English | Telugu
‘వేట్టయన్’ మూవీ రివ్యూ
Updated : Oct 10, 2024
తారాగణం: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, దుషారా విజయన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, రావు రమేష్, రోహిణి తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
డీఓపీ: ఎస్.ఆర్. కథిర్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
దర్శకుడు: టి.జి. జ్ఞానవేల్
నిర్మాత: సుభాస్కరన్ అల్లిరాజా
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
విడుదల తేదీ: అక్టోబర్ 10, 2024
'జైలర్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం 'వేట్టయన్'. 'జై భీమ్' ఫేమ్ టి.జి. జ్ఞానవేల్ దర్శకత్వం వహించడంతో పాటు.. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించడం, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Vettaiyan Movie Review)
కథ:
అధియన్ (రజనీకాంత్) అనే పోలీస్ అధికారి సమాజానికి అత్యంత హాని కలిగించే రౌడీలను ఎన్ కౌంటర్ చేస్తుంటాడు. ఈ విషయంలో పాట్రిక్( ఫాహద్ ఫాజిల్) అధియన్ కి హెల్ప్ చేస్తుంటాడు. శరణ్య ( దుషారా విజయన్) అనే గవర్నమెంట్ స్కూల్ టీచర్ అందరకి సమానమైన విద్య ఉండాలనే లక్ష్యంతో ఉంటుంది. ఈ క్రమంలోనే చదువు పేరుతో పేద వాళ్ళని దోచుకుంటున్న నాట్ అకాడమీ అనే సంస్థ తో పోరాడుతూ ఉంటుంది.దాని చైర్మన్ నటరాజ్( రానా) పేద వాళ్ళ నుంచి కొన్ని కోట్ల రూపాయిల డబ్బుని కాజేస్తాడు. తను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం అధియన్ ఒక యువకుడిని ఎన్ కౌంటర్ చేస్తాడు.కానీ ఆ తర్వాత అతను నిరపరాధి అనే విషయం తెలుస్తుంది.దీంతో రిటైర్డ్ జడ్జి ప్రస్తుత మానవ హక్కుల సంఘానికి చైర్మన్ అయినటువంటి సత్యదేవ్ బ్రహ్మదత్ పాండే(అమితాబ్ బచ్చన్) అధియన్ ని చట్టం ముందు దోషిగా ఉంచాలని ప్రయత్నిస్తుంటాడు.అసలు రజని కాంత్ ఎవరి విషయంలో ఒక అమాయకపు వ్యక్తిని చంపాడు? శరణ్య కి శత్రువుల నుంచి ఏమైనా ప్రమాదం వచ్చిందా ? నిజమైన హంతకుడిని అధియన్ ఎలా పట్టుకున్నాడు ? అసలు ఈ కథ కి నటరాజ్ కి సంబంధం ఏంటి? బ్రహ్మదత్ పాండే ఆశయం నెరవేరిందా లేదా? అనేదే ఈ కథ
ఎనాలసిస్:
ముందుగా ఇలాంటి కథ ని ఎంచుకున్నందుకు దర్శకుడు టీజే జ్ఞానవేల్ కి అభినందనలు చెప్పాలి. మీడియాలో ఒక వ్యక్తి చెడ్డవాడు, రేపిస్ట్ అని వచ్చినంత మాత్రాన నమ్మకూడదని, ప్రాపర్ ఇన్విస్టిగేషన్ జరగాలనే విషయాన్నీచాలా చక్కగా చెప్పాడు.అదే విధంగా తమ పిల్లల ఉన్నత చదువు కోసం అప్పులు చేసే పేద, మధ్య తరగతి ప్రజలకి కూడా కనువిప్పు కలిగేలా చేసాడు.కాకపోతే దర్శకుడు చెప్పే విధానంలో కొద్దిగా మార్పులు చేసి ఉండాలసింది. ఎడ్యుకేషన్ మాఫియాలోకి పోలీస్ కథ వచ్చి ఉంటె సినిమాకి మరింత నిండుదనం వచ్చేది. ఎందుకంటే సినిమాకి ఆయువు పట్టు ఎడ్యుకేషన్ మాఫియానే. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే రజనీకాంత్ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి మిగతా క్యారక్టర్ ల ఇంట్రడక్షన్ ని కూడా రియల్ లైఫ్ లో జరిగే పోలీస్ ఆఫీసర్ల సీన్స్ లాగానే చాలా నాచురల్ గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ చూస్తున్నంత సేపు కూడా కథ ఇంతేనా అనే డౌట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడి మైండ్ లో మెదులుతూనే ఉంటుంది. కానీ ఒక్కో సీన్ డిజైన్ చూసేకొద్దీ ఇంకేదో సస్పెన్సు ఉందనే డౌట్ కలుగుతుంది. ఇక సెకండ్ ఆఫ్ లో కథలో వేగం పెరిగింది.ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కి సాటి డిపార్ట్మెంట్ నుంచి గాని పొలిటికల్ గా గాని ఎన్ని ఇబ్బందులు వస్తాయో కూడా చాలా చక్కగా చెప్పారు. డబ్బున్న వాళ్ళు ఎంత వరకైనా తెగించి అమాయకులని తప్పుడు కేసులో ఇరికిస్తారనే భావన కూడా ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.చివర్లో రజనీకాంత్ తన సిద్ధాంతానికి వ్యతిరేఖంగా స్పీచ్ ఇవ్వడం చాలా బాగుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
రజనీ మరోసారి తన పెర్ఫార్మెన్సు తో జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోయాడు. ప్రతి సీన్ లో కూడా ఎంతో హుషారుగా చెయ్యడమే కాకుండా సీన్ వేగంగా కూడా పెరగడంలో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు.చాలా సినిమాల తర్వాత ఆయనకి మాత్రమే సాధ్యమయ్యే కళ్ళ జోడు స్టైల్ మరో సారి ఈ సినిమాలో సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది. ఇక మిగతా పాత్రలో చేసిన ఫాహాద్, రానా, రీతిగా సింగ్, అభినయ, అమితాబ్ బచ్చన్ వంటి నటులు తమ క్యారెక్టర్స్ మాత్రమే కనపడేలా చక్కగా చేసారు.ముఖ్యంగా రానా,ఫాహాద్ లు అయితే హై రేంజ్ పెర్ ఫార్మ్ చేసారు. రజనీ గత చిత్రం జైలర్ కి వర్క్ అయినట్టే ఈ మూవీ కి కూడా అనిరుద్ ఆర్ఆర్ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది. ఆయన ఇచ్చిన బీజీఎం వల్లనే సినిమాకి ఒక సరికొత్త హంగు చేకూరిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఫోటో గ్రఫీ కూడా సినిమా విజయ శాతాన్ని పెంచింది. ఇక ఈ చిత్ర కథకుడు, దర్శకుడు టీజే జ్ఞానవేల్ పని తనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జై భీం తర్వాత మరోసారి సామాజిక ప్రయోజనంతో కూడిన సినిమా తెరకెక్కించడమే కాకుండా ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడెయ్యటంలో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు. టేకింగ్ కూడా కళ్ళు పక్కకి తిప్పుకొని విధంగా ఉంది.
ఫైనల్ గా చెప్పాలంటే...
ఎక్కడ బోర్ కొట్టకుండా సామాజిక ఇతి వృత్తంతో సాగే వేట్టయన్ పేక్షకులని ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రేటింగ్ : 3/5
- అరుణాచలం