Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 11
?>

తిరుమల వైభవం సీరియల్ - 11

Tirumala vaibhavam Serial- 11

దేసు వెంకట సుబ్బారావు

 

తొందరడిప్పొడి ఆళ్వారులు (విప్రనారాయణ)

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటాచలపతిని మేల్కొలిపే సుప్రభాతం అనేక కోట్లమంది నిరంతరం పారాయణం చేసే దివ్యామృత స్తోత్రావళి. ప్రకృతి సైతం పరవశించే విధంగా భక్తితో తాదాత్మ్యం చెంది రచించిన ఆ అమృత ధారావళికి మూలమైన తిరుపళ్ళి ఎళుచ్చిని రచించినది విప్రనారాయణ అని పిలవబడే తొందరడిప్పొడి ఆళ్వారులు. తొందరడిప్పొడి అంతే భక్తాంఘ్రి రేణువు అని అర్ధం. వీరు తమిళనాట బ్రాహ్మణ వంశంలో తిరుమందనగుడి అనే ప్రాంతంలో మార్గశిరమాసం, ధనుర్లగ్నం, జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించారు. వీరిని శ్రీమహావిష్ణువు ధరించే వాడిపోని, వీడిపోని నిత్య సుగంధభరితమైన వైజయంతీమాల అవతారంగా కొలుస్తారు.

 

విప్రనారాయణ చిన్నతనం నుండి శ్రీరంగనాథుని అత్యంత భక్తిపారవశ్యంతో కొలిచేవాడు. శ్రీరంగనాథుడే తన ఆరాధ్యదైవంగా భావించి అతని చెంతనే తన జీవితం గడపాలని 16వ ఏట ఇల్లు వదిలి శ్రీరంగం చేరుకున్నాడు. అక్కడ ఆలయ ప్రాంగణంలో పెద్ద తులసివనంలో ఒక పర్ణశాలను నిర్మించుకుని స్వామివారిని నిత్యం తులసిమాలలతో అర్చించేవాడు. నిత్యం ఈ విప్ర యువకుడు అర్పించే తులసిమాలలనే స్వామివారికి అలంకరించేవారు అర్చకులు. ఆ తులసివనమే తన నివాసం కనుక ఆ తోటను భక్తిశ్రద్ధలతో నిర్వహించేవాడు. అనేక రకాల పూలమొక్కలను అందమైన ఆ వనంలో తులసి మొక్కలతో పాటు పెంచి తులసితో పాటు వివిధ పూలను కూడా చేర్చి మాలలు కట్టి వాటిని స్వామివారి అలంకారానికి అందించేవాడు. బ్రహ్మచర్య దీక్షలో ఉన్న విప్రనారాయణ, ఆ గుడికి వచ్చే స్త్రీమూర్తులందరినీ మాత్రుసమానులుగా భావించి ఎంతో గౌరవంగా చూసేవాడు. ఆలయానికి వచ్చే భక్తులకు విప్రనారాయణుని ప్రాపకంలో ఉన్న ఈ అందమైన పూలవనాన్ని చూడటం కూడా ఒక వంతుగా మారింది. ఆ వనాన్ని చూస్తున్న భక్తులకు విప్రుడు సర్వసంగ పరిత్యాగిలా భక్తిపారవశ్యంతో తులసిమాలలు కడుతూ తన్మయత్వంలో మునిగి కనిపించేవాడు.

 

ఈ విప్ర యువకుడైన విప్రనారాయణుడు అనునిత్యం భక్తిపారవశ్యంతో చేసే స్వామివారి సేవలకు ఆలయ పాలకులు, భక్తులు కూడా ఎంతో సంతోషించి విప్రనారాయణునికి ప్రత్యేక గౌరవాన్ని ఇవ్వసాగారు. సర్వసంగ పరిత్యాగిలాగా నిరంతరం భక్తి పారవశ్యంతో ఉండి స్వామివారిపై తాను పాడే పాటలకు అక్కడికి విచ్చేసే భక్తులు, ఆలయ సిబ్బంది ఎంతో భక్తి పారవశ్యంతో పులకించిపోయేవారు.

