Read more!

English | Telugu

నితిన్ కు నేనంటే ఇంత ఇష్టమని నాకు తెలియదు - పవన్ కళ్యాణ్

సోమవారం శిల్పకళా వేదికలో జరిగిన అ..ఆ ఆడియో ఫంక్షన్ కు ఛీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆడియో రిలీజ్ చేసిన తర్వాత పవన్ స్పీచ్ ఆసక్తికరంగా సాగింది. పవన్ గత ఫంక్షన్లలో లేనంత ఓపెన్ గా ఈ ఫంక్షన్లో మాట్లాడటం విశేషం. పవన్ స్పీచ్ ఆయన మాటల్లోనే..


" నేనంటే నితిన్ కు ఇంత ఇష్టమని నాకు ఇప్పటి వరకూ తెలియదు. నేను గబ్బర్ సింగ్ చేస్తున్న సమయంలో, తన ఇష్క్ సినిమాకు వచ్చాను. అప్పటికి తను కూడా బ్యాడ్ ప్యాచ్ లో ఉన్నాడని తెలిసింది. తర్వాత నితిన్ ను చూడగానే తమ్ముడిలా అనిపించాడు. మరి తమ్ముడికి ఇబ్బందికి వస్తే మనం అండగా ఉంటే ధైర్యంగా ఉంటుంది కదా..అందుకే అప్పుడు ఆడియో ఫంక్షన్ కు వచ్చాను. సాధారణంగా నేను పేర్లు గుర్తుపెట్టుకునే విషయంలో చాలా వీక్. సర్దార్ ఆడియో ఫంక్షన్ టైం లో దేవీశ్రీప్రసాద్ పేరు మర్చిపోయాను. ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ ఇది మంచి హిట్ గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

గోకులంలో సీత సినిమాకు త్రివిక్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ సినిమా రైటర్ పోసాని గారు ఎందుకో అందుబాటులో లేకపోవడంతో, సగం డైలాగులు త్రివిక్రమ్ తో రాయించారు. అప్పటికి నాకు తను పెద్ద పరిచయం లేదు. తొలిప్రేమ డబ్బింగ్ టైం లో పక్కనే చిరునవ్వుతో సినిమా ఎడిటింగ్ జరుగుతుంటే చూశాను. డైలాగ్స్ చాలా బాగున్నాయి అనిపించింది. ఆ తర్వాత మేము జల్సా సినిమా చేసిన టైంలో బాగా స్నేహితులమయ్యాము. త్రివిక్రమ్ విలువలు పాటిస్తారు. ఆ విషయంలోనే నాకు ఆయనంటే చాలా గౌరవం. అ..ఆ సినిమా కథ నాకు అత్తారింటికి దారేది టైంలోనే తెలుసు. చాలా మంచి కథ. ఈ సినిమాతో నితిన్ మంచి విజయం సాధించాలి. తెలుగు సినీ పరిశ్రమకు ఈ సినిమా మరో విజయాన్ని ఖాతాలో వేయాలి " అని పవన్ ప్రసంగించారు. మాట్లాడినంత సేపూ పవన్ నితిన్ ను నితిన్ గారు అని సంబోధించడం విశేషం.