Read more!

English | Telugu

‘లెజెండ్‌’.. అప్పుడు ఎలక్షన్స్‌కి ముందు రిలీజైంది. ఇప్పుడు కూడా ఎలక్షన్స్‌ ముందే.. విజయం మనదే!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన ‘లెజెండ్‌’ 2014లో రిలీజ్‌ అయి సంచలన విజయం సాధించింది. ఈ సినిమా కొన్ని సెంటర్స్‌లో సంవత్సరం పాటు ప్రదర్శితమైంది. ఈ సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్‌. ఈ ఫంక్షన్‌లో చిత్రానికి పనిచేసిన నటీనటులకు, టెక్నీషియన్స్‌కు ‘లెజెండ్‌’ 10 ఇయర్స్‌ షీల్డులను బాలయ్య చేతులమీదుగా బహూకరించారు. 

ఈ సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘నాకు ధన్యమైన జన్మనిచ్చి మీ అందరి గుండెల్లో ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నాన్నగారు, నా గురువు, నా దైవం నటరత్న తారకరామారావుగారిని తలుచుకుంటూ.. నాకు చాలా వింతగా ఉంది. ఇది సినిమా రిలీజ్‌కి ముందు జరిగే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లా అనిపిస్తోంది. ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రేక్షకులకు, తోటి నటీనటులకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మంచి సినిమా తీస్తే ప్రేక్షకులకు తప్పకుండా ఆదరిస్తారు, ఇంకా మంచి సినిమాలు తీసేందుకు ప్రోత్సహిస్తారు. మన తెలుగు సినిమా గురించి భారతదేశం అంతటా చెప్పుకుంటున్నారంటే మనం ఇచ్చే సందేశం ప్రభావం ఎంత ఉందో మనకు ప్రత్యక్షంగా తెలుస్తోంది. సినిమా రికార్డులు నాకు కొత్త కాదు, రికార్డులు సృష్టించాలన్నా నేనే,, వాటిని తిరగ రాయాలన్నా నేనే. ఎందుకంటే ఒక సినిమాకి కథని ఎంచుకోవడంలో, దర్శకుడ్ని ఎంపిక చేసుకోవడంలో, నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయంలో నాకు ఉండే నమ్మకం అలాంటిది. నాకు ముందే తెలిసిపోతుంది. గతంలోకి వెళ్తే.. 30 సెంటర్లలో సిల్వర్‌జూబ్లీ జరుపుకొని భారతదేశంలోనే కొత్త రికార్డు సృష్టించిన సినిమా సమరసింహారెడ్డి. అలాగే ఆరోజుల్లో 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా నరసింహనాయుడు. ఇప్పుడు లెజెండ్‌. ఈ సినిమా 400 రోజులు నాలుగు ఆటలతో రెండు సెంటర్స్‌లో ఆడి ఆల్‌ ఓవర్‌ ఇండస్ట్రీలోనే ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిన సినిమా మన లెజెండ్‌. అలాగే 1,116 రోజులు నాలుగు ఆటలతో ఆడి మరో రికార్డు సృష్టించింది. నాలుగు అంకెలు దాటి సౌత్‌లో ఆడిన ఏకైక సినిమా ఇది. సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంటే కాదు, నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. అలాగే రాజకీయంగా జనంలో ఒక చైతన్యం కలిగించాలనే కథాంశం ఎంచుకోవడం జరుగుతుంది. భగవంత్‌ కేసరిలో మహిళలకు ఇచ్చిన సందేశం, వీరసింహారెడ్డిలో అన్నాచెల్లెల అనుబంధం అందర్నీ ఆకట్టుకుంది. ఈరోజు అనుకోకుండా మా హీరోయిన్‌ సోనాల్‌ చౌహాన్‌ పసుపురంగు చీరతో వచ్చింది. పసుపు అనేది శుభానికి సూచకం. పసుపు అనేది ఒక ఆనందకరమైన వేడుకలకు ఆహ్వానగీతం. పసుపు అనేది సంక్షేమానికి నిర్వచనం, పసుపు అనేది అభివృద్ధికి నిదర్శనం. పసుపు అనేది ఆత్మాభిమానానికి నిలువెత్తు రూపం. అలాగే పసుపు అనేది ఆత్మగౌరవానికి ఎగరేసిన కేతనం. లెజెండ్‌ సినిమా ఎలక్షన్స్‌ ముందు రిలీజ్‌ అయింది. ఇప్పుడు ఈ రీరిలీజ్‌ కూడా ఎలక్షన్స్‌ ముందే అవుతోంది. అంతా కాకతాళీయమే, యాదృశ్చికమే. విజయం మనదే. బోయపాటి గురించి చెప్పాలంటే సింహా తర్వాత లెజెండ్‌ చేస్తున్నప్పుడు సింహా రికార్డుల గురించి మాట్లాడుకోలేదు. అలాగే అఖండ చేస్తునప్పుడు లెజెండ్‌ గురించి మాట్లాడుకోలేదు. మేం మాటలు చెప్పేవాళ్ళం కాదు, చేసి చూపిస్తాం. మా ఇద్దరి  వైబ్రేషన్స్‌ ఒకటే. బోయపాటి గురించి అంతకంటే ఎక్కువ చెప్పను’ అన్నారు.