English | Telugu

ఎన్టీయార్-చరణ్ మల్టీస్టారర్ కథ ఇదే

నందమూరి... కొణిదెల... ఈ ఇళ్లపేర్ల ప్రస్తావన వస్తే... ఆటోమేటిగ్గా వాతావరణం వేడెక్కిపోతుంది. ఎన్టీవోడి ఆగమనం నుంచీ ‘నందమూరి’ అనే ఇంటిపేరు తెలుగు నేలపై ఓ బ్రాండ్ అయ్యింది. అయితే.. ఎన్టీయార్ రాజకీయంలోకెళ్లడం... ఆయన వారసుడిగా బాలయ్య రంగంలోకి దిగడం... అంతకుందే.. చిరంజీవి హీరో అవ్వడం.. తర్వాత సుప్రీమ్ హీరో అవ్వడం.. ఆ తర్వాత మెగా స్టార్ అవ్వడంతో ‘కొణిదెల’ అనే ఇంటి పేరు మరో బలమైన బ్రాండ్ గా మారింది. 

చిరంజీవి, బాలకృష్ణ.. ఇద్దరూ చిరకాల ప్రత్యర్థులు. నువ్వా-నేనా.. అంటూ ముప్పైఏళ్లు వెండితెర సాక్షిగా పోటీపడ్డ పెందెం కోళ్లు. ఓ దశకు వచ్చే సరికి వీరిద్దరి పోటీ శృతి తప్పి రాగాన పడి.... వీరి అభిమానులు బద్ధ శత్రువులుగా మారే స్థాయికి చేరుకుంది. చివరకు కుల సమీకరణాలు కూడా మొదలయ్యాయ్. 

ఎన్టీయార్ కాలంలో మల్టీస్టారర్లంటే సర్వసాధారణం. తన సమాకాలీన కథానాయకులందరితో కలిసి నటించారు ఎన్టీయార్. అలాగే అక్కినేని, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్, కృష్ణంరాజు కూడా. కానీ.. చిరంజీవి, బాలకృష్ణ శకం వచ్చేసరికి అనారోగ్యకరమైన వాతావరణం నెలకొంది. దాంతో మల్టీస్టారర్లు కనుమరుగైపోయాయ్. వీరిద్దరే కాదు... ఏ ఇద్దరు కథానాయకులూ కలిసి నటించలేని పరిస్థితి. అయితే.. జనానికి మాత్రం.... చిరంజీవి, బాలయ్య స్క్రీన్ పంచుకుంటే చూడాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేది. కానీ.. ఆ భాగ్యం మాత్రం వారిద్దరూ కలిగించలేకపోయారు. 

అయితే... వారి తర్వాత తరం మాత్రం ఆ ఆకాంక్షను నిజం చేయడానికి నడుం బిగించింది. అవును... తారక్, రామ్ చరణ్ కలిసి ఒకసారి సినిమాలో నటించే శుభఘడియ త్వరలోనే రానుంది. వీరిద్దరినీ  కలుపుతున్న క్రెడిట్ ఎస్.ఎస్. రాజమౌళిదే. ‘బాహుబలి’ సంచలనం తర్వాత రాజమౌళి సృష్టించనున్న మరో సంచలనం ఈ  సినిమా కథ కూడా దాదాపు ఖరైన ఈ సినిమా ఫిబ్రవరిలో పట్టాలెక్కనుంది. డీవీవీ దానయ్య ఈ మల్టీస్టారర్ కి నిర్మాత. బలమైన అభిమాన గణం ఉన్న రెండు కుంటుంబాల హీరోలను కెమెరా ముందు హ్యాండిల్ చేయడం దర్శకులకు కత్తిమీద సామే. అలాంటి సాహసాలు రాజమౌళికి కెమెరాతో పెట్టిన విద్య. ఈ సిినిమా కథ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయ్. అది ‘తెలుగువన్’ మీకు ఎక్స్ క్లూజివ్ గా అందిస్తోంది. అదేంటంటే... 

కథ రిత్యా ఇందులో చరణ్ హీరో. విలన్ గా తారక్ నటిస్తున్నాడు. అదేంటి? చరణ్ కంటే సీనియర్ అయిన తారక్ విలన్ గా చేయడమేంటి? అనే అనుమానం అందరికీ కలగొచ్చు. ఈ సినిమా ‘ధూమ్’ తరహాలో ఉంటుందట. హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత విలన్ కి ఉంటుందట. అందుకే.. తారక్ ఏరి కోరి ఈ కేరక్టర్ ని ఎంచుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘జై లవకుశ’లో యాంటీషేడ్స్ ఉన్న పాత్రను అలవోకగా అదరగొట్టేసిన తారక్ కి రాజమౌళి సినిమాలో విలన్ గా చేయడం పెద్ద విషయం కాదు. చరణ్ పాత్ర కూడా డిఫరెంట్ గా ఉంటుందట. పైగా దర్శకుడు రాజమౌళి అవ్వడంతో.. హీరోల మధ్య ఇగో ప్రాబ్లమ్స్ కి చోటు ఉండదు. దర్శకధీరుడు ఏం చెబితే అది చేయడమే వీరిద్దరి పని. 

ఏది ఏమైనా... ఇదొక మంచి పరిణామం. రానున్న రోజుల్లో తెలుగు ప్రేక్షకులు ఓ అద్బుతాన్ని చూడబోతున్నారన్నది మాత్రం నిజం. తెరపై ఈ రెండు కుటుంబాల ప్రతినిథులు కలిసి ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.