English | Telugu
'ప్రాజెక్ట్ K'కి దీపికా పదుకొనె డుమ్మా.. రీజన్ ఏంటంటే..!
Updated : Jul 23, 2023
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనెకి హాలీవుడ్‌లోనూ క్రేజ్ ఉంది. ఆమె రిటర్న్ ఆఫ్ గ్జెండర్ కేజ్ సినిమాతో హాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న క్రేజీ సినిమాల్లో `కల్కి 2898 ఏడీ` ఒకటి. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్‌ను శాన్ డియాగో కామికాన్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయటంతో పాటు ప్రభాస్ లుక్‌ను అనౌన్స్ చేశారు. దీనికి ప్రభాస్, కమల్ హాసన్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తదితరులు హాజరయ్యారు. నిజానికి దీపికా పదుకొనె హాజరవుతుందని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో ఆమె కామికాన్ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయలేదు. ఇది నిజంగా ఆమె అభిమానులను బాధించింది.
ఎంతో ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తోన్న ప్రభాస్ `కల్కి 2898` కార్యక్రమంలో దీపికా పదుకొనె ఎందుకు పార్టిసిపేట్ చేయలేదనే దానిపై చాలా రకాలైన వార్తలు వినిపించాయి. అయితే దీనికి బలమైన కారణముంది. అసలు విషయమేమంటే.. హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు స్ట్రైక్ చేస్తున్నారు. గిల్డ్ అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్, రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సంస్థలు కొన్ని నెలల నుంచి ఈ స్ట్రయిక్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ రెండు సంస్థల్లోనూ దీపికా పదుకొనె సభ్యురాలు. ఈ సంస్థల రూల్ ప్రకారం అందులో సభ్యులెవరూ షూటింగ్స్‌లో, సినిమాలకు సంబంధించిన ఇతర కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకూడదు. అందుకోసమే `కల్కి 2898` ఈవెంట్‌లో దీపికా పాల్గొనలేదు.
`కల్కి 2898` సినిమా విషయానికి వస్తే.. ఇది టైమ్ ట్రావెల్‌లో సాగే యాక్షన్ అడ్వెంచరస్ మూవీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి.అశ్వినీదత్ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రభాస్, దీపికా పదుకొనె హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా, కమల్ హాసన్ విలన్‌గా మెప్పించనున్నారు.