English | Telugu

‘గురుబ్రహ్మ’ అనదగ్గ ఆరు సినిమాలు!

 

 

గురు బ్రహ్మ... గురు విష్ణు... గురు దేవో మహేశ్వరహ.. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ...
సమస్త దేవతామూర్తల ప్రతి రూపం గురువు. ఆ మాటకొస్తే... అమ్మా, నాన్న తర్వాత స్థానం గురువుదే. మన దేశ సంస్కృతి.. సంప్రదాయం అదే చెబుతుంది. తాబేలు తన బిడ్డలను కేవలం కంటి చూపుతోనే సాకుతుందట. గురువు కూడా అంతే... కేవలం కంటిచూపు మాత్రం చేతనే... జ్ణానాన్ని ప్రసాదించే పరబ్రహ్మ. గురుశిష్యుల సంబంధం భావాలకే అతీతమైంది. నేడు గురుపూజా దినోత్సవం. నిజానికి అన్ని రోజులూ గురువులవే. అన్ని వేళలా గురువు పూజనీయుడే. గురువు ప్రభావితం చేయని రంగం ఈ జగత్తులోనే ఉండదు. దానికి సినిమా మినహాయింపే కాదు. సో... నేడు గురుపూజా పర్వదినం సందర్భంగా గురువు గొప్పతనాన్ని తెలిపిన ‘టాప్ 6 మూవీస్’ మీకోసం.

బడిపంతులు

 

గురువు నేపథ్యంలో సినిమా అంటే, ముందు గుర్తొచ్చే సినిమా ఎన్టీయార్ ‘బడి పంతులు’. అంజలిదేవి కథానాయిక. కె.చంద్రశేఖరరావు దర్శకుడు. తెలుగు సినిమా చరిత్రలోనే ‘బడిపంతులు’ ఓ అద్భుతం. తప్పుదారిలో పయనిస్తున్న పిల్లల్ని మందలించి సక్రమమైన దారిలో నడిపి, వారి అభ్యున్నతి కారకులవుతారు గురువులు. తన దగ్గర చదువుకొని ఉన్నత స్థాయికి శిష్యులు చేరితే.. వారి ఎదుగుదలలో తన ఆనందాన్ని వెతుక్కుంటాడు గురువు. ‘బడి పంతులు’లో ఎన్టీయార్ పాత్ర అదే. కన్నబిడ్డలు వేధిస్తే... శిష్యుడే కొడుకై పూజిస్తాడు. గురుశిష్యుల బంధాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన సినిమా ఇది. ‘భారత మాతకు జేజేలు.. బంగరు భూమికి జేజేలు’ పాట ఈ సినిమాకే హైలైట్. ఆ మాటకొస్తే... ఈనాటికీ ఈ సినిమా.. ఈ పాటను ఎవర్ గ్రీనే.

 రేపటి పౌరులు

 

 

టి.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా ఇది. పెద్దలే పసి మనసులను గాయాలపాలు చేస్తుంటే.. శిష్యుల కోసం సొసైటీమీదే తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన ఓ టీచర్ కథ ‘రేపటి పౌరులు’. 1987లో వచ్చిన సినిమా అప్పట్లో ఓ సంచలనం.  ధనిక, పేద, కులం, మతం, ప్రాంతం, వర్గం... వీటన్నింటికీ అతీతమైంది తరగతి గది అని తెలియజెప్పే సినిమా ఇది. ఇందులో విజయశాంతి నటన  అద్భుతం. ఈ సినిమా కంటే ముందే ‘ప్రతిఘటన’లో ఆమె టీచర్ గా చేశారు.


అశ్వని

 

 

పరుగుల రాణి అశ్వనీ నాచప్ప జీవితం ఆధారంగా... రూపొందిన సినిమా ‘అశ్వని’. ఇందులో అశ్వనీ నాచప్పే... తన పాత్రను పోషించడం విశేషం. గురువు యొక్క ఆవశ్యకతను తెలిపే కథ ఇది. ఇందులో భానుచందర్ పాత్ర.. నిజమైన గురువుకి అద్దం పడుతుంది. సద్గురువు అంటే.. ఎలా ఉంటారో చూపెడుతుంది. తాను పస్తులుంటూ.. శిష్యురాలి గెలుపు కోసం కలలు కనే గురువు కథ ఇది. కాళ్లు తెగిపడినా... శిష్యురాలి పరుగులో తన పరుగును చూసుకునే గురువు కథ ఇది. మౌళి దర్శకుడు. గురుపూజా దినోత్సవం రోజు కచ్చితంగా తలచుకోదగిన సినిమా ఇది.


 ఓనమాలు

 

 

ఈ మధ్య కాలంలో వచ్చిన ‘ఓనమాలు’... గురుదేవుని గొప్పతనాన్ని చెప్పే సినిమానే. ఇందులో నారాయణరావు మాస్టారుగా రాజేంద్రప్రసాద్ నటించారు. మాతృభూమి తల్లితో సమానమని ప్రపంచానికి తెలియజెప్పిన గురువుగా ఇందులో రాజేంద్రుడు కనిపిస్తాడు. ‘ఏ దేశమేగినా... ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అని రాయప్రోలు సుబ్బారావు చెబితే.. ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. నిన్ను కన్న ఊరుతల్లిని మరవొద్దురా’ అని ఇందులో గురువు చెబుతాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తప్పక చూడదగినది.


 గోపాల గోపాల

 

 

‘మానవ సేవే.. మాధవ సేవ’ అన్న సూక్తి తూ.చా తప్పకుండా పాటించేవాడు నాస్తికుడైనా కానీ... వాడికోసం దేవుడే దిగి వస్తాడనీ... అవసరమైతే.. గురువుగా మారి వాడికి దిశదశ నిర్దేశిస్తాడని చెప్పిన సినిమా ‘గోపాల గోపాల’. ఇందులో పవన్ కల్యాణ్ శ్రీకృష్ణుడిగా నటించాడు. అంతేకాదు... జగద్గురుడుగా మెప్పిస్తాడు. ఇందులో వెంకటేశ్ కేరక్టర్ గమ్మత్తుగా ఉంటుంది. గురువే విష్ణువు అన్నారు కదా. దానికి రూపమే ‘గోపాల గోపాల’.

 

 గురు

 

 

శిష్యుల కోసం గురువు.. ఎంత త్యాగానికైనా వెనుకాడడు.. శిష్యుల గెలుపే తన గెలుపు. శిష్యుల ఆనందమే తన ఆనందం. ఇందులో ఆదాయంతో నిమిత్తం లేదు. ఆరోగ్యంతో ప్రమేయం లేదు. లక్ష్య సాధనే ముఖ్యం. దీనికోసం ఎంత కఠినంగా అయినా వ్యవహరిస్తాడు గురువు. కానీ... శిష్యులపై గురువుకు ఉండే ప్రేమ సముద్రం. ‘గురు’ సినిమాలో చెప్పేది ఇదే. వెంకటేశ్ అద్భుతంగా నటించిన సినిమా ఇది.

లోతుగా వెళితే... ఇలా గురుశిష్యుల నేపథ్యంలో సినిమాలు చాలా ఉన్నాయ్. వాటన్నింటినీ చెప్పుకుంటూ పోతే.. ఓ సీరియలే రన్ చేయాలి. అందుకే ముచ్చటగా ఈ ఆరు సినిమాలతో ఈ గురుపూజా దినోత్సవాన్ని కానిచ్చేద్దాం.