Read more!

English | Telugu

పుష్పరాజ్ దెబ్బకి 'బాహుబలి-2' ఔట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా 'పుష్ప 2: ది రూల్'(Pushpa 2 The Rule). 2021 డిసెంబర్ లో విడుదలై, పాన్ ఇండియా రేంజ్ లో సంచలన విజయం సాధించిన 'పుష్ప: ది రైజ్'కి కొనసాగింపుగా ఈ చిత్రం వస్తోంది. ఆగస్టు 15న విడుదల కానున్న 'పుష్ప 2'పై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా నార్త్ లో ఈ మూవీకి ఉన్న క్రేజ్, జరిగిన బిజినెస్ చూస్తుంటే.. దిమ్మతిరిగి పోతోంది.

'బాహుబలి-2', 'కేజీఎఫ్-2' సినిమాల కోసం సౌత్, నార్త్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా వైడ్ గా ఎంతలా ఎదురుచూశారో.. ఇప్పుడు 'పుష్ప-2' కోసం కూడా అదే స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అందుకే నార్త్ లోనూ సంచలన బిజినెస్ చేసింది. ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ ని ఏఏ ఫిలిమ్స్ ఏకంగా రూ.200 కోట్లకు దక్కించుకుందట. అంటే ఈ సినిమా హిందీలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.400 కోట్ల నెట్ వసూలు చేయాల్సి ఉందని అంటున్నారు. 

ఇప్పటిదాకా సౌత్ నుంచి 'బాహుబలి-2', 'కేజీఎఫ్-2' సినిమాలు మాత్రమే హిందీలో రూ.400 కోట్లకు పైగా నెట్ వసూలు చేశాయి. 'పుష్ప-2' కి కూడా ఆ ఫీట్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పైగా 'పుష్ప-2' అనేది 'బాహుబలి-2', 'కేజీఎఫ్-2' సినిమాల మాదిరిగానే బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా వస్తోంది. 'పుష్ప-1' ప్రభంజనాన్ని, అందులో అల్లు అర్జున్ మ్యానరిజమ్స్, డైలాగ్స్, డ్యాన్స్ లను నార్త్ ప్రేక్షకులు కూడా అంత తేలికగా మరిచిపోలేరు. అందుకే వారు 'పుష్ప-2' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదల తర్వాత ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఈ సినిమా హిందీలో సులభంగా రూ.400 కోట్లకు పైగా నెట్ వసూలు చేస్తుంది అనడంలో సందేహం లేదు. అదే ఊపులో రూ.500 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి 'బాహుబలి-2'ని బీట్ చేసినా ఆశ్చర్యంలేదు.