 

ఇది ఇలా ఉండగా ఆ ఆలయసందర్శనకు దేవదేవి అనే వేశ్యకాంత తన పరివారంతో వచ్చింది. ఆలయదర్శనం, స్వామి సేవనం పూర్తయిన తర్వాత సమీపంలోని పుష్పవనంలో కాసేపు విహరించాలని తలచి తన సోదరితో ఆ వనానికి చేరుకుంది. అక్కడ రకరకాల పూలమొక్కల సౌందర్యానికి పరవశం చెందింది. అంతలో బంగారు వన్నెతో అత్యంత సౌందర్యంతో యువతుల మనసులను కట్టిపడేసే అందంతో అపర మన్మథుని రూపంలో వెలిగిపోతున్న విప్రనారాయణ భక్తి పారవశ్యంతో మాలలు కడుతూ వీరి రాకను ఎంతమాత్రం గమనించలేదు. తమ రాకను గమనించక, తనను ఆరాధించాలానే ధ్యాస కూడా లేని ఆ విప్రనారాయణుని తాదాత్మ్యం చూసి ఆశ్చర్యపోయింది దేవదేవి. తర్వాత అతని గురించి విన్న దేవదేవి తాను ఎలానైనా ఆ విప్ర యువకుని వశం చేసుకోవాలని ఆలోచించింది. అతని నిర్మల నిశ్చల భక్తిని పరీక్షించి తన సౌందర్యంతో వశం చేసుకోవాలని భావించింది. కానీ ఎలా?!

 

మరునాడు తనవారిని తమ ఊరికి పంపి తాను మాత్రం విప్రనారాయణుని కోసం అక్కడే ఉండిపోయింది. తర్వాత తాను కూడా విప్రాంగన మాదిరిగా వేషధారణ చేసుకుని ఆలయ ఉద్యానవనంలో ప్రవేశించింది దేవదేవి. అక్కడ పూలమొక్కలకు నీరు పోస్తున్న విప్రనారాయణుని వద్దకు చేరి, తాను ఒక అనాధ యువతినని, శ్రీరంగనాథుని సేవలో తరించాలని ఉందని, తనకు కూడా పూల మాలలు కట్టడం వచ్చని, తనకు ఈ వనంలో ఆశ్రయం ఇస్తే తను కూడా స్వామిసేవతో తరిస్తానని వేడుకుంది. ఆమె మాటలు విన్న విప్రనారాయణ కరిగిపోయి, భగవత్ సేవకు అందరూ అర్హులేలని భావించి తన కుటీరానికి దగ్గర్లోనే దేవదేవికి కూడా మరొక కుటీరాన్ని ఏర్పాటు చేశాడు. నిష్కల్మష యోగిపుంగవునికి అందరియందు సమదృష్టియే ఉంటుంది కదా! కానీ దేవదేవి తన యుక్తి పారిందని ఇక విప్రుని లోన్గాతీసుకునే సమయం అట్టే పట్టదని సంతోషించింది. యద్భావం తద్భవతి. ఎవరి ఆలోచన వారిది. మాధవా! కేశవా! గోవిందా! నీ లీలలు అమోఘం. కాంతా కుయుక్తులకు విప్రనారాయణుడు, అపర భక్తుడు, సత్సీలుడు, స్వామి లీలలకు అతీతుడు కాదు కదా!చూద్దాం.

 

ఒంటరి అయిన విప్రనారాయణునికి ఇప్పుడు తోడు దొరికింది. దేవదేవి చూపించే వినమ్రతకు, భక్తికి ముగ్ధుడైపోయాడు. కలిసి పూలు కొస్తాడు. కలిసి మాలలు కడుతున్నాడు. ఆమె చూపే హొయలన్నీ భక్తి పారవశ్యంగానే భావించాడు. కలిసి గళం కలిపి భక్తిగీతాలు పాడుతున్నాడు. వీరి పాటలకు పూలు పరవశిస్తున్నాయి. ప్రవరాఖ్యుని గనుక వరూధిని వశం చేసుకో ప్రయత్నించినట్లు దేవదేవి చర్యలు విప్రనారాయణుని ఎంతో సన్నిహితంగా మెలిగేందుకు దారితీస్తున్నాయి. కానే ఇదేమీ అర్ధంకాని విప్రుడు అంతా భక్తిపారవశ్యం అనే భ్రమలోనే ఉండి ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా శ్రీరంగనాథుని సేవలో పాల్గొంటున్నాడు. ఇద్దరూ కలిసి అర్పించే మాలలతో రంగనాథుడు మరింత శోభిస్తున్నాడు.

