English | Telugu

'రవికుల రఘురామ' మూవీ రివ్యూ

ప్రేమ కథలు ఎన్ని వచ్చినా  ఆడియెన్స్ ఆదరిస్తూనే ఉంటారు. తాజాగా మరో ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే 'రవికుల రఘురామ'. గౌతమ్ వర్మ, దీప్షికలు జంటగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 15న విడుదలైంది. శ్రీధర్ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.

కథ:
గౌతమ్ (గౌతమ్ వర్మ) అనే యువకుడు రాముడు మంచి బాలుడు టైపు. అలాంటి వాడు.. నిషా (దీప్సికా ఉమాపతి) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోతాడు. నిషా కూడా అతన్ని ప్రేమిస్తుంది. ప్రేమ మొదట్లో బాగానే ఉంటుంది.. కానీ రోజులు గడిచే కొద్దీ ఎక్కడో ఒక దగ్గర తేడా రావడమో లేక అనుకోని సమస్యలు ఎదురుకావడమో జరుగుతుంది. అలా ఎన్నో ప్రేమ జంటలు విడిపోతుంటాయి. అదే బాటలో గౌతమ్-నిషా జంట కూడా పయనిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో ఇద్దరి మధ్య ఎడబాటు ఏర్పడుతుంది. గౌతమ్‌ను విడిచి నిషా వెళ్లిపోతుంది. అసలు నిషా ఎందుకు గౌతమ్‌ను వదిలేయాల్సి వచ్చింది? నిషా వదిలేసిన తర్వాత గౌతమ్ పరిస్థితి ఏమైంది?. చివరికి నిషా, గౌతమ్ ఒక్కటయ్యారా? అన్నదే కథ.

విశ్లేషణ:
ప్రేమించడం, విడిపోవడం, చివరిలో కలవడం.. ఈ తరహా ప్రేమ కథలు ఇప్పటికే ఎన్నో వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. అయితే ఈ చిత్ర దర్శకుడు చంద్రశేఖర్.. ప్రేమకథకు మదర్ సెంటిమెంట్ పెట్టి ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. కథను తెరకెక్కించిన విధానం కూడా మెప్పించింది. కథానాయకుడు కోణంలోనే కథ సాగినప్పటికీ.. కథానాయిక పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం దక్కింది. ఇక ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఆ ఎపిసోడ్ ఎమోషనల్ గా ఉంటుంది. సెకండాఫ్ కూడా ట్విస్ట్ లు, ఎమోషన్స్ తో బాగానే నడిచింది.

తెలిసిన కథ అయినప్పటికీ, అక్కడక్కడా కథనం నెమ్మదిగా సాగినప్పటికీ.. ఉన్నంతలో లవ్, ఎమోషన్స్ తో సినిమాని బాగానే నడిచాడు దర్శకుడు. సుకుమార్ పమ్మి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. మురళి కెమెరా పనితనం బాగుంది. ప్రతి ఫ్రేమ్ అందంగా ఉంది. సంభాషణలు మెప్పించాయి. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

నటీనటుల పనితీరు:
కలియుగ రాముడు లాంటి గౌతమ్ పాత్రలో గౌతమ్ వర్మ చక్కగా నటించాడు. ఎమోనల్ సీన్లలోనూ మెప్పించాడు. ఇక దీప్షిక తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ప్రమోదిని, శ్రీ లక్ష్మి, సత్య తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఫైనల్ గా..
నూతన దర్శకుడు చంద్రశేఖర్ కానూరి తెలిసిన కథనే తీసుకున్నప్పటికీ.. దానికి మదర్ సెంటిమెంట్ ని జోడించి ఉన్నంతలో బాగానే తెరకెక్కించాడు.