English | Telugu
అతని తప్పు లేదు. తప్పంతా నీదే.. నయనతారకు షాక్ ఇచ్చిన కోర్టు!
Updated : Dec 12, 2024
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతారకు షాక్ మీద షాక్ తగులుతోంది. ఇటీవల కొన్ని వివాదాలు ఆమెను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. వాటిలో ధనుష్‌తో ఏర్పడిన వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంటోంది. తన పెళ్లి విజువల్స్‌తో కూడిన ఓ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన నాన్ రౌడీ దాన్ చిత్రంలోని వీడియో క్లిప్‌ను ఉపయోగించడంతో ఈ వివాదం మొదలైంది. అంతకుముందే ధనుష్, నయనతార మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆ సినిమాను తన భర్త విఘ్నేష్ డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో తనను చాలా ఇబ్బంది పెట్టారంటూ విఘ్నేష్, నయనతారలపై ధనుష్ ఆరోపణలు చేశాడు. ఇదే క్రమంలో తను చేస్తున్న డాక్యుమెంటరీలో నాన్ రౌడీ దాన్ చిత్రంలోని వీడియో క్లిప్‌ను వాడుకుంటానని, దానికి అనుమతి కావాలని కోరింది నయన్. కానీ, దానికి ధనుష్ అంగీకరించలేదు. అయినా అందులోని క్లిప్‌ను డాక్యుమెంటరీకి వాడారు.
తన అనుమతి లేకుండా క్లిప్ వాడినందుకు తనకు రూ.10 కోట్లు చెల్లించాలని ధనుష్ డిమాండ్ చేశాడు. దీనిపై కోర్టును ఆశ్రయించాడు. ఇదే సమయంలో నయనతార మీడియాకు ఒక ఓపెన్ లెటర్‌ను రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణకు వచ్చింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి నయనతారను మందలించారు. ధనుష్ నిర్మించిన సినిమాకి సంబంధించిన క్లిప్స్ వాడుకోవాలంటే అతని అనుమతితోనే చేయాలి తప్ప ఇష్టానికి వాడుకోకూడదని స్పష్టం చేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కోర్టు ఈ వివాదంపై కోర్టుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జనవరి 8 లోగా దీనిపై సమాధానం చెప్పాలని నయనతారను కోరింది. మరి ఈ విషయంలో నయనతార ఏ విధమైన సమాధానం ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎలా చూసినా నయనతార ఆ క్లిప్‌ను వాడుకోవడం తప్పే. వీరిద్దరి విషయంలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఎవరూ నోరు విప్పడం లేదు. చివరికి ఇది ఎలా ముగుస్తుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కోర్టులో ధనుష్‌కు అనుకూలంగా తీర్పు వస్తే.. అతను డిమాండ్ చేసిన మొత్తాన్ని నయనతార చెల్లిస్తుందా లేక ఇద్దరికీ రాజీ కుదిర్చి సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారా అనేది తెలియాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే.