English | Telugu
సీరియల్ చేద్దామన్న కమల్... నో చెప్పిన విక్రమ్!
Updated : Apr 27, 2023
పొన్నియిన్ సెల్వన్ సినిమా ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ మూవీ. ఆల్రెడీ పొన్నియిన్ సెల్వన్ ఒన్‌కి విశేషమైన స్పందన వచ్చింది. 500 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు దాన్నే ప్రైమరీ అమౌంట్‌గా ఫిక్స్ అయి థియేట్రికల్ కలెక్షన్లను టార్గెట్ చేస్తోంది టీమ్. పొన్నియిన్ సెల్వన్ టీమ్ ఇప్పుడు దేశమంతటా పలు నగరాల్లో జోరుగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కథకు సంబంధించి రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి. బాహుబలి సినిమాను చూసిన తర్వాతే పొన్నియిన్ సెల్వన్‌ను తెరకెక్కించే ధైర్యం వచ్చిందని చెప్పారు మణిరత్నం. విక్రమ్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ విషయాలను చెప్పారు. ``చాన్నాళ్ల క్రితం ఓ సారి కమల్ సార్ నన్ను కలిశారు. ఆయన ఆఫీస్‌కి పిలిస్తే వెళ్లా. పొన్నియిన్ సెల్వన్ కథ గురించి చెప్పారు. ఆ ప్రాజెక్ట్ ని తానే టేకప్ చేస్తానని అన్నారు. అందులో ఓ పాత్రలో నన్ను నటించమని అడిగారు. `ఏ కేరక్టర్ కావాలో ఎంపిక చేసుకో`మని అన్నారు. నేను అందుకు `ఇలా కథగా వినడం కన్నా, పొన్నియిన్ సెల్వన్ నవల చదివి మిమ్మల్ని కలుస్తాను` అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. ఇంటికి వచ్చాక మళ్లీ ఫోన్ చేశారు. `పొన్నియిన్ సెల్వన్ సినిమా కాదు. సీరియల్ చేస్తాను. టీవీలో ప్రదర్శిద్దాం` అని అన్నారు. తాను అందులో నటించనని కూడా స్పష్టంగా చెప్పారు.
నేను ఆలోచించాను. సీరియల్‌గా చేయడం కన్నా, సినిమాగా చేస్తేనే బావుంటుందనిపించింది. `ఈ కథ వెండితెరకు వెళ్లేదాకా నేను వెయిట్ చేస్తాను. ఇప్పుడు సీరియల్‌లో వద్దు` అని ఆయనతో చెప్పాను. నిజంగానే ఈ నవలకు వెండితెరమీద రూపం ఇవ్వాలనుకున్నప్పుడు మణిరత్నం నన్ను అప్రోచ్ అయ్యారు. అప్పుడు కమల్‌హాసన్ మనసులో ఈ కథకు రూపం ఇవ్వాలనుకున్నప్పుడూ నేనున్నాను. ఇప్పుడు మణిరత్నం ఆలోచనల్లోనూ నేనున్నారు. పొన్నియిన్ సెల్వన్ కథ ఎవరనుకున్నా సరే, నన్ను అప్రోచ్ అయినందుకు ఆనందంగా ఉంది`` అని అన్నారు.