English | Telugu
రీమేక్ దర్శకులందరూ ఖాళీగా ఉన్నారు!
Updated : Feb 21, 2023
ఒకప్పుడు రీమేక్ దర్శకులు అంటే రవి రాజా పినిశెట్టి, ముత్యాల సుబ్బయ్య, భీమినేని శ్రీనివాసరావు వంటి వారిని గుర్తు చేసుకునేవారు. ప్రస్తుతం కిషోర్ కుమార్ పార్థసాని అలియాస్ డాలి, సాగర్ చంద్ర, వేణు శ్రీరామ్, మోహన్ రాజా, వివి వినాయక్ వంటి వారు రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ లుగా చెప్పుకోవాలి. వీరు రీమేక్ చిత్రాలను బాగా తెరకెక్కిస్తారని పేరును తెచ్చుకున్నారు. కానీ వీరందరూ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టంతో దర్శకునిగా పరిచయమయ్యాడు డాలీ. రెండవ ప్రయత్నంగా తమిళ సినిమాని రీమేక్‌గా తడాఖా చిత్రం చేశారు.
ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఓ మై గాడ్ అనే చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్‌తో గోపాల గోపాల టైటిల్ తో రీమేక్ చేశారు. ఇది యావరేజ్‌గా ఆడింది. అనంతరం కోలీవుడ్ వీరంని కాటమరాయుడుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇది సో.. సో... అనిపించింది. ఆ తర్వాత డాలీ ఒక్కసారిగా ఖాళీ అయిపోయారు. మేకింగ్ పరంగా మంచి పేరున్న రీమేక్ సినిమా అనేది కొంతవరకు కెరీర్ కు ప్రతికూలంగా మారుతుంది. కాటమరాయుడు విడుదలై ఐదేళ్లు కావస్తున్నా ఇంతవరకు కొత్త ప్రాజెక్టు లేదు.
అలాగే అయ్యారే సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మరో యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్రది ఇదే పరిస్థితి. అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంతో ప్రేక్షకులతో పాటు పవన్ కళ్యాణ్ దృష్టిలో పడ్డారు. అందుకే భీమ్లా నాయక్ కి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితం సాధించింది. అయినా సాగర్ చంద్రకి ఇంతవరకు కొత్త అవకాశం రాలేదు. పింక్ ని వకీల్ సాబ్ టైటిల్‌తో వేణు శ్రీరామ్ రీమేక్ చేశారు. పవన్‌తో సినిమా తీశారు. పవన్ తో సినమా చేశాననే ఆనందం తప్ప ఆయనకు ఒక్క చాన్స్ కూడా రాలేదు. అల్లు అర్జున్‌తో ఐకాన్ అన్నారు. కానీ పాపం అదేం అయిందో తెలియదు. వేణు ఇంతవరకు కొత్త సినిమా ప్రకటించలేదు. ఓ మై ఫ్రెండ్, మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి సక్సెస్ ఉన్న వేణు ఇంకా ఎందుకు తడబడుతున్నాడో ఎవ్వరికీ అర్దం కావడం లేదు. కోలీవుడ్‌లో వరుస తెలుగు చిత్రాలను రీమేక్ చేసిన దర్శకుడు మోహన్ రాజా. ఆయన తెలుగులో చేసిన మొదటి చిత్రం హనుమాన్ జంక్షన్ కూడా రీమేక్ మూవీనే. ఆతర్వాత ఆయన తమిళంలో జయం, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి పలు రీమేక్‌లు తీశాడు. ఈయన తీసిన ఒకే ఒక్క స్ట్రెయిట్ మూవీ తని వరువన్. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.
ఇక మోహన్ రాజా రీమేక్లను బాగా తీస్తారని ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ మలయాల లూసీఫర్ రీమేక్ బాధ్యతలు అప్పగించారు. కానీ లూసీఫర్ రీమేక్‌గా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం కేవలం ఫర్వాలేదనిపించింది. భారీ విజయం ఖాతాలో వేసుకుంటారని భావించిన మోహన్ రాజా టాలీవుడ్ లో సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒకవైపు నాగార్జున తన 100వ చిత్రం ఇస్తారో లేదో ఇంకా ఖరారు చేయలేదు. దాంతో మోహన్ రాజాకు వెయిటింగ్ తప్పడం లేదు. దాంతో ఆయన మరలా బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా తనలో ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఇక సీనియర్ దర్శకుడు వివి వినాయక్ కూడా రీమేక్ చిత్రాలు బాగా చేస్తాడని పేరు ఉంది. యోగి, ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు రీమేక్లుగా తీశారు. వీటిలో యోగి మాత్రమే ఫ్లాప్ అయింది. ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 చిత్రాలు హిట్స్ గా నిలిచాయి. ఇక రీమేక్ స్పెషలిస్ట్‌గా ప్రభుదేవాకి కూడా చాలా మంచి పేరుంది. దక్షిణాది చిత్రాలను బాలీవుడ్‌లో రీమేక్ చేయడమే ఈయన పని. దాంతో మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ శంకర్ దాదా జిందాబాద్ రీమేక్ బాధ్యతలు అప్పగించారు. కానీఈ సినిమా సరిగా ఆడలేదు. ఇక వీరంతా మరలా బిజీ అవ్వాలంటే తమ సొంత కథలతో మెప్పించాల్సిన అవసరం ఉంది.