English | Telugu
'షరతులు వర్తిస్తాయి' మూవీ రివ్యూ
Updated : Mar 15, 2024
మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో రూపొందే సినిమాలు ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. అలా మధ్యతరగతి కుటుంబ కథతో తెరకెక్కిన తాజా చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
మధ్యతరగతి కుటుంబానికి చెందిన చిరంజీవి(చైతన్య రావు) నీటిపారుదల శాఖలో క్లర్క్ గా ఉద్యోగం చేస్తుంటాడు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతను తానే తీసుకుంటాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన విజయశాంతి(భూమి శెట్టి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలోకి చైన్ సిస్టమ్ బిజినెస్ వచ్చి ఒక్క కుదుపు కుదుపుతుంది. కొంచెం డబ్బు కట్టి మీ తరపున మరో నలుగురిని జాయిన్ చేస్తే బోలెడు డబ్బు వస్తుందంటూ గోల్డెన్ ప్లేట్ అనే సంస్థ స్థానికులను ఆకర్షిస్తుంది. లోకల్ లీడర్ శంకరన్న(సంతోష్ యాదవ్) కూడా అందులో డబ్బు పెట్టడంతో అందరూ నమ్ముతారు. అయితే ఇలాంటి సంస్థలను నమ్మి మోసపోవద్దని చిరంజీవి వారించినా వినకుండా.. అతని కుటుంబ సభ్యులు కూడా ఆ సంస్థ ట్రాప్ లో పడతారు. చిరంజీవి తాను సేవ్ చేసిన డబ్బులను బ్యాంక్ నుంచి తీసుకొచ్చి.. భార్య చేత స్టేషనరీ షాప్ పెట్టిద్దామనుకొని ఇంట్లో ఉంచుతాడు. అయితే చిరంజీవి ఊరులో లేని సమయంలో అతని తల్లితో కలిసి విజయశాంతి కూడా ఆ కంపెనీకి డబ్బు కడుతుంది. ఇలా అందరి నుంచి డబ్బులు రాబట్టిన ఆ కంపెనీ.. రాత్రికి రాత్రి బోర్డు తిప్పేస్తుంది. ఆ దెబ్బకు చిరంజీవి కుటుంబం ఏం చేసింది? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? అసలు ఆ కంపెనీ వెనుకున్నది ఎవరు? ఆ కంపెనీతో శంకరన్నకి ఉన్న సంబంధం ఏంటి? తన కుటుంబంతో పాటు ఎన్నో మధ్యతరగతి కుటుంబాలను మోసం చేసిన కంపెనీని చిరంజీవి ఎలా ఎదుర్కొన్నాడు? వారి ఆటలను ఎలా అరికట్టగలిగాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
పుడితే ధనవంతుడిగా పుట్టాలి లేదా పేదవాడిగా పుట్టాలి అని ప్రతి మధ్యతరగతి వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా అనుకుంటాడు. మధ్యతరగతి వ్యక్తికి ఆశలు ఆకాశాన్ని చూపిస్తే.. స్థోమత నేలను చూపిస్తుంది. ఇటు నెల మీద ఉండలేక, అటు ఆకాశానికి ఎగరలేక సతమతమవుతారు. అందుకే బాగా డబ్బు వస్తుందని చిన్న ఆశ కనిపిస్తే చాలు.. సులభంగా మోసపోతారు. అలా కొంచెం డబ్బు కట్టి, బోలెడు డబ్బు సంపాదించవచ్చు అనే ఆశతో మోసపోయిన మధ్యతరగతి కుటుంబ కథే ఈ చిత్రం.
గొలుసుకట్టు వ్యాపారంలో డబ్బుపెట్టి మోసపోయిన వారు నిజ జీవితంలో ఎందరో ఉంటారు. అలా అందరికీ బాగా తెలిసిన, అందరూ చూసిన సంఘటనల నుంచి కథను రాసుకున్నాడు దర్శకుడు కుమార స్వామి. కథలో కొత్తదనం లేనప్పటికీ ఉన్నంతలో సినిమాని బోర్ కొట్టకుండా నడిపించి ప్రేక్షకులను అలరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ అంతా ప్రేమ, పెళ్లి, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితులను చూపిస్తూ సరదాగా సాగుతుంది. ముఖ్యంగా అత్తా కోడళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంది. అక్కడి నుంచి అసలు కథలోకి వెళ్లడమే కాకుండా.. సెకండాఫ్ పై ఆసక్తిని కలిగిస్తుంది. సెకండాఫ్ లో ప్రధాన పాత్రల మధ్య వచ్చే సంఘర్షణ, చైన్ సిస్టమ్ బిజినెస్ కి కార్పొరేషన్ ఎన్నికలకు ముడిపెట్టిన తీరు బాగుంది. అయితే ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కథనం నెమ్మదిగా సాగుతుంది. దీంతో ఫస్టాఫ్ ఇచ్చిన కిక్ సెకండాఫ్ ఇవ్వదు.
అరుణ్ చిలువేరు అందించిన సంగీతం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి కెమెరా పనితనం ఆకట్టుకుంది. పెద్దింటి అశోక్ రాసిన సంభాషణలు బాగున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
మధ్యతరగతి యువకుడు చిరంజీవి పాత్రలో చైతన్య రావు చక్కగా ఒదిగిపోయాడు. చిరంజీవి ప్రేయసిగా, భార్యగా భూమి శెట్టి ఆకట్టుకుంది. నంద కిషోర్, పద్మావతి, సంతోష్ యాదవ్, పెద్దింటి అశోక్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా..
మధ్యతరగతి కుటుంబ కథను నిజాయితీగా చెప్పిన దర్శకుడి ప్రయత్నం మెచ్చుకోదగినది. తెలిసిన కథే అయినా, కొన్ని నెమ్మదిగా సాగే సన్నివేశాలు ఉన్నప్పటికీ.. వినోదాన్ని పంచుతూనే ఆలోచన రేకెత్తించేలా ఉన్న ఈ చిత్రాన్ని హ్యాపీగా ఒకసారి చూసేయొచ్చు.
రేటింగ్: 2.5/5