 

ఒకనాటి మధ్యాహ్నం విప్రనారాయణ తన కుటీరంలో అరుగుమీద పూలమాలలు కట్టడంలో నిమగ్నమై ఉన్నాడు. అంతలో ఉన్నట్లుండి ఆకాశం మేఘావృతం అయింది. చిరుగాలులు ఈదురు గాలులయ్యాయి. చిరుజల్లు కుండపోత వర్షంగా మారింది. మలయమారుతం చండప్రచండంగా వీచసాగింది. అనుకొని ఈ వాతావరణం అక్కడి పరిస్థితిని అంతా అయోమయం చేసింది. ఆ తోటలో వేరే పనిలో ఉన్న దేవదేవి పరుగుపరుగున విప్రుని కుటీరంలోకి వచ్చింది. జడివాన కావడంతో ఆమె ఒళ్ళు పూర్తిగా తడిచిపోయింది. కుటీరంలోని విప్రనారాయణుని గమనించకుండా కుటీరంలో ప్రవేశించి తడిచిన చీరను తీసి కుటీరంలో చుట్టూ ఆరవేసింది. అసలే ఆమె సౌందర్యరాశి. కన్నార్పకుండా చూడాలనిపించే అందం. ఇక తడిచిన సగం దుస్తుల్లో ఆమె అందం ఎంత మందభాగ్యుడినైనా చలింపచేసేలా ఉంది. విశ్వామిత్రుడే వివశుడైన పరిస్థితి అది. సర్వం సుమశరుని అధీనంలో ఉంది. ఇంతలో తల పైకి ఎత్తి కుటీరంలోనికి ఎవరు వచ్చారా అని తల ఎత్తి చూసిన విప్రనారాయణునిలో సహజ యవ్వన కోరికలు ప్రజ్వలించి, సుమశరునకు వివశుడై ఒక్కసారిగా దేవదేవిని వద్దకు వెళ్ళి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆమె అద్భుతమైన అందాన్ని ఆరాధిస్తూ తనను వివాహం చేసుకోమని మరీమరీ ప్రార్థించాడు.

 

ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపోయిన దేవదేవి మనసులో తన వ్యూహం ఫలించిందని భావించి తన సహజ లక్షణాలను చూపిస్తూ బిగ్గరగా నవ్వుతూ ''స్వామీ నన్ను వివాహం చేసుకోవాలంటే నీవద్ద ఏముంది? ప్రేమ మాత్రమే వివాహానికి అర్హత కాదుగదా. మీ ప్రేమను నిజమని నిరూపించుకోడానికి ఈ అమృత వర్షిణికి ఏమిస్తావు?'' అని రెట్టించింది. అంతేకాదు, ''కనీసం వేయి బంగారు వరహాలు కూడా ఇవ్వలేని వరుణ్ణి ఎలా చేసుకోను?'' - అని వగలుపోతూ అక్కడినుండి వడివడిగా వెళ్ళిపోయింది. అప్పటివరకూ రిక్తహస్తాలతో, తులసీదళాలతో శ్రీరంగనాథుని కొలవడమే తప్ప వేరే వ్యాపకం లేని విప్రనారాయణుకి ప్రపంచంలో తాను ఎక్కడున్నాడో అర్ధమైంది. ధనమూలం ఇదం జగత్ - అని తెలిసొచ్చింది. కొంత ధనమైనా లేనిదే ఏ ఇంతీ కూడా ప్రేమ ఒలకబోయదనే సత్యం తెలిసింది. ఒక్కసారిగా ఖిన్నుడైపోయాడు. ఏం చేయాలో, ఎలా సంపాదించాలో తెలీని పరిస్థితి. దేవదేవి సౌందర్యం పదేపదే గుర్తొస్తోంది. ఆ సౌందర్యారాధన చేయని జీవితం ఎందుకని పరితపించాడు. కానీ కనీసం వేయి బంగారు వరహాలు ఎలా సంపాదించాలి? దేవదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? భగవంతుడా! ఎలాంటి పరిస్థితి కల్పించావు - అని దేనిమీదా ఏకాగ్రత లేక పరధ్యానంగా విచార వదనంతో కుటీరంలో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదంతా విధివైపరీత్యం కదా!

