English | Telugu

మురళీమోహన్‌కి వ్యతిరేకంగా ధర్నా.. దిగ్బంధనంలో ‘జయభేరి’!

ప్రముఖ నటుడు, నిర్మాత, జయభేరి సంస్థల అధినేత చిక్కుల్లో పడ్డారు. తాడేపల్లి మండలం కుంచనపల్లి దగ్గర ఆయన నిర్మించిన జయభేరి ది క్యాపిటల్‌  వార్తల్లోకి ఎక్కింది. ఈ అపార్ట్‌మెంట్స్‌లోని ఫ్లాట్స్‌ యజమానులు ధర్నాకు దిగారు. బుధవారం ఉదయం నుంచే అపార్ట్‌మెంట్‌ ముందు ఆందోళన చేస్తున్నారు. బయటి నుంచి ఎవరూ లోపలికి రాకుండా ఎంట్రన్స్‌ దగ్గర కార్లు పార్క్‌ చేశారు. బిల్డర్‌గా మురళీమోహన్‌కి మార్కెట్‌లో మంచి పేరు వుంది. హైదరాబాద్‌లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాల్లో జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌ అనేక అపార్ట్‌మెంట్స్‌ను నిర్మించింది. అయితే ప్రత్యేకించి కుంచనపల్లి దగ్గర నిర్మించిన జయభేరి ది క్యాపిటల్‌పై ఫ్లాట్‌ యజమానులు 90 ఫిర్యాదులను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళారు. కానీ, వాటిని పరిష్కరించేందుకు వారు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జయభేరి ది క్యాపిటల్‌లో మొత్తం 147 ఫ్లాట్స్‌ ఉన్నాయి. అవి మురళీమోహన్‌కి చెందినవి కావడంతో, అతనిపై నమ్మకంతోనే కొనుగోలు చేశామని యజమానులు చెబుతున్నారు. అయితే ఫ్లాట్స్‌ కొనుగోలు సమయంలో చేసుకున్న అగ్రిమెంట్‌లో పేర్కొన్న వసతులు కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. ఫ్లాట్‌ యజమానులు పేర్కొన్న 90 ఫిర్యాదుల్లో ముఖ్యమైనవి.. సిసి కెమెరాలు ఫిక్స్‌ చేయకపోవడం, కార్‌ పార్కింగ్‌ దగ్గర లైట్స్‌ లేకపోవడం, సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి దాన్ని సగంలో ఆపేయడం, ఫైర్‌ సేఫ్టీ లేకపోవడం, చుట్టు పక్కల నుంచి పాములు వంటి ప్రాణహాని కలిగించే జంతువులు రాకుండా జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటివి ఉన్నాయి. అంతేకాదు, లాబీలో ఒక రిసెప్షనిస్ట్‌ని ఏర్పాటు చేస్తామని అగ్రిమెంట్‌లో పేర్కొన్నారు. కానీ, దాన్ని కూడా పక్కన పెట్టారు. టోటల్‌గా ఈ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్స్‌ కొనుగోలు చేసిన వారికి రక్షణ లేకుండా పోయిందని, ఏదైనా అగ్నిప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడతామన్న నమ్మకం తమకు లేదని యజమానులు చెబుతున్నారు. 

జయభేరి సంస్థకు, మురళీమోహన్‌కి మంచి పేరు ఉంది. ఆయన మీద నమ్మకంతోనే ఫ్లాట్స్‌ కొనుగోలు చేశామని, తమతోపాటు బంధువులచేత కూడా కొనిపించామని యజమానులు అంటున్నారు. ఫ్లాట్స్‌ అమ్మడం ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు తప్ప ఫ్లాట్స్‌లో ఉండేవారికి కనీస వసతులు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్స్‌ హ్యాండోవర్‌ చేసేందుకు 15 రోజుల నుంచి నెలరోజుల వరకు టైమ్‌ తీసుకుంటున్నారని అంటున్నారు. ఎమినిటీస్‌, కార్పస్‌ ఫండ్‌తోపాటు అగ్రిమెంట్‌లో పేర్కొన్న ప్రతి ఒక్క దానికి మొత్తం డబ్బు చెల్లించిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్‌కి ఎందుకు టైమ్‌ తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని వాపోతున్నారు. రెండు లక్షలు పెట్టి కార్‌ పార్కింగ్‌ని కొనుగోలు చేస్తే కార్లకు రక్షణ లేకుండా పోయిందని, చాలా కార్లు డ్యామేజ్‌ అయ్యాయని చెబుతున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఫ్లాట్స్‌ అమ్మకాలు ఇప్పుడు జోరందుకున్నాయని, ఎక్కువ రేట్లతోనే ఫ్లాట్స్‌ అమ్ముతున్నారని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం జయభేరి ది క్యాపిటల్‌ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. దీనిపై జయభేరి సంస్థ, మురళీమోహన్‌ ఎలా స్పందిస్తారో, యజమానులు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.