English | Telugu

రేణుకా స్వామిని నేనే చంపాను.. దిమ్మతిరిగే విషయాలను వెల్లడించిన దర్శన్‌!

ఒక స్టార్‌ హీరో తన అభిమానిని అతి దారుణంగా హింసించి చంపిన కేసు కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్నడలో స్టార్‌ హీరోగా వెలుగొందుతున్న దర్శన్‌ తన అభిమాని రేణుకా స్వామిని తన అనుచరులతో కలిసి అత్యంత దారుణంగా హతమార్చి మృతదేహాన్ని కాలువలో పడేశారు. తన అభిమాన హీరో దర్శన్‌ భార్య ఉండి కూడా పవిత్రగౌడ అనే నటితో కలిసి ఉండడాన్ని సహించలేకపోయిన రేణుకా స్వామి ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టాడు. ఈ విషయాన్ని దర్శన్‌ దృష్టికి తీసుకెళ్లింది పవిత్ర. దీంతో అతని కోపం కట్టలు తెచ్చుకుంది. 

పవిత్ర గౌడ ఆధ్వర్యంలో రేణుకా స్వామిని చిత్రదుర్గం నుంచి కిడ్నాప్‌ చేసి బెంగళూరుకు తీసుకొచ్చారు. జూన్‌ 9న అతన్ని హత్య చేశారు. ఈ హత్య దర్శన్‌, పవిత్రగౌడలతోపాటు మరో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తొలుత వీరందరినీ పరప్పన్‌ జైలులో ఉంచారు. జైలులో ఉన్నప్పటికీ దర్శన్‌ లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడంటూ సోషల్‌ మీడియాలో అతని ఫోటోలు, వీడియోలు రావడంతో అతన్ని బళ్లారి జైలుకు మార్చారు. మిగతా నిందితులను మైసూరు, తమకూరు, షిమోగా, ధార్వాడ్‌, బెల్గాం, విజయపుర, కలబురిగి జైళ్లకు తరలించారు. పవిత్ర గౌడను మాత్రం పరప్పన్‌ జైలులోనే ఉంచారు. వీరంతా మూడు నెలలుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. 

ఈ క్రమంలోనే పోలీసులు నిందితులపై చార్జిషీటు దాఖలు చేశారు. ఎ1గా పవిత్రగౌడ, ఎ2గా దర్శన్‌ పేర్లను పేర్కొన్నారు. ఈ హత్యలో మరో 15 ప్రమేయం ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్యకు సంబంధించి దర్శన్‌ వెల్లడించిన విషయాలు అందర్నీ షాక్‌కి గురి చేస్తున్నాయి. రేణుకా  స్వామిని తానే చంపినట్టు పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించాడు దర్శన్‌.  ఈ హత్యకు సంబంధించిన పలు కీలక విషయాలను తెలియజేశాడు. రేణుక స్వామి మెడ, ఛాతి, తలపై, చేతులపై చెట్టుకొమ్మతో కొట్టినట్లు ఒప్పుకున్నాడు. ఆ సమయంలోనే రేణుకా స్వామిని చెప్పుతో కొట్టాల్సిందిగా పవిత్రగౌడతో చెప్పాడు. ఈ విషయాలన్నీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. 

ఈ కేసులో ఎ1గా చేర్చబడిన పవిత్రగౌడ హత్య జరగానికి ప్రధాన కారణం. దర్శన్‌తోపాటు మిగతా వారిని కూడా ఉసిగొల్పి ఈ హత్య జరడానికి కారకురాలైంది. అతన్ని హత్య చేసేందుకు భారీ లెవల్‌లోనే కుట్ర పన్నింది పవిత్ర. ఇదిలా ఉంటే.. దర్శన్‌ జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ బెంగళూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్‌ 12 వరకు దర్శన్‌ జైలులోనే ఉంటాడు. ఆ తర్వాత నిందితులు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.