English | Telugu

8 రోజుల్లో ఇదీ ‘కోర్ట్‌’ పరిస్థితి.. ఆ విషయాన్ని మరోసారి ప్రూవ్‌ చేసింది!

8 రోజుల్లో ఇదీ ‘కోర్ట్‌’ పరిస్థితి.. ఆ విషయాన్ని మరోసారి ప్రూవ్‌ చేసింది!

ఒక సినిమా ప్రేక్షకుల మెప్పు పొందాలంటే.. స్టార్‌ కాస్టింగ్‌, ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే విజువల్‌ వండర్స్‌, భారీ బడ్జెట్‌, అసాధారణమైన యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉండాలి అనేది మేకర్స్‌ ఆలోచన. అవన్నీ వారిలో ఉన్న భ్రమలే అని మరోసారి ప్రూవ్‌ అయింది. ఇప్పుడే కాదు, సినిమా పుట్టిన నాటి నుంచి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సినిమా ఈ విషయాలను గుర్తు చేస్తూనే ఉంది. కానీ, ఆ భ్రమల నుంచి బయటికి రాని స్టార్‌ హీరోలు, స్టార్‌ డైరెక్టర్లు, స్టార్‌ ప్రొడ్యూసర్లు వాటినే పట్టుకొని వేలాడుతున్నారు. సినిమాకి కథే ప్రధానం అని సినీ పెద్దలు చెప్పిన మాట అక్షరసత్యం అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కోట్లు పెట్టాలి, వారం రోజుల్లోనే జనం దగ్గర నుంచి దానికి రెట్టింపు రాబట్టాలి. ఇదే కాన్సెప్ట్‌తో ఉన్నారు పెద్ద హీరోలంతా. ఏడాదికి 200 సినిమాలు రిలీజ్‌ అయితే అందులో పది మాత్రమే పెద్ద బడ్జెట్‌ సినిమాలు ఉంటాయి. మిగతావన్నీ చిన్న హీరోల సినిమాలు, తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు. ఈమధ్యకాలంలో వాటి నుంచే ఆణిముత్యాల్లాంటి సినిమాలు వస్తున్నాయి తప్ప పెద్ద హీరోల సినిమాలు పరమ రొటీన్‌గా, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే విధంగా ఉంటున్నాయి. ఎవరెన్ని చెప్పినా సినిమాకి కథే ప్రధానం అనే విషయాన్ని మరోసారి ‘కోర్ట్‌’ చిత్రం ప్రూవ్‌ చేసింది. 

2018లో నేచురల్‌ స్టార్‌ నాని, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ప్రశాంతి తిపిర్నేని కలిసి వాల్‌పోస్టర్‌ సినిమా అనే సంస్థను స్థాపించి రొటీన్‌కి భిన్నంగా ఉండే సినిమాలను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. మొదటి సినిమాగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో ‘అ!’ చిత్రాన్ని నిర్మించి నిర్మాతలుగా తమ అభిరుచి ఏమిటో తెలియజేశారు. ఆ తర్వాత హిట్‌ సిరీస్‌ని స్టార్ట్‌ చేసి రెండు భాగాలను విడుదల చేసి భారీ విజయాల్ని అందుకున్నారు. ఇప్పుడు హిట్‌ 3 కూడా మే 1న విడుదల కాబోతోంది. ఈలోగా మరో విభిన్నమైన సినిమా ‘కోర్ట్‌’ను తెరకెక్కించారు. మార్చి 14న ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా విడుదలైంది. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉన్న కథ, కథనాలు, నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌, డైరెక్టర్‌ రామ్‌ జగదీష్‌ టేకింగ్‌.. వెరసి.. ఒక అద్భుతమైన సినిమాగా ‘కోర్ట్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్‌ అయిన మొదటి రోజు, మొదటి షో నుంచే యునానిమస్‌గా సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమాకి రోజు రోజుకీ కలెక్షన్లు పెరుగుతున్నాయి, థియేటర్లు కూడా పెరుగుతున్నాయి. 

సాధారణంగా కోర్ట్‌ ప్రధాన అంశంగా ఉన్న సినిమాలకు అప్రిషియేషన్‌ వస్తుంది కానీ, కలెక్షన్లు ఆశించిన స్థాయిలో ఉండవు. ‘కోర్ట్‌’ రిలీజ్‌ అయ్యేనాటికి అందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ, అందరి ఆలోచనలను తలకిందులు చేస్తూ మొదటి రోజు నుంచే బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తోంది ‘కోర్ట్‌’. మొదటి రోజు రూ.8.10 కోట్ల గ్రాస్‌తో మొదలై మూడు రోజుల్లోనే రూ.24.4 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఐదు రోజుల్లో రూ. 33.55 కోట్ల గ్రాస్‌ను క్రాస్‌ చేసింది. ఆరో రోజు కూడా అదే వేగంతో రూ.36.85 కోట్లకు చేరుకుంది. వీకెండ్‌కి రూ.39.60 కోట్ల వరల్డ్‌వైడ్‌ గ్రాస్‌ సాధించడం సినిమాలో ఉన్న స్టామినా ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తోంది. ఇప్పటికే యుఎస్‌లో 9 లక్షల డాలర్లు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. త్వరలోనే మిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి చేరబోతోంది ‘కోర్ట్‌’. ఇక 8వ రోజు ఈ సినిమా వరల్డ్‌వైడ్‌ గ్రాస్‌ రూ.42.30 కోట్లు. కలెక్షన్లు ఇలా ఉంటే.. రెండోవారంలోకి ఎంటర్‌ అయిన తర్వాత థియేటర్లు పెరగడం విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పుడు కనిపిస్తున్న ఈ కలెక్షన్‌ ట్రెండ్‌ చూస్తుంటే లాంగ్‌ రన్‌లో రూ.60 కోట్ల వరకు కలెక్ట్‌ చేసే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు లేవు కాబట్టి ‘కోర్ట్‌’ తన జైత్రయాత్రను నిర్విఘ్నంగా కొనసాగిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.