English | Telugu
ఆపరేషన్ థియేటర్ లో అదుర్స్ సినిమా చూపించిన డాక్టర్స్!
Updated : Sep 18, 2024
క్యాన్సర్ తో పోరాడుతున్న తిరుపతికి చెందిన 19 ఏళ్ళ కౌశిక్.. తాను జూనియర్ ఎన్టీఆర్ కి అభిమానినని, సెప్టెంబర్ 27న విడుదలవుతున్న 'దేవర' సినిమా చూడటం తన చివరి కోరికని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్.. కౌశిక్ తో వీడియో మాట్లాడి ధైర్యం చెప్పడమే కాకుండా, మెరుగైన చికిత్సకు కావాల్సిన సాయం చేస్తానని చెప్పాడు. ఇది మరువక ముందే.. తాజాగా కాకినాడలో మరో ఆసక్తికర సంఘటన జరిగింది. 55 ఏళ్ళ మహిళ.. ఎన్టీఆర్ నటించిన 'అదుర్స్' సినిమా చూస్తూ.. బ్రెయిన్ సర్జరీ చేయించుకుంది.
తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన అనంతలక్ష్మికి కొంతకాలంగా కుడికాలు, కుడిచేయి లాగుతుండటంతో పలు ఆసుపత్రుల్లో చూపించగా.. నయం కావడం కష్టమని డాక్టర్లు చెప్పారు. ఇటీవల శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోతుండటంతో పాటు.. తలనొప్పి, మూర్ఛ రావడంతో కాకినాడలోని సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి ఆమె మెదడులో కణితి ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి, ఆమె మెలకువలో ఉండగానే.. సర్జరీ ద్వారా దానిని తొలగించారు. అయితే గమ్మత్తేంటంటే.. అనంతలక్ష్మి తనకి ఇష్టమైన 'అదుర్స్' మూవీ చూస్తుండగా, నొప్పి తెలియనివ్వకుండా సర్జరీ చేశారు వైద్యులు. ఒక ట్యాబ్ లో ఆమెకి అదుర్స్ మూవీ ప్లే చేసి ఇచ్చారు. ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య కామెడీ సన్నివేశాలను చూస్తూ ఆమె ఆనందంలో ఉండగా.. డాక్టర్లు సైలెంట్ గా సర్జరీ పూర్తి చేశారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ సర్జరీ జరిగింది. సర్వజన ఆసుపత్రిలో మొదటిసారిగా ఈ తరహా క్లిష్టమైన సర్జరీ చేశామని, మరో ఐదు రోజుల్లో ఆమెను డిశ్ఛార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.