 

ఇక నిత్య కార్యక్రమాలైన పూల మొక్కల సంరక్షణ కూడా సరిగా చేయలేకపోతున్నాడు. పక్కపక్కనే కూర్చున్నా దేవదేవితో మాట్లాడలేకపోతున్నాడు. ఏదో తెలీని అసంతృప్తి. ఎలాగైనా వేయి వరహాలు సంపాదించి దేవదేవి అనుగ్రహం పొందాలనే తీవ్రమైన ఆలోచన. ఒకవైపు విరహం, మరోవైపు మనస్తాపం. ఇంకోవైపు ఆరాటం. ఏమిటో ఎన్నడూ లేని అయోమయం విప్రనారాయణకు కలిగింది. ఏం చేయాలో తోచదు. మునుపటి ఉత్సాహం లేదు, ఆనందం లేదు. ఏదో తెలీని వెలితి మోహంగా ప్రస్ఫుటిస్తుంది. అటువంటి సమయంలో తోటలోనికి ఒక ప్రముఖ వ్యాపారి ఈ విప్రుని వద్దకు వచ్చి ''స్వామీ మీరు ఎన్నడూ లేని విధంగా చాలా విచారంగా ఉన్నారు. మిమ్మల్ని ఇలా ఎన్నడూ చూడలేదు. కారణం తెలియజేయండి. నాకు చేతనైనంత సహాయం చేస్తాను. భగవంతుని సేవించినా, భక్తులను సేవించినా ఫలితం ఒక్కటే. కనుక మీరు ఇలా విచారవదనంతో ఉండటం వల్ల ఈ ఉద్యానవనం శోభించదు. ఇలా మనస్తాపంతో స్వామివారి సేవ ఇలా చేస్తారు? మీరు ఏమీ ఆలోచించకుండా మీ సమస్యను తెలియజేయండి. వీలయితే సహాయం చేస్తాను'' అన్నాడు. ఇలా మెల్లగా అడిగి విప్రనారాయణుని మనసులోని విషయం తెలుసుకుని వ్యాపారి తాను శ్రీరంగనాథునికి అనేక కానుకలను అర్పించవచ్చానని, వీటిలో నుండి ఏవైనా కొన్ని స్వీకరించమని, విప్రుడు స్వీకరిస్తేనే తనకు చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి తన వద్దనున్న అనేక కానుకల నుండి ఒక పెద్ద బంగారు పళ్ళెం తీసి విప్రనారాయణుని చేతిలో ఉంచి దీన్ని స్వీకరించండి.. ఇది మీ సమస్యను దూరం చేస్తుంది..'' అని చెప్పి మిగిలిన కానుకలను శ్రీరంగనాథునికి అర్పించి వస్తానని ఆలయం వద్దకు వెళ్ళాడు వ్యాపారి. ఆ పళ్ళెం వెనుక ''ఈ పాత్ర శ్రీరంగనాథుని సేవా కైంకర్యం కోసం సమర్పించడమైంది'' అని చెక్కి ఉంది. దాన్ని విప్రుడు గమనించలేదు.

 

ఆ పాత్రను అందుకున్న విప్రనారాయణుడు పరుగుపరుగున దేవదేవి వద్దకు వచ్చి ''దేవీ! నీ కోరిక తీరుస్తున్నాను. ఇదిగో.. ఈ స్వర్ణ పాత్ర నాలుగువేల వరహాలు చేతుంది. దీన్ని స్వీకరించి నాకు ప్రేమను అనుగ్రహించు. నన్ను గాఢ పరిష్వంగానికి ఆహ్వానించు. నన్ను వివాహం చేసుకోడానికి అంగీకరించు'' అని వేడుకున్నాడు. అతని చర్యలకు ఒక్కసారిగా ఉలిక్కిపడి పోయింది దేవదేవి. అంత దేవదేవి ''అయ్యో స్వామీ.. ఎంత పని చేసారు? నేనేదో మిమ్మల్ని ఆటపట్టించడానికి అన్నాను. నాకు ధనం మీద ఇలాంటి వ్యామోహం లేదు. మిమ్మల్నే కోరుకున్నాను. నా అజ్ఞానాన్ని మన్నించండి. దీనిమీద ''ఈ పాత్ర శ్రీరంగనాథుని సేవా కైంకర్యం కోసం సమర్పించినది'' అని చెక్కి ఉంది. ఇది అపహరించబడింది. ఎంత పని చేశారు మీరు? నా ప్రేమకోసం దొంగతనం చేశారా?'' అంటూ ఎంతో ఆవేదన చెందింది. దీన్ని ఆలయంలో అప్పగించండి - అని అర్ధించింది. కానీ విప్రనారాయణ దేవదేవిని అనునయిస్తూ ''దేవీ! ఇది అపహరించినది కాదు. ఒక వ్యాపారి బహూకరించినది. కావాలంటే వారినే ఇక్కడికి తీసుకువస్తాను. ఇక్కడే ఉండు'' అని ఆ వ్యాపారిని తీసుకొచ్చేందుకు ఆలయ పరిసరాలన్నీ వెతికాడు. కానీ అక్కడ వ్యాపారి కనిపించలేదు. ఈలోపు వ్యవహారం అంతా ఆలయ అధికారులకు తెలిసింది. ఆలయంలోని బంగారు పళ్ళెం దొంగిలించబడిందిగా భావించి ఆలయ అధికారులు విప్రనారాయణుని, దేవదేవిని బంధించి ఆలయం ఎదుట దోషులుగా నిలబెట్టారు.

