English | Telugu
సీనియర్ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత
Updated : Oct 16, 2022
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి(78) చెన్నైలోని తన నివాసంలో శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
1944 వ సంవత్సరం విజయవాడలో జన్మించిన మురారి.. ఎంబీబీఎస్ చదువు మధ్యలో ఆపి సినిమా రంగంలో ప్రవేశించారు. మొదటగా కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసి తర్వాత యువచిత్ర ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించారు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన 'సీతామాలక్ష్మి'(1978) ఆయన నిర్మించిన మొదటి సినిమా. ఆ తర్వాత 'గోరింటాకు', 'జేగంటలు', 'త్రిశూలం', 'అభిమన్యుడు', 'సీతారామ కల్యాణం', 'శ్రీనివాస కళ్యాణం', 'జానకిరాముడు', 'నారీ నారీ నడుమ మురారి' చిత్రాలను నిర్మించారు. తన సినిమాల్లో సంగీతానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఆయన నిర్మించిన సినిమాలకు ఎక్కువగా కె.వి. మహదేవన్ సంగీతం అందించారు.
"హీరో డేట్స్ వున్నాయని, లక్షలు వస్తాయని సినిమా తీయను. లాభమైనా నష్టమైనా తానే భరిస్తాను కాబట్టి కథని, దర్శకుడిని నమ్మి సినిమా తీస్తాను" అనే నైజం మురారిది. అందుకే తక్కువ సినిమాలే నిర్మించినా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు.