడసాగాడు.

 

అలా ఎదురుచూడగా ఒకనాడు తిరుకచ్చినంబి చెన్నకేశవాలయంలో పండితగోష్టిలో ఉన్న రామానుజాచార్యులను తిరుకచ్చినంబి దూరంనుండి చూసి శ్రద్ధగా ఆలకిస్తున్న అతని ధోరణిని చూసి వివరాలు అడిగాడు. తాను కేశవసోమయాజులు, కాంతిమతిల కుమారుడినని, ఇటీవలనే తన తండ్రిగారు పరమపదించారని వివరిస్తూ తన రాకకోసం తన తల్లిగారు ఎదురుచూస్తున్నారని, తప్పక తమ ఇంటికి వచ్చి ఆధిపత్యం స్వీకరించాలని ప్రార్ధించాడు. అతని అభ్యర్ధన మన్నించిన తిరుకచ్చినంబి రామానుజాచార్యులవారి ఇంటికి వెళ్ళి వారి తల్లిగారిని యోగక్షేమాలు విచారించాడు. భోజనం చేసిన తర్వాత తాను బ్రాహ్మణేతరుడు కనుక తాను తిన్న తన ఆకును తానే తీయబోగా రామానుజుల తల్లి వారించి తిరుకచ్చినంబి శ్రీవైష్ణవ భక్తుల్లో ఉన్నతులను, శ్రీవైష్ణవసేవలో తరిస్తున్నందువల్ల వీరికి కుల, మత పట్టింపులు పాటించనవసరం లేదని చెప్పి రామానుజులవారిచే ఆ ఆకును తీసివేయించి, శుభ్రపరిచి, చిన్నవాడైన శ్రీరామానుజులకు తన పవిత్ర హస్తాలతో మంగళాశాసనం చేయాలని కోరింది. అదే సమయంలో రామానుజాచార్యులు పద్మాసనం వేసుకుని తిరుకచ్చి నంబి పాదాల చెంత భక్తివినమ్రతతో నమస్కరిస్తూ కూర్చోవడం చూసి ముచ్చటపడి, ఆమె కోరిక మన్నించి తిరుకచ్చినంబి శ్రీరామానుజులకు మంగళాశాసనం చేసి ఆశీర్వదించారు. తర్వాత రామానుజాచార్యులకు వైష్ణవ భక్తి మార్గాన్ని తెల్పుతూ తిరుప్పణి ఆళ్వారుల కథను వివరించాడు. శూద్రజాతీయుడైన తిరుప్పణి ఆళ్వారుల భక్తి తత్వాన్ని వివరించిన తర్వాత తిరుకచ్చినంబి మిగిలిన ఆళ్వారుల దివ్య వైభవాన్ని వివరించాడు. వారి పాశురాలను, ప్రబంధాల ఔన్నత్యాన్ని, ఆళ్వారులలో ఉన్న విష్ణు సంశ్లేష భావాన్ని వివరించాడు. సర్వం విష్ణుమాయం జగత్ అని బోధించాడు. వైష్ణవుడంటే విష్ణువుకు సర్వం అర్పించేవాడు అని చెప్తాడు. సర్వ శక్తి సమన్వితుడు విష్ణువు అని వివరించాడు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నాడు. ఈవిధంగా శ్రీరామానుజులకు తిరుకచ్చినంబికి విడదీయరాని అవినాభావ సంబంధం ఏర్పడింది.

 

ఇంకా ఉంది...

 

Tirumala vaibhavam Serial-20, tirumala history and yamunacharya, sri rama mishra and ramanujacharya, Thirukachi nambi and ramanuja, thirukachi nambi and perambuduru vaishnava temple