English | Telugu

నాకు, నా పిల్లలకు ఏదైనా జరిగితే వాళ్లిద్దరిదే బాధ్యత.. జానీ మాస్టర్‌ భార్య సుమలత!

జానీ మాస్టర్‌ లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. జానీ మాస్టర్‌ భార్య సుమలత తన భర్తను ట్రాప్‌ చేసిన యువతిపై ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు. తనను 7 సంవత్సరాలుగా జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, తనకు కొరియోగ్రాఫర్‌గా అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడని అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని వేధించడమే కాకుండా, పలు మార్లు తనను కొట్టాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది బాధిత మహిళ. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు జానీమాస్టర్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కి పంపారు. గత కొన్ని రోజులుగా అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. తనపై అక్రమంగా ఆ యువతి కేసు పెట్టిందని విచారణలో జానీ మాస్టర్‌ చెప్పినట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే ఈ వ్యవహారం గురించి ఎంతో మంది సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. టీవీ ఛానల్స్‌లో, యూ ట్యూబ్‌ ఛానల్స్‌లో డిబేట్స్‌ పెట్టారు. అయితే జానీ మాస్టర్‌, అతని అసిస్టెంట్‌కి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. జానీ మాస్టర్‌దే తప్పు అని కొందరు అంటుంటే, ముమ్మాటికీ ఆ అమ్మాయే కావాలని మాస్టర్‌ని ఈ కేసులో ఇరికించింది అంటున్నారు. అయితే నిజానిజాలు ఏమిటి అనేది పోలీసుల విచారణలో మాత్రమే తేలనుంది. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. త్వరలోనే దీనిపై సమగ్ర నివేదిక రానుంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా జానీ మాస్టర్‌ భార్య సుమలత ఆ మహిళపై ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు. ‘కొరియోగ్రాఫర్‌గా పనిచేయడం కోసం నా భర్తను ట్రాప్‌ చేసి ప్రేమ పేరుతో ఆ యువతి వేధింపులకు గురి చేసింది. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏమిటో చూపిస్తూ నేను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లింది. నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీమాస్టర్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. నా భర్త జానీ మాస్టర్‌ను ఇంటికి రాకుండా అడ్డుకునేది. రోజులో 2 నుంచి 3 గంటలు మాత్రమే మా ఇంటికి పంపించేది. ఈ విషయం గురించి మాట్లాడేందుకు ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాను. జానీ మాస్టర్‌ను నువ్వు ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేనే వెళ్లిపోతాను అని చెప్పాను. అంతకుముందు మాస్టర్‌ నాకు అన్నయ్యలాంటి వాడు, మీరు నాకు వదిన అంటూ నమ్మించి ఇలా చేసింది. నా భర్తతోనే కాదు, చాలా మంది మగాళ్ళతో ఆమెకు అక్రమ సంబంధం ఉంది. ఈ విషయాలు తెలుసుకున్న ఆయన ఆమెను దూరం పెట్టారు. దీంతో జానీ మాస్టర్‌పై కక్ష గట్టింది. తనపై లైంగిక దాడి చేశాడంటూ అక్రమ కేసు పెట్టింది. ఆయన్నే కాదు, పేరు, డబ్బు ఉన్న మగవారిని టార్గెట్‌ చేస్తూ ఇలాంటి వేధింపులకు గురి చేస్తుంది. ఆ అమ్మాయే కాదు, వాళ్ళ అమ్మ కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఆ అమ్మాయి పెట్టిన అక్రమ కేసుపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు, నా పిల్లలకు ఏం జరిగినా ఆ తల్లీకూతుళ్ళదే బాధ్యత. నాకు, నా పిల్లలకు న్యాయం చెయ్యాలని కమిటీని కోరుతున్నాను’ అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు సుమలత.