Read more!

English | Telugu

మీనాక్షితో కనకం ఆడించిన టెంట్ డ్రామా సక్సెస్.‌. దిగొచ్చిన అపర్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌-89లో.. కనకం వాళ్ళ అక్క మీనాక్షి దుగ్గిరాల ఇంటికి వస్తుంది. ఎందుకొచ్చావని అపర్ణ అడుగగా.. కావ్యకి పెళ్ళైయింది కానీ పదహారు రోజుల పండుగ జరుగలేదని అంటుంది. అయితే ఇప్పుడు మీకేం కావాలని అడుగగా.. మీరంతా కనకం వాళ్ళ ఇంటికి వస్తే కావ్యకి నల్లపూసలు గుచ్చి మెడలో పసుపు తాడుకి బదులు నల్లపూసలు గుచ్చిన బంగారు తాళిని వేసి పంపిస్తామని మీనాక్షి చెప్పగానే.. మేం రాము.. మా పిల్లల్ని పంపించం.. మిమ్మల్ని ఇక్కడికి రానివ్వమని అపర్ణ అంటుంది. దాంతో ఏంటి అపర్ణ.. ఆచారాలని కాదంటున్నావని ఇందిరాదేవి అడుగగా.. ఈ ఒక్కసారికి నా మాటని కాదనకండి అత్తయ్య అని ఇందిరాదేవీతో అపర్ణ అంటుంది. నా కోడలికి నాకు మధ్య ఉన్న ఒప్పందంలో ఎవరు రాకండని మిగిలినవాళ్ళకి అపర్ణ చెప్పగా.. మీనాక్షి బాధపడుతూ బయటకు వెళ్ళిపోతుంది.

మీనాక్షి బయటకు వెళ్ళేసరికి వాళ్ళ ఇంటిబయట ఒక టెంటు, కార్పెట్, మీడియా సెటప్, నలుగురు మనుషులు రెడీగా ఉంటారు. కనకం కాల్ చేసి.. అక్కా మనం మంచిగా రమ్మని పిలిచాం.. వాళ్ళు రానన్నారు.‌. వాళ్ళు వచ్చేదాకా నువ్వు ఈ దీక్ష చేయాలని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత మీనాక్షికి మెడలో ఓ పూలమాల, నుదుటన కుంకుమ పెట్టి టెంటు కింద కూర్చోబెడతారు. ఇక దీక్ష మొదలుపెడతారు. మన సంప్రదాయాలని కాపాడాలి.. కావ్యకి పదహారు రోజుల పండుగ జరిపించాలని మీనాక్షి గట్టిగా అరిచేసరికి‌.. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బయటకొచ్చేస్తారు. ఆ టెంట్ కింద మీనాక్షిని చూసి షాక్ అవుతారు. తనేమో కావ్య కోస‌ం పోరాడుతుంది. మధ్యలో కావ్య వచ్చి పెద్దమ్మ ఏంటిది.. మా అత్తగారింటి పరువు తీస్తారా అనేసరికి.. కనకం ఎంట్రీ ఇస్తుంది. 

ఏంటక్కా ఈ పని.. పదహారు రోజుల పండుగకి రమ్మని చెప్పమన్నా.. వాళ్ళని నొప్పించమని చెప్పలేదు కదా అని డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఈ దీక్షకి నాకు ఏ సంబంధం లేదని చెప్పినా అపర్ణ నమ్మదు. మా అక్క మీరు వినకుంటే.. రోడ్డు మీదకి వెళ్ళినా వెళ్తుందని కనకం అనేసరికి.. దుగ్గిరాల ఇందిరాదేవి, సీతారామయ్యలు కంగారుపడతారు. వెంటనే అపర్ణ దగ్గరికి వెళ్ళిన ఇందిరాదేవి... చూడు అపర్ణ .. కావ్యకి పదహారు రోజుల పండగ జరిపిద్దాం.. లేదంటే మన రాజ్ కే ఆయుస్షు తగ్గుతుంది. మంచిది కాదనేసరికి అపర్ణ తగ్గుతుంది. నా కొడుకు కోసం ఒప్పుకుంటున్నాని అపర్ణ అంటుంది. కనకం డ్రామా ఫలిస్తుంది. ఆ తర్వాత ఈ దీక్షని విరమిస్తాను.. నాకెవరైనా నిమ్మకాయ రసం ఇస్తారా అని అని మీనాక్షి అనగా.. నిమ్మకాయలు అయిపోయి కాకరకాయలున్నాయి.. కాకరకాయ జ్యూస్ ఇవ్వమంటారా అని రుద్రాణి అనగా అమ్మో వద్దులేండని మీనాక్షి పరుగున అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో అందరూ నవ్వేస్తారు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.