English | Telugu

‘స్పిరిట్‌’ విషయంలో సందీప్‌ ఛాలెంజ్‌ని ప్రభాస్‌ ఎదుర్కోగలడా?

ఏ హీరోకైనా డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ మాడ్యులేషన్‌ ఉంటాయి. సీన్‌ ఏదైనా తన స్టైల్‌కి అనుగుణంగా పెర్‌ఫార్మ్‌ చేసి ఆడియన్స్‌ని ఆకట్టుకుంటారు. ఇక యాక్షన్‌ సినిమాల విషయానికి వస్తే.. అందులో డైలాగ్స్‌కి కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. డైలాగ్స్‌ చెప్పడంలో ఒక్కో హీరోది ఒక్కో స్టైల్‌. ఈశ్వర్‌తో హీరోగా పరిచయమైన ప్రభాస్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. కేవలం తన కటౌట్‌, యాక్షన్‌ సీన్స్‌తో ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకుంటారు ప్రభాస్‌. అయితే ప్రభాస్‌ నుంచి భారీ డైలాగులు, గొంతు చించుకొని గర్జించే డైలాగులు ఎక్స్‌పెక్ట్‌ చెయ్యలేం. అతని మొదటి సినిమా నుంచి చూసుకుంటే.. ప్రతి సినిమాలోనూ చాలా సాధారణమైన డైలాగులు, తక్కువ డైలాగులతోనే ఉంటాయి. తన స్థాయికి మించిన మోతాదులో డైలాగులు చెప్పడం అనేది మిర్చితో స్టార్ట్‌ అయింది. ఆ సినిమాలో కొన్ని ఎమోషనల్‌ డైలాగ్స్‌ ఉంటాయి. ఆ తర్వాత బాహుబలి సిరీస్‌లోని డైలాగ్స్‌ ఒక రేంజ్‌లో ఉంటాయి. వాటిని చెప్పడం ప్రభాస్‌కి కష్టతరమైనా డైరెక్టర్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అయ్యే విధంగానే ఆ డైలాగ్స్‌ చెప్పి మెప్పించారు. 

ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తున్న రాజాసాబ్‌ చిత్రంలో అతనికి సూట్‌ అయ్యే డైలాగ్సే ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్టర్‌ మారుతి ఇప్పటివరకు చేసిన సినిమాల్లో హీరోలకు ఫెరోషియస్‌గా డైలాగ్స్‌ చెప్పే అవసరం రాలేదు. కాబట్టి ప్రభాస్‌కి కూడా ఎలాంటి రిస్క్‌ లేదు. ఇక రాబోయే సలార్‌ 2, కల్కి 2 చిత్రాల్లో కూడా అతనికి పొడి పొడి డైలాగ్సే ఉంటాయి. వీటన్నింటినీ మించి ఇప్పుడు సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందనున్న స్పిరిట్‌ విషయంలోనే ప్రభాస్‌కి కొత్త సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సందీప్‌ స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌, డైలాగ్స్‌, షాట్స్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అర్జున్‌రెడ్డి, యానిమల్‌ చిత్రాల్లో హీరోచేత ఎలాంటి డైలాగులు చెప్పించాడనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు స్పిరిట్‌లో ప్రభాస్‌తో కూడా ఎంతో ఎమోషనల్‌గా ఉండే డైలాగ్స్‌ చెప్పించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్‌ మొదటిసారి పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించబోతున్నారు. పోలీస్‌ ఆఫీసర్‌ అంటే ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టుగానే పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ తప్పనిసరిగా ఉంటాయి. 

స్పిరిట్‌  చిత్రానికి సంబంధించిన స్టోరీ వర్క్‌ పూర్తయింది. అయితే డైలాగ్‌ వెర్షన్‌ మాత్రం పెండిరగ్‌లో పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమాలోని డైలాగ్స్‌ తన స్టైల్‌లో ఉండాలా లేక ప్రభాస్‌ స్టైల్‌లో ఉండాలా అనే విషయంలో సందీప్‌ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారట. సందీప్‌రెడ్డి సినిమాల్లో లెంగ్తీ డైలాగ్స్‌ హైఫై భాషతో ఉంటాయి. ప్రభాస్‌ మొదటి నుంచి షార్ట్‌ డైలాగ్స్‌తోనే ఎక్కువ ఆకట్టుకున్నారు. అయితే బుజ్జిగాడు సినిమాలో డైలాగ్స్‌తోపాటు మాడ్యులేషన్‌ కూడా డిఫరెంట్‌గా ట్రై చేశారు. దాన్ని ఆడియన్స్‌ కూడా బాగా రిసీవ్‌ చేసుకున్నారు. అప్పటివరకు వచ్చిన సినిమాల్లో అంత డిఫరెంట్‌గా ఏ సినిమాలోనూ డైలాగ్స్‌ చెప్పలేదు. ఇక సందీప్‌ విషయానికి వస్తే.. ఎమోషనల్‌గా, హై పిచ్‌లో డైలాగ్స్‌ చెప్పిస్తారు. మరి ఈ డిఫరెన్స్‌ని ప్రభాస్‌, సందీప్‌ ఎలా మేనేజ్‌ చేస్తారో చూడాలి. డైలాగ్స్‌ విషయంలో సందీప్‌ ఇచ్చే ఛాలెంజ్‌ని ప్రభాస్‌ ఎలా ఎదుర్కొంటాడు అనేది వెయిట్‌ అండ్‌ సీ.