 

పరమయోగిపుంగవుడైన విప్రనారాయణుడు వనితా వ్యామోహంతో దొంగతనానికి పాల్పడ్డాడు అనే వార్తా దావానలంలా ఊరంతా పాకిపోయింది. దానితో అక్కడే విశ్రమిస్తోన్న వ్యాపారి ఆ వార్త విని పరుగుపరుగున ఆలయానికి వచ్చి జరిగిన విషయమంతా చెప్పి విప్రనారాయణుడు నిర్దోషి అని, శిక్షార్హుడు కాదు - అని తెలియజేశాడు. అంత ఆలయాధికారులు విప్రనారాయణను క్షమించమని కోరి విడిచిపెట్టారు. ఈ సంఘటనతో విభ్రాంతి చిందిన విప్రనారాయణుడు ''అయ్యో, తల్లిదండ్రులు ఎంతో భక్తితో పెట్టుకున్న పేరుకు అపఖ్యాతి తెచ్చాను. శ్రీరంగనాథ కైంకర్యానికి ఉపయోగపడవలసిన ఈ దేహం వనితా వ్యామోహంలో చిక్కుకున్నదని పరిపరివిధాల పరితపించాడు. అంతేగాక దేవదేవి కూడా తుచ్ఛమైన వేశ్యవృత్తిలో జన్మించి అగ్ని సమానుడైన విప్రనారాయణుని సాహచర్యంలో పునీతురాలైంది. తాను చేసిన నీచమైన పనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకుని సన్యాసినిగా మారి నిరంతరం శ్రీరంగనాథుని సేవలో గడిపేందుకు నిర్ణయించుకుంది.

 

విప్రనారాయణుడు కూడా తన పేరును భక్త పాదాంఘ్రి రేణువు అనగా తొండరప్పొడిగా మార్చుకుని శ్రీ రంగనాథుని సేవలో నిమగ్నమయ్యాడు. నిరంతర భక్తిలో తరించిన ఈ ఆళ్వారులు శ్రీరంగనాథునికి 40 పాశురాలతో తిరుమాల అనే ప్రబంధాన్ని, 10 పాశురాలతో శ్రీరంగనాథునికి సుప్రభాతాన్ని తిరుప్పళ్ళి యెళుచ్చి అనే గ్రంధంగా రచించాడు. ఈ తిరుప్పళ్ళి యెళుచ్చిగ్రంధాన్ని ఆధారంగా చేసుకుని తిరుమల శ్రీవారి సుప్రభాతాన్ని ప్రతివాది భయంకర అణ్ణన్ రచించారని అంటారు.

 

ఉదయగిరి శిఖరముననుదయరవి కొలువమెరె

చెదరినవి చీకటులు నిదుర విడు రంగా

అడ నిదియె కనుగొనుము.. ముదమోసగ గసుమములు

ఎదవిరిసి మధువొలుకు నడి గనుము రంగా

మదకరుల, మురజమూలా రొద జలధివలె

చెలగద్రిదశుళును బ్రభువులను నిదొగనుమ రంగా

మొదట నిను గనుగొనేడు మది చెలగి వచ్చిరిదె

సదయుడయి కను దెరువు ముద మొలుక రంగా

మొదటి తిరుపతి యయిన సదనమున నురగపతి

మొదుశయనముగ నెపుడు నిదురగొను రంగా

 

ఇంకా ఉంది...

 

Vishnu Devotee Vipranarayana turns as Alwar, Thondaridippodi Alwar and 12 Alwars, the story of Vipranarayana, Vipranarayana and Devadevi Prostitute, Nammalvars and Thondaridippodi Alwar, the story of Thondaridippodi Alwar, Thondaridippodi Alwar and 40 Pashuras, Tirumala Prabandha, Thiruppalli yelucchi, Tiruvai moli