Read more!

English | Telugu

తెలుగోడి ఆత్మగౌరవం.. ఎన్టీఆర్ కి విశ్వక్ సేన్ నివాళి!

విశ్వక్ సేన్ తన 11వ సినిమాని కృష్ణ చైతన్య దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'VS11' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇటీవల విడుదల చేసిన గంగానమ్మ జాతర పోస్టర్ కి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి మరో పోస్టర్ విడుదలైంది.

నేడు(మే 28) ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ.. VS11నుంచి ది రాగ్స్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, ఆ మహనీయుడిపై తమకున్న ప్రేమను చాటుకుంది చిత్ర బృందం. బ్యాక్ గ్రౌండ్ లో గోడపై ఎన్టీఆర్ ఫోటో ఉండి, గోడ మీద "జోహార్ ఎన్టీఆర్.. తెలుగోడి ఆత్మగౌరవం" అని రాసి ఉండగా.. గోడ ముందు లుంగీ కట్టు, నోట్లో బీడీతో ఉన్న విశ్వక్ సేన్ మాస్ లుక్ ఆకట్టుకుంటోంది.

VS11 చిత్రం చీకటి మరియు క్రూరమైన ప్రపంచంలో అట్టడుగు నుంచి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి యొక్క కథను వివరిస్తుంది. ఈ ప్రపంచానికి నైతికత లేదు, దేనినీ పట్టించుకోదు. అలాంటి ప్రపంచంలో మనిషి మనుగడ సాగించాలంటే.. తన మార్గాన్ని నిర్ణయించుకోవడానికి అతనికి ప్రేరణ, స్ఫూర్తి అవసరం. మరి ఇందులో విశ్వక్ సేన్ ప్రయాణం ఎలా సాగిందో తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడాలి.

ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మధాది, ఆర్ట్ డైరెక్టర్ గా గాంధీ నడికుడికర్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.