English | Telugu

'రాజా సాబ్' బర్త్ డే సర్​ప్రైజ్​.. వింటేజ్ డార్లింగ్ లుక్ అదిరింది!

ఈ ఏడాది 'కల్కి 2898 AD'తో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. అయితే ఆ సినిమాలన్నింటిలో 'ది రాజా సాబ్' ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నామని ఆయన ఫ్యాన్స్ తో పాటు అందరూ ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. (The Raja Saab)

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం 'రాజా సాబ్'. రొమాంటిక్ హారర్ జానర్ లో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ వింటేజ్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా విడుదలైన పోస్టర్ అంతకుమించి అనేలా ఉంది.

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా "రాజా సాబ్" నుంచి బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. ఆ పోస్టర్ లో ప్రభాస్ లుక్ అదిరింది. చూడటానికి స్టైలిష్ గా ఉన్నాడు. ఫ్యాన్స్ అయితే వింటేజ్ డార్లింగ్ అని మురిసిపోతున్నారు.

'రాజా సాబ్' సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ పళని, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్ డిజైనర్ గా రాజీవన్ వ్యవహరిస్తున్నారు.