Read more!

English | Telugu

గిన్నిస్ బుక్ లో పద్మభూషణ్ పి.సుశీల..!

ఆమె గొంతు మధురం. ఆమె పాట అమృతం. ఆమె గానం అమోఘం. ఒకటి కాదు, రెండు కాదు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని తన గాన మాధ్యుర్యంతో కట్టిపడేసిన పి.సుశీలమ్మకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, తుళు ఇలా దాదాపు అన్ని భారతీయ భాషల్లో కలిపి నలభైవేలకు పైగా పాటలు పాడిన ఘనత ఈ గానకోకిలకు సొంతం. 1952లో పెట్రా థాయ్ అనే తమిళ సినిమాతో సుశీలమ్మ సినీ ప్రస్థానం మొదలైంది. ఆమె సేవలకు మెచ్చి 2008లో భారత ప్రభుత్వం సుశీలమ్మకు పద్మభూషణ్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘపతి వెంకయ్య అవార్డును ఇచ్చి గౌరవించింది.

గానసరస్వతి, కలైమామణి, ఫిల్మ్ ఫేర్ అవార్డు..ఒకటా, రెండా.. లెక్కకు మించి అవార్డులు, రివార్డులు గౌరవాలు ఆమె సొంతమయ్యాయి. ఐదు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారాన్ని పొందిన ఈ గాయనీమణి, అత్యధిక సంఖ్యలో సింగిల్స్ (17,695 పాటలు) పాడిన సింగర్ గా ఇప్పుడు గిన్నీస్ బుక్ లో కూడా పేరు సంపాదించుకున్నారు. గాన గంథర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె 1336 డ్యూయెట్స్ ను ఆలపించారు. ఇది కూడా ప్రపంచంలో ఎక్కడా లేని ఒక రికార్డ్. ఆమె నిండునూరేళ్లు ఆరోగ్యంగా, సంపూర్ణ జీవితాన్ని గడపాలని, మరిన్ని పాటల్ని పాడాలని ప్రతీ తెలుగు సినీ అభిమాని కోరుకుంటున్నాడనడంలో అతిశయోక్తి లేదు.