English | Telugu
ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. 'సలార్' కౌంట్ డౌన్ స్టార్ట్!
Updated : Jun 20, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్'పై ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించగల సినిమా ఇది అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి. 'సాహో' సినిమా నార్త్ లో మంచి కలెక్షన్స్ రాబట్టినప్పటికీ, ఓవరాల్ గా మాత్రం బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గానే మిగిలింది. 'రాధేశ్యామ్' అయితే పూర్తి నెగటివ్ టాక్ తో డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇటీవల విడుదలైన 'ఆదిపురుష్' డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టి ఆశ్చర్యపరిచింది. అయితే నాలుగో రోజుకే కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ కావడంతో బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగలడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో 'కేజీఎఫ్'తో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'సలార్'పైనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.
ప్రకటనతోనే ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'సలార్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 'బాహుబలి' హీరో, 'కేజీఎఫ్' డైరెక్టర్ కలిసి చేస్తున్న ఈ సినిమా సంచనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు ఉన్నాయి. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని 2023, సెప్టెంబర్ 28 న విడుదల చేయనున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. విడుదల తేదీలో మార్పు లేదని ఇప్పటికే పలుసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ.. సలార్ రెండు భాగాలుగా తెరకెక్కుతోందని, విడుదల ఆలస్యమయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఆ ప్రచారానికి చెక్ పెట్టి, రిలీజ్ కౌంట్ డౌన్ చేశారు మేకర్స్. 'సలార్' విడుదలకు ఇంకా 100 రోజులే ఉందని గుర్తు చేస్తూ తాజాగా ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది హోంబలే ఫిలిమ్స్. 'ఆదిపురుష్' కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయనే బాధలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా బూస్ట్ ఇచ్చే అప్డేట్ అని చెప్పాలి. అసలే 'సలార్' విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.. తాజా అప్డేట్ తో తెగ సంబరపడుతున్నారు.
'సలార్'లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.