English | Telugu

‘రివైండ్‌’ మూవీ రివ్యూ


నటీనటులు : సాయి రోణక్‌, అమృత చౌదరి, సురేష్‌, జబర్దస్త్‌ నాగి, కె.ఎ.పాల్‌ రామ్‌, అభిషేక్‌ విశ్వకర్మ, ఫన్‌ బకెట్‌ రాజేష్‌, భరత్‌ తదితరులు
సంగీతం: ఆశిర్వాద్‌
పాటలు: రవివర్మ ఆకుల
సినిమాటోగ్రఫీ: శివరామ్‌ చరణ్‌
ఎడిటింగన: తుషార పాలా
స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: కళ్యాణ్‌ చక్రవర్తి
బ్యానర్‌: క్రాస్‌వైర్‌ క్రియేషన్స్‌
విడుదల తేదీ: 18.10.2024

సాయి రోణక్‌, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా క్రాస్‌వైర్‌ క్రియేషన్స్‌ పతాకంపై కళ్యాణ్‌ చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రివైండ్‌’. అక్టోబర్‌ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏమిటి, నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ ఎలా ఉంది, దర్శకుడు ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు అనే విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. 

కథ : 
ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసే కార్తీక్‌ (సాయి రోణక్‌) తన అపార్ట్‌మెంట్‌లో ఉన్న శాంతి(అమృత చౌదరి)తో  మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె తన ఆఫీసులోనే పనిచేస్తుంది అనే విషయం తెలిసి మరింత సంబరపడతాడు. ఆమెకు తన ప్రేమ విషయం చెప్పేలోపే ఆమె తనకు ఒక ప్రియుడు ఉన్నాడన్న షాకింగ్‌ విషయాన్ని వెల్లడిస్తుంది. అయితే శాంతి తాత(సామ్రాట్‌)కు చెందిన ఒక బ్యాగ్‌ తన ఇంట్లోనే ఉందని తెలుసుకుని కార్తీక్‌ ఒకరోజు దాని ద్వారా టైం ట్రావెల్‌ చేయడానికి సిద్ధమవుతాడు. శాంతి తన ప్రియుడిని కలిసే రోజుకి టైం ట్రావెల్‌ చేసి వాళ్ళిద్దరిని కలవకుండా చేస్తే తాను శాంతి ప్రేమలో పడొచ్చని అలా చేస్తాడు. అలా టైం ట్రావెల్‌ ద్వారా వెనక్కి వెళ్లిన కార్తీక్‌ అప్పుడు జరిగిన పరిణామాలను మార్చగలిగాడా? అసలు శాంతి తాతకు చెందిన బ్యాగ్‌ కార్తీక్‌ ఇంటికి ఎలా వచ్చింది? వెనక్కి వెళ్లిన కార్తీక్‌ తన తండ్రి(సురేష్‌) చావుని తప్పించగలిగాడా? తర్వాత ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్‌ స్క్రీన్‌ మీద చూడాల్సిందే. 


విశ్లేషణ: 
టైం ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో  తెలుగులోనే కాదు అనేక భాషల్లో ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా ఒక రకంగా టైం ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తోనే తెరకెక్కింది. సినిమా మొదలైన వెంటనే ఈ విషయాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పేసాడు డైరెక్టర్‌. సినిమా మొదలైన తర్వాత సామ్రాట్‌ తన కుటుంబాన్ని తానే వెతుక్కుంటూ రావడంతో ఆసక్తి మొదలవుతుంది. తర్వాత సామ్రాట్‌ మాయమవడం ఆ తర్వాత కథలోకి కార్తీక్‌, శాంతి ఎంట్రీ ఇవ్వడంతో వారిద్దరి క్యూట్‌ లవ్‌ స్టోరీతో ప్రేక్షకులను ఎంగేజ్‌ చేసేలా నడిపించాడు డైరెక్టర్‌. కరెక్ట్‌గా ఇంటర్వెల్‌ సమయానికి అనేక ప్రశ్నలను ప్రేక్షకులకు వదిలేసి సెకండ్‌ హాఫ్‌లో ఒక్కొక్క దాని చిక్కుముడి విప్పుతూ వెళ్ళాడు డైరెక్టర్‌. అలా వెళ్ళిన తర్వాత ఫస్ట్‌ హాఫ్‌లో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సెకండ్‌ హాఫ్‌లో సమాధానాలు దొరుకుతాయి. ఫస్ట్‌ హాఫ్‌ నుంచి సెకండ్‌ హాఫ్‌కి ఉన్న కనెక్టివిటీ ప్రేక్షకులను అబ్బుర పరుస్తుంది. ఇక క్లైమాక్స్‌ కూడా ఊహకు అందకుండా సెకండ్‌ పార్ట్‌కి ఇచ్చే లీడ్‌ ఆసక్తికరమనిపిస్తుంది. టైం ట్రావెల్‌ చేసి గతాన్ని మార్చాలి అనుకున్న హీరో దాన్ని మార్చగలిగాడా లేదా అనే విషయాన్ని బిగ్‌ స్క్రీన్‌ మీద చూసి తెలుసుకుంటేనే మీకు కిక్‌..

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో కార్తీక్‌ పాత్రలో సాయి రోనాక్‌ కరెక్ట్‌గా సెట్‌ అయ్యాడు. ఒక పోష్‌ కుర్రాడిగా కనిపిస్తూ అలరించాడు. ఇక అమృత చౌదరి శాంతి పాత్రలో ఒదిగిపోయింది. ఒకపక్క అందంగా కనిపిస్తూనే మరో పక్కన తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. ఇద్దరి పెయిర్‌ బాగా స్క్రీన్‌ మీద చాలా ఫ్రెష్‌ గా కనిపిస్తోంది. ఇక మిగతా పాత్రల్లో కనిపించిన సురేష్‌, సామ్రాట్‌, వైవా రాఘవ, కేఏ పాల్‌ రాము వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. టెక్నికల్‌ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సంగీత దర్శకుడు ఆకట్టుకున్నారు. పాటలు కూడా వినడానికి చాలా బాగున్నాయి. ఎడిటింగ్‌ కూడా క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి సినిమా చాలా రిచ్‌గా కనిపించింది. అందుకు సినిమాటోగ్రఫీ కూడా కీలకమైన పాత్ర పోషించిందని చెప్పొచ్చు.

రేటింగ్‌: 2.75/5