Read more!

English | Telugu

ఆ తరానికి ఎన్‌.టి.ఆర్‌. ‘లెజెండ్‌’ అయితే.. ఈ తరానికి బాలకృష్ణ ‘లెజెండ్‌’!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన ‘లెజెండ్‌’ 2014లో రిలీజ్‌ అయి సంచలన విజయం సాధించింది. ఈ సినిమా కొన్ని సెంటర్స్‌లో సంవత్సరం పాటు ప్రదర్శితమైంది. ఈ సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్‌. ఈ ఫంక్షన్‌లో చిత్రానికి పనిచేసిన నటీనటులకు, టెక్నీషియన్స్‌కు ‘లెజెండ్‌’ 10 ఇయర్స్‌ షీల్డులను బాలయ్య చేతులమీదుగా బహూకరించారు. 

ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘ఈ సినిమాని ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు, సోదర సమానులైన నందమూరి అభిమానులకు, ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాను రిలీజ్‌ చేసేటపుడే చెప్పాము. అలాగే సినిమాలోని ఫస్ట్‌ షాట్‌ కూడా అదే. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్‌ ఎన్‌.టి.రామారావుగారికి అంకితం అని చెప్పాము. ఆయన ఆశీస్సులతోనే ఈ సినిమా 10 సంవత్సరాలు ప్రదర్శితమైంది. ఎందుకంటే ఆ తరానికి దిశా నిర్దేశం చేస్తూ పాత్‌ వేసిన ఆ తరం లెజెండ్‌ ఆయనైతే.. ఈ తరానికి సినిమా రూపంలో మేం చూపించిన ఈ లెజెండ్‌ బాలయ్యగారు. లెజెండ్‌ అనే టైటిల్‌ పెట్టడం కాదండీ. పెట్టడంతోపాటు ఒక లెజెండరీ సినిమా మీ ముందుకు తీసుకొచ్చినందుకు నేను గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. లెజెండ్‌ అంటేనే చరిత్ర సృష్టించేవాడు. అలాగే చరిత్రను తిరగరాసేవాడు. ఈ సినిమా అదే చేసింది. 3 సంవత్సరాలు ఆడి చరిత్ర సృష్టించింది. సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. మూడు రోజులు థియేటర్లలో ఆడడం కష్టమైన ఈ రోజుల్లో 3 సంవత్సరాలు ఒకథియేటర్‌లో ఆడడం అనేది మామూలు విషయం కాదు. అలాగే ఒక సింహా అయినా, ఒక లెజెండ్‌ అయినా, ఒక అఖండ అయినా... ఒక మంచి సినిమా ఆడితే.. నెక్స్‌ట్‌ సినిమాకి బడ్జెట్‌ పెంచుకోవడానికి వీలవుతుంది. అలాగే ఒక సినిమా హిట్‌ అయితే నెక్స్‌ట్‌ సినిమాకి మాపై బాధ్యత పెరుగుతుంది. ఆ బాధ్యత మాపై ఉండబట్టే ఆ కసితో చేసిందే ‘అఖండ’. ఇకపై మేం చేసే ఏ సినిమా అయినా ఇంతే బాధ్యతతో, ఇంతే నిష్టతో, ఒక యజ్ఞంలా చేసి మీ ముందుకు తీసుకొస్తామని తెలియజేస్తున్నాను. బాలయ్యబాబు గురించి చెప్పాలంటే.. సింహా, లెజెండ్‌, అఖండ.. ఇలా టైటిల్స్‌ పెట్టడం మాత్రమే కాదు. ఆ టైటిల్స్‌ విన్నప్పుడు ఆ క్యారెక్టర్‌లో బాలయ్యబాబే కనిపిస్తారు.  ఆయన నాపై పెట్టిన నమ్మకంతోనే ఈ మూడు సినిమాలు చెయ్యగలిగాను. థాంక్యూ బాబూ. మన రిలేషన్‌ ఇలాగే ఉండాలి. ఇలాగే మనం ముందుకు వెళ్ళాలి. మనం చేసే ప్రతి సినిమా ఇలాగే 10 సంవత్సరాల ఫంక్షన్‌ జరుపుకోవాలి’ అన్నారు.