Read more!

English | Telugu

‘నేను ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను.. మంచి పేరు వాడే తెచ్చుకోవాలి కదా..’

తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తారు, అలాగే కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించడంలో కూడా ముందుంటారు. ఈ విషయం ఈమధ్యకాలంలో ఎన్నో సినిమాల విషయంలో రుజువైంది. టాలీవుడ్‌కి ఎంతో మంది కొత్త దర్శకులు వస్తున్నారు. అందులో మంచి టాలెంట్‌ ఉన్నవారు కూడా ఉన్నారు. ఎవరిలో ఎంత టాలెంట్‌ ఉంది అనే విషయం ఆయా దర్శకులు తెరకెక్కించే సినిమాలను బట్టే తెలుసుకోగలం. నిన్నమొన్నటి వరకు జబర్దస్త్‌లో, ఆ తర్వాత సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు చేస్తూ అందర్నీ నవ్వించిన ఎల్దండి వేణు తనలో కూడా ఒక సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ఉన్నాడని ‘బలగం’ చిత్రంతో ప్రూవ్‌ చేసుకున్నాడు. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్ని కట్టి పడేశాడు. ఇప్పుడు ఆ బాటలో మరో కమెడియన్‌ ధనరాజ్‌ కొరనాని దర్శకుడుగా మారబోతున్న విషయం తెలిసిందే. ‘రామం రాఘవం’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ విడుదలైంది.

ప్రభాకర్‌ ఆరిపాక సమర్పణలో స్లేట్‌ పెన్సిల్‌ స్టోరీస్‌ పతాకంపై పృథ్వి పోలవరపు నిర్మిస్తున్న ‘రామం రాఘవం’ చిత్రం తండ్రీ కొడుకుల కథతో రూపొందింది. ప్రయోజకుడు కాని కొడుకు, అతని భవిష్యత్తుపై ఆందోళన చెందే తండ్రి.. వారిద్దరి మధ్య తలెత్తే సమస్యలు.. చివరికి ఆ తండ్రి పేరుని నిలబెడుతూ ఉన్నత స్థాయికి చేరుకునే కొడుకు.. ఇలాంటి నేపథ్యంలో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ‘రామం రాఘవం’ కూడా అలాంటి కథే అయినా అందులోనే ఓ కొత్త పాయింట్‌ని ఎంపిక చేసుకున్నారని టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా మాటలు ఈ సినిమాకి పెద్ద ప్లస్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. తండ్రిగా సముద్రఖని ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారని టీజర్‌లోనే అర్థమవుతోంది. కొడుకు పరిస్థితిని చూస్తూ ‘నేను ఇంటి పేరును మాత్రమే ఇవ్వగలను.. మంచి పేరు వాడే తెచ్చుకోవాలి కదా..’ అనే డైలాగ్‌ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటుంది.