Read more!

English | Telugu

సప్త చిరంజీవుల జపం చేస్తున్న టాలీవుడ్

హిందూ పురాణాల ప్రకారం ఏడుగురికి మరణం లేదు. వారినే సప్త చిరంజీవులు అని అంటారు. ఆ సప్త చిరంజీవులు ఎవరో కాదు.. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్వాసమహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో రూపొందుతోన్న పలు భారీ సినిమాలు సప్త చిరంజీవుల పాత్రల చుట్టూ తిరుగుతుండటం ఆసక్తికరంగా మారింది.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్ హీరో ఫిల్మ్ 'హనుమాన్' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి సినిమాగా వచ్చిన 'హనుమాన్'లో హనుమంతుడు, విభీషణుడు పాత్రలు అలరించాయి. ఈ యూనివర్స్ నుంచి 'జై హనుమాన్'తో పాటు భవిష్యత్ లో పలు సినిమాలు రానున్నాయి. వాటిలో హనుమంతుడు, విభీషణుడుతో పాటు మిగతా సప్త చిరంజీవుల పాత్రలు కూడా దర్శనమివ్వనున్నాయి అంటున్నారు.

ఇక టాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా 'కల్కి 2898 AD'. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ లో మైథలాజికల్ టచ్ ఉండనుంది. ఇందులో అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మిగతా సప్త చిరంజీవుల పాత్రలు కూడా ఉంటాయని తెలుస్తోంది. పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్, కృపాచార్యుడిగా నాని కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి హీరోలు కూడా ఈ చిత్రంలో సప్త చిరంజీవుల పాత్రలలో కనిపించనున్నారని సమాచారం.

ఏది ఏమైనా పురాణ పాత్రలను తీసుకొని, సాంకేతికతను ఉపయోగించి, ఈ తరం ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు తీయడం అనేది అభినందించదగ్గ విషయం.