Read more!

English | Telugu

సెంచరీ కొట్టారు.. లైవ్ కి వచ్చారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ లో మురారి పాత్రలో గగన్ చిన్నప్ప, ముకుంద పాత్రలో యష్మి గౌడ, కృష్ణ పాత్రలో ప్రేరణ కంభం నటిస్తున్నారు. చాలా సినిమాల్లో తల్లి పాత్రలు పోషించిన సీనియర్ ఆర్టిస్ట్ ప్రియ ఈ సీరియల్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ సీరియల్ శుక్రవారం 100వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.

ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా మొదలైంది. మురారి వేరే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ముకుంద పరిచయమవుతుంది. వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అనుకోకుండా వారిద్దరు అక్కడ విడిపోతారు. మురారి, ముకుంద మళ్ళీ ఒకరినొకరు కలుసుకోవడానికి వాళ్ళకి సంబంధించిన అడ్రెస్ గాని ఫోన్ నెంబర్ గాని ఏమీ తెలియవు. దీంతో ముకుంద వాళ్ళింట్లో అమ్మనాన్న తెచ్చిన సంబంధానికి ఇష్టం లేకున్నా ఓకే చెప్తుంది. అలా ముకుంద పెళ్ళి ఆదర్శ్ తో జరుగుతుంది. అయితే ఆదర్శ్ మురారికి అన్నయ్య అనే విషయం తర్వాత తెలుస్తుంది. ముకుంద పెళ్ళి చేసుకుని మురారి ఇంటికే వస్తుంది. పెళ్ళి అయిన వెంటనే ఆదర్శ్ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు అనుకోకుండా ఒక సంఘటనలో కృష్ణ వాళ్ళ నాన్న చనిపోతాడు. కృష్ణ వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట కోసం కృష్ణని మురారి పెళ్లి చేసుకొని ఇంటికి వస్తాడు. కృష్ణకి మురారితో పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. ఇది ఒక అగ్రిమెంట్ మ్యారేజ్ అని తన చదువు పూర్తి కాగానే వెళ్ళిపోతా అని కృష్ణ చెప్తుంది. కృష్ణని పెళ్లి చేసుకోవడం మురారి పెద్దమ్మ భవానీ(ప్రియా)కి ఇష్టముండదు. 

ఇలా ఆ ఇంట్లో ముకుంద తన ప్రేమని బ్రతికించుకోవాలని పరితపిస్తూ ఒకవైపు.. అమాయకురాలిగా కృష్ణ ఒక వైపు.‌. మధ్యలో నలిగిపోతూ మురారి కన్పిస్తుంటారు. ఇలా ఈ సీరియల్ సాగిపోతూ 100 వ ఎపిసోడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 100వ ఎపిసోడ్ సందర్భంగా కృష్ణ తన ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చింది. తన ఫాలోవర్స్ కి హాయ్ చెప్తూ వారు అడిగే ప్రశ్నలకి తీరిగ్గా సమాధానం చెప్పింది. అక్కడ షూటింగ్ లొకేషన్ ని చూపిస్తూ, పక్కనే ఉన్న మురారితో కలిసి సరదాగా ముచ్చటించింది.