Read more!

English | Telugu

అన‌సూయ ఉండ‌గా.. 'జ‌బ‌ర్ద‌స్త్‌'లోకి యాంక‌ర్‌గా ర‌ష్మి ఎలా వ‌చ్చింది?

 

ఆల్రెడీ 'జ‌బ‌ర్ద‌స్త్‌'కు అన‌సూయ యాంక‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, ర‌ష్మీ గౌత‌మ్ మ‌రో యాంక‌ర్‌గా ఎలా వ‌చ్చింద‌నేది చాలా మందికి అర్థంకాని విష‌యం. త‌న చాతుర్యంతో ర‌ష్మి ఆ షోకు యాంక‌ర్‌గా వ‌చ్చింద‌నీ, దాంతో అన‌సూయ యాంక‌రింగ్ చేసే దానికి 'జ‌బ‌ర్ద‌స్త్' అని ఉంచి, ర‌ష్మీ యాంక‌రింగ్ చేసే షోకు 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్' అని పెట్టార‌నీ ఇండ‌స్ట్రీలో ఓ ప్ర‌చారం ఉంది. అయితే తాను అన‌సూయ నుంచి ఆ షోను లాక్కోలేద‌ని ర‌ష్మి స్ప‌ష్టం చేసింది. 

'జ‌బ‌ర్ద‌స్త్‌'కు యాంక‌రింగ్ చాన్స్ ఆమెకు 2013లో వ‌చ్చింది. "ఆ టైమ్‌లో అన‌సూయ ప్రెగ్నెంట్‌. దానివ‌ల్లే ఆమె ఆ షో నుంచి కొంత‌కాలం బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింది. త‌ప్ప‌నిస‌రిగా ఆమె స్థానంలో యాంక‌ర్‌గా మ‌రొక‌రు కావాలి. అప్పుడు నాకు ఫోన్ వ‌చ్చింది. నిజానికి నేను మా అమ్మ‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు రావ‌డంతో అప్ప‌టికే ఇండ‌స్ట్రీ నుంచి ఓ ఏడాది గ్యాప్ తీసుకున్నాను. అంటే నాక‌స‌లు చేతిలో ప‌నిలేదు. ఇక ఇండ‌స్ట్రీతో నాకు ప‌ని అయిపోయింద‌నే, సినిమాల చాప్ట‌ర్ క్లోజ్ అనే అనుకున్నాను. ఆ ఏడాది గ్యాప్ తీసుకున్న‌ప్పుడు కూడా జ్ఞాపిక ప్రొడ‌క్ష‌న్స్‌ ప్ర‌వీణ గారివ‌ల్ల‌ అప్పుడ‌ప్పుడు టీవీ షోల‌కు గెస్ట్‌గా వ‌స్తుండేదాన్ని." అని ర‌ష్మి ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

ఓరోజు స‌డ‌న్‌గా ఆమెకు కాల్ వ‌చ్చింది. "జ‌బ‌ర్ద‌స్త్ షో ఉంది.. ఎల్లుండి నుంచే షూటింగ్. మీరు రాగ‌లుగుతారా?" అని అడిగారు. అప్ప‌టికి జ‌బ‌ర్ద‌స్త్ షో మొద‌లై 13 ఎపిసోడ్లు మాత్ర‌మే ప్ర‌సార‌మ‌య్యాయి. టీవీ అంటే సినిమాల్లో చేసేవారికి చిన్న‌చూపు ఉన్న‌రోజుల‌వి. "నువ్వు టీవీ షో చేస్తావా? మ‌ళ్లీ నీకు సినిమాలు రావు" అని కొంత‌మంది ర‌ష్మిని డిస్క‌రేజ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. "అప్పుడు నా బ్యాంక్ బాలెన్స్ జీరో. చేతిలో ఏ ప‌నీ లేదు. ఏదో ఒక‌టిలే అనుకుని ఆ ఆఫ‌ర్‌ను యాక్సెప్ట్ చేశాను." అని చెప్పింది ర‌ష్మి.

అలా అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంతో అన‌సూయ తిరిగి వ‌చ్చినా, మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్ ర‌ష్మిని వెన‌క్కి పంప‌లేదు. ఆమెతో షోను కొన‌సాగించి, దానికి 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్' అనే పేరు పెట్టింది. అదీ జ‌బ‌ర్ద‌స్త్‌లోకి ర‌ష్మీ ఎంట్రీ ఇచ్చిన దానికి వెన‌కున్న క‌థ‌.